డీలర్లు, వీఓఏ, ఫీల్ట్ అసిస్టెంట్ల మార్పులు ఆయన చేతుల్లోనే..
ఆగ్రహంగా ఉన్న స్థానిక సీనియర్ నేతలు
‘అందరూ వినండి. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నాకు బావ వరుస అవుతాడు. నేను చెబితే ఆయన చెప్పినట్లే’ ఇదీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలో ఓ వ్యక్తి ధోరణి. వలేటివారిపాళెం మండలానికి చెందిన ఈయన ప్రస్తుతం ఉలవపాడు మండలంలో పెత్తనం చేస్తున్నాడు. సీనియర్ నాయకులు సైతం తన వద్దకు రావాల్సిందే అంటున్నాడు. ప్రస్తుతం మండలంలో సర్వాధికారం నాదేనని చెబుతున్నాడు.
ఉలవపాడు: ‘నేను చెప్పిన వారే రేషన్ డీలర్. నాకు నచ్చిన వారే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉంటారు. నేను చూపించిన వారే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ)గా పనిచేస్తారు. నేను చెప్పినట్లే అధికారులంతా నడుచుకోవాలి.’ ఇదీ పొడపాటి సుధాకర్ అనే వ్యక్తి ఉలవపాడు మండలంలో చేస్తున్న పని. వలేటివారిపాళెం మండలానికి చెందిన ఈయన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు సమీప బంధువు, బావమరిది వరుస అవుతాడు. ఎన్నికల సమయంలో సుధాకర్ ఇంటూరి కోసం ఉలవపాడు మండలంలో పనిచేశాడు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిఫలంగా ఇక్కడ ఇష్టమొచ్చినట్లు చేసుకోమని సుధాకర్‌కు నాగేశ్వరరావు బాధ్యతలు అప్పజెప్పినట్లుప్రచారం జరుగుతోంది. అధికారులు ఏ పనిచేయాలన్నా, ప్రజలకు ఏ పని కావాలన్నా ఆయన్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
తొలగింపులు.. నియామకాలు
మండలంలో ప్రస్తుతం ఉన్న డీలర్లు, వీఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలను మార్చడానికి ఏకంగా పార్టీ కార్యాలయంలోనే సోమవారం సుధాకర్ సమావేశం ఏర్పాటు చేశాడు. ఎమ్మెల్యే అండతోనే ఇలా చేసినట్లు కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్‌షిప్, భోజన ఏజెన్సీలు తమకే కావాలంటూ కార్యకర్తలు పట్టుబట్టారు. ఇప్పుడున్న వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని తహసీల్దార్ కార్యాలయానికి పేర్లు పంపించినట్లు సమాచారం. ఈ విషయాలు సీనియర్ నాయకులకు మింగుడు పడడంలేదు. సుధాకర్ వ్యవహారశైలి నచ్చక సమావేశానికి డుమ్మా కొట్టారు. గతంలో పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఇలానే పలువురు అధికారం చెలాయించారు.
ఆగ్రహంగా సీనియర్ నేతలు
ఎమ్మెల్యే ఆదేశాలతో వేరే మండలానికి చెందిన సుధాకర్ ఉలవపాడు మండలంలో పెత్తనం చెలాయించడాన్ని స్థానిక టీడీపీ సీనియర్ నేతలు అంగీకరించడం లేదు. ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి తాము ఎంతో శ్రమించామని, ఇప్పుడు మమ్మల్ని కాదని సుధాకర్‌కు బాధ్యతలు ఇవ్వడాన్ని వారు సహించలేకపోతున్నారు. తమ మాట చెల్లుబాటు కావడం లేదని, ఎమ్మెల్యే మండలాన్ని అతనికి రాసిచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ చేస్తున్న పనులపై ద్వితీయ శ్రేణి నాయకులంతా అసంతృప్తిగా ఉన్నా ఇంటూరి మాత్రం చూసీచూడనట్లు ఉన్నట్లు విమర్శలున్నాయి. అతను ఏం చేసినా ఫర్వాలేదన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహారశైలి ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment