మళ్లీ తెరపైకి ఎక్స్‌ప్రెస్ హైవే పనులు
- మొదలైన రోడ్డు సర్వే ప్రక్రియ
- ఐదు మీటర్ల ఎత్తులో, 300 మీటర్లతో రోడ్డు నిర్మాణం
- ఆరు నెలల్లో పూర్తి కానున్న సర్వే మార్కింగ్
- రూ.4,800 కోట్ల అంచనాతో ప్రాజెక్టు
పలమనేరు, న్యూస్‌లైన్: బెంగళూరు నుంచి చెన్నై వరకు పలమనేరు మీదుగా నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ హైవే (6 ట్రాక్‌రోడ్)కు సంబంధించి సర్వే పనులు ప్రారంభమయ్యాయి. అడిషనల్ జాయింట్ కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి పర్యవేక్షణలో బెంగళూరుకు చెందిన ప్రైవేటు కంపెనీ ఇంజనీర్లు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు మండలంలోని జల్లిపేట, వెంకటేష్‌పురం కాలనీ, కొలమాసనపల్లె, బేలుపల్లె క్రాస్ గ్రామాల సమీపంలో ఆదివారం మార్కింగ్‌లు ఇచ్చారు.
ఈ ప్రక్రియ మరో ఆరునెలలపాటు జరుగుతుందని సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులు చంద్రారెడ్డి, గిరీశ్వరయ్య తెలిపారు. విమాన మార్గం ఆధారంగా నిర్మితం కానున్న ఈ రోడ్డు భూమికి ఐదు మీటర్ల ఎత్తులో, 300 మీటర్ల వెడల్పుగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం బంగారుపాళ్యం, పలమనేరు ప్రాంతాల్లో రెండు బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని వారు పేర్కొన్నారు.
రూ.4,800 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు
ఈజీఎస్ ఇండియా ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) సౌజన్యంతో రూ.4,800 కోట్ల వ్యయంతో ఎక్స్‌ప్రెస్ హైవేను చేపట్టేందుకు రెండేళ్ల క్రితం ముందుకొచ్చింది. ఈ రోడ్డు పనులకు అవసరమైన సర్వే, భూముల సేకరణకు సంబంధించి ఆ ప్రతినిధులు అప్పట్లోనే ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఏడాది క్రితం ఇక్కడ భూమి పటుత్వ పరీక్షలను సైతం నిర్వహించారు.
ఎలా నిర్మిస్తారంటే..
బెంగళూరు సమీపంలోని హొస్‌కోట నుంచి చెన్నై సమీపంలోని శ్రీపెరంబదూర్ వరకు 268 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఇది సిక్స్‌ట్రాక్ రహదారిగా ఐదు మీటర్ల ఎత్తు కల్గి రోడ్డుకు ఇరువైపులా ఏడుమీటర్ల వెడల్పుతో గ్రామీణ రహదారులకు అనుసంధానం చేస్తారు. బహుళ ప్రయోజనకారిగా ఈ రహదారిని ఉపయోగించుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని హొస్కోట, కోలారు, ముళబాగల్, మన రాష్ట్రంలోని బెరైడ్డిపల్లె, పలమనేరు రూరల్, బంగారుపాళ్యం, గుడిపాల మండలాల మీదుగా ఈ రహదారి తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబదూర్ వరకు నిర్మిస్తారు. మామూలు రోడ్ల మాదిరి కాకుండా ఆకాశమార్గం ఆధారంగా పాయింట్ టు పాయింట్ నిర్మాణం జరుగుతుంది.
రోడ్డు నిర్మాణంతో లాభాలెన్నో..
ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు పెరిగి ఉపాధితో పాటు రైతులు పండించిన పంటలను ఇటు చెన్నై, అటు బెంగళూరుకు తరలిం చేందుకు వెసులుబాటు కలుగుతుంది. అంతేగాక ఈ రోడ్డుకు ఆనుకుని భవిష్యత్తులో కోట్లాది రూపాయల వ్యయంతో భారీ పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉందనే ప్రచారంతో స్థానికంగా భూముల విలువ ఇప్పటికే అమాంతం పెరిగింది. మరోవైపు చెన్నై-బెంగళూరుకు వంద కిలోమీటర్లు ప్రయాణదూరం తగ్గుతుంది. ఫలితంగా 2.30 గంటల్లో బెంగళూరు నుంచి చెన్నైకు చేరుకోవచ్చు.