ఎడతెగని వాన
సాక్షి, గుంటూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాలుగురోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించింది. పల్లపు, శివారు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. చిలకలూరిపేట మండలంలోని పసుమర్రులో పెంకుటింటి మట్టిగోడలు కూలడంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి .ఫిరంగిపురం మండలం గరుడాచలపాలెంలో గోడకూలి ఓ బాలుడు మృతి చెందాడు. భట్టిప్రోలు మండలంలోని వెల్లటూరు - పెదపులివర్రు రహదారి మార్గంలో నిర్మిస్తున్న రహదారి, సైడ్ రిటైనింగ్ వాల్స్ పనులకు వ ర్షాల కారణంగా విఘాతం కలిగింది.
శనివారం తెల్లవారుజామున రహదారికి ఓపక్క మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. వర్షం అన్ని వర్గాల వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా కురుస్తున్న వర్షంతో జిల్లా అంతా తడిసి ముద్దయింది. దీంతో పగటిపూట పట్టణంలో జనసంచారం తగ్గింది. వర్షంతో రహదారులు జలమయం కావడంతో రాకపోకలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు ఉద్యోగులు కూడా తడుస్తూనే ఇబ్బందులు పడుతు వెళ్తున్నారు. చేతి వృత్తుల వారిపై ఈ వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గుంటూరు నగరంలో శివారు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది.
ప్రమాద హెచ్చరిక..
నిజాంపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం ప్రభావంతో హార్బర్‌లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్లు పోర్టు కన్జర్వేటర్ మోకా వెంకట రామారావు తెలిపారు. కొన్నిరోజులుగా కురుస్తున్న అకాలవర్షాలకు పలు బోట్లు వేటకు వెళ్లకుండా ఆగినట్లు తెలిపారు. వేటకు వెళ్లి బోట్లు వాతావరణం అనుకూలించక పోవడంతో తిరిగి ఒడ్డుకు చేరాలని సమాచారం అందించామన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
సెంటిమెంట్‌తో సముద్రంలోనే బోట్లు
లంగర్‌తో నడిసముద్రాన మత్స్యకారులు నిలిచిపోయారు. వేటకు వెళ్ళినబోట్లు వేటను నిలిపి తిరిగిరాకుండా నడిసముద్రంలోనే బోట్లను లంగర్‌వేసి నిలిపినట్లు పలువురు మత్స్యకారులు తెలుపుతున్నారు. హార్బర్‌లో 151 మెకగ్నైజడ్‌బోట్లు ఉన్నాయి. ఈనెల 15వ తేదీతో వేట నిషేదం గడువు ముగియడంతో బోట్లన్నీ సముద్రపు వేటకు బయలుదేరి వెళ్లాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వేట అతంత మాత్రంగానే సాగుతుండటంతో మత్స్యకారులు సముద్రంలోనే వేటను కొనసాగిస్తూ ఉన్నారు.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం ప్రభావంతో వేటకు వెళ్లిన బోట్లు తిరిగి రావాలని అధికారులు మత్స్యాకారులకు సమాచారం అందిస్తున్నారు. రెండు నెలల వేటనిషేధం తర్వాత తొలిసారిగా వేటకు వెళ్ళిన మత్స్యాకారులు తిరిగి వచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. తొలిసారిగా వేటకు వెళ్లి తిరిగి వస్తే ఏడాది మొత్తం అదేపరిస్థితి నెలకొంటుందని సెంటిమెంట్‌తో మత్స్యకారులు వేట సాగకపోయినా సముద్రంలోనే లంగరువేసి బోట్లను నిలిపినట్లు మత్స్యకారులు తెలుపుతున్నారు. సెంటిమెంట్‌తో వంద బోట్ల వరకూ సముద్రంలోనే నిలిచిఉన్నట్లు సమాచారం.
గోడ కూలి బాలుడి మృతి
ఫిరంగిపురం : మండలంలోని తక్కెళ్లపాడు శివారు గ్రామం గరుడాచలపాలెంలో శుక్రవారం రాత్రి గోడ కూలి బాలుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నరసరావుపేట రూరల్ మండలం ఇస్సాపాలెం గ్రామానికి చెందిన వావిరాల సుబ్బారావు, వెంకాయమ్మలు కూలీ పనుల నిమిత్తం కుమారుడు గణేష్(7)తో కలిసి గరుడాచలపాలెంలోని బంధువుల ఇంటికి నాలుగు రోజుల కిందట వచ్చారు. వారు నివాసముంటున్న ఇంటి గోడ పక్కగా గణేష్ నడుచుకుంటూ వెళ్ళుతుండగా ఒక్కసారిగా కూలి అతనిపై పడింది. తీవ్రంగా గాయపడిన గణేష్‌ను సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందా డు. మృతదేహాన్ని స్వగ్రామం అయిన ఇస్సాపాలెం గ్రామానికి తల్లిదండ్రులు తీసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.