కొంపముంచిన కిరణ్ పర్యటన | kirankumar reddy Tour in vizag | Sakshi
Sakshi News home page

కొంపముంచిన కిరణ్ పర్యటన

Published Wed, Mar 19 2014 12:20 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

kirankumar reddy Tour in vizag

పాడేరు, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి హోదాలో 2012 డిసెంబర్ 19న కిరణ్‌కుమార్‌రెడ్డి విశాఖ జిల్లా పాడేరు పర్యటన ఆర్‌ఆండ్‌బీ అధికారుల కొంపముంచింది. ఆయన పర్యటనలో సాంకేతిక అనుమతులు లేకుండా హడావిడిగా ఆర్‌ఆండ్‌బీ రోడ్ల అభివృద్ధి పేరిట రూ.76.25 లక్షల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ ఆధారాలతో పాడేరుకు చెందిన అల్లాడి శ్రీనివాసరావు పాడేరు కోర్టులో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన న్యాయమూర్తి నాగేశ్వరరావు, అక్రమాలకు పాల్పడిన 11 మంది ఆర్‌ఆండ్‌బీ అధికారులతోపాటు కాంట్రాక్టర్‌పై కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలని పాడేరు పోలీసులను ఆదేశించారు.
 
 దీంతో పాడేరు పోలీసులు మంగళవారం ఆర్‌ఆండ్‌బీ అధికారులపై 167,409, 420, 468 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిలో హైదరాబాద్ ఆర్‌ఆండ్‌బీ చీఫ్ ఇంజినీర్ ఎం.గంగాధరం(ఎ1), విశాఖపట్నం ఆర్‌ఆండ్‌బీ ఎస్‌ఈ కె.కాంతిమతి(ఎ2), పాడేరు ఏఈఈ బి.విశ్వనాధం(ఎ3), పాడేరు డీఈఈ  కె.గోవిందరావు(ఎ4), జి.మాడుగుల ఏఈఈ వి.ఆర్.సీ.కుమార్(ఎ5), పాడేరు ఏఈఈ వి.కృష్ణారావు (ఎ6), ముంచంగిపుట్టు ఏఈఈ సీహెచ్.వెంకటరావు (ఎ7), విశాఖ క్వాలిటీ కంట్రోల్ డీఈఈ ఆర్.రామకృష్ణ(ఎ8), క్వాలిటీ కంట్రోల్ ఏఈఈలు ఎస్.రామచంద్రరావు(ఎ9), ఆర్.ఆర్.విద్యాసాగర్(ఎ10), డి.అప్పారావు (ఎ11), పాడేరు కాంట్రాక్టర్ పరిటాల నాగేశ్వరరావు(ఎ12)లు ఉన్నారు.
 
 ఇదీ నేపథ్యం!
 కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనతో పాడేరు-చింతపల్లి రోడ్డులో మూడు కిలోమీటర్లు, పాడేరు-అరకు రోడ్డులో మూడు కిలోమీటర్లు, సుజనకోట-డుడుమ రోడ్డులో మూడు కిలోమీటర్ల రోడ్డును ఆర్‌ఆండ్‌బీ అధికారులు అభివృద్ధి చేశారు. ఇందుకు రూ.76.25 లక్షలు ఖర్చు పెట్టారు. సీఎం పర్యటనకు కొత్త రోడ్లు వేయడం, మరమ్మతులు చేపట్టడం వంటి పనులు నిబంధనలకు విరుద్ధమని సమాచార హక్కు చట్టం కార్యకర్త అల్లాడి శ్రీనివాసరావు గుర్తించారు.
 
 ఈ రోడ్డు పనులకు రాష్ట్ర ఉన్నతాధికారితో పాటు ఇతర అధికారుల సాంకేతిక అనుమతులు లేవని, టెండర్లు కూడా పిలవలేదని, తప్పుడు రికార్డులు సృష్టించారని, పనుల్లో ప్రమాణాలు పాటించలేదని, తదితర వివరాలన్నింటిని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించారు. అన్ని స్థాయిల్లోను అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ ఏకమై ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని నిర్ధారణకు వచ్చిన శ్రీనివాసరావు, పాడేరు పోలీసు స్టేషన్‌లో తొలుత ఫిర్యాదు చేసి విఫలమయ్యారు. దీంతో పాడేరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, అన్ని ఆధారాలు చూపారు. దీంతో న్యాయమూర్తి విచారణ చేపట్టి, ఆర్‌ఆండ్‌బీ అధికారులపై కేసు నమోదుకు ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement