
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో గత రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి మహబూబ్‌నగర్ మండలం కోడూరు దగ్గర ఉన్న రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో శుక్రవారం ఉదయం రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. దాదాపు 30 మంది విద్యార్థులతో వెళుతున్న భాష్యం టెక్నో స్కూల్‌కు చెందిన బస్సు నీటిలో చిక్కుకుంది.
రాంచంద్రపూర్, మాచన్‌పల్లి, సూగురుగడ్డ తాండా నుంచి విద్యార్థులను ఎక్కించుకుని పాఠశాలకు వెళ్తున్న బస్సు వరద నీటిలోకి రాగానే ఆగిపోయింది. చూస్తుండగానే బస్సులోకి నీరు చేరడంతో దీనిని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విద్యార్దులంతా క్షేమంగా బయటపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ట్రాక్టర్ సహాయంతో నీటిలో చిక్కుకున్న బస్సును బయటకు లాగారు.
అయితే బస్సు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే పూర్తిగా నీటిలో మునిగిపోయేదని, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
చదవండి: భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి
Comments
Please login to add a commentAdd a comment