పలమనేరు : చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే పనులు స్పీడందుకున్నాయి. చెన్నై సమీపంలోని శ్రీపెరంబూదూర్ నుంచి బెంగళూరు సరిహద్దు లోని హొసకోట వరకు 283.5 కిలోమీటర్ల మేరకు 6 ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఎన్‌హెచ్‌ఏఐ(నేషనల్ హై వే అథారిటీ ఆఫ్ ఇండియా) భారత్‌మాల పరియోజన పథకం కింద రూ.16,730 కోట్లతో 2021 నుంచి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మూడు ఫేజుల్లో పనులు సాగుతున్నాయి.
తొలిఫేజ్‌లో కర్ణాటక పరిధిలోని 71 కిలోమీటర్లలో ఇప్పటికే 37.56 శా తం పనులు పూర్తయ్యాయి. రెండు, మూడు ఫేజ్ లలో మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాతో పాటు తమిళనాడు రాష్ట్రంలో 112 కిలోమీటర్లలో పదిశాతం మట్టిరోడ్డు పనులు, అలైన్‌మెంట్ ల్యాండ్ లెవలింగ్ సాగుతోంది. పనులు త్వరితగతిన జరిగేలా మూడు ఫేజ్‌లలో పది ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో కర్ణాటకలో మూడు, ఏపీలో మూడు, తమిళనాడులో నాలుగు ప్యాకేజీలు ఉన్నాయి. ఇందులో భాగంగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దు నుంచి పలమనేరు నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల మీదుగా 60 కిలోమీటర్ల మేర రోడ్డు పనులు సాగుతున్నాయి.
వీటిని బేతమంగళ నుంచి బైరెడ్డిపల్లె వరకు మోంటేకార్లె లిమిటెడ్ కంపెనీ, బైరెడ్డిపల్లె నుంచి బంగారుపాళెం వరకు ఆప్కో ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ, బంగారుపాళెం నుంచి గుడిపాల దాకా దిలీప్‌బిల్డ్‌కాన్ కంపెనీ పనులు చేపడుతున్నా యి. పలమనేరు మండలంలోని బేలుపల్లి క్రాస్, పట్టణ సమీపంలోని గంటావూరు వద్ద పనుల సామగ్రి కోసం యంత్రాలను నిర్మాణ కంపెనీ ఏర్పాటు చేసుకుంది.
పలమనేరు నియోజకవర్గంలో చెన్నై– బెంగళూరు 6 ట్రాక్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలైన్‌మెంట్ మేరకు మట్టి రోడ్డు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. హైవే మూడు ఫేజ్‌లలో నిర్మాణం సాగుతుండగా.. ఇప్పటికే కర్ణాటకలో 37శాతం పనులు పూర్తయ్యాయి. రెండో ఫేజ్‌లో పలమనేరు నియోజకవర్గంలోనూ పదిశాతం పనులు జరిగాయి. ఈనెల 10న కర్ణాటక రాష్ట్రంలోని హొసకోట సమీపంలో వడగనహళ్లి వద్ద పనులను పరిశీలించిన కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌గడ్కరి 2024 మార్చికల్లా పూర్తిచేసి ప్రారంభించనున్నట్టు వెల్లడించిన విషయం తెలిసిందే.
దక్షిణాదిలోనే తొలి ఎక్స్‌ప్రెస్ హైవే
దక్షిణ భారతదేశంలోనే చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌హైవే మొట్టమొటది కానుంది. దీనికి ఎన్‌హెచ్‌ఏఐ ఎన్‌ఈ 7గా నామకరణం చేశారు. ముఖ్యంగా మూడు రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధి పెంపొందించడమే ఈ రహదారి నిర్మాణ ఉద్దేశం. బెంగళూరు నుంచి చెన్నై పోర్టుకు రవాణా సౌకర్యాలు పెరిగేందుకు ఈ రోడ్డు ఉపకరిస్తుంది. బెంగళూరు నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించేవారు సైతం తక్కువ. ఈ హైవే పూర్తయితే దాదాపు అంతే సమయానికి విమాన చార్జీలకంటే తక్కువ ధరతో రోడ్డు మార్గంలోనే ప్రయాణించే సౌకర్యం కలుగుతుంది.
ఎక్స్‌ప్రెస్‌హైవే వివరాలిలా...
- చెన్నై నుంచి బెంగళూరు వరకు రోడ్డు దూరం 283.5 కిలోమీటర్లు
- ఇది కర్ణాటకలో 77 కి.మీ, ఏపీలో 91 కి.మీ, తమిళనాడులో 93 కిలోమీటర్లు
- ఇప్పటి వరకు బెంగళూరు–చెన్నై ప్రయాణ సమయం 6 గంటలు
- ఎక్స్‌ప్రెస్ హైవే పూర్తయితే 2 గంటల 15 నిమిషాలు మాత్రమే
- ఈ రహదారిలో సాధారణ వేగం గంటకు 120 కిమీ
- ఎక్స్‌ప్రెస్‌హైవేలో మొత్తం బ్రిడ్జిలు –162
- రైల్వే క్రాసింగ్‌లు–4, కల్వర్టులు–143
- మొత్తం ఫ్లైఓవర్‌లు– 17 ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment