జూన్ నెల... ఫలిస్తుందా కల | 1,200 vacant apartments in Guntur | Sakshi
Sakshi News home page

జూన్ నెల... ఫలిస్తుందా కల

Published Sun, Feb 14 2016 2:13 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

జూన్ నెల...  ఫలిస్తుందా కల - Sakshi

జూన్ నెల... ఫలిస్తుందా కల

విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఖాళీగా 1200  అపార్టుమెంట్లు  
రాజధాని నిర్మాణ ప్రక్రియలో జాప్యంతో ఆందోళనలో బిల్డర్లు
ఉద్యోగుల తరలిరాక కోసం ఎదురుచూపులు


సాక్షి ప్రతినిధి, గుంటూరు :  జూన్‌పైనే అమరావతిలోని బిల్డర్లు ఆశలు పెట్టుకున్నారు. జూన్ నాటికి ప్రభుత్వ ఉద్యోగులంతా హైదరాబాద్ నుంచి అమరావతికి తరలిరావాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో బిల్డర్లు భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అపార్టుమెంట్ల నిర్మాణాలను వేగవంతం చేశారు. సాధారణంగా ఒక అపార్టుమెంట్ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి బిల్డర్లు కనీసం 18 నెలల సమయం తీసుకుంటారు. పూర్తి ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉండే సంస్థలైతే 15 నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తాయి. కొందరు బిల్డర్లు 12 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కార్మికులను అధిక సంఖ్యలో నియమించుకుని.. అధిక వేతనాలిచ్చి పనులు చేయిస్తున్నారు. 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు తరలివస్తారని ముఖ్యమంత్రి చెబుతున్నప్పటికీ కనీసం అందులో సగమైనా వస్తే నిర్మిస్తున్న అపార్టుమెంట్లను మంచి ధరకు అమ్ముకోవచ్చని ఆశగా ఉన్నారు. చదరపు అడుగు ధర రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు నిర్ణయించి ప్లాట్లు విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.


 ఆందోళనలో బిల్డర్లు..
రాజధాని ప్రకటన నాటి నుంచి నిర్మాణాలు ప్రారంభించిన కొందరు బిల్డర్ల అపార్టుమెంట్లు పూర్తి కావచ్చాయి. నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లు, పూర్తికావచ్చిన అపార్టుమెంట్లను హైదరాబాద్ నుంచి తరలిరానున్న ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేస్తారనే ఆశతో బిల్డర్లు ఉన్నారు. అయితే తాత్కాలిక రాజధాని నిర్మాణం ఇంకా టెండర్ల దశ దాటకపోవడం, రాజధానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. జూన్ నాటికి సీఎం పేర్కొన్న విధంగా ఉద్యోగులు తరలిరాకపోతే తమ పరిస్థితి తల్లకిందులవుతుందనే భయంతో ఉన్నారు. సీఎం మాటలు నమ్మి నివేశన స్థలాలు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు ధరలు పెరగక తీవ్రంగా నష్టపోయారు. తమ పరిస్థితి అలా అవుతుందనే భయం కూడా కొందరికి లేకపోలేదు.


ఖాళీగా అపార్టుమెంట్లు..
ఇప్పటికే దాదాపు 1200 అపార్టుమెంట్లు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయి కొనుగోలుదారులు, అద్దెదారులు ముందుకు రాకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. ఈ పరిణామానికి బిల్డర్లు, వాటి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. కొందరు బిల్డర్లు భవిష్యత్ ఎలా ఉంటుందో అర్థంకాక సామాన్య లాభాలతో బయటపడేందుకు తక్కువ రేటుకు ప్లాట్లు విక్రయిస్తున్నారు. నగరాలకు కొద్ది దూరంలోని అపార్టుమెంట్లకు చదరపు అడుగు ధర రూ.3 వేలు చెబుతున్నప్పటికీ, స్పాట్ రిజిస్ట్రేషన్‌కు ఎవరైనా ముందుకు వస్తే రెండు మూడు వందలు తగ్గించి, గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు పూర్తి చేస్తున్నారు. అయితే ఎవరికి వారు వ్యాపారం మంచిగానే ఉందని చెబుతున్నప్పటికీ, వాస్తవాలు ఆ స్థాయిలో లేవని బిల్డర్లే  అంగీకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement