సాక్షి ప్రతినిధి, చెన్నై: తనను తాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పేర్కొంటూ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన శశికళపై చట్టపరమైన చర్యలకు అన్నాడీఎంకే సిద్ధమైంది. ఈ విషయమై ఆపార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో.. పోలీసుశాఖ న్యాయశాస్త్ర నిపుణులతో సమాలోచనలు జరుపుతోంది. అయితే చట్టం ఉచ్చులో ఆమె చిక్కక తప్పదని అన్నాడీఎంకే న్యాయనిపుణులు, సాధ్యం కాదని ఆమె న్యాయవాది వాదిస్తున్నారు.
జయ మరణం తరువాత చోటుచేసుకున్న అనేక రాజకీయ పరిణామాల వల్ల అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్ ఎడపాడి పళనిస్వామి, పార్టీ అగ్రనేతలంతా కలిసి శశికళ, టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సొంతం చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద శశికళ, దినకరన్ చేసిన పోరు చివరికి విఫలమైంది. పన్నీర్, ఎడపాడి నాయకత్వంలోని అన్నాడీఎంకేకు రెండాకుల చిహ్నం సొంతమని ఢిల్లీ హైకోర్టు సైతం అప్పట్లో తీర్పు చెప్పింది. దీంతో టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం అనే పార్టీని స్థాపించి శశికళ కనుసన్నల్లోనే నడిపించారు. అయితే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష ముగించుకుని జైలునుంచి విడుదలైన శశికళ కొద్దినెలలు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా మెలిగినా ఇటీవల మరలా దూకుడు ప్రదర్శించారు. చదవండి: (స్టాలిన్ సర్కారు సరికొత్త పథకం)
స్వర్ణోత్సవాల వేళ కలకలం
అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల సందర్భంగా ఈనెల 17వ తేదీన శశికళ తన అనుచరవర్గంతో కలిసి హడావుడి చేశారు. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో చెన్నై మెరీనాబీచ్‌లోని ఎంజీఆర్, జయసమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. మరుసటి రోజున ఎంజీఆర్ స్మారక మందిరం వద్దకు చేరుకుని ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందులో ‘అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ’ అని పొందుపరిచి ఉంది. అక్కడి నుంచి చెన్నై రామాపురంలోని ఎంజీఆర్ గృహానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. శశికళ తీరు అన్నాడీఎంకే అధినాయకత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ హోదాను, పతాకాన్ని ఆమె అక్రమంగా వాడుకున్నారని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. చెన్నై టీ నగర్‌లో శశికళ నివసిస్తున్నందున అదే పరిధిలోని మాంబళం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి జయకుమార్, పార్టీ న్యాయసలహాదారు బాబు మురుగవేల్‌తో కలిసి బుధవారం రాత్రి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేని శశికళ చట్టవిరుద్ధంగా వ్యవహరించినందున తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. న్యాయస్థానం, ఎన్నికల కమిషన్ ఆదేశాలను దిక్కరించిన శశికళపై చట్టపరమైన చర్యల సాధ్యాసాధ్యాలపై పోలీసు యంంత్రాగం న్యాయనిపుణులతో చర్చలు జరపడం ప్రారంభించింది. శశికళపై ఎఫ్‌ఐఆర్ నమోదు దిశగా పోలీస్‌శాఖ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ చర్యలను ఆమె న్యాయవాది రాజా సెందూర్‌పాండియన్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిపై సివిల్ కోర్టులో కేసు విచారణలో ఉన్నపుడు శశికళపై చర్యలు తీసుకునేందుకు వీలుండదని ఆయన అన్నారు. న్యాయస్థానం ద్వారా శశికళపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుందని అన్నాడీఎంకే న్యాయసలహాదారులు చెబుతున్నారు.
చదవండి: (నటుడు శింబుపై భారీ కుట్రలు)
ఎడపాడి దిష్టిబొమ్మ దహనం
ఇదిలా ఉండగా, శశికళ పట్ల అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తిరునెల్వేలీ వన్నార్‌పేటలో ఆమె అభిమానులు అన్నాడీఎంకే పతాకాన్ని, మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు.
26 నుంచి చిన్నమ్మ పర్యటన
అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు సాగుతుండగా, చిన్నమ్మ శశికళ మాత్రం ఇవేమీ పట్టనట్లుగా రాజకీయ పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఈనెల 26వ తేదీన తంజావూరులో తన పర్యటనకు శ్రీకారం చుట్టి వారం రోజులపాటూ దక్షిణ జిల్లాలను చుట్టిరావాలని నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment