అవస్థల ఆర్‌యూబీ!
మూడేళ్లుగా కొనసా..గుతున్న బ్రిడ్జి నిర్మాణం
మహబూబాబాద్ : తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచిందన్నట్లుగా తయారైంది మానుకోట రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణం. పెరుగుతున్న పట్టణ జనాభా... వాహనాల రద్దీ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ఆర్‌యూబీ నిర్మాణ పనులు రెండు అడుగులు ముందుకు.. నాలుగడుగులు వెన క్కి అన్న చందంగా కొనసాగుతున్నారుు. పట్టణవాసులు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన మానుకోటలో ఆర్‌యూబీ నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.18 కోట్లు మంజూరు చేశాయి. ఇందులో ట్రాక్ కింద బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.3.29 కోట్లు, ఆర్‌యూబీ నిర్మాణంతో ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం అందజేసేందుకు రూ.6.60 కోట్లు కేటాయించారు. మిగతా నిధులతో బ్రిడ్జికి ఇరువైపుల సైడ్‌వాల్స్, పైపులైన్, విద్యుద్దీపాలు, సర్వీసు గో డలు, ఇతర నిర్మాణాలు చేపట్టాలని అధికారులు నిర్ణరుుంచా రు. 2011లో బ్రిడ్జి నిర్మాణ పనులకు టెండర్ పిలవగా... ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. అదే సంవత్సరం పనులు ప్రారంభించాడు. మూడేళ్లు కావొస్తున్నా... పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
అనాలోచిత నిర్ణయూలతో...
ముందుగా నిర్ణయించిన ప్రకారం పనులు చేపట్టకుండా అధికారులు పలుమార్లు బ్రిడ్జి డిజైన్‌ను మార్చారు. తొలుత టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తనకు నిర్మాణానికి సరిపడా నిధులు మంజూరు చేయాలని అధికారులను కోరగా.. వారు పట్టించుకోలేదు. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో గత టెండర్‌ను రద్దు చేసి మరో కాంట్రాక్టర్‌కు ఆర్‌యూబీ పనులు అప్పగించారు. ఇలా బ్రిడ్జి డిజైన్, కాంట్రాక్టర్ల మార్పు కారణంగా పనుల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. అంతేకాదు... ముందుగా నిర్ణయించిన ప్రకారం నిర్మాణం చేపట్టకుండా డిజైన్‌లో మార్పులు చేయడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాస్తవానికి 10 అడుగుల ఎత్తుతో నిర్మించాల్సిన బ్రిడ్జిని 8.8 అడుగుల ఎత్తుతో కట్టడంతో నాన్ కమర్షియల్ వాహనాలు మాత్రమే బ్రిడ్జి కింది నుంచి వెళ్తున్నాయి. బ్రిడ్జి కింది నుంచి కనీసం 108 అంబులెన్స్ వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఏరియా ఆస్పత్రికి, పాతబజార్ నుంచి కొత్త బజార్‌కు వచ్చేందుకు సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉన్న ఆర్‌ఓబీ (రోడ్డు ఓవర్ బ్రిడ్జి)పై నుంచి రావాల్సి వచ్చేది. ఆర్‌యూబీ నిర్మాణంతోనైనా తమ కష్టాలు తొలగిపోతాయని భావించిన ప్రజలు, వాహన దారులకు డిజైన్ మార్పు శరాఘాతంగా మారింది.
రాత్రివేళల్లో ప్రమాదాలు
రాత్రివేళల్లో కొత్త బజార్ బ్రిడ్జి సమీపంలోని రామమందిరం, ఏరియా ఆస్పత్రి రోడ్డు, కురవి రోడ్డు నుంచి వచ్చే వాహనదారులు పాతబజార్‌కు ఏ మార్గం గుండా వెళ్లాలో తెలియక తికమకపడుతున్నారు. వాహనాలు అదుపుతప్పడంతో పలువురు ప్రమాదాల బారిన పడ్డారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఆర్‌యూబీ డిజై న్‌లో మార్పులు చేసి నిర్మాణపనులను త్వరితగతిన పూర్తి చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. రోడ్డు వెంబడి ఏర్పాటు చేసిన వీధి లైట్లకు త్వరగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ప్రమాదాలను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్ అండ్ బీ పనులు పూర్తి చేశాం
ఆర్‌అండ్‌బీకి సంబంధించిన పనులను సక్రమంగా పూర్తి చేశాం. వర్షాకాలంలో బ్రిడ్జి కింద నీరు నిలిచిపోకుండా ఉండేందుకు ఇక్కడి నుంచి సమీపంలోని బంధం కాలువకు పైపులైన్ వేశాం. ట్రాక్ క్రింద బ్రిడ్జి పనులు రైల్వే పరిధిలో ఉండడంతో రైల్వే కాంట్రాక్టర్ ఆ పనులను చేస్తున్నారు. డిజైన్‌లో ఏమాత్రం మార్పు వచ్చినా... ఇబ్బందులు తప్పవు.
- రమేష్, ఆర్‌అండ్‌బీ డీఈ