హైదరాబాద్‌ను మించి కొత్త రాజధాని
- ఆదాయమూ పెంచుతాం
- శ్రీకాకుళం సభలో సీఎం చంద్రబాబు వెల్లడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/నరసన్నపేట/ఎచ్చెర్ల: హైదరాబాద్‌ను తలదన్నే రీతిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించి తీరుతామని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. నూతన రాజధాని హైదరాబాద్ కన్నా వంద రెట్లు మెరుగ్గా ఇది ఉంటుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. శనివారం మధ్యాహ్నం నరసన్నపేట డిగ్రీ కళాశాల ఆవరణలో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ శ్రీకాకుళం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రయోగాత్మక చదువు కోసం ఇకపై అన్ని కళాశాలలకు వైఫైతో కూడిన కంప్యూటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్తులో కోస్తా కారిడార్‌ను ఇచ్ఛాపురం వరకు పొడిగిస్తామని, భావనపాడు, కళింగపట్నం ప్రాంతాల్లో పోర్టులు, విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు. రెండో దశ రుణమాఫీ కింద ఇప్పటికే 31 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారని, వారికి 97.5 శాతం మాఫీ చేయిస్తామన్నారు.
త్వరలో యానిమల్ హాస్టళ్లు
పశుపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ఇకపై ‘యానిమల్ హాస్టళ్లు’ప్రారంభిస్తామని, యంత్రాలతో పాలు పితికించడం, కావాల్సిన గడ్డిని అక్కడే పండించడం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభం వచ్చేలా చేస్తామని చంద్రబాబు చెప్పారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ‘100 రోజుల్లో లక్ష మరుగుదొడ్ల నిర్మా ణం’ చేపడుతున్నట్టు వెల్లడించారు.
మన ఆదాయమే ఎక్కువ
పర్యటనలో భాగంగా చిలక పాలెం జంక్షన్‌లోని శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఇంట్రాక్షన్ విత్ యూత్ ఆన్ స్కిల్ డెవలెప్‌మెంట్ అండ్ ఎంట్రపెన్యూర్, క్లాస్ రూం టూ కామన్‌మెన్’ అనే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 7 నెలల పరిపాలనలో 59 శాతం జనాభా ఉన్న ఏపీలో 48 శాతం ఆదాయం లభిస్తే, 41.45శాతం జనాభా ఉన్న తెలంగాణకు కేవలం 52 శాతం ఆదాయమే వచ్చిందన్నారు. కార్యక్రమంలోఎంపీ కె. రామ్మోహన్‌నాయుడు మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, కిమిడి మృణాళిని, విప్ కె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఢిల్లీకి చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. తిరిగి అదే రోజు రాత్రికే హైదరాబాద్ చే రుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకునే సీఎం సాయంత్రం 6.45 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య తాజాగా నెలకొన్న కృష్ణా జలాల వివాదం తదితరాల గురించి చర్చిస్తారు. ఇటీవల రాష్ట్రానికి నిధులు కేటాయించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలపనున్నారు. అదేవిధంగా సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు వివాహ రిసెప్షన్‌లోనూ సీఎం పాల్గొంటారు. ఆ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ కుమార్తె వివాహ విందుకూ హాజరుకానున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు ప్రధాని కూడా హాజరవుతారు. ఢిల్లీ చేరిన వెంటనే రెన్యూవబుల్ ఎనర్జీపై విజ్ఞాన్ భవన్‌లో జరిగే సదస్సులో చంద్రబాబు పాల్గొంటారు.