
సాక్షి, చెన్నై: బెంగళూరు నుంచి చెన్నైకు చిన్నమ్మ శశికళ సుదీర్ఘ పయనం చేశారు. అభిమానులు, మద్దతుదారుల ఆహ్వాన నీరాజనాలు అందుకుంటూ 23 గంటలు ఆమె కారులో ప్రయాణం చేశారు. మంగళవారం ఉదయం 6.45 గంటలకు చెన్నైలోని టీనగర్‌లో తన నివాసానికి చేరుకున్నారు. హారతి పట్టి కుటుంబీకులు ఆహ్వానం పలికారు. గో పూజ తర్వాత ఇంట్లోకి చిన్నమ్మ వెళ్లారు.
బ్రహ్మరథం పట్టిన అభిమానులు..
బెంగళూరు నుంచి శశికళ సోమవారం ఉదయం 7.45 గంటలకు చెన్నైకు బయలుదేరిన విషయం తెలిసిందే. అడుగడుగునా అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలు, మద్దతుదారులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. మంగళవారం ఉదయం 4గంటల సమయంలో రామాపురం తోట్టంలోని దివంగత ఎంజీఆర్ నివాసానికి చేరుకుని అక్కడ ఆయన విగ్రహానికి శశికళ నివాళులర్పించారు. అక్కడి నుంచి మద్దతుదారుల ఆహ్వానాన్ని అందుకుంటూ 6.45 గంటలకు టీ నగర్ హబీబుల్లా రోడ్డులోని తన వదినమ్మ ఇలవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంటికి చేరుకున్నారు.
హారతి పట్టి కుటుంబీకులు ఆహ్వానం పలికారు. గోపూజ తర్వాత ఇంట్లోకెళ్లారు. రెండ్రోజుల విశ్రాంతి తర్వాత కార్యకర్తలను కలుసుకోబోతున్నారు. శశికళ అన్నాడీఎంకే జెండాను ఉపయోగించిన కారులో పయనించడం, ఆ కారుకు యజమానిగా ఉన్న కృష్ణగిరి జిల్లా సూలగిరి యూనియన్ ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శి సంపంగితో పాటు ఆరుగుర్ని అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ, ఆ పార్టీ సమన్వయ కమిటీ ప్రకటన చేసింది. చిన్నమ్మ అండ్ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బ తీయడానికి అన్నాడీఎంకే పాలకులు సిద్ధమైనట్టున్నారు.
చదవండి: (పార్టీని ఆధీనంలోకి తెచ్చుకుంటా)