రోడ్డుపైనే అంత్యక్రియలు..
పింప్రి: శ్మశానం కోసం భూమిని కేటాయించటం లేదంటూ రద్దీగా ఉండే రోడ్డుపైనే గ్రామస్తులు అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలివీ... మహారాష్ట్రలోని పింప్రిలో హింజవడీ ఏరియా గబార్‌వాడీలో నివసించే పరమేశ్వర్ గావరే (33) శుక్రవారం మరణించాడు. ఆయన భౌతికకాయానికి నడిరోడ్డుపై అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించిన స్థలంలోనే కొన్నేళ్ల కిందట శ్మశానం ఉండేది. అయితే ఐటీ పార్క్ నిర్మాణం తర్వాత ప్రభుత్వం స్థలాలను సేకరించి అక్కడ రోడ్డును నిర్మించింది.
అయితే, ప్రభుత్వం 2007లో గబార్‌వాడీ ప్రజల కోసం అదే ప్రాంతానికి సమీపంలో స్థలాన్ని శ్మశానం కోసం కెటాయించింది. కొందరి వ్యతిరేకత కారణంగా ఇంత వరకు అక్కడ శ్మశానం నిర్మాణం చేయలేదు. దీనిపై గ్రామస్థులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ప్రస్తుతం ఎవరైన మరణిస్తే సుమారు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లి అంత్యక్రియలు చేయాల్సివస్తోంది. శ్మశానభూమి ఏర్పాటు చేస్తామని స్థలం కేటాయించి 10 ఏళ్లు గడిచిన ఇంకా నిర్మాణం చేయకపోవడంపై నిరసనతో ఉన్న గ్రామస్థులు పరమేశ్వర్ గావరే భౌతికకాయాన్ని నడిరోడ్డుపైనే అంత్యక్రియలు నిర్వహిచారు. ఇప్పుడైన ప్రభుత్వం కళ్లు తెరవాలని గ్రామస్థులు కోరుతున్నారు.