
గుడిబండ వద్ద స్థలాలను పరిశీలిస్తున్న అధికారులు
అడ్డాకుల(దేవరకద్ర): అడ్డాకుల మండల పరిధిలో మినీ విమానాశ్రయం ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో అధికారులు స్థలాలను గుర్తించే పనిలో ఉన్నారు. మండలంలోని గుడిబండ శివారులో మంగళవారం ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు స్థలపరిశీలన చేశారు. మహబూబ్‌నగర్ ఆర్‌అండ్‌బీ ఏఈ వేణుగోపాల్, అడ్డాకుల గిర్దావర్ మంజుల, సర్వేయర్ సాయిబాబా, రెవెన్యూ కార్యదర్శి కిరణ్ చిన్నమునుగల్‌ఛేడ్, పెద్దమునుగల్‌ఛేడ్ శివారులోని ఓ స్థలాన్ని పరిశీలించారు. అయితే అక్కడ చెరువు కాలువ ఉండటంతో గుడిబండలోని సర్వే నంబర్ 108 పరిసరాల్లోని ఇతర సర్వే నంబర్లలో పొలాలను పరిశీలించారు. దాదాపు 300 ఎకరాల స్థలాన్ని గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.
హైదరాబాద్ నుంచి 120కిలోమీటర్ల దూరంలో స్థలాలను ఎంపిక చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో అధికారులు ఇక్కడి స్థలాన్ని ఎంపిక నిమిత్తం పరిశీలించి మ్యాపులను రూపొందిస్తున్నారు. కాగా, తొలుత అడ్డాకులతో పాటు మూసాపేట, భూత్పూర్ మండలాల్లోని పలుప్రాంతాలను అధికారులు పరిశీలించారు. అదేవిధంగా భూత్పూర్ మండలంలోని రావులపల్లిలో కూడా ఓ స్థలాన్ని పరిశీలించగా ఓ దశలో అక్కడే విమానాశ్రయం ఏర్పాటు కానుందన్న ప్రచారం సాగింది. అయితే ఆయా ప్రాంతాలు విమానాశ్రయం ఏర్పాటుకు అనువుగా లేవని ఉన్నతాధికారులు తిరస్కరించడంతో తాజాగా అడ్డాకుల మండలంలో అధికారులు సర్వే చేస్తున్నారు. దీంతో అడ్డాకుల మండలంలో మినీ విమానాశ్రయం ఏర్పాటుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment