బెజవాడలో ఎక్స్‌ప్రెస్ హైవే
విజయవాడ : కోల్‌కతా- చెన్నై ఎన్‌హెచ్-16పై నగరంలో కొత్తగా ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే రానుంది. బందరురోడ్డు విస్తరణలో భాగంగా బెంజిసర్కిల్ వద్ద స్క్రూబిడ్జి నుంచి రామవరప్పాడు వరకు నిర్మించతలపెట్టిన ఫ్లైవోవర్‌ను ఆపేసి, ఆ స్థానంలో ఎలివేటెడ్ హైవే ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్‌లో మెహదీపట్నం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 2009లో నిర్మించిన పి.వి.నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవే తరహాలో ఇక్కడ కూడా నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై ఆయన అధికారులతో చర్చించినట్లు తెలిసింది. 3.5 కి.మీ. పొడవున ఎలివేటెడ్ హైవే (ఫ్లైవోవర్) నిర్మించడంలో గల సాధ్యాసాధ్యాలను నేషనల్ హైవే అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలన్నీ ఈ ఫ్లైవోవర్ మీదుగా వెళతాయి. నగరంలో ట్రాఫిక్ అంతా యథావిధిగా ఈ ఫ్లైవోవర్ కింద నడుస్తుంది. దీన్ని నిర్మిస్తే నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని నేషనల్ హైవే అథారిటీ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. హైదరాబాద్‌లో 11.6 కి.మీ. మేర నిర్మించిన ఎక్స్‌ప్రెస్ హైవే వివరాలను అధికారులు సేకరించి సీఎంకు వివరించినట్లు చెబుతున్నారు.
విజయవాడలో నిర్మించతలపెట్టిన ఎక్స్‌ప్రెస్ హైవే హైదరాబాద్ కంటే సగానికి సగం తక్కువ దూరంతో పూర్తయ్యేలా అధికారులు ప్రతిపాదించారు. దీనిపై సర్వే చేయడానికి నైపుణ్యంగల సంస్థను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సంస్థ త్వరలో సర్వేచేసి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు ఆ ఫ్లైవోవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిసింది.
ట్రాఫిక్ కష్టాలకు చెక్
ఎక్స్‌ప్రెస్ ఫ్లైవోవర్ వల్ల బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని నేషనల్ హైవే అధికారులు భావిస్తున్నారు. కోల్‌కతా-చెన్నై మధ్య నిత్యం వేలాదిగా రాకపోకలు సాగించే వాహనాలు, భారీ ట్రాలీలతో బెంజసర్కిల్ వద్ద తరచు ట్రాఫిక్ స్తంభిస్తోంది. క్షణ క్షణం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు నానా అగచాట్లు పడుతుంటారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నిత్యం గన్నవరం విమానాశ్రయం నుంచి నగరానికి వచ్చే వీఐపీల తాకిడి పెరిగింది. వారి కాన్వాయ్ వచ్చినప్పుడు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను మళ్లించడం లేదా నిలుపుదల చేయాల్సిరావడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.