స.హ.చట్టం అమలు తప్పనిసరి | Mandatory implementation of sahacattam | Sakshi
Sakshi News home page

స.హ.చట్టం అమలు తప్పనిసరి

Published Sun, Oct 19 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:03 PM

Mandatory implementation of sahacattam

నూజివీడు : సమాచార హక్కుచట్టం అమలులో అధికారులు గిమ్మిక్కులు చేస్తూ  చట్టాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర  సమాచార కమిషనర్లు లాం తాంతియాకుమారి,  ముత్తంశెట్టి విజయనిర్మల హెచ్చరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అమలవుతున్న సమాచార హక్కు చట్టం పనితీరును పర్యవేక్షించేందుకు శనివారం వారు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. నూజివీడులోని ఆర్‌అండ్‌బీ అతిధి గృహంలో  లాం తాంతియాకుమారి మాట్లాడుతూ సమాచార హక్కుచట్టంపై ప్రజలలో గతంలో కంటే  చైతన్యం పెరిగిందన్నారు.

అవినీతిని అరికట్టడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని, ఈ చట్టం పట్ల ప్రతి పౌరుడు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.  రాష్ట్రంలోని విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ చట్టం అమలు బాగా జరుగుతోందన్నారు. జన్మభూమి గ్రామసభల్లో సైతం ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కలిగించాలని చెప్పారు.  దేవాదాయశాఖ, సహకారశాఖలు సైతం సమాచారహక్కుచట్టం పరిధిలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా ప్రజలే ప్రభువులనే విషయాన్ని గమనించాలన్నారు. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోందని, అటువంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.   లాం తాంతీయాకుమారిని ఇన్‌ఛార్జి ఆర్డీవో ఎన్.రమేష్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
 
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి విజయనిర్మల
 
జూపూడి(ఇబ్రహీంపట్నం రూరల్) : ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులు ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని రాష్ట్ర సమాచార హక్కుచట్టం (ఆర్టీఐ) కమిషనర్ ముత్తంశెట్టి విజయనిర్మల సూచిం చారు.  జూపూడి నోవా ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టీఐ చట్టంపై జరిగిన అవగాహనా సదస్సులో ఆమె పాల్గొన్నారు.  ఆమె మాట్లాడుతూ  ప్రభుత్వ శాఖల్లోని అవినీతిని బట్టబయలు చేయడంలో ఆర్టీఐ(2005)చట్టం సామాన్యుల చేతిలో వజ్రాయుధమన్నారు.  గ్రామపంచాయతీ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ప్రజాధనంతో చేపట్టే పనుల వివరాలను కేవలం రూ.10ఫీజుతో అర్జీపెట్టి తెలుసుకోవచ్చని తెలిపారు.

తెల్లరేషన్ కార్డుదారులకు రుసుము అవసరం లేదని తెలిపా రు. అర్జీ ఇచ్చిన 30రోజుల తర్వాత సమాధానం ఇవ్వకపోతే అప్పిలేట్ అధికారిని సంప్రదించాలని, అప్పటికీ సమస్య పరిష్కా రం కాకపోతే రోజుకు రూ.250 చొప్పున రూ.25వేల వరకు సంబంధిత అధికారులకు  జరిమానా విధించవచ్చన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు పేదవర్గాలకు 5శాతం మెడికల్ రాయితీ కల్పించాలని, ప్రస్తుతం ఎన్ని ఆస్పత్రులు ఆ విధానాన్ని పాటిస్తున్నాయో ఆర్టీఐ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పారు.  విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు.   కళాశాల డెరైక్టర్ జె.శ్రీనివాసరావు, ఆర్‌ఐ బేబీసరోజిని ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, వీఆర్వో లలితకుమారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement