కన్నీటి నివాళి | Complete the funeral of 15 people | Sakshi
Sakshi News home page

కన్నీటి నివాళి

Published Fri, Jan 9 2015 3:01 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

కన్నీటి నివాళి - Sakshi

కన్నీటి నివాళి

15 మందికి అంత్యక్రియలు పూర్తి  
హిందూపురం ఆస్పత్రిలో కోలుకుంటున్న 45 మంది క్షతగాత్రులు
వైద్యసేవలు అందించేందుకు అనంతపురం నుంచి వెళ్లిన డాక్టర్లు
ఆర్టీసీ డీఎం, ఇద్దరు ఆర్‌అండ్‌బీ అధికారుల సస్పెన్షన్
మృతులకు జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, ప్రభుత్వ అధికారుల నివాళి
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ కార్యాలయం ముట్టడి

 
‘మాకు మట్టివ్వాల్సినోడివి.. మేమే నీకు మట్టివ్వాల్సొచ్చింది.. ఆ దేవుడికి ఏం అన్యాయం చేశామని మాకీ శిక్ష వేశాడు.. పగ వాడికి కూడా ఈ కష్టం రాకూడదు.. పిల్లగాళ్లందరూ కలిసి పట్నం పోసి సదువుకుంటాండారంటే సంబరపడినాం. ఇలా అరుుపోతుందని కలలో కూడా అనుకోలేదు.. ఒరేయ్.. ఒక్క సారి లెయ్ రా.. అమ్మా అని పిలవరా..’ అంటూ మృతి చెందిన విద్యార్థుల తల్లులు విలపిస్తుంటే ఆ దృశ్యం చూస్తున్న వారి కళ్లు సైతం చెమర్చారుు.
 
అనంతపురం : పెనుకొండ సమీపంలోని ‘షీ-ఫారం’ వద్ద బుధవారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 15 మందికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. మావటూరులో ఆరుగురు, నాగలూరులో ఇద్దరు, బండ్లపల్లిలో ఇద్దరితో పాటు మిగిలిన గ్రామాల్లో తక్కిన ఐదుగురికిఅంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయా గ్రామస్తులంతా అంత్యక్రియల్లో పాలు పంచుకుని క న్నీటి నివాళులర్పించారు. చాలామంది విద్యార్థులు కావడంతో కడసారి తమ బిడ్డలను చూస్తూ తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. మావటూరుకు చెందిన నరేంద్ర, అశోక్, నరసింహులు అనే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరే కావడంతో వారు మరింత రోదించారు.

కోలుకుంటున్న క్షతగాత్రులు

ప్రమాదంలో గాయపడిన వారిలో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో 45 మంది, అనంతపురం ఆస్పత్రిలో ఐదుగురు, కర్నూలులో ఒకరు, బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో ఆరుగురు, నిమ్హాన్స్‌లో 15 మంది, మరో ప్రైవేటు ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స తీసుకుంటున్నారు. అనంతపురం నుంచి ప్రత్యేకంగా వైద్యులు హిందూపురానికి వెళ్లి చికిత్స అందిస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం స్థానిక ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతపురంలో చికిత్స పొందుతున్న నలుగురిని ఏజేసీ ఖాజామొహిద్దీన్ పరామర్శించారు. బెంగళూరులో చికిత్స పొందుతున్న వారిని మంత్రులు శిద్ధా రాఘవరావు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, గంటా శ్రీనివాసరావు పరామర్శించారు.
 
ముగ్గురు అధికారుల సస్పెన్షన్

ప్రమాదానికి బాధ్యులుగా తేల్చుతూ మడకశిర డిపో మేనేజర్ సూర్యనారాయణతో పాటు ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీనివాసులు, ఏఈఈ నాగరాజులను సస్పెండ్ చేస్తున్నట్లు మంత్రి శిద్ధా రాఘవరావు బెంగళూరులో ప్రకటించారు. పోలీసులు అందించిన ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేయిస్తామన్నారు.
 
కాంట్రాక్టర్‌పై చర్యలేవీ?


 ఘటనాస్థలిని పరిశీలించిన ప్రతి ఒక్కరికీ తప్పు కాంట్రాక్టర్‌దనే విషయం ఇట్టే తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వానికి, మంత్రులకు ఈ విషయం కన్పించడంలేదు. సదరు సబ్ కాంట్రాక్టర్ మంత్రి పరిటాల సునీతకు బంధువు కావడంతో తప్పిదాన్ని ఎలాగైనా ఇతరులపైకి నెట్టేయాలనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. సస్పెండ్ అయిన ఆర్‌అండ్‌బీ డీఓ శ్రీనివాసులు, ఏఈఈ నాగరాజు నెల కిందటే పెనుకొండకు బదిలీపై వచ్చారు. వీరు తప్పు చేశారని తేల్చిన మంత్రులకు కాంట్రాక్టర్ చేసిన తప్పిదాలు కనిపించకపోవడంలో ఆంతర్యమేమిటని క్షతగాత్రులు ప్రశ్నిస్తున్నారు.
 
చర్యలు తీసుకోవాల్సిందే..

ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆధ్వర్యంలో గురువారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. నిర్మాణసంస్థ రక్షణ గోడ నిర్మించి ఉంటే అసలు ఈ ప్రమాదమే జరిగేది కాదని క్షతగాత్రులు అంటున్నారు. హెచ్చరిక బోర్డులు  ఏర్పాటు చేయకుండా, రోడ్డుకు కుడివైపు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా వ్యవహరించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకపోవడం దారుణమని వారు మండిపడుతున్నారు. ‘కాంట్రాక్టర్, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగింద’ని పెనుకొండ మండలం మావటూరుకు చెందిన డిగ్రీ విద్యార్థిని ఆరోపించారు. ‘ఈ ఘోర ప్రమాదానికి ముమ్మాటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమ’ని మడకశిర మండలం చిన్నమంతూరుకు చెందిన పదో తరగతి విద్యార్థి తిరుమలేశు అన్నారు. ‘పది నెలలుగా పనులు జరుగుతున్నాయి. మధ్యలో చిన్న చిన్న ప్రమాదాలు జరిగారుు. అయినప్పటికీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. జాగ్రత్త చర్యలు తీసుకోలేద’ని నాగలూరుకు చెందిన డిగ్రీ విద్యార్థి బాబు, మేకలపల్లికి చెందిన మమత అన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు.
 
మృతులకు ‘అనంత’ నివాళి

 ప్రమాదంలో చనిపోయిన మృతుల్లో అధిక శాతం విద్యార్థులు కావడంతో వారి ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు నివాళులర్పించారు. పాఠశాలల ప్రార్థనా వేళలలో రెండు నిమిషాలు మౌనం పాటించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నేతలు మౌనం పాటించారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement