central transport
-
వాహనాలు ఢీకొనకుండా ఆటోమేటిక్ బ్రేకులు
అమరావతి: రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. కార్లు, ఇతర వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా చేసేందుకు సరికొత్త టెక్నాలజీని వాడేందుకు నిర్ణయించింది. ‘వెహికల్ టు ఎవ్రీథింగ్ (వీ2ఎక్స్) అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీని ముందుగా కార్లలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ భద్రతా ప్యానల్ కేంద్రానికి నివేదించింది. భారత్ ఎన్‌క్యాప్ ప్రోగ్రాంలో స్థానం దేశం మొత్తమ్మీద 2021లో 4,12,000 రోడ్డు ప్రమాదాలు జరగ్గా వాటిల్లో దాదాపు 1,53,972 మంది మరణించారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం రహదారి భద్రత కోసం వీ2ఎక్స్ టెక్నాలజీని వాడాలని నిర్ణయించింది. ‘న్యూ కార్ ఎసెస్మెంట్ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్)లో చేర్చింది. అంటే ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్లకు భద్రతా రేటింగ్స్ నిర్ణయించేటప్పుడు ఈ టెక్నాలజీని ప్రమాణికంగా తీసుకుంటారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ రహదారి భద్రతా ప్యానల్ 58 పేజీల నివేదికను సమర్పించింది. ఈ టెక్నాలజీని దేశంలో తయారు చేసే కార్లలో ప్రవేశపెట్టే అంశంపై కేంద్ర రవాణా, టెలీ కమ్యూనికేషన్ల శాఖల ఉన్న తాధికారుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. వీ2ఎక్స్ ఎలా పని చేస్తుందంటే... కార్ల తయారీలో అంతర్భాగంగా ఈ టెక్నాలజీని అమలు చేస్తారు. ఇది వైఫై ఆధారంగా ఇది పనిచేస్తుంది. తగినంత దూరం నుంచే రహదారిపై ఎదురుగా, పక్కన, వెనుక ఉన్న వాహనాలను గుర్తించి డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. రోడ్లపై రద్దీ, రోడ్డు పక్కన పాదచారుల విషయంలోనూ ఈ టెక్నాలజీ నిత్యం గమనిస్తూ వాహనదారులను హెచ్చరిస్తుంది. టోల్ గేట్లు, రోడ్డు మలుపులు, యూటర్న్లు, ప్రమాద హెచ్చరిక బోర్డుల గురించి ముందుగానే సమాచారమిస్తుంది. వాహనాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తే ఆటోమేటెడ్ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేసి ఆ వాహనాలు నిలిచిపోతాయి. ప్రస్తుతం కార్లు, ఎస్‌యూవీలలో ఉన్న భద్రతా ఫీచర్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను ఇవ్వడం లేదని నిపుణులు భావిస్తున్నారు. -
ఫాస్టాగ్ లేకుంటే సబ్సిడీ రద్దు ..
కడప సిటీ : ఫాస్టాగ్ నిబంధనలను కేంద్ర ఉపరితల రవాణాశాఖ కఠినతరం చేసింది. ఫాస్టాగ్ తీసుకోకుంటే తిరుగు ప్రయాణంలో ఇచ్చే 50 శాతం సబ్సిడీని రద్దు చేసింది. ఈ మేరకు ఆయా టోల్‌ప్లాజాలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఎల్రక్టానిక్ టోల్ చెల్లింపు విధానం వైపు వాహనదారులు మొగ్గుచూపకపోవడంతో ఎలాగైనా నిబంధనలు కఠినతరం చేసి స్టిక్కర్లు కొనిపించాలని నిర్ణయానికి రావడం వల్లే ఈ ఆంక్షలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.పండుగకు ముందు రెండు, మూడు క్యాష్ కౌంటర్లు ఉండగా, తర్వాత అధికభాగం ఫాస్టాగ్ కౌంటర్లుగా మార్చి కేవలం ఒకే ఒక్క క్యాష్‌లైన్ ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని కూడా తీసి వేస్తామని పాలెంపల్లె టోల్‌ఫ్లాజా మేనేజర్ హర్షవర్ధన్ తెలిపారు. గడువు ఇచ్చినా... టోల్‌ప్లాజాల వద్ద క్యాష్ విధానం వల్ల గంటల తరబడి వాహనాలు నిలపాల్సి వచ్చేది.దీనివల్ల సమయం, వృథా, ఇంధనం ఖర్చు కూడా అవుతోంది. దీంతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ 2016లో ఫాస్టాగ్ స్టిక్కర్లను వాహనాలకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.స్టిక్కర్లో ఉన్న చిప్‌ను అక్కడున్న స్కానర్ స్కాన్ చేసి వారి అకౌంటులో ఉన్న మొత్తాన్ని జమ చేసుకుంటుంది. 2019 డిసెంబరు 1వ తేదీ నుంచి 15 వరకు ఫాస్టాగ్ స్టిక్కర్లను కొనుగోలు చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయించారు. మళ్లీ ఈ గడువును జనవరి 15, 2020 వరకు పొడిగించారు. కానీ వాహనదారులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 52 శాతం మాత్రమే ఫాస్టాగ్ స్టిక్కర్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తున్నారు. జనవరి 15వ తేదీ నుంచి ఒకే క్యాష్‌లైన్ ఏర్పాటు చేయడం, తిరుగు ప్రయాణంలో సబ్సిడీని ఎత్తివేయడం వంటి అంశాలను తీసుకొచ్చారు. నగదు చెల్లించే వారు 24 గంటల్లో తిరిగి వచ్చినా మొత్తం టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అదే ఫాస్టాగ్ స్టిక్కర్లు కలిగి ఉంటే 50 శాతం సబ్సిడీ వారికి ఉంటుంది. జాతీయ రహదారులపై రెగ్యులర్‌గా తిరిగే వాహనదారులకు నెలవారీ పాసులను కూడా జారీ చేస్తారు. దీనిని తీసుకుంటే టోల్ ఛార్జీల్లో తగ్గింపు ఉంటుంది. ఫాస్టాగ్ ఉంటేనే రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిని సంక్రాంతి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. రాయితీ ఉండదు టోల్‌ప్లాజా వద్దకు 24 గంటల్లో తిరిగి వాహనం వస్తే 50 శాతం సబ్సిడీ మాత్రమే ఉంటుంది. ఫాస్టాగ్ స్టిక్కర్ లేకపోతే ఈ అవకాశం ఉండదు. ఇప్పటివరకు 51 శాతం ఫాస్టాగ్ స్టిక్కర్లను వాహనదారులు కొనుగోలు చేశారు. నిబంధనలు కఠినతరం చేయడం వల్ల వారం రోజుల్లో పూర్తి స్థాయిలో తీసుకుంటారని భావిస్తున్నాం. – హర్షవర్ధన్, మేనేజర్, పాలెంపల్లె టోల్‌ప్లాజా -
ఆర్‌అండ్‌బీకి కూడా ఎస్ఎస్ఆర్ వర్తింపు
ఇక అన్ని ఇంజినీరింగ్ విభాగాలకు ఒకే ధర అన్ని శాఖలూ కేంద్ర రవాణాశాఖ డేటాను అనుసరించాల్సిందే.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రహదారులను పూర్తిస్థాయిలో మెరుగుపరిచేందుకు భారీఎత్తున పనులు చేపడుతున్న తరుణంలో రోడ్లు భవనాల శాఖ నిర్మాణ ధరలు పెరిగిపోనున్నాయి. ఇప్పటివరకు అమలులో ఉన్న స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్(ఎస్ఎస్ఆర్)ను భారీగా సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్న ధరలతోపోలిస్తే 18శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల నమోదవుతుందని అంచనా. రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ మినహా మిగతా ఇంజినీరింగ్ విభాగాలన్నీ ఏపీ స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్ డేటాను అనుసరిస్తున్నాయి. ఇప్పుడు ఇంచుమించు అన్నీ సమం చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంటే ఆయా శాఖల పనుల్లో అనుసరిస్తున్న ఎస్‌ఎస్‌ఆర్‌ను రోడ్లు భవనాల శాఖ అనుసరించేలా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆర్అండ్బీ ఇప్పటికీ 2008-09 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్ఆర్నే వినియోగిస్తోంది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అన్ని ఇంజినీరింగ్ విభాగాలు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ డేటాను అనుసరించాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు గతంలో జారీ చేసిన 49వ నెంబర్ జీవోకు రిలాక్సేషన్ ఇచ్చింది. ప్రస్తుతం ఒక కిలోమీటరు రోడ్డు నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖకు రూ.35లక్షల నుంచి రూ.40లక్షలు ఖర్చవుతుండగా ఇతర విభాగాలకు రూ.45 లక్షలకు పైగా ఖర్చవుతోంది. కొత్త ఎస్ఎస్ఆర్ వల్ల ఆర్అండ్బీ కూడా రూ.45 లక్షలకుపైగా ఖర్చు చేయవచ్చు. త్వరలో రూ.10 వేల కోట్లకుపైగా విలువైన పనులు ఆర్అండ్బీ చేపడుతున్నందున ఖజానాపై భారం మోపినా... పనుల్లో వేగం పెంచుతుందంటున్నారు. -
అనంత టు విజయవాడ
జిల్లా సరిహద్దు ప్రాంతమైన కొడికొండ చెక్‌పోస్టు పరిధిలోని కోడూరు నుంచి పుట్టపర్తి, ధర్మవరం, బత్తలపల్లి, నాయనపల్లి క్రాస్, తాడిపత్రి, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లి, నంద్యాల, ప్రకాశం జిల్లా గిద్దలూరు, మార్కాపురం, తోకపల్లి మీదుగా గుంటూరు, విజయవాడకు 570 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేయనున్నారు. సాక్షి, అనంతపురం : రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో సీమ జిల్లాల నుంచి అక్కడికి వెళ్లేందుకు ప్రధాన రహదారి మార్గాన్ని సూచిస్తూ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం పేషీ నుంచి జిల్లా జాతీయ రహదారులు అధికారులకు అందిన ఆదేశాల మేరకు వారు ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ప్రస్తుతం ఆ ఫైలు కేంద్ర ట్రాన్స్‌పోర్టు కమిషనర్ నితిన్ గడ్కారి పరిశీలనకు వెళ్లింది. వివరాల్లోకెళ్తే.. ఏప్రాంతమైనా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందాలంటే రోడ్డు మార్గంతో పాటు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అవసరం. ఈ విషయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఎక్కడికక్కడ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను రోడ్డు మార్గంతో అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్పు చేస్తూ.. క్రిష్ణా జిల్లాలోని క్రిష్ణపట్నం, బందరు పోర్టులను అనుసంధానించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్అండ్బి రోడ్లను జాతీయ రహదారులుగా మార్పు చేయడానికి అనుమతి కోరుతూ.. కేంద్ర ట్రాన్స్‌పోర్టు మంత్రి నితిన్ గడ్కారికి ఫైలును పంపించారు. ప్రస్తుతం ఆ ఫైలు ఆయన వద్ద పెండింగ్‌లో ఉంది. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే భూసేకరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అయితే అధికారులు తయారు చేసిన రూట్ మ్యాప్‌లో ఐదు జిల్లాలు కవర్ కానున్నాయి. అనంతపురం జిల్లాలో కవర్ అవుతున్న కోడూరు, పుట్టపర్తి, ధర్మవరం, బత్తలపల్లి, నాయనపల్లిక్రాస్,తాడిపత్రి రోడ్డు నాలుగు లైన్ల రోడ్డుగా మారనుంది. మంగళూరు పోర్టుకు మరో మార్గం రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే అని తేలిపోవడంతో కర్ణాటకలోని మంగళూరు పోర్టు నుంచి నిజాం పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా మార్గాన్ని సర్వే చేయించాలన్న ఎమ్మెల్సీ తిప్పేస్వామి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం జాతీయ రహదారుల అధికారులను సర్వేకు ఆదేశించింది. ఈ మేరకు సర్వే చేసిన అధికారులు జిల్లా సరిహద్దులోని కోడూరు నుంచి లేపాక్షి, హిందూపురం, మడకశిర మీదుగా కర్ణాటక రాష్ట్రంలోని శిర నుంచి మంగళూరు పోర్టు, అక్కడి నుంచి నిజాంపోర్టుకు రహదారులను అనుసంధానం చేస్తూ అధికారులు మారో రిపోర్టును తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు. ఈ ఫైలు కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రి అనుమతి కోసం వేచి ఉంది. ప్రతిపాదనలు పంపాము.. రాజధానిగా విజయవాడను ప్రకటించాక.. అనంతపురం జిల్లా నుంచి విజయవాడకు దగ్గర మార్గం చూపిస్తూ ప్రతిపాదనలు పంపించాలని సీఎం పేషీ నుంచి మాకు అదేశాలు వచ్చాయి. ఆ మేరకు సర్వే చేసి 570 కిలోమీటర్ల మేర రహదారిని సూచిస్తూ ప్రతిపాదనలు పంపా ము. ఈ రహదారి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి గడ్కారీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. - వైఆర్ సుబ్రమణ్యం, ఎన్‌హెచ్ అనంతపురం సర్కిల్ ఎస్ఈ