గిరి రైతు క్షేత్రంలో సిరులు
డ్రాగన్ ఫ్రూట్ సాగులో నిలకడగా ఆదాయం ఆర్జిస్తున్న గిరి రైతు
అంతర పంటగా బంతి
అనుకూలించిన వాతావరణ పరిస్థితులు
ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం పొందుతున్న గిరిజన రైతు నాగేశ్వరరావు
పశువుల ఎరువు వినియోగంతో నాణ్యమైన దిగుబడి
స్థానికంగానే మార్కెటింగ్ తప్పిన దళారుల సమస్య
డ్రాగన్ ప్రూట్ సాగులో మంచి ఫలితాలు సాధిస్తున్నారు కొర్రాయి పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గిరిజన రైతు గుజ్జెల నాగేశ్వరరావు. ఎకరా విస్తీర్ణంలో సాగు చేపట్టిన ఆయన రూ.2 లక్షల మేర ఆదాయం పొందుతున్నారు. అంతర పంటగా బంతి వేయడం వల్ల ఆదనంగా ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు. దళారులు, వ్యాపారులపై ఆధారపడకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న మార్కెటింగ్ వనరులను సది్వనియోగం చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
డుంబ్రిగుడ: మండలంలోని కొర్రాయి పంచాయతీ శాంతినగర్‌కు చెందిన గిరిజన కుటుంబానికి చెందిన గుజ్జెల నాగేశ్వరరావు డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టి మంచి ఆదాయం పొందుతున్నారు. విశాఖ షిప్‌యార్డులో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న ఆయనకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. అయితే అందరిలా కాకుండా ఆయన వినూత్నంగా ఆలోచించారు. ఈ ప్రాంత వాతావరణం అనుకూలంగా ఉన్నందున డ్రాగన్ ఫ్రూట్ సాగుపై దృష్టి సారించారు. గతేడాది ట్రెల్లీస్ పద్ధతిలో జైన్ రకానికి చెందిన రెండు వేల మొక్కలను ఎకరా విస్తీర్ణంలో నాటారు.
ఒకొక్క మొక్క రూ.75..
ఒకొక్క మొక్కను గుంటూరులోని ఓ క్షేత్రంలో రూ. 75 చొప్పున కొనుగోలు చేశారు. ట్రెల్లీస్ విధానంలో కీలకమైన సిమెంట్ స్తంభాలు ఒకొక్కటి రూ.350 చొప్పున 500 కొనుగోలు చేశారు. మొత్తమ్మీద మొక్కలు, సిమెంటు స్తంభాలు, కూలి ఖర్చులు కలిపి ఎకరాకు 1.50 లక్షల వరకు పెట్టుబడి అయిందని రైతు తెలిపారు.
» నాటిన తొమ్మిది నెలలకు కాపు మొదలైంది. ఈ ఏడాది పూర్తిగా దిగుబడి వచ్చింది. కిలో రూ.200 చొప్పున విక్రయించగా సుమారు రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చిందని రైతు పేర్కొన్నారు.
» భూమిని సారవంతం చేసేందుకు రసాయన ఎరువులకు బదులుగా పశువుల ఎరువు వినియోగించారు. ఎకరాకు ఐదు ట్రాక్టర్లు గెత్తం వాడినట్టు రైతు తెలిపారు. దీనివల్ల దిగుబడి పెరగడంతో పాటు పండు నాణ్యతగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఒకసారి నాటితే సుమారు 30 సంవత్సరాల వరకు నిలకడగా దిగుబడి వస్తుందని ఆయన వివరించారు.
» ట్రెల్లీస్ విధానంలో సాగు చేపట్టడం వల్ల మొక్కకు గాలి తగిలి ఏపుగా పెరుగుతుంది. మొక్కకు మొక్కకు మధ్య పది అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు దూరం ఉండాలి. ఒక మొక్క నుంచి సుమారు 20 వరకు పండ్ల దిగుబడి వస్తుందని రైతు తెలిపారు.
» పర్యాటక ప్రాంతం కావడం వల్ల మార్కెటింగ్ స్థానికంగా అందుబాటులో ఉంది. అరకు పైనరీ, గిరిజన మ్యూజియంతో పాటు స్థానిక మార్కెట్లో విక్రయించడం వల్ల దళారుల ప్రభావం లేదని రైతు తెలిపారు. దీనివల్ల ఆయన మంచి ఆదాయం పొందగలుగుతున్నారు.
» అంతరపంటగా ముద్దబంతి సాగు చేపట్టారు. దీనిపై ఏటా అక్టోబర్, నవంబర్‌లో వచ్చే ఆదాయం తోట నిర్వహణ ఖర్చులకు సరిపోతుందని రైతు తెలిపారు. ఉద్యానవనశాఖ ఎకరాకు రూ.13 వేలు పెట్టుబడి సాయంగా అందజేసిందని రైతు తెలిపారు. ఇంటిల్లపాది కష్టపడి పనిచేయడం వల్ల ఏటా నిర్వహణ ఖర్చులు తగ్గడం వల్ల రెండో ఏడాది మంచి ఆదాయం వచ్చిందని రైతు నాగేశ్వరరావు వివరించారు.
సాగును ప్రోత్సహిస్తాం
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టే రైతులకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తున్నాం. ఉద్యానవన శాఖ తరఫున ఎకరాకు రూ.13 వేల చొప్పున ఆర్థిక సాయం పొందవచ్చు. అయితే ఈ ఏడాది ఎటువంటి నిధులు మంజూరు కాలేదు. వ్యవసాయ, ఉద్యానవన శాఖల ద్వారా సాగునీటి బోర్లు మంజూరైతే తప్పనిసరిగా డ్రాగన్ ఫ్రూట్ రైతులకు కేటాయిస్తాం. – కె.శిరీష,ఉద్యానవనశాఖ అధికారి, డుంబ్రిగుడ
Comments
Please login to add a commentAdd a comment