=భీమారం నుంచి అన్నాసాగర్ వరకు..
=కేయూ నుంచి పెద్దమ్మగడ్డ వరకు..
=కడిపికొండ వద్ద 10 మీటర్ల రోడ్డు
=రూ.57 కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలు
వరంగల్, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న ప్రధాన రోడ్లను విస్తరించనున్నారు. ఇప్పటి వరకున్న ఇరుకు రోడ్లను నాలుగు లేన్ల రోడ్లుగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూ.57 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను ఆర్‌అండ్‌బీ ప్రత్యేక కార్యదర్శి ఆమోదించి.. సీఎం పేషీకి పంపించారు. దీంతో త్వరలోనే వీటికి అనుమతి లభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిధులకు ఒకే చెప్పిన నాలుగైదు నెలల్లోనే ఇప్పుడున్న రోడ్లు నాలుగు లేన్ల రోడ్లుగా రూపాంతరం చెందనున్నాయి. దీంతో రహదారులపై ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా ప్రమాదాలు తగ్గనున్నాయి. నగరంలోకి భారీ వాహనాలు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు కాకతీయ యూనివర్సిటీ క్రాసింగ్ నుంచి ములుగురోడ్డు(పెద్దమ్మగడ్డ) వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేయనున్నారు. దీనికి కూడా త్వరలోనే అనుమతి రానుంది.
ఎక్కడెక్కడంటే..
హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే రహదారిని మడికొండ నుంచి కాజిపేట వరకు 13 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. మొత్తం 13 కిలోమీటర్ల ఈ రోడ్డు ప్రస్తుతం 7 మీటర్ల వెడల్పు ఉంది. దీనిని 10 మీటర్లకు పెంచనున్నారు. అరుుతే ఇందుకు భూ సేకరణ మళ్లీ చేయాల్సిన అవసరం లేదని, ఇప్పటి వరకు 5 మీటర్ల వరకు అదనంగా ఉందని, దీనిలో 3 మీటర్లు తీసుకుని 10 మీటర్ల రోడ్డుగా నిర్మాణం చేయనున్నట్లు ప్రతిపాదనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. మొత్తం 13 కిలోమీటర్ల ఈ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లను వెచ్చించనున్నారు.
జిల్లా దాటి కరీంనగర్ జిల్లాలోకి అడుగు పెట్టే ప్రధాన రహదారిని సైతం విస్తరించనున్నారు. భీమారంలోని 115వ మైలురాయి నుంచి 124వ మైలురాయి వరకు ఈ రోడ్డును ఫోర్‌లేన్‌గా మార్చనున్నారు. ప్రధాన నగరాలకు అవసరమయ్యే ఈ రోడ్డు విస్తరణ అత్యంత ప్రాముఖ్యమని నివేదికల్లో పేర్కొన్నారు. మొత్తం 9 కిలోమీటర్ల దూరం ఈ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా మార్చేందుకు రూ.21 కోట్లు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు సర్వేలో గుర్తించారు. విస్తరిస్తే ప్రమాదాలను తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వానికి వివరించారు.
ఇక ములుగు, ఏటూరునాగారంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ఔట్ సిటీ రోడ్డును ఆర్‌అండ్‌బీ ఆధ్వర్యంలో విస్తరించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ నుంచి ములుగు రోడ్డుకు కలుపుతూ ఉన్న రోడ్డును ఫోర్‌లేన్‌గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించారు. మొత్తం 5 కిలోమీటర్ల ఈ రోడ్డును రూ.16 కోట్లతో నిర్మించనున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనల్లో స్పష్టం చేశారు.
నిధులు త్వరలోనే వస్తాయి : మోహన్ నాయక్, ఎస్‌ఈ ఆర్‌అండ్‌బీ వరంగల్ ఈ రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు రెండు నెలల కిందటే పంపించాం. రూ.57 కోట్లతో ఈ రోడ్లను విస్తరించడం అనివార్యం. త్వరలోనే వీటికి సంబంధించిన నిధులు విడుదల కానున్నట్టు సమాచారం వచ్చింది.