చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది?
చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రధారులు
వైఎస్ వివేకా హత్య కేసులో రాజకీయ కోణం లేదు.. మరో సంబంధం ఉంది
సునీత, రాజశేఖర్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్టులు చేయాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి
కడప కార్పొరేషన్: ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు చంద్రబాబు భారీగా ఫైనాన్స్ చేశారని, సుమారు రూ. 60 కోట్లు ఇచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లాలో 10 మంది టీడీపీ అభ్యర్థులకు మొండిచేయి చూపి షర్మిలకు డబ్బులిచ్చి కడప పార్లమెంటుకు పోటీ చేయిస్తున్నారని చెప్పారు. డా. చైతన్యరెడ్డితో కలిసి బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే షర్మిలకు అంత డబ్బు ఎక్కడిదని ప్రశ్నించారు.
రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్న వైఎస్సార్‌సీపీపై బురద జల్లేందుకు వైఎస్ కుటుంబంలో షర్మిల, సునీతను చంద్రబాబు పావులుగా మార్చారని చెప్పారు. ఇందులో భాగంగానే షర్మిల పీసీసీ అద్యక్షురాలయ్యారని తెలిపారు. అరుంధతి సినిమాలోలాగా వారిని పశుపతి ఆవహించారని ఎద్దేవా చేశారు. కుటుంబాలను విడదీయడంలో చంద్రబాబు దిట్ట అని, తల్లీబిడ్డలకు కూడా తగవు పెట్టే సమర్థుడని చెప్పారు.
సునీత లక్ష్యం వైఎస్ వివేకా హత్య కేసులో నిజమైన నేరస్తులను వెలికితీయడమా లేక తప్పు చేయని వారిని శిక్షించడమా అని ప్రశ్నించారు. ఆమె సైకో ఆలోచనకు ఇది నిదర్శనమన్నారు. ఒక పథకం ప్రకారం కథ అల్లుతూ వారు అనుకున్న వ్యక్తులను నిందితులుగా చేరుస్తూ కేసును పూర్తిగా పక్కదారి పట్టించారన్నారు. సిట్ దర్యాప్తును సీబీఐ పరిగణనలోకి తీసుకొని ఉంటే అసలు నేరస్తులు దొరికేవారని చెప్పారు.
బాబు ఇచ్చిన తప్పుడు సమాచారంతో, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, అవినాశ్‌రెడ్డిపై ఉన్న కోపంతో షర్మిల, సునీత ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. కేసు ట్రయల్‌కు వచ్చాక నిజాలు బయటికి వస్తాయని, ఆ లోపే ఒకరిని లక్ష్యం చేసుకొని దుష్ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.
వేరే సంబంధాలతోనే వివేకా హత్య
వేరే సంబంధాలతోనే వివేకా హత్య జరిగిందని, రాజకీయ కోణం లేదని తెలిపారు. హత్యకు ఒక రోజు ముందు ఇంట్లో పని చేసే పందింటి రాజశేఖర్‌ను సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి కాణిపాకం పంపించారని, చెవులు వినపడని వాచ్‌మేన్ రంగయ్య ఇంటి బయట ఉన్నారని చెప్పారు. అదే సమయంలో దుండగులు వివేకా ఇంటి తలుపులు పగులగొట్టి ఇంట్లోకి చొరబడినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. సీబీఐని ఎవరో మేనేజ్ చేశారని, అందువల్లే వీటిని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.
వైఎస్ వివేకాతో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరికి సాన్నిహిత్యం ఉందని, తరచూ కలిసి భోజనం చేస్తారని సీబీఐకి సాక్షులు చెప్పారని గుర్తుచేశారు. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా చేసేందుకు వివేకా కష్టపడ్డారని తొలుత చెప్పిన సునీత.. ఆ తర్వాత మాటమార్చిందన్నారు. హార్ట్ ఎటాక్ డ్రామా ఆడింది కూడా సునీతేనని చెప్పారు. కేసును పక్కదారి పట్టించేందుకే వివేకా రాసిన లేఖను దాచిపెట్టారని ఆరోపించారు.
సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెబితేనే లేఖను దాచిపెట్టినట్లు పీఏ కృష్ణారెడ్డి చెప్పారన్నారు. వారికి నార్కో అనాలసిస్ టెస్టులు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. రక్తపు మరకలను ఎవరూ తుడవలేదని, బెడ్ వద్ద మాత్రమే తుడిచారని, ఆ వస్త్రం కూడా అక్కడే ఉందని అన్నారు. కడప ఎంపీగా పోటీ చేయాలని వైఎస్ వివేకా బలవంతపెట్టారని షర్మిల చెప్పడంలో అర్థం లేదన్నారు. 2014లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని నిర్ణయించారని, 2019లోనూ ఆయన్నే కొనసాగించారని చెప్పారు.
పబ్లిక్ ఫోరం, మీడియాలో ట్రయల్స్ ఆపండి : డా. చైతన్యరెడ్డి
వివేకా హత్య కేసులో పబ్లిక్ ఫోరం, మీడియా ట్రయల్స్ ఆపాలని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు డా. చైతన్యరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్ భాస్కర్‌రెడ్డికి హార్ట్ చెకప్ చేసి, సర్జరీ చేయాలని, బెయిలివ్వాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే, సీబీఐ వ్యతిరేకించకపోయినా సునీత మాత్రం వ్యతిరేకించిందన్నారు.
ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్‌ల బెయిల్‌ను వ్యతిరేకించకుండా, తన తండ్రి శంకర్‌రెడ్డి బెయిల్‌ను మాత్రం వ్యతిరేకించారన్నారు. ఇది కక్ష సాధింపు కాక మరేమిటని ప్రశ్నించారు. గూగుల్ టేకౌట్‌కు ఎలాంటి శాస్త్రీయత లేదని, ఖచ్చితత్వం అంతకంటే లేదన్నారు. సీబీఐ పేర్కొన్నది వాట్సాప్ చాట్స్ అని, వాట్సాప్ కాల్స్ కానేకాదన్నారు. అందులో ఔట్‌గోయింగ్ చాట్స్ అసలే లేవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment