రీజనల్‌ రింగ్‌.. మరింత లాంగ్‌! | The southern part of the regional ring road which will be more than 200 km | Sakshi
Sakshi News home page

రీజనల్‌ రింగ్‌.. మరింత లాంగ్‌!

Published Sun, Oct 6 2024 4:28 AM | Last Updated on Sun, Oct 6 2024 4:28 AM

The southern part of the regional ring road which will be more than 200 km

200 కిలోమీటర్లను మించనున్న రీజనల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగం 

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్‌మెంట్‌లో పలు జలాశయాలు 

గూగుల్‌ మ్యాప్‌ ఆధారంగా చేసిన ఆ అలైన్‌మెంట్‌ ఖరారు దాదాపు అసాధ్యమే.. 

జలవనరులను తప్పించేలా మార్పులు చేస్తే.. మరో 10– 12 కిలోమీటర్లు 

పెరగనున్న నిడివి... కనీసం రూ.1,200 కోట్లకుపైగా అదనపు భారం పడే చాన్స్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రీజనల్‌ రింగ్‌ రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను మించిపోనుంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చేపట్టిన పరిశీలనను కాదని రాష్ట్ర ప్రభుత్వం విడిగా రూపొందించిన అలైన్‌మెంట్, దానిలో మార్పులు చేయాల్సిన పరిస్థితులే దీనికి కారణం. గతంలో ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ పరిశీలన చేపట్టి మూడు వేర్వేరు అలైన్‌మెంట్లను రూపొందించగా.. అందులో 189.425 కిలోమీటర్ల నిడివి ఉన్న మూడో అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. 

దాన్ని ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదించేలోగా లోక్‌సభ ఎన్నికలు రావడంతో పెండింగ్‌లో పడింది. తర్వాత రోడ్డు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చుకుంది. సొంతంగా దక్షిణ భాగం రింగ్‌రోడ్డును చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాల్లో అలైన్‌మెంట్‌పై చర్చలు జరిగాయి. కొన్ని కన్సల్టెన్సీ సంస్థల సాయంతో గూగుల్‌ మ్యాప్‌ల ఆధారంగా ప్రాథమికంగా ఓ అలైన్‌మెంట్‌ను అధికారులు సిద్ధం చేశారు. 

గతంలో ఢిల్లీ కన్సల్టెన్సీ రూపొందించిన అలైన్‌మెంట్‌లో చాలా మార్పులు చేస్తూ, కొత్త ప్రాంతాల మీదుగా రింగ్‌రోడ్డు కొనసాగేలా రూపొందించారు. దానితో దక్షిణభాగం నిడివి 194 కిలోమీటర్లకు చేరింది. అయితే అది క్షేత్రస్థాయి పరిశీలనతో రూపొందించినది కాకపోవటంతో పలు లోపాలు ఉండిపోయాయి. ఆ అలైన్‌మెంట్‌ను ఉన్నది ఉన్నట్టుగా ఖరారు చేసే పరిస్థితి లేదు. జలాశయాలు, రిజర్వాయర్లు, గుట్టలు, వాగులు, వంకల మీదుగా దాన్ని రూపొందించడమే కారణం. 

ఇప్పుడు ఇలాంటి వాటన్నింటినీ తప్పిస్తూ.. తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. దీనితో నిడివి మరో 12 కిలోమీటర్లకుపైగా పెరుగుతుందని అంచనా. ఈ లెక్కన రీజనల్‌ రింగ్‌రోడ్డు దక్షిణ భాగం నిడివి 200 కిలోమీటర్లను దాటిపోతుందని అంటున్నారు. 

రూ.1,200 కోట్లు అదనపు వ్యయం 
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త అలైన్‌మెంట్‌ను ఖరారు చేసే పనిలో ఉంది. ఇటీవలే 12 మంది అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. 194 కిలోమీటర్ల ప్రాథమిక అలైన్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని.. క్షేత్రస్థాయిలో పర్యటించి తుది అలైన్‌మెంట్‌ను సిద్ధం చేయనున్నారు. 

ఈ క్రమంలో ప్రాథమిక అలైన్‌మెంట్‌లోని లోపాలను సరిదిద్దితే.. రోడ్డు నిడివి పెరగనుంది. దీనితో రోడ్డు నిర్మాణ వ్యయం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

ఆమన్‌గల్‌ ఆవలి నుంచి.. 
ఎన్‌హెచ్‌ఏఐ రూపొందించిన అలైన్‌మెంట్‌ ఆమన్‌గల్‌ పట్టణం ఇవతలి నుంచి ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని మార్చి ఆమన్‌గల్‌ పట్టణం అవతలి నుంచి అలైన్‌మెంట్‌ను రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఆ పట్టణం పూర్తిగా రీజనల్‌ రింగురోడ్డు లోపలికి రానుంది. 

ఇక చేవెళ్ల మండలం పరిధిలోని ఆలూరు –కిష్టాపూర్‌ గ్రామాల సమీపంలో హైదరాబాద్‌–బీజాపూర్‌ హైవేను క్రాస్‌ చేసేలా ఎన్‌హెచ్‌ఏఐ అలైన్‌మెంట్‌ ఉండగా.. ఇప్పుడు మన్నెగూడ వద్ద క్రాస్‌ చేసేలా మార్పు చేస్తున్నట్టు సమాచారం. ఇలా మరెన్నో మార్పులు జరుగుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం ప్రాథమిక అలైన్‌మెంట్‌ స్థానంలో.. మరో తాత్కాలిక అలైన్‌మెంట్‌ను కొత్తగా రూపొందించినట్టు సమాచారం. 

గతంలోనూ ఇలాగే.. 
ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్‌ను రూపొందించకముందు, రాష్ట్ర ప్రభుత్వం అ«దీనంలో ఎన్‌హెచ్‌ విభాగం ఓ ప్రాథమిక అలైన్‌మెంట్‌ను రూపొందించింది. అప్పట్లో కూడా అధికారులు గూగుల్‌ మ్యాపుల ఆధారంగా దాదాపు 182 కిలోమీటర్ల నిడివితో దాన్ని రూపొందించారు. మర్రిగూడ మండలం శివన్నగూడలో ఉన్న రిజర్వాయర్‌ మధ్యలోంచి రోడ్డును నిర్మించేలా సిద్ధం చేశారు. 

దీనితో ఆ రిజర్వాయర్‌ సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. రిజర్వాయర్‌ను ఆసరా చేసుకుని సాగు భూముల్లోంచి అలైన్‌మెంట్‌ మార్కింగ్‌ చేసిన అంశాన్ని.. ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు క్షేత్రస్థాయిలో సర్వే చేసి.. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరం నుంచి కొత్త అలైన్‌మెంట్‌ రూపొందించారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే మళ్లీ ఎదురవుతోంది.

ప్రస్తుతం జలాశయాల మీదుగా..
ఇది దక్షిణ రింగురోడ్డు ప్రారంభ ప్రాంతం. ఉత్తర రింగ్‌ ప్రారంభయ్యే సంగారెడ్డి పట్టణం చేరువలోని గిర్మాపూర్‌ వద్ద దక్షిణ భాగం రింగురోడ్డు అనుసంధానమయ్యే చోటు ఇది. ఇక్కడ ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన అలైన్‌మెంట్‌ ప్రారంభంలోనే ఓ లూప్‌ తరహాలో అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి (లేత నీలిరంగు గీత) మొదలవుతుంది. దీన్ని లోపంగా భావించారో, మరేమో గానీ.. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రాథమిక అలైన్‌మెంట్‌లో దాన్ని (ముదురు నీలిరంగు) స్ట్రెయిట్‌ లైన్‌గా మార్చారు. 

నిజానికి అక్కడ పెద్ద చెరువు ఉంది. కొండాపూర్‌ మండలం తొగర్‌పల్లి పెద్దచెరువు పరీవాహక ప్రాంతాన్ని తప్పించేందుకు ఢిల్లీ కన్సల్టెన్సీ లూప్‌లో అలైన్‌మెంట్‌ రూపొందించింది. ప్రభుత్వ అలైన్‌మెంట్‌లో దాన్ని నేరుగా ఉండేలా మార్చటం వల్ల చెరువు పరీవాహక ప్రాంతం మీదుగా రోడ్డు వస్తుంది, అలాగే నిర్మించాలంటే ఎలివేటెడ్‌ విధానాన్ని అనుసరించాలి. అది భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఇక మర్రిగూడ మండలం కిష్టరాయునిపల్లి వద్ద ఓ రిజర్వాయర్‌ నిర్మాణ ప్రతిపాదన ఉంది. 

దాన్ని తప్పించేందుకు ఢిల్లీ సంస్థ ఆ ప్రాంతంలో వంపు తిరుగుతూ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ప్రభుత్వ అలైన్‌మెంట్‌లో దాన్ని కూడా నేరుగా మార్చటం వల్ల.. ప్రతిపాదిత రిజర్వాయర్‌ భూముల్లోంచి రోడ్డు నిర్మించాల్సి వస్తుంది. అది కుదిరే పనికాదు. లేదా అతి భారీ ఫ్లైఓవర్లు కట్టాల్సి వస్తుంది. దక్షిణభాగం పొడవునా పలుచోట్ల ఇదే పరిస్థితి ఉండటంతో.. ప్రాథమిక అలైన్‌మెంట్‌కు మార్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement