గజ్వేల్ రింగ్ రోడ్డుపై స్పష్టత
♦ రూ.200 కోట్లతో ఫోర్‌లేన్ రహదారి
♦ నాలుగు రేడియల్ రోడ్లతో అనుసంధానం
♦ ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రవీందర్‌రావు
గజ్వేల్ : గజ్వేల్ రింగ్ రోడ్డు విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ రోడ్డును నాలుగు లేన్లుగా మార్చి, పట్టణానికి అనుబంధంగా ఉన్న నాలుగు రేడియల్ రోడ్లతో అనుసంధానం చేస్తారు. డబుల్ లేన్ అనుకున్న దానిని నాలుగు లేన్లుగా మారుస్తారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ మంజూరు చేసిన రూ.90కోట్లకు మరో రూ.110కోట్లు వెచ్చించి మొత్తం రూ.200కోట్లతో పనులు చేపట్టాలని భావిస్తున్నట్టు ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రవీందర్‌రావు సోమవారం గజ్వేల్‌లో తెలిపారు.
నగర పంచాయతీ పరిధిలో దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్య నెలకొని ఉంది. ట్రాఫిక్ సమస్యను స్వయంగా పరిశీలించిన సీఎం అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌కు రింగ్ రోడ్డు నిర్మించి ట్రాఫిక్ సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే రింగ్ రోడ్డుకు రూ.90కోట్లు మంజూరు చేశారు. పట్టణంలోని 133/33కేవీ సబ్‌స్టేషన్‌నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్‌టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్ కళాశాల, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపడతారు.
నాలుగు లేన్లుగా..
సోమవారం గజ్వేల్‌కు వచ్చిన ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రవీందర్‌రావు రింగ్‌రోడ్డుపై స్పష్టత ఇచ్చారు. మొదట గజ్వేల్ చుట్టూ 19కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మించాలనుకున్నారు. ఇందుకోసం 140 ఎకరాలను సేకరించారు. ముందుగా 100మీటర్ల వెడల్పుతో నిర్మించాలనుకున్న ఈ రోడ్డును 150 మీటర్లకు పెంచి నాలుగు లేన్లుగా నిర్మించాలని నిర్ణయించారు. దీంతో అంచనా వ్యయం రూ.200 కోట్లకు పెరగనుంది. రింగ్ రోడ్డు కోసం 140 ఎకరాలు సేకరించగా నాలుగు లేన్లుగా మారిస్తే అదనంగా మరో 70 ఎకరాలు అవసరం. అదేవిధంగా పొడవు సైతం 24 కిలోమీటర్లకు పెరుగుతుంది. పట్టణంలోని పిడిచెడ్, ధర్మారెడ్డిపల్లి, జాలిగామ, సంగాపూర్ రేడియల్ రోడ్లను రింగ్ రోడ్డుతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు.
రూ. 1663కోట్లతో ఆర్‌అండ్‌బీ పనులు
జిల్లాలో రూ. 1663 కోట్లతో ఆర్‌అండ్‌బీ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు రవీందర్‌రావు తెలిపారు. సోమవారం గజ్వేల్ -ప్రజ్ఞాపూర్ రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2400 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు ఉండగా అందులో 1641కిలో మీటర్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో రూ. 433 కోట్లతో పనులు సాగుతున్నాయన్నారు. ఇక్కడ 110 కిలోమీటర్ల మేర ఉన్న రోడ్లను డబుల్ లేన్ చేస్తామని, ఈ పనులు జూన్‌లోగా పూర్తవుతాయన్నారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రహదారి 6లేన్ల పనులు మోడల్‌గా చేపట్టేందుకు శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. వంద మీటర్ల పొడవునా నమూనాగా చేపట్టిన పనులు సీఎం ఆమోదం పొందిన తరువాత పూర్తి స్థాయిలో చేపడతామన్నారు.