అనంతపురం ఎడ్యుకేషన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాలు సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ‘సామాజిక సాధికార బస్సు యాత్ర’ చేశాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో తాడిపత్రి జనపత్రిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన రోడ్డు వేలాది ప్రజలతో కిక్కిరిసింది.
ముందుగా పట్టణంలోని కూరగాయల కొత్త మార్కెట్ ఎదురుగా ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావుపూలే విగ్రహాన్ని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం భగత్‌సింగ్ నగర్ నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సీబీ రోడ్డు మీదుగా వైఎస్సార్ సర్కిల్ వరకు సాగింది. మధ్యలో సిద్దిబాషా దర్గాలో ప్రార్థనలు చేశారు.
దారిపొడవునా బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వేలాదిమంది పాల్గొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను ప్రజాప్రతినిధులు, నేతలు వివరించినప్పుడు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ‘మళ్లీ రావాలి జగన్ – కావాలి జగన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మాకే ఉంది : మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
నాలుగున్నరేళ్లలో సామాజిక న్యాయం చేసి నిరూపించిన సీఎం వైఎస్ జగన్ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్‌సీపీ నేతలకే ఉందన్నారు. సామాజిక న్యాయం జరగాలని, పేదవాడు పేదవాడిగానే ఉండిపోకూడదని, పేదల కుటుంబాల్లోనూ డాక్టర్లు, ఇంజినీర్లు కావాలని సీఎం వైఎస్ జగన్ పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పల్లకీ మోసిన జగన్‌ను మళ్లీ గెలిపిద్దాం: మంత్రి ఉషశ్రీచరణ్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పల్లకీ మోశారని, మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని మంత్రి ఉషశ్రీ చరణ్ పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాలను గుర్తించి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పారు. 139 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు, బీసీల్లో పుట్టాం అని గర్వంగా చెప్పుకునేలా చేశారని తెలిపారు. సీఎం జగన్ అగ్రకులంలో పుట్టినా బీసీ కుల గణనకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.
సీఎం జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటాం: ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను గుండెల్లో పెట్టుకుంటామని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ చెప్పారు. ఈ వర్గాలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా నిలబెట్టేందుకు సీఎం జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ : ఎంపీ తలారి రంగయ్య
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో అత్యధిక ప్రాధాన్యం కల్పించి, సామాజిక న్యాయం చేసిన సీఎం జగన్ అని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య చెప్పారు. రాయలసీమలో మొత్తం 8 ఎంపీ స్థానాలు ఉంటే 5 స్థానాలు బీసీ, ఎస్సీలకు ఇచ్చారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీలకు ఏ పార్టీ టికెట్లు ఇవ్వలేదన్నారు.
రాష్ట్రానికి జగన్ అవసరం చాలా ఉంది: ఎంపీ నందిగం సురేష్
పేదలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉందని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. సీఎం జగన్ అతి సామాన్యమైన వ్యక్తులను పైసా ఖర్చు లేకుండా ఎంపీలుగా చేశారని, వారిలో తాను ఒకడినని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment