పదవులుండి పెత్తనం చేయలేని నిస్సహాయులు
చినబాబు అండ్ కో ఆజ్ఞ లేనిదే చిన్న బదిలీ కూడా జరగదు
షాడో ఎమ్మెల్యేలుగా పచ్చ మీడియా ప్రతినిధులు
వీరు ఆమోద ముద్ర వేస్తేనే పోస్టింగ్‌లకు క్లియరెన్స్
సీఐ, ఎస్‌ఐ పోస్టింగ్‌లపై ఎమ్మెల్యే సిఫార్సులు పెండింగ్‌లో
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి రిక్తహస్తాలు
జిల్లాలోని పలు సర్కిళ్లలో ఖాళీగా సీఐ, ఎస్‌ఐ పోస్టులు
కూటమి ఎమ్మెల్యేలు డమ్మీలు. నియోజకవర్గ స్థాయిలో పెత్తనమంతా చిన్నబాబు లోకేష్.. ఆయన అనుచరులదే. పచ్చమీడియా ప్రతినిధులే షాడో ఎమ్మెల్యేలు. వీరు సిఫార్సు చేస్తేనే కానిస్టేబుల్ నుంచి ఎస్పీల వరకు.. బిల్ కలెక్టర్ నుంచి కలెక్టర్ వరకు పోస్టింగ్ లు ఇస్తున్న పరిస్థితి. చిన్నబాబు ఆజ్ఞ లేనిదే చిన్న పోస్టింగ్ కూడా ఇవ్వలేమని ఉన్నతాధికారులు తెగేసి చెబుతున్నారు. చిన్న పోస్టింగ్ కూడా వేయించుకునే శక్తి లేక ఎమ్మెల్యేలు నిస్సహాయత ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెంలో సీఐ, ఎస్‌ఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సాక్షిప్రతినిధి, ఒంగోలు: అధికారంలోకి వచ్చాక తమ అధికార దర్పాన్ని ప్రదర్శిద్దామని కలలు కన్న ఎమ్మెల్యేలు డమ్మీలయ్యారు. ఏది చేయాలన్నా చిన్నబాబు టీమ్ అనుమతి కావాల్సిందే. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి అధికారులు సైతం అక్కడి నుంచి క్లియరెన్స్ రావాలంటూ ఎమ్మెల్యేలకు ఓపెన్‌గా చెప్పేస్తున్నారు.
దీంతో చిన్నబాబును కలిసి చెప్పలేక, పనులు కాక, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. చివరకు సీఐ, ఎస్‌సై పోస్టింగ్‌లలో సైతం తాము చెప్పిన వారికి వేయించుకోలేని దుస్థితిలో ఉన్నామంటూ కూటమి ఎమ్మెల్యేలు తమ అనుయాయుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. పోలీసు పోస్టింగ్‌లు ఏవైనా చిన్నబాబు లోకేష్ టీమ్ చెక్ చేసి ఓకే అంటేనే పోస్టింగ్‌లు వేసేలా ఐజీ, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అభ్యర్థించినా అక్కడి నుంచి ఆమోదం రానిదే పోస్టింగ్‌లు వేయలేమంటూ తెగేసి చెబుతున్నారు.
కొందరు ఎమ్మెల్యేలు అయితే మంత్రులు, జిల్లా ముఖ్యనేతలతో సహా ఉన్నతాధికారులకు చెప్పించినా చివరకు డీజీపీని కలిసి అభ్యరి్థంచినా ఫలితం లేకపోవడంతో కొత్త పేర్లు ఇవ్వకుండా అలిగి కూర్చున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు అలిగినా, ఆగ్రహించినా చిన్నబాబు టీమ్ మాత్రం డోంట్ కేర్ అంటోంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు రిపోర్టర్లు, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు, యువగళం పాదయాత్రలో పాల్గొన్న టీడీపీ యువనేతలతో పోలీసు అధికారుల గురించి సమాచారం తెప్పించుకుని దాని ప్రకారం మాత్రమే క్లియరెన్స్ ఇస్తున్న పరిస్థితి. దీంతో టీడీపీ సామాజికవర్గం మినహా ఎస్‌సై పోస్టింగ్‌లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పోలీసు అధికారులకు దక్కక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎమ్మెల్యేల లిస్ట్‌కు నో..
జిల్లాలో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఎస్‌సై, సీఐ పోస్టింగ్‌లు వేయించుకోలేని నిస్సహాయ పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలంతా సీఐ, ఎస్‌సై పోస్టింగ్‌లకు తమకు కావాల్సిన వారికి ఇవ్వమని లిస్టు పంపినప్పటికీ చిన్నబాబు టీమ్ పరిశీలనకు వెళ్లినట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి క్లియరెన్స్ రాని సీఐ, ఎస్‌సైలకు ఇప్పటికీ పోస్టింగ్‌లు దక్కలేదు. రెండు దఫాలుగా మార్చి కొత్తపేర్లు ఇచ్చినప్పటికీ వాళ్లు కూడా మన పారీ్టకి సంబంధించిన వారు కాదంటూ చిన్నబాబు టీమ్ అడ్డుపుల్ల వేశారు.
జిల్లాలో కనిగిరి, పామూరు, మార్కాపురం, కంభం, యర్రగొండపాలెం, త్రిపురాంతకం తదితర సర్కిల్‌లకు సీఐల పేర్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పంపినప్పటికీ వారికి ఇవ్వడం కుదరదంటూ చిన్నబాబు టీమ్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి క్లియరెన్స్ రానిదే పోస్టింగ్‌లు ఇవ్వమంటూ పోలీసు ఉన్నతాధికారులు సైతం చేతులెత్తేస్తున్న పరిస్థితి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు దాటుతున్నా సీఐ, ఎస్‌సై పోస్టింగ్‌లు కూడా వేయించుకోలేకపోతున్నామని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి తాము చూడలేదంటూ ఎమ్మెల్యేలు మనోవేదన చెందుతున్నట్లు తెలిసింది. ఆయా జిల్లాల మంత్రులు సిఫార్సు చేసినా ఫలితం లేకపోవడంతో ఇక తమగోడు ఎవరికి చెప్పుకోవాలంటూ ఎమ్మెల్యేలు అలిగి కూర్చున్నట్లు తెలిసింది.
తాము చెప్పిన వారికి పోస్టింగ్ వేయకపోతే ఇక కొత్త పేరు చెప్పేది లేదంటూ ఎమ్మెల్యే భీషి్మంచి కూర్చొవడంతో ఇప్పటికీ జిల్లాలో సీఐ, ఎస్‌సై పోస్టింగ్‌లు ఇవ్వకుండా పాతవారినే కొనసాగిస్తున్న పరిస్థితి. టీడీపీకి పూర్తి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే పోస్టింగ్ ఇవ్వాలనేది చిన్నబాబు టీమ్ ప్రతిపాదనగా ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ హయాంలో పోస్టింగ్‌లు చేసిన పోలీసు అధికారులకు ఎమ్మెల్యేలు అంగీకరించినా పోస్టింగ్ ఇచ్చే సమస్యే లేదని లోకేష్ టీమ్ మోకాలడ్డుతోంది. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో చిన్నబాబు టీమ్, ఎమ్మెల్యేల మధ్య అంతర్యుద్ధం నడుస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఎటు దారితీస్తుందోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment