హైదరాబాద్‌ - అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే | Express highway to connect Amaravati with Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ - అమరావతి మధ్య ఎక్స్‌ప్రెస్‌ వే

Published Thu, Feb 23 2017 2:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Express highway to connect Amaravati with Hyderabad

- రూ.7,500 కోట్లతో ఆరు వరుసలుగా నిర్మాణం
- ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో నిర్మాణం
- కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం


సాక్షి, హైదరాబాద్‌:
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌– ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్‌వే రూపుదిద్దుకోనుంది. ఇప్పటికే రెండు నగరాల మధ్య రైలుమార్గం అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన నేపథ్యంలో, ఇప్పుడు రహదారి విషయంలో కూడా కదలిక వస్తోంది.

వాస్తవానికి ఇప్పటికే ఈ పనులు మొదలు కావాల్సి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వమే ఈ హామీ ఇచ్చింది. దాన్ని విభజన చట్టంలోనూ పొందుపరిచింది. కానీ రాష్ట్రం విడిపోయి మూడేళ్లు గడుస్తున్నా ఇందులో కదలిక లేకపోవటంతో దాన్ని ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి ప్రారంభించింది. రహదారుల విషయంలో వెనుకబాటుకు గురైన తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రహదారులు కోరుతూ ప్రతిపాదనలు సమర్పించినప్పుడల్లా కేంద్రం సానుకూలంగా స్పందించింది.  ఈ నేపథ్యంలో వెంటనే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం చేపట్టాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా  లేఖ రాయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర  రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ దృష్టికి కూడా తెచ్చారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా ఈ రోడ్డు నిర్మాణం కోసం ఆసక్తి చూపుతున్నందున రెండు ప్రభుత్వాల నుంచి ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనల కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం తమ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంపై చర్చ సాగింది. ‘ముఖ్యమంత్రితో చర్చించి ఈ రోడ్డు నిర్మాణంపై కేంద్రానికి లేఖ పంపబోతున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోణంలో కూడా ఈ రోడ్డుకు ప్రాధాన్యం ఉంది. ఇది పెట్టుబడులను ఆకట్టుకునేందుకు దోహదం చేస్తుంది. వీలైనంత తొందరలోనే దీన్ని ప్రారంభించాలని కేంద్రంపై ఒత్తిడి తేనున్నాం.’అని సమావేశానంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సాక్షితో చెప్పారు.

250 కిలోమీటర్లు.. రూ.7,500 కోట్లు
హైదరాబాద్‌ నుంచి నేరుగా అమరావతికి గ్రీన్‌ ఫీల్డ్‌ రోడ్డు నిర్మాణం అవుతుంది. దాదాపు 250 కిలోమీటర్ల మేర సాగే ఈ ఆరు వరుసల రహదారి నిర్మాణానికి దాదాపు రూ.7,500 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా, దీన్ని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపితే వచ్చే నెలలోనే దీనిపై సర్వే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌– మాల్‌– మల్లెపల్లి– నాగార్జునసాగర్‌– మాచర్ల– పిడుగురాళ్ల మీదుగా అమరావతికి దీనిని నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు...
రాష్ట్ర విభజనకు పూర్వం ఏపీ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఉన్నట్టుగానే ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేకంగా రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ నుంచే కేటాయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా రుణం తీసుకోవాలని నిర్ణయించారు. కాగా కొత్త జిల్లా కేంద్రాల నుంచి అన్ని మండల కేంద్రాలకు రెండు వరుసల రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి రూ.970 కోట్లు, నాబార్డ్, గ్రామీణ రహదారుల నిధికి రూ.575 కోట్లు, కలెక్టరేట్లు సహా ఇతర భవనాల నిర్మాణం కోసం రూ.1116 కోట్లు, రహదారుల నిర్వహణ వ్యవస్థ, కోర్‌ రోడ్డు నెట్‌వర్క్‌ కోసం రూ.260 కోట్లు, భవనాల నిర్వహణకు రూ.40 కోట్లు ప్రతిపాదించారు. వచ్చే సంవత్సరంలో 4 వేల కి.మీ. నిడివితో కొత్త రోడ్లను నిర్మించాలని, 40 వంతెనలు సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement