effect of low pressure
-
కుండపోత
►ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు.. ► నీట మునిగిన పొలాలు పెనుగంచిప్రోలు: బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో మండలంలో పలువాగులు పోటెత్తాయి. ముచ్చింతాల వద్ద నడివాగు చప్టాపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగు పొంగడంతో చుట్టూ ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. ఎస్సీల శ్మశానవాటిక మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. అనిగండ్లపాడు వద్ద దూళ్లవాగు, గండివాగు, లింగగూడెం వద్ద గండివాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పత్తి, మిర్చి పొలాల్లో వర్షపు నీరు భారీగా చేరింది. ఈవర్షం పంటలకు చాలా మేలు చేస్తుందని రైతులు అంటున్నారు. చెరువుల్లోకి కొద్దిగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఉదయం ఆగకుండా రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. పెనుగంచిప్రోలు పోలీస్‌స్టేషన్ వద్ద పసుమర్తి చంద్రకాంతం ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
ఎడతెగని వాన
సాక్షి, గుంటూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాలుగురోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించింది. పల్లపు, శివారు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. చిలకలూరిపేట మండలంలోని పసుమర్రులో పెంకుటింటి మట్టిగోడలు కూలడంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి .ఫిరంగిపురం మండలం గరుడాచలపాలెంలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందాడు. భట్టిప్రోలు మండలంలోని వెల్లటూరు - పెదపులివర్రు రహదారి మార్గంలో నిర్మిస్తున్న రహదారి, సైడ్ రిటైనింగ్ వాల్స్ పనులకు వ ర్షాల కారణంగా విఘాతం కలిగింది. శనివారం తెల్లవారుజామున రహదారికి ఓపక్క మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. వర్షం అన్ని వర్గాల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లా అంతా తడిసి ముద్దయింది. దీంతో పగటిపూట పట్టణంలో జనసంచారం తగ్గింది. వర్షంతో రహదారులు జలమయం కావడంతో రాకపోకలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు ఉద్యోగులు కూడా తడుస్తూనే ఇబ్బందులు పడుతు వెళ్తున్నారు. చేతి వృత్తుల వారిపై ఈ వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గుంటూరు నగరంలో శివారు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రమాద హెచ్చరిక.. నిజాంపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం ప్రభావంతో హార్బర్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ మోకా వెంకట రామారావు తెలిపారు. కొన్నిరోజులుగా కురుస్తున్న అకాలవర్షాలకు పలు బోట్లు వేటకు వెళ్లకుండా ఆగినట్లు తెలిపారు. వేటకు వెళ్లి బోట్లు వాతావరణం అనుకూలించక పోవడంతో తిరిగి ఒడ్డుకు చేరాలని సమాచారం అందించామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. సెంటిమెంట్‌తో సముద్రంలోనే బోట్లు లంగర్‌తో నడిసముద్రాన మత్స్యకారులు నిలిచిపోయారు. వేటకు వెళ్ళినబోట్లు వేటను నిలిపి తిరిగిరాకుండా నడిసముద్రంలోనే బోట్లను లంగర్వేసి నిలిపినట్లు పలువురు మత్స్యకారులు తెలుపుతున్నారు. హార్బర్లో 151 మెకగ్నైజడ్బోట్లు ఉన్నాయి. ఈనెల 15వ తేదీతో వేట నిషేదం గడువు ముగియడంతో బోట్లన్నీ సముద్రపు వేటకు బయలుదేరి వెళ్లాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వేట అతంత మాత్రంగానే సాగుతుండటంతో మత్స్యకారులు సముద్రంలోనే వేటను కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం ప్రభావంతో వేటకు వెళ్లిన బోట్లు తిరిగి రావాలని అధికారులు మత్స్యాకారులకు సమాచారం అందిస్తున్నారు. రెండు నెలల వేటనిషేధం తర్వాత తొలిసారిగా వేటకు వెళ్ళిన మత్స్యాకారులు తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. తొలిసారిగా వేటకు వెళ్లి తిరిగి వస్తే ఏడాది మొత్తం అదేపరిస్థితి నెలకొంటుందని సెంటిమెంట్‌తో మత్స్యకారులు వేట సాగకపోయినా సముద్రంలోనే లంగరువేసి బోట్లను నిలిపినట్లు మత్స్యకారులు తెలుపుతున్నారు. సెంటిమెంట్‌తో వంద బోట్ల వరకూ సముద్రంలోనే నిలిచిఉన్నట్లు సమాచారం. గోడ కూలి బాలుడి మృతి ఫిరంగిపురం : మండలంలోని తక్కెళ్లపాడు శివారు గ్రామం గరుడాచలపాలెంలో శుక్రవారం రాత్రి గోడ కూలి బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నరసరావుపేట రూరల్ మండలం ఇస్సాపాలెం గ్రామానికి చెందిన వావిరాల సుబ్బారావు, వెంకాయమ్మలు కూలీ పనుల నిమిత్తం కుమారుడు గణేష్(7)తో కలిసి గరుడాచలపాలెంలోని బంధువుల ఇంటికి నాలుగు రోజుల కిందట వచ్చారు. వారు నివాసముంటున్న ఇంటి గోడ పక్కగా గణేష్ నడుచుకుంటూ వెళ్ళుతుండగా ఒక్కసారిగా కూలి అతనిపై పడింది. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందా డు. మృతదేహాన్ని స్వగ్రామం అయిన ఇస్సాపాలెం గ్రామానికి తల్లిదండ్రులు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. -
ఆశలు సజీవం
భారీ వర్షాలతో రైతుల్లో ఆనందం - పునాస పంటలకు జీవం - గోడ కూలి వృద్ధురాలి మృతి - పుల్కల్లో 8.24 సెంటీమీటర్ల వర్షం సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వానలు పునాస పంటలకు జీవం పోస్తున్నాయి. విత్తనం వేసిన రోజు నుంచి చినుకు కోసం వెయ్యి కళ్లలో ఎదురు చూసిన రైతులకు ఈ వర్షాలు ఎంతో ఊరట నిచ్చాయి. అల్ప పీడన ప్రభావంతో వర్షాలు కురవటంతో మొక్కజొన్న, పత్తి, మిరప, పెసర పంటలకు మేలు జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సగటున 32.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధిక వర్షపాతం. మూడు రోజులుగా ముసురు పడుతుండగా, శనివారం భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పుల్కల్ మండలంలో 8.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ మండలంలో 19.2మిల్లిమీటర్లు, పాపన్నపేటలో 44.6, చిన్నశంకరంపేటలో 67.8, రామాయంపేటలో 16.4 మి.మి.వర్షపాతం నమోదైంది. ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. చెరువులో కూడా కొంతమేర నీరు వచ్చింది. వరినాట్లు కొనసాగుతున్నాయి. పొలాల్లో నీరు నిల్వ కావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. ఆరుతడి పంటలకు కూడా ఈ వర్షాలు ప్రాణం పోశాయి. ఇదిలా ఉండగా.. వైద్య, రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం, ముందస్తు జాగ్రత్తలు చేపట్టక పోవడంతో జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మిరుదొడ్డి మండలం కేంద్రంలో ఇంటి పై కప్పు కూలి ఆండాళమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది. కౌడిపల్లి మండలం తిమ్మాపురంలో పాత పాఠశాల భవనం కూలిపోయింది. పాతపడి కూలిపోయే పరిస్థితి ఉండటంతో రెండేళ్లుగా ఆ భవనం వినియోగించడం లేదు. రే గోడు మండలం కొత్వాన్‌పల్లిలో అతిసార ప్రబలింది. గ్రామానికి చెందిన దాదాపు 10 మందికి పైగా అతిసారబారిన పడ్డారు. పిడుగు పడి ఎద్దు మృతి మిరుదొడ్డి :పిడుగు పడి ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని అందె గ్రామంలో శనివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సూకూరి లింగం శుక్ర వారం రాత్రి తన వ్యవసాయ పొలం వద్ద ఎద్దును కట్టేశాడు. శనివారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ నేపథ్యంలో ఎద్దుపై పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతి చెందిందని బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఎద్దు విలువ సుమారు రూ. 45 వేలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరాడు. కాగా శనివారం తెల్లవారు జామున కురిసిన వర్షం కారణంగా మిరుదొడ్డి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్న కాన్గంటి ముత్యాలుకు చెందిన ప్రహరీతో పాటు మరుగుదొడ్డి కుప్ప కూలి పోయింది. -
కుండపోత
సాక్షి, సిటీబ్యూరో: అల్పపీడన ప్రభావంతో నగరంలో గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కుండపోత వర్షం కురిసింది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచి ఎక్కడికక్కడ ట్రాఫిక్స్తంభించింది. రాత్రి 8.30 గంటల వరకు 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. బంజారాహిల్స్, అబిడ్స్, కోఠి, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ్యకుంట, సాయిచరణ్ కాలనీ, అచ్చయ్యనగర్, బాపూజీనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. రాంనగర్ నాలా పరీవాహక ప్రాంతమైన నాగమయ్య కుంట, అచ్చయ్యనగర్లలో నడుము లోతున వర్షపు నీరు ప్రవహించి, ఇళ్లలోకి చేరింది. ఇళ్లలోని బియ్యం, పుస్తకాలు, నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి. నాగమయ్యకుంట వాసులు హిందీ మహా విద్యాలయలో తెల్లవార్లూ జాగరణ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రాంతానికి రాకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. మెహిదీపట్నం డివిజన్లోని గుడిమల్కాపూర్ మార్కెట్ రోడ్, టోలిచౌక్, నదీంకాలనీ, లంగర్హౌజ్లలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది బస్తీల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం తెల్లవార్లూ నిద్ర లేకుండా గడిపారు. అంధకారం.. వర్ష విలయానికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగెలు తెగిపడి కాలనీలు, బస్తీల్లో అంధకారం అలముకుంది. భారీ వర్షం కారణంగా సీపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో శివారు ప్రాంతాలు తెల్లవార్లూ అంధకారంలో మునిగాయి. రామాంతపూర్, ఉప్పల్, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో విద్యుత్ తీగెలపై చెట్లు విరిగిపడడంతో అంధకారం అలుముకుంది. వర్షంతో వినాయక మంటపాల వద్ద అలంకరణ చేసే వారూ అవస్థలు పడ్డారు. ట్రాఫిక్ జంఝాటం.. భారీ వర్షంతో అబిడ్స్, కోఠి, నాంపల్లి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్, ఉప్పల్, తార్నాక, బేగంపేట్, మెహిదీపట్నం తదితర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై మోకాలి లోతున వర్షపు నీరు నిలిచింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, విద్యార్థులు రాత్రి బాగా పొద్దుపోయాక ఇళ్లకు చేరుకోవాల్సి వచ్చింది. -
పదునెక్కిన పొలాలు
ఒంగోలు టూటౌన్: జిల్లాలో రెండు రోజులుగా అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలతో పొలాలు పదునెక్కాయి. ఈ పాటికే వేసిన పంటలకు ఊరట లభించింది. విత్తనం విత్తుకునే అవకాశం అన్నదాతకు కలిగింది. ప్రస్తుతం ఖరీఫ్‌లో పత్తి 3,096 హెక్టార్లు, వేరుశనగ 2,091 హెక్టార్లు, కంది 6,963 హెక్టార్లు, సజ్జ 3,901 హెక్టార్లు వేశారు. పంట కాలం ప్రారంభమై దాదాపు రెండు నెలలు కావస్తోంది. వీటితో పాటు వరి 145 హెక్టార్లు, కూరగాయలు 1641 హెక్టార్లు సాగయింది. ఈ నెలలో 89.7 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 82.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. వాతావరణం చల్లబడటం, వర్షం పడటం వలన ప్రస్తుతం వేసిన పంటలపై అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. గత ఏడాది ఇదే నెలలో పత్తి 8,652 హెక్టార్లు, వేరుశనగ 2,961 హెక్టార్లు, కంది 9,657 హెక్టార్లు, సజ్జ 5,590 హెక్టార్లు సాగయింది. ప్రస్తుత ఖరీఫ్‌లో 2,42,064 హెక్టార్లలో పంటలు పదునెక్కిన పొలాలు సాగు చేయాల్సి ఉండగా..సకాలంలో వర్షాలు కురవకపోవడంతో కేవలం 37,933 హెక్టార్లలో నామమాత్రంగా పంటలు సాగయ్యాయి. ఇకనుంచైనా వర్షాలు సక్రమంగా కురిస్తే ఖరీఫ్ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అందుబాటులో విత్తనాలు: కంది 1890 క్వింటాళ్లు, జీలుగ 1100 క్వింటాళ్లు, జనుము 1484 క్వింటాళ్లు, పెసర 1048 క్వింటాళ్లు, మినుము 3,606 క్వింటాళ్లు, పెసర 194 క్వింటాళ్లు ఉన్నాయి. మొత్తం 9379 క్వింటాళ్లు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. రైతులకు 50 శాతం రాయితీపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అయా మండలాల్లో ఇస్తున్నారు. ఇప్పటి వరకు 2,804 క్వింటాళ్ల విత్తనాలను రైతులకు అమ్మినట్లు ఏడీఏ రత్నప్రసాద్ తెలిపారు. ఎరువులు: ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తం 37 వేల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. యూరియా 9,400, డీఏపీ 8,900, కాంప్లెక్స్ ఎరువులు 18,100, ఎంవోపీ (మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ) 900 టన్నులు అందుబాటులో ఉంది. ప్రస్తుతం సీజన్ ముమ్మరం అయితే ఎరువుల కోసం రైతులు పరుగులు తీసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ఏడీఏ రత్నప్రసాద్ తెలిపారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు ఒంగోలు టౌన్: జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. సోమవారం సగటు వర్షపాతం 15.5 మిల్లీమీటర్లుగా నమోదైంది. ప్రాంతాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ఒంగోలు 26, టంగుటూరు 9.2, కొత్తపట్నం 24.6, నాగులుప్పలపాడు 1.6, చీమకుర్తి 23.2, మద్దిపాడు 23.4, సంతనూతలపాడు 16.2, అద్దంకి 24.6, కొరిశపాడు 19.8, జే పంగులూరు 36.2, బల్లికురవ 5.2, సంతమాగులూరు 29.2, మార్టూరు 46.2, యద్దనపూడి 46.4, చీరాల 37, వేటపాలెం 36, చినగంజాం 37.4, పర్చూరు 39.4, ఇంకొల్లు 10.6, కారంచేడు 24.6, కందుకూరు 6.2, గుడ్లూరు 2, వలేటివారిపాలెం 5.8, పొన్నలూరు 3.2, కొండపి 10.2, జరుగుమల్లి 8.2, సింగరాయకొండ 8, ఉలవపాడు 3.8, లింగసముద్రం 5.6, కనిగిరి 9, హనుమంతునిపాడు 11.8, పామూరు 1.6, వెలిగండ్ల 7.6, పీసీపల్లి 3.2, పొదిలి 13.8, కొనకనమిట్ల 2.6, మర్రిపూడి 7, దర్శి 38.2, తాళ్లూరు 20.2, ముండ్లమూరు 7, దొనకొండ 11, కురిచేడు 15, తర్లుపాడు 11.8, మార్కాపురం 13, దోర్నాల 8.8, పెద్దారవీడు 11.4, యర్రగొండపాలెం 14.4, త్రిపురాంతకం 18, పుల్లలచెరువు 14, గిద్దలూరు 10, రాచర్ల 10.2, కొమరోలు 9.2, బేస్తవారపేట 12.2, కంభం 9.4, అర్ధవీడులో 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జులైలో 89.7 మిల్లీమీటర్ల సగటు వర్షానికిగాను ఇప్పటి వరకు 82.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.