- భవన నిర్మాణంలో ఆర్ అండ్ బీ అడ్డగోలుతనం
సాక్షి, హైదరాబాద్: అదో భారీ బహుళ అంతస్తుల భవనం. రాష్ర్ట రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఈ భవనానికి 2009లో టెండర్లు ఖరారైన సమయంలో దాని అంచనా వ్యయం రూ. 20 కోట్లు. అప్పట్లో పనులు మొదలై ఇప్పటికి కొలిక్కి వస్తున్నాయి. కానీ ప్రస్తుతం దాని అంచనా వ్యయం రూ. 67 కోట్లకుపైమాటే! అంటే మూడు రెట్లకుపైగా పెరిగిపోయింది. అయితే దీని లోతుపాతుల్లోకి వెళితే విస్మయం కలిగించే విషయాలెన్నో వెలుగుచూస్తున్నాయి.
సొంత భవనం విషయంలో ఆర్‌అండ్‌బీ అధికారులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రతి విషయంలోనూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎలక్ట్రికల్ ఫిట్టిం గ్స్ కోసమే రూ. 14.50 కోట్లు, అంతర్గత రహదారుల అభివృద్ధికి రూ. 5 కోట్లు చూపారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రోడ్లుభవనాల శాఖలో పట్టపగ్గాల్లేని విచ్చలవిడితనానికి ఇదో నిదర్శనంగా నిలుస్తోంది. అధికారులు ప్రతిపాదనలు అందజేయడమే తడువుగా ప్రభుత్వం కూడా అనుమతులిచ్చేస్తోంది.
ఇదీ తంతు..
హైదరాబాద్ నడిబొడ్డున ఎర్రమంజిల్‌లో రోడ్లుభవనాల శాఖ ఇంజనీరింగ్ కార్యాలయం ఉంది. అది నిజాం కాలంలో నిర్మించినది కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. దాంతో ఆ విభాగం కోసం కొత్తగా మరో భవనాన్ని నిర్మించాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవనం వెనకవైపున ఉన్న విశాల స్థలంలోనే దాన్ని నిర్మించాలని తలపెట్టింది. 2009లో టెండర్ పిలిచి సివిల్ వర్క్ అంచనాను రూ.11.93 కోట్లుగా పేర్కొంది. 0.45 శాతం అధిక ధరను కోట్ చేసిన చబ్రాస్ అసోసియేట్స్ కంపెనీకి దాన్ని కట్టబెట్టారు.
ఈ భవనానికి మొత్తం రూ. 20 కోట్లు అవుతుందని అప్పట్లో ఆర్‌అండ్‌బీ శాఖ అంచనా వేసింది. రెండంతస్తుల భూగర్భ పార్కింగ్‌తోపాటు ఐదంతస్తుల భారీ భవన సముదాయానికి ప్రణాళికలు రూపొందించి పనులు మొదలుపెట్టారు. నిర్మాణం కోసం 2010 ఫిబ్రవరిలో అధికారులు కాంట్రాక్టు సంస్థకు స్థలాన్ని అప్పగించారు. కానీ భవన విస్తీర్ణాన్ని పెంచాలని, ఐదుకు బదులుగా 8 అంతస్తులుగా నిర్మించాలని ఆ తర్వాత నిర్ణయించారు.
ఈ మేరకు ప్రభుత్వానికి 2012లో ప్రతిపాదన పంపారు. విస్తీర్ణం పెరిగినందున భవన నిర్మాణ అంచనాను రూ. 39.96 కోట్లకు పెంచారు. దీన్ని ఇక్కడితో ముగించలేదు. అంతర్గత రహదారులు, భవనం చుట్టూ రిటెయినింగ్ వాల్, భూగర్భ సంప్, దానికి అనుసంధానంగా పంప్‌హౌస్‌లాంటి ఇతర పనులు కూడా చేపట్టాల్సి ఉందని 2014లో మరో ప్రతిపాదన చేశారు. ఇందుకోసం మొత్తం అంచనా వ్యయాన్ని రూ. 67.30 కోట్లకు పెంచాలని ప్రభుత్వానికి ఆర్‌అండ్‌బీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో వారం రోజుల క్రితమే రాష్ర్ట ప్రభుత్వం ఇందుకు అనుమతులిచ్చింది.
అయితే సాధారణంగా సివిల్ పనుల టెండర్లను పిలిచినప్పుడు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఇతర కీలక పనులకు విడిగా టెండర్లు పిలుస్తారు. అన్నీ ఒకే టెండర్‌లో పిలవాలనుకున్నప్పుడు ముందుగానే పేర్కొంటారు. కానీ ఇక్కడ ఒక్కోసారి ఒక్కో పనిని చేరుస్తూ ప్రాజెక్టు అంచనాను మారుస్తూ పోయారు. అయితే విడిగా టెండర్లు పిలిచిన దాఖలాలు లేవు. అన్ని పనులు అదే కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలనే ఉద్దేశంతో ఈ ఎత్తుగడ చేశారని కొందరు ఆర్‌అండ్‌బీ అధికారులే పేర్కొంటున్నారు.
వింతలెన్నో...
భవన నిర్మాణం ప్రారంభించే సమయంలో సివిల్ పనుల మొత్తాన్ని రూ.11.93 కోట్లుగా చూపారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ పనుల వ్యయాన్నే రూ. 14.51 కోట్లుగా చూపారు.
ఈ భవనాన్ని ఎత్తయిన ప్రాంతంలో నిర్మిస్తున్నందున చుట్టూ రిటెయినింగ్ వాల్ అవసరం ఏర్పడింది. అలాగే ప్రధాన రహదారి నుంచి పైవరకు రోడ్డు నిర్మించాల్సి ఉంది. దీంతో వీటి పేరుతో ఏకంగా రూ. 5 కోట్ల అంచనాను రూపొందించేశారు.
కాంట్రాక్టు ఒప్పందం కుదిరిన తర్వాత 2013-14 నాటికి మార్కెట్‌లో నిర్మాణ సామగ్రి ధరలు ఐదు రెట్లు పెరిగినందున ‘ధరల సవరణ’ పేరుతో అదనంగా రూ. 13.50 కోట్లు ప్రతిపాదించారు. సాధారణంగా ఒప్పంద గడువులోపు పనులు పూర్తి చేస్తేనే ధరల సవరణ వర్తిస్తుంది.
కిటికీల నిర్మాణంలో అదనపు మెష్ షట్టర్స్ ఏర్పాటు పేరుతో రూ. 35 లక్షలను అదనంగా చూపారు.
కారిడార్ ఫ్లోరింగ్ రాళ్ల రకాన్ని మార్చామన్న పేరుతో రూ. కోటి మేర అంచనా విలువ పెంచారు.