నిషిత్ అంత్యక్రియలు పూర్తి
నెల్లూరు : రోడ్డు ప్రమాదంలో కొడుకును పోగొట్టుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రమాదం జరిగిన రాత్రి తన కుమారుడు నిషిత్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కుమారుడికి ఫోన్ చేశారు. ’నాన్న నిషీ ఎక్కడున్నావ్... టైమ్ పదకొండు అవుతోంది, ఇంకా ఇంటికి వెళ్లలేదా?. భోజనం చేశావా? జాగ్రత్తగా ఇంటికి వెళ్లు. నేను ఇక్కడ బిజీగా ఉన్నాను. రెండురోజుల్లో తిరిగి వచ్చేస్తాను. నువ్వు కారు డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త’ అంటూ ఫోన్‌లో మాట్లాడారు.
అవే తన కొడుకుతో మంత్రి మాట్లాడిన చివరి మాటలు. ...మరికొద్ది గంటల్లోనే కుమారుడి మరణవార్త వినాల్సి వచ్చింది. తన స్నేహితుడు రవిచంద్రతో కలిసి వెళుతున్న నిషిత్ కారు అతివేగంగా మెట్రో ఫిల్లర్‌ను ఢీకొట్టిన విషయంత తెలిసిందే. ఈ దుర్ఘటనలో నిషిత్‌తో పాటు అతని స్నేహితుడు దుర్మరణం చెందారు.
మరోవైపు కుమారుడి మరణవార్త విన్న మంత్రి నారాయణ హుటాహుటీన లండన్ నుంచి గురువారువారం తెల్లవారుజామున నెల్లూరు చేరుకున్నారు. నిషిత్ మృతదేహాన్ని చూసి ఆయన భోరున విలపించారు. పెన్నానది తీరంలోని బోడిగాడి తోట శ్మశాన వాటికలో నిషిత్ అంత్యక్రియలు జరిగాయి. కొడుకు చితికి మంత్రి నారాయణ నిప్పంటించారు. అంత్యక్రియల కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. అంతకు ముందు నెల్లూరులో నారాయణ కళాశాల నుంచి నిషిత్ అంతిమ యాత్ర కొనసాగింది.