రీజినల్‌ రింగ్‌ రోడ్‌.. కొత్త దారిలో? | Telangana: Changes In Regional Ring Road Alignment | Sakshi
Sakshi News home page

Telangana: రీజినల్‌ రింగ్‌ రోడ్‌.. కొత్త దారిలో?

Published Thu, Oct 14 2021 1:32 AM | Last Updated on Thu, Oct 14 2021 10:19 AM

Telangana: Changes In Regional Ring Road Alignment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రగతి ముఖచిత్రంలో కీలక మార్పులు తెస్తుందని భావిస్తున్న రీజనల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌లో మార్పులు జరుగనున్నాయి. నాలుగు వరుసలుగా చేపట్టే ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ఏయే ప్రాంతాల మీదుగా నిర్మించాలన్న దానిపై స్పష్టత వచ్చినా.. క్షేత్రస్థాయిలో ప్రస్తుత అలైన్‌మెంట్‌ అనువుగా లేదని కన్సల్టెన్సీ సంస్థ తేల్చింది. పూర్తిగా కొత్త అలైన్‌మెంట్‌తో ఆర్‌ఆర్‌ఆర్‌ను చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ మేరకు పలు అంశాల ఆధారంగా నాలుగు కొత్త అలైన్‌మెంట్లు రూపొందించి ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)’కుఅందజేసింది. దీనిలో ఏదో ఒకటి ఖరారు కాగానే మిగతా ప్రక్రియ మొదలుకానుంది. 

రెండున్నరేళ్ల మార్పులతో.. 
రీజనల్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో కన్సల్టెన్సీగా వ్యవహరించిన ఓ బెంగళూరు సంస్థ.. గూగుల్‌మ్యాప్స్, అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. దాని ఆధారంగానే ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించారు. కానీ ఆ అలైన్‌మెంట్‌ తయారై దాదాపు రెండున్నరేళ్లు గడిచింది. ఈలోగా క్షేత్రస్థాయిలో కొన్ని మార్పుచేర్పులు చోటుచేసుకున్నాయి. మిషన్‌ భగీరథ పైపులైన్లు ఏర్పాటయ్యాయి, గోదావరి జలాల తరలింపు కాల్వలు, కొత్త రిజర్వాయర్లు నిర్మితమయ్యాయి. ఈ నేపథ్యంలో అలైన్‌మెంటులో మార్పులు జరగాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా ఈ విషయాన్ని కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కొత్తగా ఏర్పాటైన కన్సల్టెన్సీ సంస్థ నూతన ప్రతిపాదనలను రూపొందించింది.  

కొత్త నిర్మాణాలు, అవసరాల మేరకు.. 
ప్రస్తుతం నాగ్‌పూర్‌కు చెందిన ‘కే అండ్‌ జే ప్రైవేట్‌ లిమిటెడ్‌’సంస్థ రీజనల్‌ రింగ్‌రోడ్డు కన్సల్టెన్సీ బాధ్యతలు చూస్తోంది. చెరువులు–కుంటలు, రిజర్వాయర్లు, ఇతర నీటి వనరులు, నివాస ప్రాంతాలు, గుట్టలు, రోడ్లు, రైలు మార్గాలు వంటి అడ్డంకులను బట్టి అలైన్‌మెంట్‌ను అటూఇటూ మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే (పూర్తిగా కొత్త రహదారి)గా నిర్మించాల్సి ఉండటంతో.. అవసరమైన భూమి మొత్తాన్నీ సమీకరించాల్సి ఉంటుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. దీనికితోడు ఎక్కడైనా నిర్మాణాలను తొలగించాల్సి వస్తే పరిహారం ఖర్చు పెరుగుతుంది. జల వనరులు ఉన్నచోట కాస్త దూరంగా నిర్మించాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అధ్యయనం చేసిన కన్సల్టెన్సీ.. నాలుగు వేర్వేరు అలైన్‌మెంట్లను రూపొందించింది. వీటిని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఏఐ.. పలు మార్పులు చేర్పులు సూచించింది. ఈ మేరకు కన్సల్టెన్సీ సిబ్బంది నాలుగైదు రోజులుగా మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి అలైన్‌మెంట్లలో మార్పులు చేస్తున్నారు. కన్సల్టెన్సీ సంస్థ వారం పదిరోజుల్లో ఎన్‌హెచ్‌ఏఐకి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది. నాలుగు అలైన్‌మెంట్లలో ఖర్చు, నిర్మాణ అనుకూలత ఆధారంగా యోగ్యంగా ఉన్నదానిని ఎన్‌హెచ్‌ఏఐ ఎంపిక చేయనుంది. 

ఓఆర్‌ఆర్‌ నుంచి 40–50 కిలోమీటర్ల దూరంలో.. 
ప్రస్తుతం హైదరాబాద్‌ చుట్టూ ఉన్న ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అవతల 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల దూరంలో రీజనల్‌ రింగ్‌రోడ్డును నిర్మించనున్నారు. కన్సల్టెన్సీ సంస్థ ఈ దూరం పరిధిలోనే నాలుగు అలైన్‌మెంట్లను ప్రతిపాదించింది. ఒక్కో అలైన్‌మెంట్‌కు మధ్య 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల తేడా ఉండేలా రూపొందించింది. అయితే ఓఆర్‌ఆర్‌ నుంచి దూరం పెరిగేకొద్దీ రీజనల్‌ రింగురోడ్డు పొడవు, నిర్మాణ ఖర్చు పెరుగుతాయి. అదే సమయంలో జనావాసాలు, ఇతర నిర్మాణాలకు దూరంగా ఉండటం వల్ల పరిహారం ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి అంశాలను పరిశీలించి.. అలైన్‌మెంట్‌ను ఎంపిక చేయనున్నారు. 

భూసేకరణే కీలకం.. 
ఆర్‌ఆర్‌ఆర్‌ తుది అలైన్‌మెంట్‌ ఖరారయ్యాక భూసేకరణ కీలకంగా మారనుంది. తొలుత అవసరమైన భూమి, ఇతర వనరులు, అవసరాలను గుర్తిస్తారు. డీపీఆర్‌ తయారు చేస్తారు. వీటికే ఆరు నెలల వరకు సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. భూసేకరణకు సంబంధించి పరిహారం, ఇతర వివాదాలు, కోర్టు కేసుల వంటి సమస్యలు ఏర్పడితే నిర్మాణంలో జాప్యం జరగవచ్చని అంటున్నారు. ఔటర్‌ రింగ్‌రోడ్డు తరహాలో వివాదాల్లేని ప్రాంతాల్లో ముందు నిర్మిస్తూ వెళితే.. ఆర్‌ఆర్‌ఆర్‌ త్వరగా పూర్తవుతుందని పేర్కొంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement