- ముత్తిరేవుల నుంచి కలవకుంట, గంగాధరనెల్లూరు మీదుగా వేలూరు రోడ్డును కలిపే విధంగా ప్లాన్
- సెప్టెంబర్ 21న సీఎం చిత్తూరు పర్యటనలో ప్రకటించే విధంగా అధికారుల చర్యలు
- ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈని కలిసి చర్చించిన ‘దేశం’ నేతలు
చిత్తూరు(టౌన్): చిత్తూరుకు రూ. 100 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డు మంజూరుకానుంది. తిరుపతి వైపు నుంచి వేలూరు, చెన్నై నగరాలకు వెళ్లే వాహనచోదకుల ఇబ్బందులు, చిత్తూరు నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆర్‌అండ్‌బీ అధికారులు ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. సర్వేలు ఇప్పటికే పూర్తయ్యాయి. కొత్తగా స్థల సేకరణ చేపట్టే అవసరం లేకుండా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉన్న రోడ్లనే కలుపుతూ వాటిని వెడల్పు చేసి తద్వారా రింగ్‌రోడ్డును నిర్మించే విధంగా అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.
రింగ్‌రోడ్డు కలిసే ప్రాంతాలివి
తిరుపతి నుంచి చిత్తూరు నగరం వైపు ప్రయాణించే వాహనచోదకులు ముత్తిరేవుల వద్ద ఎడమవైపుగా వెళ్లి పెనుమూరు మండలానికి చెందిన కలవకుంట, గంగాధరనెల్లూరు మండలానికి చెందిన కలిజవేడు, నాశంపల్లి, బొమ్మవారిపల్లి, చిత్తూరు-పుత్తూరు రోడ్డులోని గంగాధరనెల్లూరు, వేల్కూరు, చిత్తూరు రూరల్ మండలం తాళంబేడు, ఎన్‌ఆర్‌పేట, రామాపురం, గుడిపాల మండలం కొత్తపల్లి, గోపాలపురం మీదుగా వేలూరు రోడ్డులో కలిసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గోపాలపురం మీదుగానే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి.
ఈ రింగ్‌రోడ్డును ఆ ఎక్స్‌ప్రెస్ హైవేలో కలిపే విధంగా కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీని పొడవు 20 నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. గోపాలపురం నుంచి పొన్నై రహదారిని కలిపే రోడ్డుతోపాటు, పొన్నై రోడ్డు నుంచి గంగాధరనెల్లూరు కలిపే రోడ్డు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నాయి. గంగాధరనెల్లూరు నుంచి కలిజవేడు, కలవకుంట రోడ్డు ఆర్‌అండ్‌బీ పరిధిలో ఉంది. అయితే ఇవి ప్రస్తుతం 12 నుంచి 15 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్నారుు. వాటిని 30 నుంచి 40 అడుగుల వెడల్పు చేస్తూ రోడ్డును నిర్మించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
వీడనున్న ట్రాఫిక్ సమస్య
రింగ్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే చిత్తూరు నగరవాసులకు ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగనుంది. తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లే వాహనాలు మురకంబట్టు బైపాస్ మీదుగా వెళతాయి. చెన్నై, వేలూరు మార్గాల్లో ప్రయాణించాల్సిన వాహనాలు రింగ్‌రోడ్డు మీదుగా వెళ్లేటట్లు చర్యలు తీసుకుంటారు. చిత్తూరు నగరం మీదుగా వెళ్లే వాహనాల్లో దాదాపు 75 శాతం తగ్గిపోతాయి.
చిత్తూరు పర్యటనలో ప్రకటించనున్న సీఎం
సీఎం సెప్టెంబర్ 21న చిత్తూరు నగర పర్యటన ఖరారైంది. అదే రోజు ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం విషయాన్ని కూడా సీఎం ప్రకటించే విధంగా స్థానిక దేశం నేతలు కార్యాచరణను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యిదర్శి దొరబాబు, నాయకులు డీకే బద్రీనారాయణ, నాని తదితరులు సోమవారం ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శివకుమార్‌ను కలిసి ఔటర్ రింగ్ విషయంగా చర్చించారు. ఎస్‌ఈతో వారు దాదాపు అర గంటపాటు చర్చించారు.