కుండపోత
►ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు..
► నీట మునిగిన పొలాలు
పెనుగంచిప్రోలు: బంగళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండపోత వర్షం కురిసింది. దీంతో మండలంలో పలువాగులు పోటెత్తాయి. ముచ్చింతాల వద్ద నడివాగు చప్టాపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాగు పొంగడంతో చుట్టూ ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. ఎస్సీల శ్మశానవాటిక మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది.
అనిగండ్లపాడు వద్ద దూళ్లవాగు, గండివాగు, లింగగూడెం వద్ద గండివాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పత్తి, మిర్చి పొలాల్లో వర్షపు నీరు భారీగా చేరింది. ఈవర్షం పంటలకు చాలా మేలు చేస్తుందని రైతులు అంటున్నారు. చెరువుల్లోకి కొద్దిగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఉదయం ఆగకుండా రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. పెనుగంచిప్రోలు పోలీస్‌స్టేషన్ వద్ద పసుమర్తి చంద్రకాంతం ఇంటి గోడ కూలింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.