అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఏఎన్‌ఆర్‌ శతజయంతి వేడుకలు | Akkineni Nageswara Rao Centenary Celebrations By Akkineni Foundation Of America | Sakshi
Sakshi News home page

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఏఎన్‌ఆర్‌ శతజయంతి వేడుకలు

Published Thu, Sep 19 2024 12:06 PM | Last Updated on Thu, Sep 19 2024 12:14 PM

 Akkineni Nageswara Rao Centenary Celebrations  By Akkineni Foundation Of America

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏ.ఎఫ్.ఏ) ఆధ్వర్యంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి శతజయంతి (సెప్టెంబర్ 20, 1924 – సెప్టెంబర్ 20, 2024) సందర్భంగా “నటసమ్రాట్ అక్కినేనిగారి నటనాజీవితం-వివిధ కోణాలలో” అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం ఆదివారం ఘనంగా జరిగింది.

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రస్తుత అధ్యక్షులు మురళి వెన్నం అక్కినేని గారితో ఉన్న ప్రత్యేక అనుభందాన్ని, ఆయన జీవనప్రస్థానాన్ని క్లుప్తంగా వివరించి ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికీ ఆత్మీయ స్వాగతం పలికారు. అక్కినేనిగారితో ఎంతో కాలంగా సన్నిహిత సంబంధంఉన్న ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రవి కొండబోలు అక్కినేనిగారి అభిరుచులు, కుటుంబ విలువలకు ఆయన ఇచ్చిన ప్రాముఖ్యాన్ని పంచుకున్నారు. 

ప్రముఖ గాయని, ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షురాలు శారద ఆకునూరి అక్కినేనిగారి సమక్షంలో పాటలు పాడి వారి ఆశీస్సులు పొందగల్గడం తన అదృష్టం అన్నారు. ఎ.ఎఫ్.ఎ పూర్వాధ్యక్షులు రావు కల్వాల అక్కినేని గారి జ్ఞాపకశక్తి, ఆత్మీయపలకరింపులను గుర్తు చేసుకున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ డా. అక్కినేని నటనా జీవితం ఎంత ప్రముఖమైనదో ఆయన వ్యక్తిత్వం కూడా అంత విశిష్ట మైనది, ఆయన జీవితంనుండి నేర్చుకోవలసినది ఎంతోఉంది అన్నారు. 

అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో విశిష్టఅతిథులుగా పాల్గొన్న – జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ప్రముఖ సినీ గీతరచయిత, తెలుగువేదకవి – “అక్కినేనితో ముచ్చట్లు”; డా. వి.ఎన్ ఆదిత్య, ప్రముఖ సినీదర్శకులు, రచయిత, నిర్మాత – “జానపద కథానాయకుడు అక్కినేని”; ఎస్. వి రామారావు, ‘సినీ విజ్ఞాన విశారద’, సినీ చరిత్రకారుడు – “అక్కినేని జైత్రయాత్ర”; బలభద్రపాత్రుని రమణి, ప్రముఖ సినీకథా రచయిత్రి, నందిపురస్కార గ్రహీత – “నవలానాయకుడు అక్కినేని”; కాదంబరి కిరణ్, ప్రముఖ సినీ నటులు, అక్కినేనికి అత్యంత ఆప్తులు – “చిన్నతెరమీద మహానటుడు”; పోణంగి బాలభాస్కర్, పూర్వ ఆకాశవాణి వార్తల చదువరి, దూరదర్శన్ వ్యాఖ్యాత – “భక్తిరస పాత్రల్లో అక్కినేని”; పారా అశోక్ కుమార్, సాహిత్య పరిశోధకులు –“అక్కినేని హేతువాద దృక్పథం”; లక్ష్మీ భవాని, ‘అక్కినేని వీరాభిమాని’ – “సాంఘిక చిత్రాలలో మరపురాని కథానాయకుడు” అంటూ వివిధ కోణాలలో అక్కినేని గారి నటనాజీవితాన్ని చక్కగా విశ్లేషణ చేశారు. 

ప్రముఖ ద్వ్యనుకరణ కళాకారుడు భవిరి రవి అక్కినేని గారి ఎలా మాట్లాడతారో అనుకరించి అందరినీ అలరించారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర పద్మవిభూషణ్, నటసమ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదినమైన సెప్టెంబర్ 20వ తేదీ సాయంత్రం అల్లెన్‌ నగరంలో (డాలస్ పరిసర నగరం) నెలకొని ఉన్న రాధాకృష్ణ టెంపుల్ ఆడిటోరియంలో అక్కినేని సినిమాల నుంచి కొన్ని పాటలను ఎంపికచేసి “అక్కినేని చిత్రగీతాంజలి / నృత్యాంజలి పేరిట’’ ఒక ప్రత్యేక నివాళిగా అక్కినేని శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అందరూ పాల్గొనవలసినదిగా ఆహ్వానం పలికారు.

(చదవండి: చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement