రహదారులు సిద్దం!
సర్కారుకు డీపీఆర్ అందజేత 150 అడుగులకు రూ.2,700 కోట్ల నష్టం
అవాంతరాలూ కోకొల్లలు 100 ఫీట్లకు రూ.401 కోట్ల పరిహారం
దీనికే మొగ్గు చూపుతున్న ఆర్‌అండ్‌బీ అధికారులు
వరంగల్ రూరల్ : నగరంతోపాటు చుట్టూ ఉన్న రహదారుల అభివృద్ధిపై డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) సిద్ధమైంది. ఆరు లేన్లుగా 150 అడుగులతో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు అధికారులు సర్వే చేశారు. మొత్తం ఐదు రహదారులపై రూపొం దించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. 150 అడుగులుగా రహదారులను అభివృద్ధి చేస్తే రూ.వేల కోట్లలో నష్టపరిహారం చెల్లించాల్సి వస్తోందన్న విషయం సర్వేలో వెలుగుచూసింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ అధికారులు 100, 150 అడుగులతో అభివృద్ధి చేస్తే కలిగే లాభనష్టాలను బేరీజు వేస్తూ నివేదికలో పొందుపర్చారు. 150 అడుగులతో అభివృద్ధి చేయూలనుకుంటే నష్టపరిహారం అందించేందుకే నిధులు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుందని, ఈ క్రమంలో విస్తరణకు నిధుల కొరత ఏర్పడుతుందని అంచనా వేశారు.
150 అడుగులుగా మారిస్తే... నగరం, చుట్టు పక్కల రహదారులు
హంటర్‌రోడ్-నాయుడు పంప్, కాజీపేట-పెద్దమ్మగడ్డ, కడిపికొండ -ఉర్సుగుట్ట, రాంపూర్-ములుగురోడ్డు (ఎన్‌హెచ్-163), ములుగురోడ్డు-ధర్మారం వరకు ఐదు రోడ్లను 150 అడుగులుగా అభివృద్ధి చేస్తే 7,51,275 చదరపు గజాల స్థలాన్ని సేకరించాలని డీపీఆర్‌లో స్పష్టం చేశారు. 2,938 పక్కా భవనాలను కూల్చివేయాల్సి ఉంటుందని... ఇందుకోసం బాధితులకు సుమారు రూ.2,700 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నారు.
150 అడుగులు అరుుతే...
ఈ ఐదు రహదారులను 100 అడుగులుగా విస్తరిస్తే 1,85,600 చదరపు గజాల స్థలం అవసరమవుతుందని నివేదికలో పొందుపరిచారు. ఈ మేరకు 790 భవనాలను కూల్చివేయాలని, సుమారు రూ. 401 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
1971 మాస్టర్ ప్లాన్ బెటర్...
రహదారులను 150 అడుగులుగా విస్తరిస్తే వందలాది పక్కా భవనాలు నేలమట్టమై పలు కుటుంబాలు ఆశ్రయం కోల్పోయే అవకాశాలున్నాయని వివరించిన ఆర్ అండ్ బీ అధికారులు 1971 మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో వివరించారు.
వరంగల్ నగర అభివృద్ధి కోసం 1971లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్లు రహదారికి వదిలివేసే విధంగా భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని, ఈ మేరకు నష్టపరిహార భారం ప్రభుత్వంపై తక్కువ పడుతుందని పేర్కొన్నారు. 150 అడుగులతో విస్తరించాల్సి వస్తే నష్టపరిహారం ప్రభుత్వానికి భారంగా మారడంతోపాటు కోర్టు చిక్కులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నివేదికలో వివరించారు.