సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ జగన్‌పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఉదయం పొద్దుటూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ తన చెల్లిపై ప్రేమతో ఆస్తిలో షర్మిలకు వాటా ఇచ్చారన్నారు. చంద్రబాబుతో కలిసి కుట్రలు చేయడం సమంజసమేనా? అంటూ ప్రశ్నించారు.
‘‘షర్మిల చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే. షర్మిలకు ఎలాంటి హక్కు లేకపోయినా ఆస్తిలో వాటా ఇచ్చారు. న్యాయపరమైన చిక్కులు వస్తాయనే బదాలాయింపు నిలిపేస్తామన్నారు. అహంకారం, అత్యాశ కలిస్తే షర్మిల. వైఎస్ జగన్‌ను పతనం చేయాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు.’’ అని రాచమల్లు దుయ్యబట్టారు.
‘‘ఇంటింటికీ ఒక రామాయణం ఉండనే ఉంటుంది. మా ఇంటి రామాయణం షర్మిల పుణ్యమాని బజార్లోకి వచ్చింది. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను షర్మిల బజారుకీడ్చిన తర్వాత వాస్తవాలేంటో చెప్పాల్సిన బాధ్యత మాకుంది. చంద్రబాబును ఆసరాగా చేసుకుని ఆమె చేస్తున్నది సవివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. షర్మిలమ్మ ప్రేమలు, అప్యాయతల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. నిజంగా అలా ప్రేమలకు ప్రాధాన్యం ఇచ్చి ఉంటే అన్నను జజారు కీడుస్తుందా? జైలుకు పంపే ప్రయత్నం చేస్తుందా?. చంద్రబాబుతో చేతులు కలిపి కుట్రకు తెరలేపుతుందా?
జగన్ ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లాడనడం పచ్చి అబద్ధం. ఎవరి ఆస్తులు ఎవరికిస్తున్నారో తెలియజెప్పాల్సిన అవసరం మాకుంది. షర్మిలకు పెళ్లై 30 ఏళ్లు కావొస్తుంది.. నీ తండ్రి మరణించిన 14 ఏళ్ల తర్వాత అమ్మగారి ఇంటి నుంచి ఏం ఆస్తి వస్తుంది?. వైఎస్సార్ బతికుండగానే ఇద్దరికీ సమానంగా ఆస్తులను పంచారు. వైఎస్సార్ ఆడపిల్లను వేరుగా చూడకుండా ఇద్దరికీ సమానంగా ఆస్తులు పంచారు. తన స్వార్జితం సంపాదించుకున్న ఆస్తిలో చెల్లెలుపై ప్రేమతో ఆయన వ్యాపారాల్లో రూ.200 కోట్లు వైఎస్ జగన్ ఇచ్చారు. డబ్బే కాదు.. ఆస్తులు కూడా ఇస్తానని పిలిచి ముందుకు వచ్చాడు. షర్మిలకు హక్కు లేకపోయినా.. రక్త సంబంధంతో ఎంవోయూ చేశారు.
జగన్ ఇవ్వడం గొప్పైతే.. దానికి ఒప్పుకోవడం జగన్ సతీమణి భారతి చాలా గొప్పతనం. ఏ ఆడబిడ్డకు ఇచ్చేదానికి ఏ భార్య ఒప్పుకోదు. ఆమెను ప్రశంసించాలి. ఆ ఎంవోయూలో ఈడీ చేతిలో ఆస్తులు అటాచ్ అయ్యాయి. వెంటనే బదలాయింపు చేయలేనని చెప్తూ అగ్రిమెంట్ చేశారు. ఆమెకు దానిలో హక్కు లేదు. తండ్రి గారి సొమ్ము కూడా కాదు. కేసులు పరిష్కారం అయిన తర్వాత నీకు బదలాయింపు జరుగుతుందని కూడా ఎంవోయూలో ఉంది. ఏదో నీ తండ్రి సంపాదించిన ఆస్తిలో హక్కు అడిగినట్లు షర్మిలమ్మ మాట్లాడుతోంది. జగన్ నీకిచ్చిన ఆస్తి కోసం ట్రిబ్యునల్‌కు వెళ్లలేదు.. ఆయన కోర్టుకు వెళ్లలేదు.. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కి వెళ్లారు.
నాకు తెలియకుండా మోసం చేసి, నా తల్లికి అబద్ధాలు చెప్పి బదలాయింపు చేసుకునేందుకు ప్రయత్నించారని, దాన్ని ఆపాలని జగన్ కోరారు. న్యాయపరమైన చిక్కులు ఏర్పడకుండా, ప్రమాదం జరగకుండా ఆయన తీసుకున్న జాగ్రత్త ఇది. నీది కాని ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపావు తల్లీ. ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లీ..?. చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, సునీతమ్మ, మీరు నలుగురు కలిసి కుట్ర చేసి జగన్‌ను చిక్కుల్లోకి పంపాలని కుట్ర చేశారు. మరోక రెండేళ్లు జగన్‌ను జైలుకు పంపాలని ప్రయత్నం చేస్తావా..?
చంద్రబాబు, రేవంత్ చేశారంటే ఒక అర్ధం ఉంది.. తోడబుట్టిన, రక్తం పంచుకుని పుట్టిన దానివి.. ఎందుకింత నీచానికి ఒడికడుతున్నావు. తల జగన్ గారిదైతే.. కత్తి షర్మిలమ్మది.. చేయి చంద్రబాబుది. ఇంత చేస్తూ అనుబంధాలు, ప్రేమలు, అప్యాయతలంటూ మాట్లాడతావా.. షర్మిల మాట్లాడే మాటలన్నీ పచ్చి అబద్దం. సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌లో భూములపైనే ఎటాచ్‌మెంట్ ఉంది. కంపెనీ అటాచ్ కాలేదు అంటూ అబద్దాలు మాట్లాడుతోంది.
2019లో సరస్వతి ఇండస్ట్రీస్‌లో పూర్తిగా వంద శాతం ఆమెకే ఇచ్చాడు. ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకోడానికి కోట్లు ఖర్చు అవుతుందని కాలయాపన చేసింది. 2019 డిసెంబర్‌లో ఆ ఆస్తి కూడా అటాచ్‌మెంట్‌లోకి పోయింది. ఆమె ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మాట్లాడుతుంది తప్ప...హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో గురించి మాట్లాడటం లేదు. హైకోర్టు తీర్పులో ఎటువంటి క్రయవిక్రయాలు చేయకూడదని స్పష్టంగా ఉంది. అహంకారం+అత్యాశ= షర్మిల. చంద్రబాబు, సోనియాతో కలిసి ఎప్పటికైనా ఏలాలనే పదవులపై అత్యాశ. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు తెలంగాణాలో పార్టీని మూసేసి ఇక్కడకు వచ్చి అన్నను బజారుకీడుస్తున్నావు.
మీ అన్నపై రాయితో దాడి చేస్తే ఆనాడు నువ్వేం మాట్లాడావు..?. జగన్ అంతమే నీ లక్ష్యంగా కనిపిస్తోంది. అప్పుడే నీకు సంతోషంగా ఉండేట్లుంది. జగన్ సంపాదించిన ఆస్తిని తన చెల్లెలుపై ప్రేమతో ఉచితంగా ఇస్తున్న ఆస్తి ఇది. అమ్మకు అబద్ధం చెప్పి.. ఆమెకు ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను లాగేసుకోవాలని ప్రయత్నం చేశారు. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు.. ఎంత అహంకారంగా మాట్లాడుతున్నావు...? విజయమ్మ గారిని కూడా ఒక మాట అడుగుతున్నా.. నా బిడ్డ జగన్‌ను రాష్ట్రానికి ఇస్తున్నాను.. నా బిడ్డ కాదు.. మీ బిడ్డ అన్నారు.. ఇప్పుడు జగన్ మా బిడ్డ, మా అన్న అయినప్పుడు ఆయనకు ప్రమాదం వస్తే మా అందరితో ముడిపడి ఉంది. ఆయన ప్రమాదం, ఆయన ప్రాణం, గౌరవం మా అందరి కోటిమంది కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంది. మా అందరి జీవితాలతో ముడిపడి ఉన్న పెద్దన్న లాంటి జగన్ గారిని మీరందరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు?. శతాబ్ది జోక్ కాదు.. వందేళ్లు వెనక్కి పోయినా నీలాంటి చెల్లెలు ఏ ఇంట్లోనూ ఉండదు.
ఆ అన్న నీ ఒక్కడికే అన్న కాదు.. మా అందరికీ అన్న.. నీది రక్త బంధమైతే.. మాది హృదయానికి సంబంధించిన బంధం. ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా మేం జగన్‌తో ఉండే వాళ్లం..నువ్వు ఆయన్ని జైళ్లోకి పంపిస్తే మా జీవితాలు ఏం కావాలి..?. చెల్లెల్లు రక్షాబందన్ కట్టి అన్న చల్లాగా ఉండాలనుకుంటారు..నువ్వు అన్నను జైలుకు పంపాలనుకుంటున్నావు. భర్త సంపాదించిన ఆస్తిలో చెల్లెలకు వాటా ఇస్తున్నా సహకరించి సంతకం పెట్టిన భారతమ్మను గౌరవించాలి. జగన్ తల్లి, చెల్లిపై కోర్టులో కేసు వేశాడా..? ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా.. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆస్తుల కోసం తల్లి,చెల్లిపై కేసు వేశాడని రాస్తారా?. కుట్రపూరితంగా మీరు ఆయన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే..కళ్లు తెరిచి ఆయన జాగ్రత్త పడ్డాడు. ఆ ఆస్తి మీది కాదు..జగన్‌మోహన్‌రెడ్డి కష్టార్జితం. ఈ కుటుంబ సమస్యను బజారుకీడ్చింది మీరు.. చంద్రబాబుతో చేతులు కలిపింది షర్మిల.
మీ ఇంట్లో రామాయణం లేదా చంద్రబాబు..? మీ తమ్ముడు రామ్మూర్తిని గొలుసులేసి కట్టేశారు..రూపాయి అస్తులు ఇవ్వలేదు. మీ అమ్మ కు హైదరాబాద్‌లో ఉన్న వందల కోట్ల భూమిని మీ చెల్లెల్లకు ఇచ్చినావా?. లక్ష్మీ పార్వతికి చెందాల్సిన ఆస్తులు, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి వంశానికి సమస్యలు లేవా?. పవన్ కల్యాణ్ పెళ్లాలకు ఉండే సమస్యలు సంగతేంటి?. మీ రామాయణాలు ఏ రోజూ మేం ప్రస్తావించలేదు.. ఇళ్లన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఇలా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో పేజీ పేజీ వండి వార్చలేదు. కుటుంబ వ్యవస్థలో ఉండాల్సిన అనుబంధాలు చంద్రబాబుకు లేవు.. అది ఒక్క వైఎస్సార్ కుటుంబంలోనే ఉన్నాయి. మా దరిద్రానికి ఇప్పుడు ఈ షర్మిల మాకు తోడైంది.. లేదంటే ఇంతవరకూ మచ్చలేని కుటుంబం వైఎస్సార్‌ది. విజయమ్మకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నా..మీ బిడ్డ మీ బిడ్డ కాదు..మా ఆస్తి... వైఎస్సార్సీపీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల ఆస్తి..మీ ఇష్టానుసారం ఆయన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండటానికి సిద్ధంగా లేము. ఇంత దూరం వచ్చిన తర్వాత దాచిపెట్టుకుని మెల్లిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది..?’’ అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment