express highway
-
జెట్ స్పీడ్‌గా హైవే పనులు.. ఇక బెంగళూరుకు 135 నిమిషాలే టైమ్..
పలమనేరు : చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే పనులు స్పీడందుకున్నాయి. చెన్నై సమీపంలోని శ్రీపెరంబూదూర్ నుంచి బెంగళూరు సరిహద్దు లోని హొసకోట వరకు 283.5 కిలోమీటర్ల మేరకు 6 ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఎన్హెచ్ఏఐ(నేషనల్ హై వే అథారిటీ ఆఫ్ ఇండియా) భారత్‌మాల పరియోజన పథకం కింద రూ.16,730 కోట్లతో 2021 నుంచి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మూడు ఫేజుల్లో పనులు సాగుతున్నాయి. తొలిఫేజ్‌లో కర్ణాటక పరిధిలోని 71 కిలోమీటర్లలో ఇప్పటికే 37.56 శా తం పనులు పూర్తయ్యాయి. రెండు, మూడు ఫేజ్ లలో మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు రాష్ట్రంలో 112 కిలోమీటర్లలో పదిశాతం మట్టిరోడ్డు పనులు, అలైన్మెంట్ ల్యాండ్ లెవలింగ్ సాగుతోంది. పనులు త్వరితగతిన జరిగేలా మూడు ఫేజ్‌లలో పది ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో కర్ణాటకలో మూడు, ఏపీలో మూడు, తమిళనాడులో నాలుగు ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి పలమనేరు నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల మీదుగా 60 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు సాగుతున్నాయి. వీటిని బేతమంగళ నుంచి బైరెడ్డిపల్లె వరకు మోంటేకార్లె లిమిటెడ్ కంపెనీ, బైరెడ్డిపల్లె నుంచి బంగారుపాళెం వరకు ఆప్కో ఇన్ఫ్రాటెక్ కంపెనీ, బంగారుపాళెం నుంచి గుడిపాల దాకా దిలీప్‌బిల్డ్‌కాన్ కంపెనీ పనులు చేపడుతున్నా యి. పలమనేరు మండలంలోని బేలుపల్లి క్రాస్, పట్టణ సమీపంలోని గంటావూరు వద్ద పనుల సామగ్రి కోసం యంత్రాలను నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేసుకుంది. పలమనేరు నియోజకవర్గంలో చెన్నై– బెంగళూరు 6 ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలైన్మెంట్ మేరకు మట్టి రోడ్డు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. హైవే మూడు ఫేజ్‌లలో నిర్మాణం సాగుతుండగా.. ఇప్పటికే కర్ణాటకలో 37శాతం పనులు పూర్తయ్యాయి. రెండో ఫేజ్‌లో పలమనేరు నియోజకవర్గంలోనూ పదిశాతం పనులు జరిగాయి. ఈనెల 10న కర్ణాటక రాష్ట్రంలోని హొసకోట సమీపంలో వడగనహళ్లి వద్ద పనులను పరిశీలించిన కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌గడ్కరి 2024 మార్చికల్లా పూర్తిచేసి ప్రారంభించనున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే. దక్షిణాదిలోనే తొలి ఎక్స్‌ప్రెస్ హైవే దక్షిణ భారతదేశంలోనే చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌హైవే మొట్టమొటది కానుంది. దీనికి ఎన్హెచ్ఏఐ ఎన్ఈ 7గా నామకరణం చేశారు. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధి పెంపొందించడమే ఈ రహదారి నిర్మాణ ఉద్దేశం. బెంగళూరు నుంచి చెన్నై పోర్టుకు రవాణా సౌకర్యాలు పెరిగేందుకు ఈ రోడ్డు ఉపకరిస్తుంది. బెంగళూరు నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించేవారు సైతం తక్కువ. ఈ హైవే పూర్తయితే దాదాపు అంతే సమయానికి విమాన చార్జీలకంటే తక్కువ ధరతో రోడ్డు మార్గంలోనే ప్రయాణించే సౌకర్యం కలుగుతుంది. ఎక్స్‌ప్రెస్‌హైవే వివరాలిలా... - చెన్నై నుంచి బెంగళూరు వరకు రోడ్డు దూరం 283.5 కిలోమీటర్లు - ఇది కర్ణాటకలో 77 కి.మీ, ఏపీలో 91 కి.మీ, తమిళనాడులో 93 కిలోమీటర్లు - ఇప్పటి వరకు బెంగళూరు–చెన్నై ప్రయాణ సమయం 6 గంటలు - ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తయితే 2 గంటల 15 నిమిషాలు మాత్రమే - ఈ రహదారిలో సాధారణ వేగం గంటకు 120 కిమీ - ఎక్స్ప్రెస్హైవేలో మొత్తం బ్రిడ్జిలు –162 - రైల్వే క్రాసింగ్‌లు–4, కల్వర్టులు–143 - మొత్తం ఫ్లైఓవర్లు– 17 ఉంటాయి. -
విజయవాడ–నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేకి పచ్చజెండా
సాక్షి, అమరావతి: ఏపీ నుంచి మరో జాతీయ రహదారి మహారాష్ట్రను అనుసంధానించనుంది. విజయవాడ–నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) కార్యాచరణకు ఉపక్రమించింది. పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ ఈ గ్రీన్‌ఫీల్డ్–బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నారు. రూ.14 వేల కోట్లతో మొత్తం 457 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించే ప్రణాళికను ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. చదవండి: AP: ఎగుమతులపై ‘పుష్’ పాలసీ ఈమేరకు ఫీజబులిటీ నివేదిక, డీపీఆర్‌లను ఖరారు చేసింది. విజయవాడ–నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ హైవేను అయిదు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. వాటిలో విజయవాడ–ఖమ్మం, ఖమ్మం–వరంగల్, వరంగల్–మంచిర్యాల ప్యాకేజీలను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా.. మంచిర్యాల–రేపల్లెవాడ, రేపల్లెవాడ–చంద్రాపూర్ ప్యాకేజీలను బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలుగా నిర్మించాలని నిర్ణయించారు. చంద్రాపూర్ నుంచి నాగ్‌పూర్‌కు ఇప్పటికే ఉన్న 4 లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవేకి ఈ రహదారిని అనుసంధానిస్తారు. మొత్తం మీద 310 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్, 147 కిలోమీటర్ల బ్రౌన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రూపుదిద్దుకోనుంది. తగ్గనున్న వ్యయ, ప్రయాసలు ఈ హైవేతో విజయవాడ–నాగ్‌పూర్ మధ్య ప్రయాణానికి వ్యయ, ప్రయాసలు బాగా తగ్గుతాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి నాగ్‌పూర్ వెళ్లాలంటే హైదరాబాద్, అదిలాబాద్ మీదుగా 770 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దాదాపు 13 గంటల సమయం పడుతోంది. కొత్త ఎక్స్‌ప్రెస్ హైవేను విజయవాడ నుంచి ఖమ్మం, వరంగల్, మంచిర్యాల మీదుగా నిర్మించన్నారు. దీంతో విజయవాడ–నాగ్‌పూర్ మధ్య దూరం 163 కిలోమీటర్లు తగ్గి ఐదుగంటల సమయం కలసివస్తుంది. ఇప్పటికే డీపీఆర్ సిద్ధం కావడంతో భూసేకరణ ప్రక్రియపై ఎన్హెచ్ఏఐ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు వేగవంతం చేసింది. విజయవాడ రూరల్, జి.కొండూరు, గంపలగూడెం మండలాల్లో దాదాపు 1.65 లక్షల చదరపు మీటర్ల భూసేకరణకు రెవెన్యూ శాఖ సన్నాహాలు చేస్తోంది. డిసెంబరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి 2025నాటికి ఈ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పూర్తిచేయాలని ఎన్హెచ్ఏఐ లక్ష్యంగా పెట్టుకుంది. -
Express Highway: ఏపీకి మరో ఎక్స్‌ప్రెస్ హైవే..
సాక్షి, అమరావతి: రాష్ట్రం గుండా మరో ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం కానుంది. కర్నూలును మహారాష్ట్రలోని షోలాపూర్‌ను అనుసంధానిస్తూ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆమోదముద్ర వేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర గుండా పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానిస్తూ 318 కిలోమీటర్ల మేర ఈ జాతీయ రహదారి ఉంటుంది. దీని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించడం కోసం ఎన్హెచ్ఏఐ టెండర్లు పిలిచింది. చదవండి: ఏపీలో ఉత్తమ పోలీస్‌స్టేషన్ ఇదే.. భారతమాల ప్రాజెక్టు రెండో దశ కింద దాదాపు రూ.12 వేల కోట్లతో ఈ రహదారి నిర్మిస్తారు. 2025 నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ హైవేతో రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి పశ్చిమ భారతంతో రోడ్ కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. ప్రస్తుతం కర్నూలు నుంచి నల్గొండ, హైదరాబాద్ మీదుగా షోలాపూర్ వెళ్లాల్సి వస్తోంది. నూతన రహదారి నిర్మాణం పూర్తయితే కర్నూలు నుంచి షోలాపూర్‌కు దాదాపు 100 కి.మీ. తగ్గుతుంది. కర్నూలు నుంచి మహబూబ్‌నగర్, కర్ణాటకలోకి కోస్గి, రాయచూర్, మహారాష్ట్రలోని షోలాపూర్ వరకు ఈ ఆరులేన్ల రోడ్డు నిర్మిస్తారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేను చెన్నై – బెంగళూరు, బెంగళూరు–విజయవాడ ఎక్స్‌ప్రెస్ హైవేలతో అనుసంధానించాలని కూడా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రతిపాదనలపై ఎన్హెచ్ఏఐ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. -
ఆర్ఆర్ఆర్పై అన్నిటికీ రైట్.. రైట్
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్)పై వెళ్లేందుకు అన్ని వాహ నాలకు అనుమతి ఇవ్వబోతున్నారు. ఎక్స్ ప్రెస్‌వే అయినప్పటికీ బస్సులు, కార్లే కాకుండా ఆటోలు, ద్విచక్రవాహనాలు, చివరకు ఎడ్ల బండ్లు సైతం దీని మీదుగా వెళ్లేందుకు వెసులుబాటు కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు, అలాగే విమానాశ్రయానికి ప్రత్యేకంగా నగరం నుంచి శంషాబాద్ వరకు నిర్మించిన పీవీ నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేల మీద ద్విచక్రవాహనాలు, ఆటోలు లాంటి చిన్న వాహనాలకు అనుమతి లేని విషయం తెలిసిందే.ఈ రెండింటి లాగే ఆర్ఆర్ఆర్ కూడా ఎక్స్‌ప్రెస్ వేగా నాలుగు వరుసల్లో రూపుదిద్దుకోనున్నప్పటికీ అన్ని వాహనాలూ వెళ్లేందుకు అనుమతించనున్నారు. సర్వీసు రోడ్లు ఉండవు.. సాధారణంగా ఎక్స్‌ప్రెస్ వేలకు సర్వీసు రోడ్లను నిర్మిస్తారు. ఇప్పుడు నిర్మించే ప్రధాన జాతీయ రహదారులకు కూడా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పీవీ ఎక్స్‌ప్రెస్‌వే ఫ్లైఓవర్ (ఎలివేటెడ్ కారిడార్)గా నిర్మించినందున దానికి సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయలేదు. అలాగే ఆర్ఆర్ఆర్కు కూడా సర్వీసు రోడ్డు ఉండదని తెలుస్తోంది. దీన్ని జాతీయ రహదారిగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 335 కి.మీ. నిడివితో కూడిన ఈ రోడ్డుకు దాదాపు రూ.18 వేల కోట్లకుపైగా ఖర్చు కానుంది. కాగా దీని నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదట్నుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్డును 8 వరుసలుగా నిర్మించాల్సి ఉన్నా, ప్రస్తుతానికి 4 వరుసలు సరిపోతాయని ఇప్పటికే నిర్ధారించారు. తాజాగా దీని వ్యయంపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో చర్చించారు. ప్రస్తుతానికి ఉత్తర భాగాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. వీలైనంత వరకు ఖర్చును నియంత్రణలో ఉంచుకోవాలని ఢిల్లీలోని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే సర్వీసు రోడ్ల ప్రతిపాదన తొలగించారు. అయితే సర్వీసు రోడ్లు లేకుంటే స్థానికులు ఎక్కువగా వినియోగించే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు లాంటివి ఎక్స్‌ప్రెవే పైకి ఎక్కేందుకు వీలుండదు. అలాంటప్పుడు స్థానికులు భూములు ఇచ్చేందుకు అంగీకరించరు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎక్స్‌ప్రెస్ వే అయినప్పటికీ, సాధారణ జాతీయ రహదారుల మీదకు అన్ని వాహనాలను అనుమతిస్తున్నట్టే దీని మీదకు కూడా అనుతించటం ద్వారా సర్వీసు రోడ్ల అవసరం లేకుండా చేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో రెండు వైపులా ప్రధాన క్యారేజ్ వేకు చివరన (అంచున) 3 మీటర్ల వెడల్పుతో కాస్త పల్లంగా రోడ్డు (పేవ్డ్ షోల్డర్ పోర్షన్) నిర్మిస్తారు. ఇది ప్రధాన రోడ్డుకు చివరలో ఉండే తెల్ల గీతకు అవతల ఉంటుందన్న మాట. రోడ్డు అంచుల్లో చిన్న వాహనాలు రీజినల్ రింగ్‌రోడ్డును 120 కి.మీ. వేగంతో వాహనాలు దూసుకుపోగలిగే సామర్థ్యంతో, ప్రమాణాలతో నిర్మిస్తారు. అంత వేగంగా వాహనాలు దూసుకుపోతుంటే ద్విచక్ర వాహనాలు, ఆటోల లాంటి తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాల కారణంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఆర్ఆర్ఆర్కు సర్వీసు రోడ్డు అవసరం లేదని ఎన్హెచ్ఏఐ భావిస్తుండటంపై కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఈ రోడ్డు చివరన ఉండే పేవ్డ్ షోల్డర్స్ పోర్షన్‌ను ఇలా తక్కువ వేగంతో వెళ్లే ఆటోలు, ద్విచక్ర వాహనాలు లాంటి వాటికి కేటాయిస్తారు. అయితే సర్వీసు రోడ్డు ఉంటేనే బాగుంటుందని స్థానిక అధికారులు కోరుతున్నట్టు సమాచారం. వీలుకాని పక్షంలో కనీసం ఒక్క వైపైనా సర్వీసు రోడ్డు నిర్మించేలా డిజైన్ చేయాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. -
రీజినల్ రింగ్ రోడ్.. కొత్త దారిలో?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రగతి ముఖచిత్రంలో కీలక మార్పులు తెస్తుందని భావిస్తున్న రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్లో మార్పులు జరుగనున్నాయి. నాలుగు వరుసలుగా చేపట్టే ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలన్న దానిపై స్పష్టత వచ్చినా.. క్షేత్రస్థాయిలో ప్రస్తుత అలైన్మెంట్ అనువుగా లేదని కన్సల్టెన్సీ సంస్థ తేల్చింది. పూర్తిగా కొత్త అలైన్మెంట్తో ఆర్ఆర్ఆర్ను చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ మేరకు పలు అంశాల ఆధారంగా నాలుగు కొత్త అలైన్మెంట్లు రూపొందించి ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)’కుఅందజేసింది. దీనిలో ఏదో ఒకటి ఖరారు కాగానే మిగతా ప్రక్రియ మొదలుకానుంది. రెండున్నరేళ్ల మార్పులతో.. రీజనల్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో కన్సల్టెన్సీగా వ్యవహరించిన ఓ బెంగళూరు సంస్థ.. గూగుల్‌మ్యాప్స్, అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. దాని ఆధారంగానే ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించారు. కానీ ఆ అలైన్మెంట్ తయారై దాదాపు రెండున్నరేళ్లు గడిచింది. ఈలోగా క్షేత్రస్థాయిలో కొన్ని మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్లు ఏర్పాటయ్యాయి, గోదావరి జలాల తరలింపు కాల్వలు, కొత్త రిజర్వాయర్లు నిర్మితమయ్యాయి. ఈ నేపథ్యంలో అలైన్మెంటులో మార్పులు జరగాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ నూతన ప్రతిపాదనలను రూపొందించింది. కొత్త నిర్మాణాలు, అవసరాల మేరకు.. ప్రస్తుతం నాగ్‌పూర్‌కు చెందిన ‘కే అండ్ జే ప్రైవేట్ లిమిటెడ్’సంస్థ రీజనల్ రింగ్‌రోడ్డు కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తోంది. చెరువులు–కుంటలు, రిజర్వాయర్లు, ఇతర నీటి వనరులు, నివాస ప్రాంతాలు, గుట్టలు, రోడ్లు, రైలు మార్గాలు వంటి అడ్డంకులను బట్టి అలైన్‌మెంట్‌ను అటూఇటూ మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ను గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (పూర్తిగా కొత్త రహదారి)గా నిర్మించాల్సి ఉండటంతో.. అవసరమైన భూమి మొత్తాన్నీ సమీకరించాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికితోడు ఎక్కడైనా నిర్మాణాలను తొలగించాల్సి వస్తే పరిహారం ఖర్చు పెరుగుతుంది. జల వనరులు ఉన్నచోట కాస్త దూరంగా నిర్మించాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేసిన కన్సల్టెన్సీ.. నాలుగు వేర్వేరు అలైన్మెంట్లను రూపొందించింది. వీటిని పరిశీలించిన ఎన్హెచ్ఏఐ.. పలు మార్పులు చేర్పులు సూచించింది. ఈ మేరకు కన్సల్టెన్సీ సిబ్బంది నాలుగైదు రోజులుగా మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్మెంట్లలో మార్పులు చేస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థ వారం పదిరోజుల్లో ఎన్హెచ్ఏఐకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు తెలిసింది. నాలుగు అలైన్మెంట్లలో ఖర్చు, నిర్మాణ అనుకూలత ఆధారంగా యోగ్యంగా ఉన్నదానిని ఎన్హెచ్ఏఐ ఎంపిక చేయనుంది. ఓఆర్ఆర్ నుంచి 40–50 కిలోమీటర్ల దూరంలో.. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డుకు అవతల 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్‌రోడ్డును నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఈ దూరం పరిధిలోనే నాలుగు అలైన్మెంట్లను ప్రతిపాదించింది. ఒక్కో అలైన్‌మెంట్‌కు మధ్య 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల తేడా ఉండేలా రూపొందించింది. అయితే ఓఆర్ఆర్ నుంచి దూరం పెరిగేకొద్దీ రీజనల్ రింగురోడ్డు పొడవు, నిర్మాణ ఖర్చు పెరుగుతాయి. అదే సమయంలో జనావాసాలు, ఇతర నిర్మాణాలకు దూరంగా ఉండటం వల్ల పరిహారం ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి అంశాలను పరిశీలించి.. అలైన్‌మెంట్‌ను ఎంపిక చేయనున్నారు. భూసేకరణే కీలకం.. ఆర్ఆర్ఆర్ తుది అలైన్మెంట్ ఖరారయ్యాక భూసేకరణ కీలకంగా మారనుంది. తొలుత అవసరమైన భూమి, ఇతర వనరులు, అవసరాలను గుర్తిస్తారు. డీపీఆర్ తయారు చేస్తారు. వీటికే ఆరు నెలల వరకు సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి పరిహారం, ఇతర వివాదాలు, కోర్టు కేసుల వంటి సమస్యలు ఏర్పడితే నిర్మాణంలో జాప్యం జరగవచ్చని అంటున్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు తరహాలో వివాదాల్లేని ప్రాంతాల్లో ముందు నిర్మిస్తూ వెళితే.. ఆర్ఆర్ఆర్ త్వరగా పూర్తవుతుందని పేర్కొంటున్నారు. -
ఉప్పర్‌పల్లి ర్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రెండు ర్యాంపులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఉప్పర్‌పల్లిలో పీవీఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు కనెక్టివిటీగా నిర్మించిన ర్యాంపును శనివారం ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ర్యాంపు ద్వారా ఐటీ ప్రాంతానికి వేగంగా ప్రయాణించే అవకాశం కలిగిందని అన్నారు. రూ. 22 కోట్లతో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 164 దగ్గర ర్యాంపుల నిర్మాణం జరిగింది. ఈ ర్యాంపును హెచ్ఎండీఏ సంస్థ నిర్మించింది. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్రయాణికులు ఉప్పర్‌పల్లి వద్ద దిగి టోలీచౌకి, ఐటీ కారిడార్, ఇతర ప్రాంతాలకు త్వరగా చేరవచ్చని ఆయన తెలిపారు. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్ర రెడ్డి, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసి, నగర మేయర్ జి విజయ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. MA&UD Minister @KTRTRS inaugurated the newly constructed ramps of PVNR Expressway at Upparpally today. pic.twitter.com/TeaI0pnJ2L — Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 29, 2021 చదవండి: వృద్ధాప్య పింఛన్ రూ.1,500 నుంచి రూ.3,016కు పెంపు -
వందోరోజుకు రైతు ఆందోళనలు
చండీగఢ్: కేంద్రం తెచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలు 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో హరియాణాలో రైతు సంఘాలు కేఎంపీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రాస్తారోకో నిర్వహించారు. శనివారం 11 గంటల నుంచి 4 గంటల వరకు హరియాణాలో పలు ప్రాంతాల్లో హైవేపై రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్లకు అంగీకరించడం లేదంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. రాస్తారోకో సందర్భంగా ఈ హైవేపై రాకపోకలను నియంత్రించిన పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. సంయుక్త కిసాన్‌మోర్చా ఈ రాస్తారోకోకు పిలుపునిచ్చింది. మూడు చట్టాలను ఉపసంహరించుకునేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతు నేతలు చెప్పారు. తమ నిరసన శాంతియుతంగా ఉంటుందన్నారు. కేంద్ర అహంకారానికి నిదర్శనం సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన వందోరోజుకు చేరడం కేంద్ర దురహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్ దుయ్యబట్టింది. భారత ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చగా అభివర్ణించింది. ఆందోళన చేస్తున్న రైతుల్లో చాలామంది పిల్లలు సైన్యంలో చేరి దేశాన్ని కాపాడుతున్నారని, అలాంటి రైతులను అడ్డుకునేందుకు కేంద్రం రోడ్లపై మేకులు పరుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శించారు. రైతులు తమ హక్కులను కోరుతున్నారని, ప్రభుత్వం వారిపై దమనకాండ జరుపుతోందని ట్వీట్ చేశారు. అన్నదాతలు వందరోజులుగా నిరసన చేస్తున్నా, బీజేపీ ప్రభుత్వం అబద్దాలు, అహంకారంతో కాలం గడిపిందని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. రైతాంగ ఉద్యమం చరిత్రాత్మకం సాక్షి , న్యూఢిల్లీ: సాగు వ్యతిరేక చట్టాలపై వంద రోజులుగా సాగిన ఉద్యమం దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైందని ఆలిండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా అభివర్ణించాయి. శనివారం ఈ రెండు రైతు సంఘాలు ప్రకటన విడుదల చేశాయి. 1930లో మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన దండి ఉద్యమం మాదిరిగా రైతు ఉద్యమం జరుగుతోందని స్పష్టంచేశాయి. రైతులు చేస్తున్న పోరాటం సామాన్యమైన విషయం కాదని, ఎన్నో ఇబ్బందులు, అటంకాలు, అవమానాలకి ఓర్చి ఇంత స్థాయిలో ఉద్యమిస్తున్న రైతాంగానికి ఏఐకేఎస్, ఎస్కేయూ ధన్యవాదాలు తెలిపాయి. బీజేపీ సర్కారు ఎన్నినిర్బంధాలు పెట్టినా రైతాంగం ఉద్యమించడం హర్షణీయమని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ పేర్కొన్నారు. -
ఒకేసారి నాలుగు రికార్డులు.. దేశానికే మైలురాయి
సాక్షి, ముంబై: రోడ్ల నిర్మాణంలో భారత్ అత్యంత వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. ముంబై– ఢిల్లీలతో బడోదాను కలిపే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం పనుల్లో ఒకేసారి 4 ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. దీంతో గోల్డన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ నిర్మాణపనులు స్థానం సంపాదించుకున్నాయి. ఈ నాలుగు ప్రపంచ రికార్డులలో మొదటిది 12 వేల టన్ను సిమెంట్ కాంక్రీట్‌ను ఉత్పత్తి(తయారు)చేయడంకాగా, రెండోది కాంక్రీట్‌ను వేగంగా పంపిణీ(విడుదల) చేయడం. ఇక మూడో రికార్డు.. ఒక అడుగు మందం, 18.75 మీటర్ల వెడల్పుతో ఏకధాటిగా 2 కి.మీ.ల పొడవైన రోడ్డును నిర్మించడం. రిజిడ్‌పేవ్‌మెంట్, క్వాలిటీ మెయింటెయిన్ చేయడంతో నాలుగో రికార్డు సాధ్యమైంది. ఇవన్ని కేవలం 24 గంటల్లో పూర్తి చేయడం విశేషం. ఇలా ఎక్స్‌ప్రెస్ హైవే ఒకేసారి 4 ప్రపంచ రికార్డులను సృష్టించింది. గుజరాత్లో ప్రస్తుతం బడోదా నుంచి భారూచ్‌ల మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే పనులు జరుగనున్నాయి. ఫిబ్రవరి 2న 23 గంటల్లో 2 కి.మీ.ల పొడవు, 18.75 వెడల్పు రోడ్డును కేవలం 24 గంటల్లో నిర్మించారు. ఇందుకోసం 1.10 లక్షల సిమెంట్ బస్తాలు (5.5 టన్నులు), 500 టన్నుల ఐస్‌ను వాడారు. మొత్తం రూ. 5 కోట్లు ఖర్చయింది. చదవండి: రాజీవ్ హత్య కేసు: రాష్ట్రపతి భవన్‌కు క్షమాభిక్ష ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో విశేషాలు.. ►1250 మంది పనులు చేశారు. ► గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కోసం ► 115 ట్రిప్పర్ ట్రక్కుల వినియోగం ► మెకానికల్ విభాగంలో 300 మంది పనిచేశారు. ► 250 మంది ప్రొడక్షన్ యూనిట్ బాధ్యతలను చేపట్టారు. దేశానికి మైలురాయి: అరవింద్ పటేల్ ‘ఒకేసారి నాలుగు రికార్డులు సృష్టించడం అనేది దేశానికే మైలురాయి. ఈ రికార్డును అంత తొందరగా సులభంగా ఏ సంస్థా బద్దలు కొట్టబోదు. ఇది కేవలం రికార్డు సృష్టించడంకాదు. ఆధునిక భారత ముఖచిత్రం’ అని పటేల్ ఇన్ఫ్రాస్టక్చర్ సంస్థ ఎండీ అరవింద్ పటేల్ అభివర్ణించారు. ‘ఇది దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక బెంచ్‌మార్కు. నిర్మాణం ఇంకా వేగవంతం కానుంది. మా ప్లాంట్‌లో ప్రస్తుతం గంటకు 840 ఘనపు మీటర్ల కాంక్రీట్‌ను తయారుచేస్తున్నాం’ అని ఆయన అన్నారు. కాంక్రీట్ ఉత్పత్తి కోసం జర్మనీ నుంచి రూ. 20 కోట్లు వెచ్చించి మూడు అధునాతన యంత్రాలను తెప్పించామని తెలిపారు. -
ఓ కుటుంబం ప్రాణాలను కాపాడిన పోలీసుల సమయస్పూర్తి
-
మేడ్చల్ వద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను ప్రారంభించిన కేటీఆర్
-
2019 టార్గెట్ : డిల్లీ టూ పాట్న 11 గంటల్లోనే...
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి మరో రెండేళ్లలో కఠిన పరీక్ష ఎదురుకాబోతుంది. సాధారణ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ప్రాజెక్టులపై కేంద్రం దృష్టిసారించింది. ఢిల్లీ నుంచి పాట్నకు రహదారి మార్గంలో ప్రయాణ సమయాన్ని 11 గంటలకు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ నిర్దేశించింది. కేంద్రప్రభుత్వం, బిహార్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి ఈ ప్రయాణ సమయాన్ని కనీసం మూడింట తగ్గించేయాలని నిర్ణయించాయి. ఈ ప్లాన్‌లో భాగంగా రింగ్ రోడ్డులు, ఎక్స్‌ప్రెస్ హైవేలను నిర్మించనున్నాయి. ఢిల్లీ, లక్నో, పాట్నలు కేంద్ర ప్రభుత్వానికి మూడు మేజర్ పొలిటకల్ సెంటర్లు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర ప్రదేశ్, బిహార్‌లు కీలక రాష్ట్రాలుగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండగా.. బిహార్‌లో జేడీయూకు మద్దతుగా బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు రాష్ట్రాల్లో అస్తవ్యస్థంగా ఉన్న రోడ్డు కనెక్టివిటీ సమస్యను పరిష్కరించేందుకు సిద్దమైంది. ఢిల్లీ నుంచి ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌కు కొత్త ఎకనామిక్ కారిడార్‌ను ఏర్పాటుచేయనుంది. ప్రస్తుతం ఢిల్లీ నుంచి పాట్నకు రోడ్డు మార్గాన 18 గంటల సమయం పడుతోంది. ఢిల్లీ నుంచి పాట్నకు ప్రయాణ సమయాన్ని 11 గంటలకు తగ్గించాలనుకోవడం చాలా పాజిటివ్ నిర్ణయమని, రింగ్ రోడ్డులు, ఎక్స్‌ప్రెస్‌హైవేలు నిర్మించాక, ఎక్స్‌ప్రెస్‌హైవేలు ఎక్కువ ట్రాఫిక్‌ను ఆకట్టుకుంటాయని యూపీ ఎక్స్ప్రెస్హైవేస్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ సీఈవో అవనిష్ కే అవస్థి చెప్పారు. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఆగ్రా టూ లక్నో మధ్య జర్నీ సమయాన్ని తగ్గించడం కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఓ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించిందని తెలిపారు. ఆగ్రా నుంచి లక్నోకు నిర్మించిన ఎక్స్‌ప్రెస్‌హైవే మంచి ట్రాఫిక్‌ను కలిగి ఉందని, దివాళి సందర్బంగా 32వేలకు పైగా కార్లు, చిన్న వాహానాలు ఈ హైవేపై ప్రయాణించినట్టు పేర్కొన్నారు. -
‘అనంత’–అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే
రహదారి పక్కనే రైలు మార్గం : మంత్రి అయ్యన్న వెల్లడి సాక్షి, విశాఖపట్నం: అనంతపురం–అమరావతి మధ్య రూ.27 వేల కోట్లతో ఆరులేన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించనున్నట్టు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ రహదారికి సమాంతరంగా రైలు మార్గాన్ని కూడా నిర్మిస్తామని వెల్లడించారు. మంగళవారం విశాఖ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే 393 కిలోమీటర్లని మొత్తం ఐదు జిల్లాల గుండా వెళుతుందని, దేశంలో ఉన్న ఎక్స్‌ప్రెస్ హైవేల్లో ఇది మూడోదని పేర్కొన్నారు. -
ప్రాణ స్నేహితులు బలయ్యారు
ముంబయి: వారిద్దరు ప్రాణ స్నేహితులు. ఒకరికి 21, మరొకరికి 22 సంవత్సరాల వయసు. ఇద్దరూ కూడా బాంద్రాలోని రిజ్వీ కాలేజీలో చదువుతున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కాండ్విలి వద్ద ఎక్స్‌ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇంకా చెప్పాలంటే, ఆ ప్రమాదంకంటే దాని బారిన పడిన వారిని ఎవరూ గుర్తించని కారణంగా ప్రాణాలుకోల్పోయారు. మానవత్వం వారి దరిదాపులకు వెళ్లని కారణంగా మృత్యువాతపడ్డారు. ప్రమాదం సమయంలో ఏ ఒక్కరు స్పందించినా బహుశా ఆ ఇద్దరు ప్రాణాలతో బతికుండేవారు. ఈ విషయం స్వయంగా పోలీసులే చెప్పారు. ఆ రోడ్డుపై నడుస్తూ వెళ్లే వారుగానీ బైక్‌లపై, కారుపై వెళ్లేవారుగానీ కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. తమపై ఆ ఘటనకు బాధ్యత పడుతుందేమోనన్న భయంతో ఎవరూ ముందుకురాకపోవడంతో ఆ ఇద్దరు ప్రాణాలుకోల్పోవాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. నిత్యం బిజీగా ఉండే రోడ్డులో సోమవారం సమతానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన బీట్ మార్షల్స్ కాండ్విలి వైపు వెళుతుండగా ప్రమాదానికి గురై పడి ఉన్న సాద్ తీరందాజ్, బిలాల్ అన్సారీ అనే ఇద్దరిని గుర్తించారు. వీరిది మీరా రోడ్డులోని కనాకియా రెసిడెన్సీ ప్రాంతంలో బిలాల్ రిజ్వీ కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తుండగా.. సాద్ అదే కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇస్తూ రోడ్డు ప్రమాదం, ఎప్పుడు ఎలా జరిగిందో తెలియడం లేదని, ఏ ఒక్కరూ దానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదని, సాద్ అక్కడికక్కడే చనిపోగా బిలాల్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని అన్నారు. తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. -
హైదరాబాద్ - అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్ వే
- రూ.7,500 కోట్లతో ఆరు వరుసలుగా నిర్మాణం - ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో నిర్మాణం - కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్– ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌వే రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే రెండు నగరాల మధ్య రైలుమార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన నేపథ్యంలో, ఇప్పుడు రహదారి విషయంలో కూడా కదలిక వస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ఈ పనులు మొదలు కావాల్సి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ హామీ ఇచ్చింది. దాన్ని విభజన చట్టంలోనూ పొందుపరిచింది. కానీ రాష్ట్రం విడిపోయి మూడేళ్లు గడుస్తున్నా ఇందులో కదలిక లేకపోవటంతో దాన్ని ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ప్రారంభించింది. రహదారుల విషయంలో వెనుకబాటుకు గురైన తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రహదారులు కోరుతూ ప్రతిపాదనలు సమర్పించినప్పుడల్లా కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వెంటనే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపట్టాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా లేఖ రాయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి కూడా తెచ్చారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు నిర్మాణం కోసం ఆసక్తి చూపుతున్నందున రెండు ప్రభుత్వాల నుంచి ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ బడ్జెట్ ప్రతిపాదనల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తమ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంపై చర్చ సాగింది. ‘ముఖ్యమంత్రితో చర్చించి ఈ రోడ్డు నిర్మాణంపై కేంద్రానికి లేఖ పంపబోతున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోణంలో కూడా ఈ రోడ్డుకు ప్రాధాన్యం ఉంది. ఇది పెట్టుబడులను ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుంది. వీలైనంత తొందరలోనే దీన్ని ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్నాం.’అని సమావేశానంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షితో చెప్పారు. 250 కిలోమీటర్లు.. రూ.7,500 కోట్లు హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం అవుతుంది. దాదాపు 250 కిలోమీటర్ల మేర సాగే ఈ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి దాదాపు రూ.7,500 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా, దీన్ని జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపితే వచ్చే నెలలోనే దీనిపై సర్వే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్– మాల్– మల్లెపల్లి– నాగార్జునసాగర్– మాచర్ల– పిడుగురాళ్ల మీదుగా అమరావతికి దీనిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు... రాష్ట్ర విభజనకు పూర్వం ఏపీ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నట్టుగానే ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచే కేటాయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా రుణం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా కొత్త జిల్లా కేంద్రాల నుంచి అన్ని మండల కేంద్రాలకు రెండు వరుసల రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి రూ.970 కోట్లు, నాబార్డ్, గ్రామీణ రహదారుల నిధికి రూ.575 కోట్లు, కలెక్టరేట్లు సహా ఇతర భవనాల నిర్మాణం కోసం రూ.1116 కోట్లు, రహదారుల నిర్వహణ వ్యవస్థ, కోర్ రోడ్డు నెట్వర్క్ కోసం రూ.260 కోట్లు, భవనాల నిర్వహణకు రూ.40 కోట్లు ప్రతిపాదించారు. వచ్చే సంవత్సరంలో 4 వేల కి.మీ. నిడివితో కొత్త రోడ్లను నిర్మించాలని, 40 వంతెనలు సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. -
భూసేకరణకు నెల రోజుల్లో నోటిఫికేషన్
– వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశం కర్నూలు(అగ్రికల్చర్): అనంతపురం– అమరావతి ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి మలుపులు లేకుండా నిర్మించేందుకు అవసరమైన భూముల సేకరణ పనులను ముమ్మరం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జాతీయ రహదారి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారులు మలుపులు లేకుండా నేరుగా వేసేందుకు అవసరమైన పునఃప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కర్నూలు జిల్లాలో కొలిమిగుండ్ల, సంజామల, ఉయ్యాలవాడ, ఆళ్లగడ్డ, రుద్రవరం మండలాల్లోని 27 గ్రామాల్లో భూ సేకరణ సర్వే పనులు నెల రోజుల్లో పూర్తి చేసి నోటిఫికేషన్ జారీ చేయాలని జాయింట్ కలెక్టర్‌ను ఆదేశించారు. కర్నూలు నుంచి జేసీ మాట్లాడుతూ..జిల్లాలో దాదాపు 1008.75 ఎకరాల భూమిని సర్వే చేయాల్సి ఉందన్నారు. అలాగే శిరువెళ్ల మండలంలో 13.5 కిలోమీటర్ల రిజర్వు ఫారెస్ట్‌లో 203 ఎకరాల భూమి అవసరం అవుతుందని, ఈ నెల 15లోగా పెగ్ మార్క్ వేసి సర్వే పనులు ప్రారంభిస్తామని జేసీ వివరించారు. కర్నూలు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో నేషనల్ హైవే ఈఈ నాగరాజు, అటవీ శాఖ కన్జర్వేటర్ మూర్తి, నంద్యాల, ఆత్మకూరు డీఎఫ్ఓలు తదితరులు పాల్గొన్నారు. -
మా నివాసాలు తొలగించొద్దు
► నవులూరులోని ఎంఎస్ఎస్ కాలనీవాసుల వేడుకోలు ► ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీచేసిన ► పంచాయతీ అధికారులు ► స్థానికుల ఆందోళన సీపీఎం మద్దతు నవులూరు (మంగళగిరి) : ఎక్స్‌ప్రెస్ హైవేల పేరుతో ఇళ్ల జోలికొస్తే సహించేది లేదని, ఆత్మహత్యలకైనా సిద్ధమేనని, ఇళ్లను మాత్రం తొలగిస్తే ఊరుకునేది లేదని పలువురు స్థానికులు అధికారులను హెచ్చరించారు. మండలంలోని ఎంఎస్ఎస్ కాలనీవాసులు 15 రోజుల్లో ఇళ్లను తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని పంచాయతీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. దీంతో కాలనీవాసులు గురువారం రాత్రి సమావేశమయ్యారు. అనంతరం నోటీసులతో గురు వారం కాలనీలోనే ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ 20, 30 సంవత్సరాలుగా నివాసముంటున్న తమను ఖాళీ చేయించాలని ప్రభుత్వం పంచాయతీ అధికారులతో నోటీసులు జారీ చేయడమేమిటని ప్రశ్నించారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నిర్మించే ఎక్స్‌ప్రెస్ హైవే కోసమే తమ ఇళ్లను తొలగించే కుట్ర జరుగుతోందని వారు చెప్పారు. మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సమయంలోనే తామంతా వ్యతిరేకించగా, ‘మీకు ఇష్టం లేకుంటే రోడ్డు మారుస్తాం.. ’ అని చెప్పిన సీఆర్డీఏ అధికారులు తిరిగి ఇప్పుడు తమకు నోటీసులు జారీచేసి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన సీపీఎం నాయకుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ రాజధానిలో పేదలు ఉండకూడదనే లక్ష్యంతోనే కుట్రలు చేస్తున్నారన్నారు. మంగళగిరిలోని చెరువులను బడాబాబులకు కట్టబెట్టి ఖాళీ స్థలాల్లో ఉన్న పేదలను ఖాళీ చేయించేందుకు అధికారులు అత్యుత్సాహం చూపడమేమిటని ప్రశ్నించారు. పేదల పొట్టకొట్టి వారి ఉసురు తీయడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఇళ్లు ఖాళీ చేయిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకుడు ఎం.రవి మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లు తొలగిస్తామనడం సరైన పద్ధతి కాదన్నారు. నోటీసుల జారీని నిరసిస్తూ ఈనెల 30వ తేదీన పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
చిత్తూరుకు రూ.100 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు
ముత్తిరేవుల నుంచి కలవకుంట, గంగాధరనెల్లూరు మీదుగా వేలూరు రోడ్డును కలిపే విధంగా ప్లాన్ సెప్టెంబర్ 21న సీఎం చిత్తూరు పర్యటనలో ప్రకటించే విధంగా అధికారుల చర్యలు ఆర్అండ్బీ ఎస్ఈని కలిసి చర్చించిన ‘దేశం’ నేతలు చిత్తూరు(టౌన్): చిత్తూరుకు రూ. 100 కోట్ల ఔటర్ రింగ్ రోడ్డు మంజూరుకానుంది. తిరుపతి వైపు నుంచి వేలూరు, చెన్నై నగరాలకు వెళ్లే వాహనచోదకుల ఇబ్బందులు, చిత్తూరు నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఆర్అండ్బీ అధికారులు ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. సర్వేలు ఇప్పటికే పూర్తయ్యాయి. కొత్తగా స్థల సేకరణ చేపట్టే అవసరం లేకుండా పంచాయతీరాజ్, ఆర్అండ్బీ పరిధిలో ఉన్న రోడ్లనే కలుపుతూ వాటిని వెడల్పు చేసి తద్వారా రింగ్‌రోడ్డును నిర్మించే విధంగా అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. రింగ్‌రోడ్డు కలిసే ప్రాంతాలివి తిరుపతి నుంచి చిత్తూరు నగరం వైపు ప్రయాణించే వాహనచోదకులు ముత్తిరేవుల వద్ద ఎడమవైపుగా వెళ్లి పెనుమూరు మండలానికి చెందిన కలవకుంట, గంగాధరనెల్లూరు మండలానికి చెందిన కలిజవేడు, నాశంపల్లి, బొమ్మవారిపల్లి, చిత్తూరు-పుత్తూరు రోడ్డులోని గంగాధరనెల్లూరు, వేల్కూరు, చిత్తూరు రూరల్ మండలం తాళంబేడు, ఎన్ఆర్పేట, రామాపురం, గుడిపాల మండలం కొత్తపల్లి, గోపాలపురం మీదుగా వేలూరు రోడ్డులో కలిసే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. గోపాలపురం మీదుగానే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ రింగ్‌రోడ్డును ఆ ఎక్స్‌ప్రెస్ హైవేలో కలిపే విధంగా కూడా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీని పొడవు 20 నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది. గోపాలపురం నుంచి పొన్నై రహదారిని కలిపే రోడ్డుతోపాటు, పొన్నై రోడ్డు నుంచి గంగాధరనెల్లూరు కలిపే రోడ్డు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నాయి. గంగాధరనెల్లూరు నుంచి కలిజవేడు, కలవకుంట రోడ్డు ఆర్అండ్బీ పరిధిలో ఉంది. అయితే ఇవి ప్రస్తుతం 12 నుంచి 15 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్నారుు. వాటిని 30 నుంచి 40 అడుగుల వెడల్పు చేస్తూ రోడ్డును నిర్మించే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వీడనున్న ట్రాఫిక్ సమస్య రింగ్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే చిత్తూరు నగరవాసులకు ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగనుంది. తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్లే వాహనాలు మురకంబట్టు బైపాస్ మీదుగా వెళతాయి. చెన్నై, వేలూరు మార్గాల్లో ప్రయాణించాల్సిన వాహనాలు రింగ్‌రోడ్డు మీదుగా వెళ్లేటట్లు చర్యలు తీసుకుంటారు. చిత్తూరు నగరం మీదుగా వెళ్లే వాహనాల్లో దాదాపు 75 శాతం తగ్గిపోతాయి. చిత్తూరు పర్యటనలో ప్రకటించనున్న సీఎం సీఎం సెప్టెంబర్ 21న చిత్తూరు నగర పర్యటన ఖరారైంది. అదే రోజు ఈ రింగ్‌రోడ్డు నిర్మాణం విషయాన్ని కూడా సీఎం ప్రకటించే విధంగా స్థానిక దేశం నేతలు కార్యాచరణను తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యిదర్శి దొరబాబు, నాయకులు డీకే బద్రీనారాయణ, నాని తదితరులు సోమవారం ఆర్అండ్బీ ఎస్ఈ శివకుమార్‌ను కలిసి ఔటర్ రింగ్ విషయంగా చర్చించారు. ఎస్ఈతో వారు దాదాపు అర గంటపాటు చర్చించారు. -
బెజవాడలో ఎక్స్‌ప్రెస్ హైవే
విజయవాడ : కోల్‌కతా- చెన్నై ఎన్‌హెచ్-16పై నగరంలో కొత్తగా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే రానుంది. బందరురోడ్డు విస్తరణలో భాగంగా బెంజిసర్కిల్ వద్ద స్క్రూబిడ్జి నుంచి రామవరప్పాడు వరకు నిర్మించతలపెట్టిన ఫ్లైవోవర్‌ను ఆపేసి, ఆ స్థానంలో ఎలివేటెడ్ హైవే ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో మెహదీపట్నం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 2009లో నిర్మించిన పి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలో ఇక్కడ కూడా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై ఆయన అధికారులతో చర్చించినట్లు తెలిసింది. 3.5 కి.మీ. పొడవున ఎలివేటెడ్ హైవే (ఫ్లైవోవర్) నిర్మించడంలో గల సాధ్యాసాధ్యాలను నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలన్నీ ఈ ఫ్లైవోవర్ మీదుగా వెళతాయి. నగరంలో ట్రాఫిక్ అంతా యథావిధిగా ఈ ఫ్లైవోవర్ కింద నడుస్తుంది. దీన్ని నిర్మిస్తే నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని నేషనల్ హైవే అథారిటీ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో 11.6 కి.మీ. మేర నిర్మించిన ఎక్స్‌ప్రెస్ హైవే వివరాలను అధికారులు సేకరించి సీఎంకు వివరించినట్లు చెబుతున్నారు. విజయవాడలో నిర్మించతలపెట్టిన ఎక్స్‌ప్రెస్ హైవే హైదరాబాద్ కంటే సగానికి సగం తక్కువ దూరంతో పూర్తయ్యేలా అధికారులు ప్రతిపాదించారు. దీనిపై సర్వే చేయడానికి నైపుణ్యంగల సంస్థను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సంస్థ త్వరలో సర్వేచేసి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు ఆ ఫ్లైవోవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ ఎక్స్‌ప్రెస్ ఫ్లైవోవర్ వల్ల బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని నేషనల్ హైవే అధికారులు భావిస్తున్నారు. కోల్‌కతా-చెన్నై మధ్య నిత్యం వేలాదిగా రాకపోకలు సాగించే వాహనాలు, భారీ ట్రాలీలతో బెంజసర్కిల్ వద్ద తరచు ట్రాఫిక్ స్తంభిస్తోంది. క్షణ క్షణం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు నానా అగచాట్లు పడుతుంటారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నిత్యం గన్నవరం విమానాశ్రయం నుంచి నగరానికి వచ్చే వీఐపీల తాకిడి పెరిగింది. వారి కాన్వాయ్ వచ్చినప్పుడు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను మళ్లించడం లేదా నిలుపుదల చేయాల్సిరావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
మళ్లీ తెరపైకి ఎక్స్‌ప్రెస్ హైవే పనులు
మొదలైన రోడ్డు సర్వే ప్రక్రియ ఐదు మీటర్ల ఎత్తులో, 300 మీటర్లతో రోడ్డు నిర్మాణం ఆరు నెలల్లో పూర్తి కానున్న సర్వే మార్కింగ్ రూ.4,800 కోట్ల అంచనాతో ప్రాజెక్టు పలమనేరు, న్యూస్‌లైన్: బెంగళూరు నుంచి చెన్నై వరకు పలమనేరు మీదుగా నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ హైవే (6 ట్రాక్‌రోడ్)కు సంబంధించి సర్వే పనులు ప్రారంభమయ్యాయి. అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన ప్రైవేటు కంపెనీ ఇంజనీర్లు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు మండలంలోని జల్లిపేట, వెంకటేష్‌పురం కాలనీ, కొలమాసనపల్లె, బేలుపల్లె క్రాస్ గ్రామాల సమీపంలో ఆదివారం మార్కింగ్‌లు ఇచ్చారు. ఈ ప్రక్రియ మరో ఆరునెలలపాటు జరుగుతుందని సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులు చంద్రారెడ్డి, గిరీశ్వరయ్య తెలిపారు. విమాన మార్గం ఆధారంగా నిర్మితం కానున్న ఈ రోడ్డు భూమికి ఐదు మీటర్ల ఎత్తులో, 300 మీటర్ల వెడల్పుగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం బంగారుపాళ్యం, పలమనేరు ప్రాంతాల్లో రెండు బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని వారు పేర్కొన్నారు. రూ.4,800 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు ఈజీఎస్ ఇండియా ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సౌజన్యంతో రూ.4,800 కోట్ల వ్యయంతో ఎక్స్‌ప్రెస్ హైవేను చేపట్టేందుకు రెండేళ్ల క్రితం ముందుకొచ్చింది. ఈ రోడ్డు పనులకు అవసరమైన సర్వే, భూముల సేకరణకు సంబంధించి ఆ ప్రతినిధులు అప్పట్లోనే ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఏడాది క్రితం ఇక్కడ భూమి పటుత్వ పరీక్షలను సైతం నిర్వహించారు. ఎలా నిర్మిస్తారంటే.. బెంగళూరు సమీపంలోని హొస్కోట నుంచి చెన్నై సమీపంలోని శ్రీపెరంబదూర్ వరకు 268 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇది సిక్స్‌ట్రాక్ రహదారిగా ఐదు మీటర్ల ఎత్తు కల్గి రోడ్డుకు ఇరువైపులా ఏడుమీటర్ల వెడల్పుతో గ్రామీణ రహదారులకు అనుసంధానం చేస్తారు. బహుళ ప్రయోజనకారిగా ఈ రహదారిని ఉపయోగించుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని హొస్కోట, కోలారు, ముళబాగల్, మన రాష్ట్రంలోని బెరైడ్డిపల్లె, పలమనేరు రూరల్, బంగారుపాళ్యం, గుడిపాల మండలాల మీదుగా ఈ రహదారి తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబదూర్ వరకు నిర్మిస్తారు. మామూలు రోడ్ల మాదిరి కాకుండా ఆకాశమార్గం ఆధారంగా పాయింట్ టు పాయింట్ నిర్మాణం జరుగుతుంది. రోడ్డు నిర్మాణంతో లాభాలెన్నో.. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు పెరిగి ఉపాధితో పాటు రైతులు పండించిన పంటలను ఇటు చెన్నై, అటు బెంగళూరుకు తరలిం చేందుకు వెసులుబాటు కలుగుతుంది. అంతేగాక ఈ రోడ్డుకు ఆనుకుని భవిష్యత్తులో కోట్లాది రూపాయల వ్యయంతో భారీ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందనే ప్రచారంతో స్థానికంగా భూముల విలువ ఇప్పటికే అమాంతం పెరిగింది. మరోవైపు చెన్నై-బెంగళూరుకు వంద కిలోమీటర్లు ప్రయాణదూరం తగ్గుతుంది. ఫలితంగా 2.30 గంటల్లో బెంగళూరు నుంచి చెన్నైకు చేరుకోవచ్చు.