► నవులూరులోని ఎంఎస్‌ఎస్ కాలనీవాసుల వేడుకోలు
► ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు జారీచేసిన
► పంచాయతీ అధికారులు
► స్థానికుల ఆందోళన సీపీఎం మద్దతు
నవులూరు (మంగళగిరి) : ఎక్స్‌ప్రెస్ హైవేల పేరుతో ఇళ్ల జోలికొస్తే సహించేది లేదని, ఆత్మహత్యలకైనా సిద్ధమేనని, ఇళ్లను మాత్రం తొలగిస్తే ఊరుకునేది లేదని పలువురు స్థానికులు అధికారులను హెచ్చరించారు. మండలంలోని ఎంఎస్‌ఎస్ కాలనీవాసులు 15 రోజుల్లో ఇళ్లను తొలగించాలని, లేదంటే తామే తొలగిస్తామని పంచాయతీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేశారు. దీంతో కాలనీవాసులు గురువారం రాత్రి సమావేశమయ్యారు. అనంతరం నోటీసులతో గురు వారం కాలనీలోనే ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ 20, 30 సంవత్సరాలుగా నివాసముంటున్న తమను ఖాళీ చేయించాలని ప్రభుత్వం పంచాయతీ అధికారులతో నోటీసులు జారీ చేయడమేమిటని ప్రశ్నించారు. సీఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా నిర్మించే ఎక్స్‌ప్రెస్ హైవే కోసమే తమ ఇళ్లను తొలగించే కుట్ర జరుగుతోందని వారు చెప్పారు. మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సమయంలోనే తామంతా వ్యతిరేకించగా, ‘మీకు ఇష్టం లేకుంటే రోడ్డు మారుస్తాం..
’ అని చెప్పిన సీఆర్‌డీఏ అధికారులు తిరిగి ఇప్పుడు తమకు నోటీసులు జారీచేసి భయాందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు మద్దతు తెలిపిన సీపీఎం నాయకుడు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ రాజధానిలో పేదలు ఉండకూడదనే లక్ష్యంతోనే కుట్రలు చేస్తున్నారన్నారు. మంగళగిరిలోని చెరువులను బడాబాబులకు కట్టబెట్టి ఖాళీ స్థలాల్లో ఉన్న పేదలను ఖాళీ చేయించేందుకు అధికారులు అత్యుత్సాహం చూపడమేమిటని ప్రశ్నించారు.
పేదల పొట్టకొట్టి వారి ఉసురు తీయడం భావ్యం కాదని ఆయన పేర్కొన్నారు. ఇళ్లు ఖాళీ చేయిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం నాయకుడు ఎం.రవి మాట్లాడుతూ 30 ఏళ్లుగా ఉంటున్న పేదల ఇళ్లు తొలగిస్తామనడం సరైన పద్ధతి కాదన్నారు. నోటీసుల జారీని నిరసిస్తూ ఈనెల 30వ తేదీన పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మా నివాసాలు తొలగించొద్దు
Published Fri, Apr 29 2016 5:32 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement