ఇక అన్ని ఇంజినీరింగ్ విభాగాలకు ఒకే ధర
అన్ని శాఖలూ కేంద్ర రవాణాశాఖ డేటాను అనుసరించాల్సిందే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రహదారులను పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు భారీఎత్తున పనులు చేపడుతున్న తరుణంలో రోడ్లు భవనాల శాఖ నిర్మాణ ధరలు పెరిగిపోనున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్(ఎస్‌ఎస్‌ఆర్)ను భారీగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ధరలతోపోలిస్తే 18శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల నమోదవుతుందని అంచనా. రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ మినహా మిగతా ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఏపీ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్ డేటాను అనుసరిస్తున్నాయి.
ఇప్పుడు ఇంచుమించు అన్నీ సమం చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే ఆయా శాఖల పనుల్లో అనుసరిస్తున్న ఎస్‌ఎస్‌ఆర్‌ను రోడ్లు భవనాల శాఖ అనుసరించేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆర్‌అండ్‌బీ ఇప్పటికీ 2008-09 సంవత్సరానికి సంబంధించిన ఎస్‌ఎస్‌ఆర్‌నే వినియోగిస్తోంది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అన్ని ఇంజినీరింగ్ విభాగాలు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ డేటాను అనుసరించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు గతంలో జారీ చేసిన 49వ నెంబర్ జీవోకు రిలాక్సేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఒక కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖకు రూ.35లక్షల నుంచి రూ.40లక్షలు ఖర్చవుతుండగా ఇతర విభాగాలకు రూ.45 లక్షలకు పైగా ఖర్చవుతోంది. కొత్త ఎస్‌ఎస్‌ఆర్ వల్ల ఆర్‌అండ్‌బీ కూడా రూ.45 లక్షలకుపైగా ఖర్చు చేయవచ్చు. త్వరలో రూ.10 వేల కోట్లకుపైగా విలువైన పనులు ఆర్‌అండ్‌బీ చేపడుతున్నందున ఖజానాపై భారం మోపినా... పనుల్లో వేగం పెంచుతుందంటున్నారు.
ఆర్‌అండ్‌బీకి కూడా ఎస్‌ఎస్‌ఆర్ వర్తింపు
Published Thu, Dec 25 2014 12:45 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
Advertisement
Advertisement