అమరావతి: రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కార్లు, ఇతర వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా చేసేందుకు సరికొత్త టెక్నాలజీని వాడేందుకు నిర్ణయించింది. ‘వెహికల్ టు ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్) అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీని ముందుగా కార్లలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ భద్రతా ప్యానల్ కేంద్రానికి నివేదించింది.
భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రాంలో స్థానం
దేశం మొత్తమ్మీద 2021లో 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిల్లో దాదాపు 1,53,972 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రహదారి భద్రత కోసం వీ2ఎక్స్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. ‘న్యూ కార్ ఎసెస్‌మెంట్ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్)లో చేర్చింది. అంటే ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్లకు భద్రతా రేటింగ్స్ నిర్ణయించేటప్పుడు ఈ టెక్నాలజీని ప్రమాణికంగా తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ రహదారి భద్రతా ప్యానల్ 58 పేజీల నివేదికను సమర్పించింది. ఈ టెక్నాలజీని దేశంలో తయారు చేసే కార్లలో ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర రవాణా, టెలీ కమ్యూనికేషన్ల శాఖల ఉన్న తాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది.
వీ2ఎక్స్ ఎలా పని చేస్తుందంటే...
కార్ల తయారీలో అంతర్భాగంగా ఈ టెక్నాలజీని అమలు చేస్తారు. ఇది వైఫై ఆధారంగా ఇది పనిచేస్తుంది. తగినంత దూరం నుంచే రహదారిపై ఎదురుగా, పక్కన, వెనుక ఉన్న వాహనాలను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రోడ్లపై రద్దీ, రోడ్డు పక్కన పాదచారుల విషయంలోనూ ఈ టెక్నాలజీ నిత్యం గమనిస్తూ వాహనదారులను హెచ్చరిస్తుంది. టోల్ గేట్లు, రోడ్డు మలుపులు, యూటర్న్‌లు, ప్రమాద హెచ్చరిక బోర్డుల గురించి ముందుగానే సమాచారమిస్తుంది. వాహనాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తే ఆటోమేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేసి ఆ వాహనాలు నిలిచిపోతాయి. ప్రస్తుతం కార్లు, ఎస్‌యూవీలలో ఉన్న భద్రతా ఫీచర్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment