చిత్తూరు(టౌన్): రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో జిల్లాలో మం జూరైన రూ. 300 కోట్ల పనులకు బ్రేక్ వేసింది. ముఖ్యంగా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో చేపట్టిన రూ.200 కోట్ల పనులతో పాటు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పీలేరులో ఆయన మంజూరు చేసిన పనుల్లో రూ. 100 కోట్ల పనులను నిలుపుదల చేయాలంటూ జిల్లా అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు మంజూరైన పనుల్లో ఇప్పటివరకు అగ్రిమెంట్ కాని పనులను పూర్తిగా నిలిపేయూలని, అగ్రిమెంట్ అయివున్నా చేపట్టని పనులను గుర్తించి నాట్ స్టార్టెడ్ పేరుతో వెంటనే ఆపేయూలని పంచాయతీరాజ్ ప్రిన్సిపుల్ సెక్రెటరీ జవహర్‌రెడ్డి సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు.
పంచాయతీరాజ్‌లోనే రూ.100 కోట్లకు పైగా ఆగిన పనులు
పంచాయతీరాజ్ పరిధిలోనే సుమా రు వంద కోట్లకు పైగా పనులు నిలిచిపోయాయి. పంచాయతీరాజ్‌లో ప్రాజెక్టులు (పీఆర్‌యూ), లోకల్ బాడీస్ (పీఆర్‌ఐ) అని రెండు విభాగాలున్నాయి. పీఆర్‌యూలో వివిధ పథకాల కింద సుమారు 120కోట్లకు పైగా పనులు మంజూరయ్యాయి. పీఆర్‌ఐలో వంద కోట్ల రూపాయలకు పైగా పనులు గత ఏడాది మంజూరయ్యాయి. వీటిలో కొన్ని ఇంతవరకు అగ్రిమెంట్ దశకు చేరుకోలేదు. మరికొన్ని అగ్రిమెంట్ దశ పూర్తయ్యాయి. అయితే పీఆర్‌యూలో రూ. 50 నుంచి రూ.55 కోట్ల వరకు పనులు నిలిచిపోగా పీఆర్‌ఐలో రూ. 45 నుంచి రూ. 50 కోట్ల వరకు మంజూరైన పనులు ఆగిపోయాయి.
ఆర్‌అండ్‌బీకి అనఫిషియల్ హాలిడే
జిల్లాలోని ఆర్‌అండ్‌బీ రోడ్లకు మెయింటెనెన్స్ కింద కోట్లాది రూపాయల పనులు మంజూరు చేశారు. అంతేకాకుండా రూ.150 కోట్లతో కొత్తగా కొన్ని తారురోడ్లను మంజూరు చేశారు. వీటిలో కొన్ని అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. మరికొన్ని అగ్రిమెంట్ దశ పూర్తైపనులు చేపట్టడంలో ఆలస్యం జరుగుతోంది. ఏ పనులు చేయొద్దనడంతో ఈ శాఖకు ప్రభుత్వం అనధికారికంగా హాలిడేను ప్రకటించినట్టయింది.
పీలేరులో రూ.100 కోట్ల పనులు
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహించిన పీలేరుపై ప్రతేక శ్రద్ధ కనబరిచి ఎస్‌డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కింద ఆరేడు నెలల క్రితం వంద కోట్ల రూపాయలకు పైగా నిధులతో వివిధ భవనాలు, కల్వర్టులు, రోడ్డు పనులను మంజూరు చేశారు. అయితే దీనిపై ఈ నెల 16న కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేస్తూ జిల్లాలో ఎస్‌డీఎఫ్ కింద చేపట్టిన పనులను నిలుపుదల చేయాలంటూ కోరారు. పీలేరులో తప్ప మరెక్కడా ఈ నిధులతో పనులు మంజూరు కాలేదు.
జిల్లాలో రూ.300 కోట్ల పనులకు బ్రేక్
Published Tue, Jul 22 2014 3:40 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement