పాలెంపల్లె టోల్‌ఫ్లాజా వద్ద క్యాష్ లైన్‌లో బారులు తీరిన వాహనాలు(ఫైల్)
కడప సిటీ : ఫాస్టాగ్ నిబంధనలను కేంద్ర ఉపరితల రవాణాశాఖ కఠినతరం చేసింది. ఫాస్టాగ్ తీసుకోకుంటే తిరుగు ప్రయాణంలో ఇచ్చే 50 శాతం సబ్సిడీని రద్దు చేసింది. ఈ మేరకు ఆయా టోల్‌ప్లాజాలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఎల్రక్టానిక్ టోల్ చెల్లింపు విధానం వైపు వాహనదారులు మొగ్గుచూపకపోవడంతో ఎలాగైనా నిబంధనలు కఠినతరం చేసి స్టిక్కర్లు కొనిపించాలని నిర్ణయానికి రావడం వల్లే ఈ ఆంక్షలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.పండుగకు ముందు రెండు, మూడు క్యాష్ కౌంటర్లు ఉండగా, తర్వాత అధికభాగం ఫాస్టాగ్ కౌంటర్లుగా మార్చి కేవలం ఒకే ఒక్క క్యాష్‌లైన్ ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని కూడా తీసి వేస్తామని పాలెంపల్లె టోల్‌ఫ్లాజా మేనేజర్ హర్షవర్ధన్ తెలిపారు.
గడువు ఇచ్చినా...
టోల్‌ప్లాజాల వద్ద క్యాష్ విధానం వల్ల గంటల తరబడి వాహనాలు నిలపాల్సి వచ్చేది.దీనివల్ల సమయం, వృథా, ఇంధనం ఖర్చు కూడా అవుతోంది. దీంతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ 2016లో ఫాస్టాగ్ స్టిక్కర్లను వాహనాలకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.స్టిక్కర్‌లో ఉన్న చిప్‌ను అక్కడున్న స్కానర్ స్కాన్ చేసి వారి అకౌంటులో ఉన్న మొత్తాన్ని జమ చేసుకుంటుంది. 2019 డిసెంబరు 1వ తేదీ నుంచి 15 వరకు ఫాస్టాగ్ స్టిక్కర్లను కొనుగోలు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిర్ణయించారు. మళ్లీ ఈ గడువును జనవరి 15, 2020 వరకు పొడిగించారు. కానీ వాహనదారులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదు.
ఇప్పటివరకు జిల్లాలో కేవలం 52 శాతం మాత్రమే ఫాస్టాగ్ స్టిక్కర్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తున్నారు. జనవరి 15వ తేదీ నుంచి ఒకే క్యాష్‌లైన్ ఏర్పాటు చేయడం, తిరుగు ప్రయాణంలో సబ్సిడీని ఎత్తివేయడం వంటి అంశాలను తీసుకొచ్చారు. నగదు చెల్లించే వారు 24 గంటల్లో తిరిగి వచ్చినా మొత్తం టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అదే ఫాస్టాగ్ స్టిక్కర్లు కలిగి ఉంటే 50 శాతం సబ్సిడీ వారికి ఉంటుంది. జాతీయ రహదారులపై రెగ్యులర్‌గా తిరిగే వాహనదారులకు నెలవారీ పాసులను కూడా జారీ చేస్తారు. దీనిని తీసుకుంటే టోల్ ఛార్జీల్లో తగ్గింపు ఉంటుంది. ఫాస్టాగ్ ఉంటేనే రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిని సంక్రాంతి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.
రాయితీ ఉండదు
టోల్‌ప్లాజా వద్దకు 24 గంటల్లో తిరిగి వాహనం వస్తే 50 శాతం సబ్సిడీ మాత్రమే ఉంటుంది. ఫాస్టాగ్ స్టిక్కర్ లేకపోతే ఈ అవకాశం ఉండదు. ఇప్పటివరకు 51 శాతం ఫాస్టాగ్ స్టిక్కర్లను వాహనదారులు కొనుగోలు చేశారు. నిబంధనలు కఠినతరం చేయడం వల్ల వారం రోజుల్లో పూర్తి స్థాయిలో తీసుకుంటారని భావిస్తున్నాం.
– హర్షవర్ధన్, మేనేజర్, పాలెంపల్లె టోల్‌ప్లాజా
Comments
Please login to add a commentAdd a comment