Fast Tag
-
వాహనదారులకు అలర్ట్.. ఇక ఆగక్కర్లేదు,కొత్త టోల్ వ్యవస్థ రాబోతోంది
జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్ వ్యవస్థను అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. అవరోధం లేని టోల్ వ్యవస్థ కోసం ట్రయల్స్ కొనసాగుతున్నాయి. వాటి ట్రయల్స్ విజయవంతం అయిన వెంటనే, దానిని అమలు చేస్తాము" అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. ఈ వ్యవస్థ అమలులోకి వస్తే వాహనదారులు టోల్ బూత్‌ల వద్ద అర నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. ఈ నూతన వ్యవస్థ ద్వారా సామర్థ్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అలాగే కిలోమీటర్ల ఆధారంగా చెల్లింపుల వ్యవస్థకు ఉండొచ్చని తెలిపారు. గతంలో ఫాస్ట్‌ట్యాగ్‌ల వినియోగం ద్వారా టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని 47 సెకన్లకు తగ్గించామని, ప్రస్తుతం ప్రభుత్వం దానిని 30 సెకన్ల కంటే తక్కువకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు. ఉపగ్రహ, కెమెరాలు వంటి సాంకేతికతల ఆధారితంగా పనిచేసే ఈ నూతన టోల్ వ్యవస్థ పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు జాతీయ రహదారిపైకి ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద మీ వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్‌ను కెమెరా స్కాన్ చేసి డేటాను క్రోడీకరిస్తుంది. మీరు ప్రయాణించిన కి.మీ.లకు ఛార్జీలు విధిస్తుంది. టెలికాం సహా అన్ని రంగాలలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగానే ఇలాంటి పురోగతి అంతా జరుగుతోందని, టెలికమ్యూనికేషన్స్ రంగం అన్ని ఇతర రంగాలతో అనుసంధానమై ఉందని మంత్రి అన్నారు. మెరుగైన టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు టోల్ ప్లాజాల డేటాను నిర్వహించడంలో సహాయపడతాయని అన్నారు. చదవండి 'ప్రతి ఒక్కరినీ రక్షించలేం..' అల్లర్లపై సీఎం కీలక వ్యాఖ్యలు.. -
ఫిబ్రవరిలో తగ్గిన యూపీఐ లావాదేవీలు
న్యూఢిల్లీ: యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై రిటైల్ చెల్లింపుల లావాదేవీలు ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గి రూ.8.27 లక్షల కోట్ల మేర నమోదయ్యాయి. సంఖ్యా పరంగా 452 కోట్ల లావాదేవీలు జరిగాయి. అంతక్రితం నెల 2022 జనవరిలో 461 కోట్ల లావాదేవీలు నమోదు కాగా, వీటి విలువ రూ.8.32 లక్షల కోట్ల మేర ఉంది. టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ ఆధారిత లావాదేవీలు 24.36 కోట్లు నమోదయ్యాయి. వీటి విలువ రూ.3,613 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను ఎన్పీసీఐ విడుదల చేసింది. జనవరిలో ఫాస్టాగ్ టోల్ వసూళ్ల లావాదేవీలు 23.10 కోట్లుగాను, వీటి విలువ రూ.3,604 కోట్లుగా ఉంది. ఐఎంపీఎస్ లావాదేవీల విలువ జనవరిలో రూ.3.87 లక్షల కోట్లు. ఫిబ్రవరిలో రూ.3.84 లక్షల కోట్లకు తగ్గింది. జనవరిలో 31 రోజులు కాగా, ఫిబ్రవరిలో 28 రోజులే కావడం గమనార్హం. (చదవండి: వాహనదారులకు అలర్ట్.. ఇక ఆ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి!) -
గుడ్‌న్యూస్: ఎంత ప్రయాణిస్తే అంతే టోల్‌చార్జీ
న్యూఢిల్లీ: జీపీఎస్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్టు కేంద్ర రవాణా, రహదారులు, ఎంఎస్ఎంఈల శాఖల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. జాతీయ రహదారిపైకి ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిపోయిన పాయింట్ వరకు.. ప్రయాణించిన మేరే టోల్ చార్జీలను ఇందులో చెల్లించొచ్చన్నారు. కాకపోతే ఈ వ్యవస్థ రావడానికి రెండేళ్లు పట్టొచ్చని చెప్పారు. జాతీయ రహదారులపై టోల్ వసూళ్ల కోసం ఫాస్టాగ్ విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వాహనాల రద్దీ గణనీయంగా తగ్గినట్టు తెలిపారు. దీనివల్ల ఏటా రూ.20,000 కోట్ల మేర ఇంధనం రూపంలో ఆదా అవుతుందని, కనీసం రూ.10,000 కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని వివరించారు. టోల్ ప్లాజాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన వ్యవస్థను మంత్రి సోమవారం ప్రారంభించారు. అదే విధంగా జాతీయ రహదారులకు రేటింగ్ వ్యవస్థను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి ఫాస్టాగ్‌ను దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. టోల్ ప్లాజాల వద్ద జాప్యాన్ని ఒక నిమిషం లోపునకే పరిమితం చేస్తామని మంత్రి చెప్పారు. టోల్ ప్లాజాలను ఆన్లైన్లోనే పర్యవేక్షించే వ్యవస్థ ఆదాయపన్ను, జీఎస్టీ, ఇతర అధికారులకు ముఖ్యమైన సాధనంగా మారుతుందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం రికార్డు స్థాయిలో రోజుకు 33 కిలోమీటర్లకు చేరుకున్నట్టు మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.11,035 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. -
పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు తీపికబురు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేసిన సంగతి మనకు తెలిసిందే. ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ లేకుండా ఏ జాతీయ లేదా రాష్ట్ర రహదారిపై వాహనాలను అనుమతించడం లేదు. ఒకవేళ ఫాస్టాగ్ లేకుండా ప్రయాణించాల్సి వస్తే టోల్ ప్లాజా వద్ద రెట్టింపు జరిమానా వసూలు చేస్తున్నారని వాహనదారులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో వాహనదారుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఫాస్టాగ్ లేని కారణంగా రెట్టింపు టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులలో వాహనదారులు పేర్కొన్నారు. ఫాస్టాగ్ లేని వారి భాద ఈ విదంగా ఉంటే, ఫాస్టాగ్ తీసుకున్న వారి భాద మరో విదంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పలు బ్యాంకులు, మొబైల్ యాప్‌ల నుంచి ఫాస్టాగ్ కొనుగోలుచేయడానికి అవకాశం కల్పించింది. ఫాస్టాగ్ తీసుకున్నవారు టోల్ గేట్ దాటుతున్న సమయంలో ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖాతా నుంచి కట్ అయ్యినట్లు పిర్యాదు చేస్తున్నారు. ఇందులో పేటీఎం నుంచి ఫాస్టాగ్ తీసుకున్న వారు కూడా ఉన్నారు. పేటీఎం తన ఫాస్టాగ్ యూజర్లకు శుభవార్త తెలిపింది. మీ ఫాస్టాగ్ ఖాతా నుంచి అకారణంగా లేదా ఎక్కువ డబ్బు కట్ అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాటిని తిరిగి చెల్లిస్తుంది అని పేర్కొంది. ఇప్పటికే 2.6 లక్షల (82 శాతం)కు పైగా వినియోగదారులకు కట్ అయిన నగదును వారికీ తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. టోల్ ప్లాజాల నుంచి వస్తున్న ఫిర్యాదులు సహా ఇతరుల సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాలుగా తమ వినియోగదారులకు సహాయం అందించేందుకు కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సతీష్ గుప్తా తెలిపారు. చదవండి: క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు! ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ -
ఇక రాష్ట్ర రహదారులపై ఫాస్టాగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రహదారులపై కూడా ఫాస్టాగ్ అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం జాతీయ రహదారులు, ఔటర్ రింగురోడ్డుపై మాత్రమే ఫాస్టాగ్‌తో నగదు రహిత చెల్లింపు విధానం అమలవుతోంది. గత 15వ తేదీ నుంచి అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలలో అన్ని గేట్లను పూర్తిగా ఫాస్టాగ్‌తో అనుసంధానించిన విషయం తెలిసిందే. గతేడాదిలోనే ఒక గేట్ మినహా మిగతావి ఫాస్టాగ్ పరిధిలోకి వచ్చాయి. కానీ, రాష్ట్ర రహదారులపై మాత్రం ఇంకా నగదు చెల్లింపు విధానం కొనసాగుతోంది. ఇక మార్చి ఒకటో తేదీ నుంచి హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిపై ఇది అమలులోకి రానుంది. ప్రస్తుతానికి ఒక రహదారిపైనే.. రాష్ట్రంలో టోల్‌ప్లాజాలున్న రాష్ట్ర రహదారులు రెండు. మొదటిది హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారి కాగా, రెండోది నార్కెట్‌పల్లి-అద్దంకి (పాత ఎన్‌హెచ్-5) రోడ్డు. ఇందులో రాజీవ్ రహదారిపై దుద్దెడ, రేణికుంట, బసంత్‌నగర్‌ల వద్ద మూడు ప్లాజాలున్నాయి. ఈ మూడింటినీ ఒకే కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నారు. వీటిల్లో ఫాస్టాగ్ విధానాన్ని మార్చి ఒకటి నుంచి అమలులోకి తేవాలని భావిస్తున్నారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రహదారిపై మూడు టోల్ప్లాజాలున్నాయి. ఇందులో మాడుగులపల్లి వద్ద ఉన్న ప్లాజా తెలంగాణలో ఉండగా, మిగతా రెండు ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయి. మాడుగులపల్లి టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ వ్యవస్థ ఏర్పాటైంది. కానీ, మిగతా రెండుచోట్ల కాలేదు. ఈ మూడు ప్లాజాలు కూడా ఒకే కాంట్రాక్టర్ పరిధిలో ఉన్నాయి. దీంతో మూడింటిని ఒకేసారి ప్రారంభించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నార్కెట్‌పల్లి-అద్దంకి రోడ్డుపై మాత్రం మార్చి చివరికిగానీ, ఏప్రిల్ మొదటి వారంలోగాని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. సిస్టం ఏర్పాటుపై స్పష్టత లేక.. రాష్ట్ర రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌కు సంబంధించిన సెన్సార్లు, ఇతర ఆటోమేటిక్ వ్యవస్థ, దాని సాఫ్ట్వేర్ కొనుగోలు ఖర్చు విషయంలో ప్రభుత్వానికి-కాంట్రాక్టర్లకు మధ్య స్పష్టత రాలేదు. ఈ రోడ్ల ఒప్పందాలు 2010లో జరిగాయి. అప్పటికీ ఫాస్టాగ్ విధానంపై అవగాహన కూడా లేదు. ఇప్పుడు ఆ వ్యవస్థ ఏర్పాటుకు ఒక్కోప్లాజా వద్ద దాదాపు రూ.70 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ రూ.20 లక్షలకు మాత్రమే రీయింబర్స్ చేస్తోంది. మిగతా ఖర్చును కాంట్రాక్టర్ భరించాల్సి ఉంది. కానీ.. మొత్తం ఖర్చును రీయింబర్స్ చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌పై తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు, ముందైతే ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించటంతో ప్రస్తుతానికి కాంట్రాక్టరే వ్యయాన్ని భరిస్తున్నారు. ట్యాగ్ లేకుంటే రెట్టింపు ఫీజు ఫాస్టాగ్ లేకుండా టోల్‌గేట్‌లోకి వస్తే రెట్టింపు రుసుము చెల్లించే పద్ధతి ప్రస్తుతం జాతీయ రహదారులపై అమలవుతోంది. ఇదే పద్ధతి ఇక రాష్ట్ర రహదారులపై (ఫాస్టాగ్ ప్రారంభం అయినప్పటి నుంచి) అమలులోకి రానుంది. ప్రస్తుతానికి రహదారులపై 75 వాహనాలకు మాత్రమే ట్యాగ్ ఉంటోంది. మిగతావారు అప్పటికప్పుడు ట్యాగ్ కొనటమో, రెట్టింపు ఫీజు చెల్లించి వెళ్లటమో చేస్తున్నారు. ఇప్పుడు ఆ రోడ్లమీద దూసుకుపోయే వాహనదారులు కూడా అప్రమత్తం కావాల్సిందే. ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఉన్న వాహనాల కోసం ఒక అత్యవసర మార్గం తప్ప మిగతావాటిల్లో కచ్చితంగా ఫాస్టాగ్ ఉండాల్సిందే. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్ -
వాహనదారులకు కేంద్రం తీపికబురు
మీకు కారు కానీ ఏదైనా భారీ వాహనం కలిగి ఉన్నారా? అయితే మీకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు తీపికబురు అందించింది. ఉచితంగానే ఫాస్టాగ్ అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2021 మార్చి 1 వరకు దేశవ్యాప్తంగా ఉన్న 770 టోల్ ప్లాజాలలో (స్టేట్ ప్లాజాతో సహా) ఉచితంగానే ఫాస్టాగ్ పొందవచ్చు అని ఎన్హెచ్ఏఐ తెలిపింది. దీనితో వాహనదారులకు రూ.100 ఆదా కానుంది. జాతీయ రహదారులపై నడిచే వాహనాల యూజర్ల ఫాస్టాగ్ వినియోగించడాన్ని పెంచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం, ఫాస్టాగ్ ను 87 శాతం మంది వినియోగదారులు వాడుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే ఫాస్టాగ్ వినియోగం 7 శాతం పెరిగింది. ఇక దేశంలో 100 టోల్ ప్లాజాల దగ్గర ఫాస్టాగ్ వినియోగించే వారి సంఖ్య 90శాతం చేరుకుంది. ఒక్కరోజులోనే ఫాస్టాగ్ ద్వారా 63 లక్షల లావాదేవీలతో రూ.100 కోట్ల టోల్ వసూలు చేశారు. టోల్ ప్లాజా దగ్గర ఏదైనా సాంకేతిక లోపం ఉంటే ఫాస్టాగ్‌లలో బ్యాలెన్స్ ఉన్నంత వరకు ఒక్క పైసా కూడా చెల్లించకుండా వినియోగదారులు టోల్ ప్లాజాలు దాటవచ్చు అని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. గత రెండు రోజుల్లో 2.5 లక్షలకు పైగా ట్యాగ్ల అమ్మకాలు జరిగాయని ఎన్హెచ్ఏఐ పేర్కొంది. ప్రతి వాహనదారుడి దగ్గర ఫాస్టాగ్ తప్పక ఉండాల్సిందే. లేదంటే భారీ జరిమానా పడుతుంది. చదవండి: వాట్సాప్‌కు దీటుగా స్వదేశీ సందేశ్ యాప్ -
ఫాస్టాగ్ తప్పనిసరి.. లేదంటే టోల్ ఫీజు రెట్టింపు!!
న్యూఢిల్లీ: టోల్ గేట్ల దగ్గర రద్దీని తగ్గించే దిశగా వాహనాలకు ఫాస్టాగ్‌లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫిబ్రవరి 15 అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ట్యాగ్ లేని వాహనాలకు టోల్ ఫీజు భారం రెట్టింపు కానుంది. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎన్హెచ్ఏఐ) ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల్లోని అన్ని లేన్లను ఫిబ్రవరి 15/16 అర్ధరాత్రి నుంచి ’ఫాస్టాగ్ లేన్లు’గా మారతాయని పేర్కొంది. ‘నిబంధనల ప్రకారం ఫాస్టాగ్ లేని వాహనాలు, చెల్లుబాటు కాని ఫాస్టాగ్ ఉన్న వాహనాలు గానీ ఫాస్టాగ్ లేన్‌లోకి వచ్చిన పక్షంలో రెట్టింపు ఫీజు వర్తిస్తుంది‘ అని ఎన్హెచ్ఏఐ వివరించింది. డిజిటల్ విధానం ద్వారా టోల్ ఫీజుల చెల్లింపును ప్రోత్సహించేందుకు, ప్లాజాల దగ్గర నిరీక్షించే సమయాన్ని, ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు కొత్త నిబంధనలు తోడ్పడగలవని తెలిపింది. 2016లో తొలిసారిగా ఫాస్టాగ్‌లను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1 నుంచి నాలుగు చక్రాల ప్యాసింజర్ వాహనాలు, గూడ్స్ వాహనాలకు ఫాస్టాగ్ అమర్చడాన్ని తప్పనిసరి చేసింది. ఆ తర్వాత డెడ్‌లైన్‌ను ఫిబ్రవరి 15 దాకా పొడిగించింది. ఇక డెడ్‌లైన్ పొడిగించేది లేదు: మంత్రి గడ్కరీ ఫాస్టాగ్ అమలుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను మరింత పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. గడువును ఇప్పటికే రెండు, మూడు సార్లు పొడిగించామని పేర్కొన్నారు. వాహనదారులు ఇకపై తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందేనన్నారు. కొన్ని రూట్లలో ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ 90 శాతం దాకా ఉంటోందని, తీసుకోని వారి సంఖ్య కేవలం పది శాతమే ఉండొచ్చని మంత్రి చెప్పారు. టోల్ ప్లాజాల దగ్గర కూడా ఇది అందుబాటులో ఉంటుందని వివరించారు. -
రేపటి నుంచి ఫాస్టాగ్ తప్పనిసరి.. లేదంటే బాదుడే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రేపటి (ఫిబ్రవరి 15) నుంచి ఫాస్టాగ్ తప్పనిసరిగా అమల్లోకి రానుంది. వాహనాలకు ఫాస్టాగ్ ఉంటేనే హైవేలపైకి ఎక్కాలి, లేదంటే రెట్టింపు టోల్ బాదుడు భరించాల్సివుంటుంది. ఇప్పటికే పలుమార్లు ఫాస్టాగ్ తప్పనిసరి వినియోగాన్ని వాయిదా వేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఫాస్టాగ్ వినియోగంతో హైవేలపై టోల్ ప్లాజాల దగ్గర సమయం వృథా అయ్యే అవకాశం ఉండదు. వాహనాలకు ఫాస్టాగ్‌ను టోల్ ప్లాజాల వద్ద లేదా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. దీనికోసం వాహన రిజిస్ట్రేషన్ పత్రాలను అందుబాటులో ఉంచుకోవల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ఖరీదు వాహనంపై ఆధారపడి ఉంటుంది. ఇక ఫాస్టాగ్ రీఛార్జ్‌ను ఆన్లైన్ లేదా టోల్‌ప్లాజాల వద్ద చేయించుకోవచ్చు. -
గుర్తుందా.. 15 తర్వాత ఫాస్టాగ్ లేకుంటే..
హైదరాబాద్: టోల్గేట్ల వద్ద నగదు రహిత టోల్ ఫీజు చెల్లింపులకు ప్రవేశపెట్టిన విధానం ‘ఫాస్టాగ్’. వాహనాలు ఆగకుండా వెళ్లేందుకు ప్రవేశపెట్టిన విధానం ఈనెల 15వ తేదీ నుంచి పక్కాగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మీ వాహనాలు ఫాస్టాగ్ విధానంలోకి మార్చుకోకపోతే ఇక టోల్‌ద్ట్లు దాటలేవు. దానికి ఇంకా వారం రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వ అధికారులు అవగాహన కార్యక్రమాలు పెంచారు. దేశవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల కోసం కేంద్రం ప్రభుత్వం 2017లో ‘ఫాస్టాగ్’ విధానం తీసుకొచ్చింది. అప్పటి నుంచి అమలు చేస్తున్న ఈ విధానం గడువు పొడగిస్తూనే వస్తున్నారు. ఇక ఫిబ్రవరి 15 చివరి గడువు అని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఆ తర్వాత ‘ఫాస్టాగ్’ లేకపోతే వాహనం టోల్గేట్ దాటదని అధికారులు చెబుతున్నారు. టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ తగ్గించడంతో నగదు రహిత చెల్లింపుల ప్రోత్సాహానికి ఈ ఫాస్టాగ్ దోహదం చేస్తుంది. ఫిబ్రవరి 15 డెడ్ లైన్ ఆఖరు అని తేల్చి చెప్పింది. ఫాస్టాగ్ లేకపోతే జాతీయ రహదారులపై మీ కార్లు, లారీలు తదితర వాహనాలు అనుమతించరు. అయితే ఫాస్టాగ్ చేసుకునేందుకు కేంద్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా 720 టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు చేయించుకోకపోతే వెళ్లి ఫాస్టాగ్ చేసుకోండి. -
ఇక వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ: కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 15వ తేది నుంచి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్టాగ్ ను తప్పనిసరి చేసింది. ఇక నుంచి ఫాస్ట్ టాగ్ లేకుండా టోల్ ఫీజు చెల్లించాలనుకుంటే మాత్రం రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ గడువు తేది దగ్గర పడుతుండటంతో ఈ కొత్త విధానంపై కేంద్రం ప్రజలకు అవగాహనా కల్పించడం కోసం కేంద్రం ప్రకటనలు ఇస్తుంది. అయితే కొత్త ఫాస్టాగ్ విధానంపై చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.(చదవండి: ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్!) ఇప్పుడు అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేయబడింది. ఇందులో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ ఫీజ్ ఆటోమేటిక్ చెల్లించవచ్చు. ఈ ఫాస్టాగ్ పొదుపు ఖాతా లేదా డిజిటల్ వాలెట్‌తో అనుసంధానించబడుతుంది. దీనిని మీ ఫోర్ వీలర్ వాహనం విండ్‌స్క్రీన్‌పై అమర్చిన ఒక బార్ కోడ్ స్టిక్కర్. దీని ద్వారా టోల్ చెల్లించడానికి మీరు వాహనం ఆపవలసిన అవసరం లేదు. టోల్‌ను దాటేటప్పుడు సమయం, ఇంధనం ఆదా చేయడం, ట్రాఫిక్‌ను తగ్గించడం కోసం ఈ ఫాస్టాగ్ విధానాన్ని తప్పని సరి చేసింది. ఫాస్టాగ్ ఎక్కడ పొందవచ్చు? ఫాస్టాగ్ లను ఏదైనా బ్యాంకు లేదా ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీనికోసం ఐసిఐసిఐ, ఎస్బిఐ, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. ఇదే కాకుండా, టోల్ ప్లాజా, ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే "మై ఫాస్టాగ్ యాప్"ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫామ్ లు గూగుల్ పే, అమెజాన్ పే, పేటీఎం వంటి యాప్‌లు కూడా ఫాస్టాగ్ ను అందిస్తున్నాయి.(చదవండి: జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం) ఈ ఫాస్టాగ్ లో వాహనం రిజిస్ట్రేషన్ వివరాలతో కూడిన ఒక బార్ కోడ్ ఉంటుంది. ఈ బార్ కోడ్ ను వాహనం ముందు అద్దం లేదా సైడ్ మిర్రర్ పై స్టిక్కర్ లా అతికిస్తారు. కాగా, ఇది జారీ చేసిన తేదీ నుండి ఐదేళ్ల కాలం పాటు చెల్లుతుంది. దీన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరు "మై ఫాస్ట్ ట్యాగ్" మొబైల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ లో మీ వివరాలు, ఫాస్టాగ్ వివరాలు సమర్పించిన తర్వాత ఆక్టివేట్ చేసుకోవచ్చు. ఆర్సి లేకుండా ఫాస్టాగ్ తీసుకోవచ్చా? ఆర్సి లేకుండా ఫాస్టాగ్ తీసుకోలేము. ఆర్సి అనగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ఫాస్టాగ్ తిసుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగి ఉండాలి. ఫాస్ట్ ట్యాగ్ బదిలీ చేయవచ్చా? మీ వాహనం యొక్క ఫాస్టాగ్ మరెవరికీ బదిలీ చేయకూడదు. మీరు వాహనాన్ని విక్రయిస్తుంటే మీ వాహనం యొక్క ఫాస్టాగ్ ఖాతాను నిలిపివేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ ను ఎలా రీఛార్జ్ చేసుకోవాలి? ఫాస్టాగ్ డిజిటల్ వాలెట్ ను క్రెడిట్, డెబిట్ కార్డులు లేదా యూపీఐ, నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలతో రీచార్జ్ చేసుకోవచ్చు. పేటీఎం, ఫోన్ పే, గూగుల్‌పే వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లా ద్వారా కూడా ఫాస్టాగ్ వాలెట్ ను రీచార్జి చేసుకోవచ్చు. ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి ఎవరికి మినహాయింపు? న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, ఎమర్జెన్సీ సర్వీస్ వర్కర్స్ ఫాస్టాగ్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వీరికి ఫాస్టాగ్ చెల్లింపుల నుంచి మినహాయింపు లభిస్తుంది. -
ఫాస్టాగ్, సమయం ఉంది మిత్రమా..
సాక్షి, విశాఖపట్నం : జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద అన్ని లైన్లలోనూ ఫాస్టాగ్ ద్వారానే వాహనాల నుంచి టోల్‌ట్యాక్స్ వసూలు విధానం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి అమలు కానుంది. వాస్తవానికి జనవరి 1వ తేదీ నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండగ నేపథ్యంలో సెలవులకు దూరప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రాకపోకలు సాగించే వాహనాలను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును పొడిగించింది. ఆ మేరకు టోల్‌ప్లాజాల వద్ద ప్రస్తుతం ఉన్నట్లుగానే ఒక్క క్యాష్ లైను కొనసాగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీలోగా ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్లు శత శాతం పూర్తి చేయాలనే లక్ష్యంతో వాహనదారుల్లో అవగాహన కలిగించడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫాస్టాగ్ అనేది ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానం. దీన్ని కొనుగోలు చేసి ఆ యాప్‌ను అప్లోడ్ చేసుకుంటే టోల్ నగదు రూపంలో చెల్లించనక్కర్లేదు. వాహనదారులు టోల్‌ప్లాజా వద్ద ఆగకుండా గేట్లలో నుంచి నేరుగా వెళ్లిపోవచ్చు. వాహనం అద్దంపై ఉన్న ఫాస్టాగ్ స్టిక్కర్‌ను స్కానర్లు గ్రహించడం ద్వారా టోల్ రుసుం ఫాస్టాగ్ కార్డు నుంచి చెల్లింపు జరుగుతుంది. ఏడాది కిందటే ఈ విధానం అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటివరకూ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాల సంఖ్య 80 శాతం మాత్రమే ఉంది. వీటి కోసం టోల్‌ప్లాజాల వద్ద మూడు గేట్లు కేటాయించారు. నగదు రూపేణా టోలు చెల్లించే వాహనదారులకు ఒకే ఒక్క లైన్ ఉంది. దీంతో అక్కడ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఒక్కోసారి ఆ వాహనాలు ఫాస్టాగ్ లైన్లలోకి వెళ్లిపోతుండడంతో ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ వాహనాలకు అడ్డంకి ఏర్పడుతోంది. దీనివల్ల కాలహరణే గాకుండా వివాదాలకు కారణమవుతోంది. ఈ దృష్ట్యా జనవరి 1వ తేదీ నుంచి టోల్‌ప్లాజాల వద్దనున్న అన్ని లైన్లనూ ఫాస్టాగ్‌గా మార్చేయాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రజాప్రతినిధులు, కొన్ని అసోసియేషన్ల నుంచి విజ్ఞాపనలు రావడంతో ఈ గడువును ఫిబ్రవరి 15వ తేదీ వరకూ పొడిగించింది. (ఫాస్టాగ్ ఉంటేనే రాయితీలు) ‘లోకల్’ వాహనాలతోనే ఇబ్బంది జిల్లాలో నక్కపల్లితో పాటు విశాఖ నగరంలో అగనంపూడి, పోర్టు అనుసంధాన మార్గంలోని పంచవటి, డాక్‌యార్డు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. నక్కపల్లి టోల్‌ప్లాజా రాజమండ్రి రీజియన్‌లో ఉంది. మిగతా మూడు విశాఖ రీజియన్ పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని టోల్‌ప్లాజాల్లో అగనంపూడి, నక్కపల్లి జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 16)పై ఉండడంతో ఇవి ఎంతో కీలకమైనవి. కరోనా నేపథ్యంలో సొంత లేదా అద్దె కార్లలో ప్రయాణించేవారి సంఖ్య పెరిగింది. ప్రస్తుతం అగనంపూడి వద్ద సగటున రోజుకు 75 వేల వాహనాల తాకిడి ఉంటోంది. వాటిలో ప్రస్తుతం ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్నవి 80 శాతం వరకే ఉంటున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాల్లో అధిక శాతం స్థానికంగా తిరిగేవేనని ఎన్హెచ్ఏఐ అధికారులు గుర్తించారు. వాహనదారులంతా ఫాస్టాగ్ తీసుకుని సహకరిస్తే జాతీయ రహదారిపై ప్రయాణంలో కాలహరణ లేకుండా ఉంటుందని చెబుతున్నారు. ఫాస్టాగ్ ట్యాగ్‌లపై అవగాహన కల్పిస్తున్నాం స్థానిక వాహనదారులు తాము ఎక్కువగా ప్రయాణించే ప్రాంతంలోని టోల్‌ప్లాజాకు మాత్రమే వర్తించేలా ఫాస్టాగ్ ట్యాగ్ తీసుకుంటే సరిపోతుంది. టోల్‌ప్లాజాలతో పాటు ఎన్హెచ్పైనున్న పెట్రోల్ పంపులు, ఆర్టీవో కార్యాలయాలు, ట్రాన్స్‌పోర్టు హబ్‌లు, ప్రజాసేవా కేంద్రాలు (సీఎస్సీ), బ్యాంకుల వద్ద ఫాస్టాగ్ ట్యాగ్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశాం. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం, బ్యాంకింగ్ మొబైల్ యాప్స్, మై ఫాస్టాగ్ యాప్, సుఖద్‌యాత్ర యాప్‌తో పాటు ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దీనిపై వాహనదారుల్లో అవగాహన కలిగించడానికి ప్రయత్నిస్తున్నాం. – పి.శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ విశాఖ రీజియన్ -
వాహనదారులకు కేంద్రం శుభవార్త
న్యూఢిల్లీ: వాహనదారులకు శుభవార్త తెలిపింది కేంద్ర ప్రభుత్వం. గతంలో జనవరి 1 నుండి ఫాస్ట్‌టాగ్ ను తప్పని సరిచేస్తూ తీసుకున్న నిబంధనలను మరోసారి సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం ఫాస్ట్‌టాగ్ ఉపయోగించి జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల వసూలు చేయడానికి గడువును రోడ్డు రవాణా మరియు రహదారి మంత్రిత్వ శాఖ పొడిగించింది. ఈ గడువు మొదట జనవరి 1, 2021 వరకు ఉండేది. తాజాగా ఫిబ్రవరి 15, 2021 వరకు పొడిగించబడింది. అసలు గడువు ప్రకారం, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనవరి 1 నుండి టోల్ ప్లాజాలలో ఫాస్ట్ ట్యాగ్ చెల్లింపుకు పూర్తిగా మారాలని నిర్ణయించారు.(చదవండి: అమెజాన్‌లో 'మెగా శాలరీ డేస్' సేల్) ప్రస్తుతం, ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చేసిన లావాదేవీల వాటా 75-80 శాతం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫీబ్రవరి 15 నుండి 100 శాతం నగదు రహిత రుసుము వసూలు చేయాలనీ కేంద్రం భావిస్తుంది. ప్రభుత్వం ఇంకో వైపు సింగల్ లేన్ మినహా అన్ని దారులను ఫాస్ట్ ట్యాగ్ లేన్లుగా మార్చాలని చూస్తుంది. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా చూడటం వల్ల ఇటు ఇంధనంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది అని కేంద్రం పేర్కొంది. -
జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైనవి..
న్యూఢిల్లీ: చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2021 జనవరి 21 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతుంది. అలాగే ఎల్పీజీ సిలిండర్ ధరలు, జీఎస్టీ, యుపీఐ లావాదేవీల చెల్లింపు, వాట్సాప్ వంటి ఇలా సామాన్యుల జీవితాల్లో బాగా ప్రభావం చూపే చాలా నిబంధనలు జనవరి 1 నుంచి మారబోతున్నాయి. 2021 జనవరి 1 నుంచి రాబోయే కొత్త నిబంధనలు సామాన్యుని జీవితాన్ని బాగా ప్రభావితం చేయబోతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఈ మార్పుల గురుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. జనవరి 1 నుండి మారబోయే అతి ముఖ్యమైన కొన్ని నియమాలు ఇక్కడ ఉన్నాయి. చెక్ పేమెంట్ సంబంధించి మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2021 జనవరి 21 నుండి 'పాజిటివ్ పే సిస్టం' పేరిట కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. ఈ నూతన నిబంధన ద్వారా రూ.50 వేలకు పైబడిన చెక్ ఇచ్చినప్పుడు రీ కన్ఫర్మేషన్ చేసుకోవడం తప్పనిసరి చేసింది. ఇది వినియోగదారుడి అభీష్టానుసారం ఉంటుంది. అలాగే రూ.5 లక్షలకు మించి అంతకంటే ఎక్కువ మొత్తానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో చెక్కులను తప్పనిసరి చేయాలని బ్యాంకులకు సూచించింది. కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఆర్బిఐ వాటి చెల్లింపుల పరిమితిని పెంచనున్నట్లు తెలిపింది. ఈ కొత్త నిబంధనలు 2021 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న లావాదేవీల పరిమితిని రూ.2,000 నుంచి రూ.5 వేలకు పెంచనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో ఈ డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్స్‌ని ఉపయోగించుకునేందుకు వినియోగదారులు కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించాలని పేర్కొంది. ఇందుకోసం ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9 కన్న పాత ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తున్న మొబైల్స్‌లో వాట్సాప్ సేవలు నిలిపివేయనున్నట్లు సంస్థ పేర్కొంది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల నేపథ్యంలో ప్రతికూల ప్రభావాన్ని అధిగమించడానికి కారు కంపెనీలైన మహీంద్రా, మారుతి సుజుకి ఇండియా కంపెనీలు తమ వాహనాల ధరలను జనవరి 1 నుండి పెంచనున్నట్లు తెలిపాయి. దేశంలో ల్యాండ్లైన్ల నుండి మొబైల్ ఫోన్లకు కాల్ చేయడానికి త్వరలో '0' నెంబర్ ను జోడించాల్సి ఉంటుంది అని ట్రాయ్ తెలిపింది. కొత్త వ్యవస్థను అమలు చేయడానికి జనవరి 1లోగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని టెల్కోస్‌ను టెలికాం విభాగం కోరింది. జనవరి 1, 2021 నుండి అన్ని ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేస్తూ కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 1, 2017లోపు అమ్మిన ఎం, ఎన్ క్లాస్ నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసింది. దీని కోసం 1989 సెంట్రల్ మోటారు వాహనాల నియమాలు సవరించారు. దీనికి సంబంధించి నవంబర్ 6న మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే నుండి లావాదేవీలపై వినియోగదారులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 1 నుండి థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు నిర్వహిస్తున్న యుపీఐ చెల్లింపు సేవ (యుపీఐ చెల్లింపు) పై అదనపు ఛార్జీ విధించాలని ఎన్పీసీఐ నిర్ణయించినట్లు తెలిసింది. కొత్త సంవత్సరం నుంచి థర్డ్ పార్టీ యాప్‌లపై ఎన్పీసీఐ 30 శాతం పరిమితిని విధించింది. ఈ ఛార్జీని చెల్లించడానికి పేటీమ్ అవసరం. గూగుల్ తన పేమెంట్ అప్లికేషన్ గూగుల్ పే వెబ్ యాప్‌ని 2021 జనవరి1 నుంచి నిలిపివేయనున్నట్లు తెలుస్తుంది. అలాగే గూగుల్ పే ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ పేమెంట్ సిస్టమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల చెల్లింపులు చేసినప్పుడు మనీ ట్రాన్స్ఫర్ కోసం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మరీ ఈ విషయంపై గూగుల్ స్పందించలేదు. చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లలో ముడి రేట్లను బట్టి ప్రతి నెల మొదటి రోజు ఎల్పీజీ ధరలను సవరించనున్నారు. ఈ కొత్త నిబంధన 2021 జనవరి 1 నుంచి అమలులకి రానుంది. 5 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న వ్యాపారాలు ప్రస్తుతం ట్రేడర్లు ఏడాదికి 12 రిటర్న్స్ దాఖలు చేసే బదులుగా జనవరి1 నుంచి నాలుగు జీఎస్టీ సేల్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే సరిపోతుంది. కొత్త రూల్స్ అమలులోకి వచ్చినప్పటి నుండి పన్ను చెల్లింపుదారులు కేవలం 8 రిటర్న్స్ మాత్రమే దాఖలు చేయొచ్చు. ఇందులో 4 జీఎస్టీఆర్ 3జీ, 4 జీఎస్టీఆర్ 1 రిటర్న్స్ ఉంటాయి. దీంతో 94 లక్షల జీఎస్టీ చెల్లింపుదారులకు ఊరట కలుగనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది చిన్న వ్యాపారులకి ఊరట కలగడం విశేషం. -
అలర్ట్.. జనవరి నుంచి ఇది మస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అన్ని రకాల ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. రవాణా వాహనాలకు ఫాస్టాగ్ పునరుద్దరించిన తర్వాతే ఫిట్మెంట్ సర్టిఫికెట్ జారీ చేయడం తప్పనిసరి అని చేసినట్లు తెలిపింది. కాబట్టి ఇకపై ప్రతి నాలుగు చక్రాల వాహనం ఫాస్టాగ్ చేయించుకోవాల్సిందే. టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం 2017 నుంచి అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని రకాల ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరైంది. -
పాత వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి
న్యూఢిల్లీ : టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానాన్ని త్వరలోనే పూర్తిగా నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఫాస్టాగ్ మొదలైన తర్వాత కూడా ఇంకా 40 శాతం మంది వాహనదారులు టోల్ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2021 జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు సెంట్రల్ మోటర్ వెహికల్స్ నిబంధనలకు రహదారి రవాణా శాఖ సవరణలు ప్రతిపాదించింది. సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరుతూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. (ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్) -
ఫాస్టాగ్ ఉంటేనే రాయితీలు
సాక్షి, హైదరాబాద్: టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానాన్ని త్వరలోనే పూర్తిగా నిలిపివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టోల్ రుసుము మొత్తం ఫాస్టాగ్ విధానంలో చెల్లించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫాస్టాగ్ మొదలైన తర్వాత కూడా ఇంకా 40 శాతం మంది వాహనదారులు టోల్ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తున్నారు. దీన్ని పూర్తిగా నియంత్రించి క్రమంగా వాహనదారులంతా ఫాస్టాగ్ పొందేలా కొన్ని నెలలుగా ముమ్మ రంగా ప్రచారం చేస్తోంది. అయినప్పటికీ వాహనదారుల్లో ఇంకా ఆశించిన స్థాయి స్పందన ఉండడం లేదని భావిస్తున్న కేంద్రం ఉపరితల రవాణా శాఖ క్రమంగా నగదు చెల్లించేవారిని నియంత్రించేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటోంది. ఈ క్రమంలోనే టోల్ చెల్లింపులో ఉన్న రాయితీలన్నింటినీ కేవలం ఫాస్టాగ్ చెల్లింపుదారులకే పరిమితం చేయాలని నిర్ణయించించింది. వాస్తవానికి ఈ నిర్ణయం లాక్డౌన్ కంటే ముందే తీసుకున్నా దాని అమలు పూర్తిస్థాయిలో ప్రారంభించలేదు. తాజాగా దీనికి సంబంధించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఓ గెజిట్ విడుదల చేసింది. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులను కేంద్రం ఆదేశించింది. రాయితీలు ఇవే.. ⇒ 24 గంటల్లో వస్తే తగ్గింపు హుళక్కే టోల్గేట్ దాటిన ఇరవై నాలుగు గంటల్లోనే తిరుగుప్రయాణంలో వస్తే రాయితీ ఉంది. తిరుగు ప్రయాణపు టోల్ చార్జీలో 50 శాతం రాయితీ ఉంటుంది. ఇప్పటివరకు వాహనదారులంతా ఇది పొందుతున్నారు. ఇక నుంచి ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు మాత్రమే దీన్ని పొందే అవకాశం ఉంది. ఫాస్టాగ్ లేకుండా నగదు ద్వారా టోల్ ఫీజు చెల్లించే వాహనదారులు పూర్తి చార్జీని భరించాల్సిందే. ⇒ లోకల్ డిస్కౌంట్ కూడా.. టోల్‌గేట్‌కు 10 కిలోమీటర్ల పరిధిలో ఉండే వాహనదారులకు ప్రత్యేక లోకల్ డిస్కౌంట్ వసతి ఉంది. టోల్ రుసుములో నిర్ధారిత మొత్తం రాయితీ రూపంలో తగ్గింపు లభిస్తుంది. దాన్ని స్థానికులు పొందుతున్నారు. ఇప్పుడు ఇది కూడా ఫాస్టాగ్ ఉంటేనే పొందే అవకాశం ఉంది. ⇒ నెలవారీ పాస్‌కు ఫాస్టాగ్ క్రమంగా టోల్ గేట్లు ఉన్న రోడ్లపై ప్రయాణించేవారు నెలవారీ పాస్‌లు పొందు తుంటారు. ఒకేసారి నెల చార్జీ చెల్లిస్తుండడంతో టోల్‌లో కొంత తగ్గుదల ఉంది. ఇప్పుడు ఆ పాస్‌లను కేవలం ఫాస్టాగ్ ఉన్నవారికి మాత్రమే ఇస్తారు. మిగతా వారు ఏరోజుకారోజు చెల్లించాల్సిందే. దీంతో వారికి టోల్ భారం పెరుగుతుంది. ⇒ త్వరలో అన్ని గేట్లూ ఫాస్టాగ్‌కే నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం రహదారులపై టోల్ ఫీజు విషయంలోనూ దాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతోపాటు రోడ్లపై నగదు రూపంలో టోల్ చెల్లించాల్సి రావడంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీన్ని నియంత్రించి గేట్ల వద్ద వాహనాలు నిలపాల్సిన పని లేకుండా ఫాస్టాగ్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే -
ఔటర్‌పై ఇక రైట్..రైట్..
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ఎట్టకేలకు అన్ని వాహనాల రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ పడింది. తాజా లాక్డౌన్ ఆదేశాల (జీవో 68) ప్రకారం 158 కిలోమీటర్ల రహదారిపై అనుమతి ఉన్న అన్ని వాహనాలకు ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు, భారీ వాహనాలకు మాత్రం 24 గంటల పాటు రాకపోకలు సాగించొచ్చని హెచ్ఎండీఏ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు సంయుక్త ఆదేశాలిచ్చారు. అయితే మంగళవారం నుంచే ఓఆర్ఆర్పై అన్ని వాహనాల రాకపోకలకు ఎంట్రీ ఇవ్వకపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని, నిర్ణయం తీసుకోవడంలో ఇరు ప్రభుత్వ విభాగాలు తాత్సారం చేస్తున్న అంశాలను ప్రస్తావిస్తూ ‘ఔటర్‌పై డౌట్’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన హెచ్ఎండీఏ అధికారులు అన్ని వాహన రాకపోకలకు బుధవారం రాత్రి 12 గంటల నుంచి అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే విషయాన్ని సైబరాబాద్, రాచకొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాహన రాకపోకలపై మార్గదర్శకాలు విడుదల చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నిత్యావసర సరుకులు, అత్యవసర వైద్యసేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేదని, ఇక నుంచి అన్ని వాహనాల రాకపోకలు సాగుతాయని, అయితే కొన్ని అంక్షలు ఉంటాయని పేర్కొన్నారు. (చదవండి: ఔటర్‌పై డౌట్!) రాత్రిళ్లు అనుమతి లేదు.. రాజధానితో పాటు శివారు ప్రాంతాల రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఓఆర్ఆర్లో వాహన రాకపోకలను అనుమతిచ్చారు. అయితే చిన్న, తేలికపాటి వాహనాలు (కారులు, చిన్న సరుకు రవాణా వాహనాలు) కర్ఫ్యూ సమయమైన రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించరు. ఎక్కువ వేగంతో వెళ్లే వాహనాలు తక్కువ వేగంతో వెళ్లే వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉండటంతో రాత్రి సమయాల్లో రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలను విశ్రాంతి కోసంఓఆర్ఆర్పై నిలిపేస్తున్నారు. ఆ సమయంలో వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీ కొడితే రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉండటంతో చిన్న, తేలికపాటి వాహన రాకపోకలను రాత్రి పూట నిషేధించారు. నిబంధనలు పాటించాల్సిందే.. ఓఆర్ఆర్పై తొలి 2 లేన్లు (సెంట్రల్ మీడియన్‌కు పక్కనే ఉండే కుడివైపు లేన్లు) గంటకు 100 కిలోమీటర్ల వేగంతో, ఎడమవైపు లేన్లలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. ప్రయాణికులను తీసుకెళ్లే గూడ్స్ వెహికల్స్‌ను ఓఆర్ఆర్లో అనుమతించరు. అలాంటి వాటి వివరాలను టోల్ సిబ్బంది సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి అప్పజెప్పుతారు. ‘సురక్షితమైన ప్రయాణం కోసం ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలి. వేగ పరిమితి మించొద్దు. లేన్ రూల్స్ అనుసరించాలి. గతంలోలాగే స్పీడ్ లేజర్ గన్ కెమెరాలతో వాహనాలు వేగాన్ని పసిగట్టి ఈ–చలాన్లు జారీ చేస్తాం’అని సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు విజయ్‌కుమార్, దివ్యచరణ్రావు తెలిపారు. ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకే ప్రాధాన్యం ప్రజారోగ్య రక్షణ చర్యల్లో భాగంగా ఓఆర్ఆర్ టోల్గేట్ నిర్వహణ సిబ్బంది భద్రతా చర్యలు పాటించాలని హెచ్ఎండీఏ నిర్దేశించింది. ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ టాగ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్ పద్ధతిలో ఫాస్ట్‌టాగ్ చెల్లింపులకు అవకాశం ఉంటుంది. వాహనదారులు వీలైనంత మేరకు నగదు రహిత లావాదేవీలు చెల్లించాలని హెచ్ఎండీఏ సూచించింది. -
‘ఫాస్టాగ్’ తిప్పలు
సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు తుక్కగూడ నుంచి బొంగళూర్ గేట్ వరకు సాధారణంగా కారుకు టోల్‌ఫీజు రూ.20 వసూలు చేస్తారు. అయితే ఫిబ్రవరి 27న తుక్కుగూడ నుంచి బొంగళూరు వరకు ఫాస్టాగ్ ద్వారా వెళ్లిన ఏపీ29 బీకే 0789 కారుకు మాత్రం రూ.70లు కార్డు నుంచి కట్ అయ్యాయి. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం రూ.20 టోల్ రుసుం కట్ అయింది. ...ఇది మచ్చుకు ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు ఎదుర్కొంటున్న సమస్యకు ఒక ఉదాహరణ మాత్రమే. నిత్యం లక్షా 30వేలకు పైగా వాహనాలు వెళుతున్న 158 కిలోమీటర్ల ఈ మార్గంలో చాలామంది వాహనదారులకు ఈ సమస్యలు నిత్యకృత్యం అయ్యాయి. అయితే రూ.50లే కదా ఫిర్యాదు ఎందుకులే అని కొందరు తేలిగ్గా తీసుకుంటే... ప్రతిరోజూ ఆయా మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు మాత్రం ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఆయా టోల్గేట్ల వద్ద అడిగినా సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో మిన్నకుండిపోతున్న సందర్భాలు చాలానే ఉంటున్నాయి. కొంతమంది సిబ్బందేమో మళ్లీ డబ్బులు క్రెడిట్ అవుతాయని సర్దిచెబుతుండటంతో ఈ సమస్య హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ అనుబంధ విభాగమైన ‘హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్’ ఉన్నతాధికారుల దృష్టికి చేరడం లేదనే వాదన వినిపిస్తోంది. ఫాస్టాగ్‌తోనూ తప్పని తిప్పలు... కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్లో భాగంగా ఫాస్టాగ్ వసూలు వ్యవస్థను గతేడాది ఆగస్టు నుంచి ఓఆర్ఆర్లో అమల్లోకి తీసుకొచ్చారు. అంతకుముందు ఏడాది పాటు ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్‌ను ట్రయల్ రన్ నిర్వహించిన సమయంలో సిబ్బందికి సరైన అవగాహన లేక సాంకేతిక కారణాలతో అడపాదడపా అమలును వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు గతేడాది ఆగస్టు నుంచి అమలు చేస్తున్నా సాంకేతిక సమస్యలు మాత్రం తీరడం లేదు. ఆయా ఫాస్టాగ్ కార్డులు కొన్ని సందర్భాల్లో స్కాన్ కాకపోవడం వల్ల వాహనాలు బారులు తీరుతున్నాయి. చాలాసార్లు అధికారులు క్విక్‌రెస్పాన్స్‌తో సమస్యను పరిష్కరిస్తున్నారు. ఒక్కో మార్గం నుంచి మరో మార్గం వరకు నిర్దిష్ట రుసుం రూ.20, రూ.30లు ఉంటే రూ.70లు ఆయా వాహనదారుల ఫాస్టాగ్ కార్డుల నుంచి కట్ అవడం విస్మయం కలిగిస్తోంది. ముఖ్యంగా పేమెంట్స్ యాప్‌ల ద్వారా ఆయా ఫాస్టాగ్ కార్డులు రీచార్జ్ చేస్తున్న వారికి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టుగా ఓఆర్ఆర్ విభాగాధికారులకు అందుతున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తోంది. ఈ సాంకేతిక సమస్యలపై ఇప్పటికే ఆయా పేమెంట్స్ యాప్‌ల దృష్టికి ఉన్నతాధికారులు తీసుకెళ్లినా.. ఆశించినంత స్పందన రాలేదని తెలిసింది. పరిమితికి మించి మీ ఫాస్టాగ్ కార్డుల ద్వారా నగదు కట్ అయితే ఫిర్యాదు చేయాలని, తక్షణ పరిష్కారం లభించేలా చూస్తామని అధికారులు అటున్నారు. వాహనదారులు తికమక పడవద్దు... ఆర్ఎఫ్ఐడీ ఫాస్టాగ్ ఉపయోగించే వాహనదారుల కోసం ఆయా టోల్గేట్ల వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించాం. అలా కాకుండా కొందరు ఫాస్టాగ్ ఉన్న వాహనదారులు మాన్యువల్ లేన్‌లోకి వెళ్లి అక్కడి సిబ్బందికి కార్డు చూపించి స్లిప్ తీసుకొని వెళుతున్నారు. దీంతో ఫాస్టాగ్ కార్డును అక్కడి సాంకేతిక వ్యవస్థ రీడ్ చేయడం లేదు. ఫలితంగా వారు ఎక్కడైతే టోల్గేట్ నుంచి దిగిపోతారో వారికి ఎంట్రీ అయిన ప్రదేశాన్ని సాంకేతిక వ్యవస్థ గుర్తించక ఎగ్జిట్ అయిన ప్రాంతం వద్ద రూ.70లు కట్ అవుతున్నట్టుగా మెసేజ్‌లు వెళుతున్నాయి. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్కు రూ.140 టోల్ రుసుం కాబట్టి ఇలా సగం కట్ అవుతుంది. మీ ప్రయాణ దూరాన్ని బట్టి కాకుండా, అంతకుమించి ఎక్కువగా డబ్బులు కట్ అవుతే మాత్రం మా టోల్గేట్ వద్ద ఫిర్యాదుచేయండి. సమస్యను పరిష్కరిస్తాం.–రవీందర్ రెడ్డి, హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాధికారి -
‘స్లో’ట్యాగ్!
ఇది హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న రాజధాని బస్సు. దానికి ఫాస్టాగ్ ఉంది. టోల్‌ప్లాజాలో అక్కడి సెన్సార్ దాన్ని స్కాన్ చేసి రుసుము డిడక్ట్ చేసుకుని క్షణాల వ్యవధిలో గేట్ తెరుచుకోవాల్సి ఉంది. కానీ సెన్సార్లు ఆ పని చేయకపోవటంతో టోల్‌ప్లాజా సిబ్బంది హ్యాండ్‌హెల్డ్ యంత్రం ద్వారా స్కాన్ చేసే ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాకపోవటంతో ఆ యంత్రాన్ని డ్రైవర్ చేతికే ఇచ్చారు. ఆయన కాసేపు అటూఇటూ కదిలిస్తూ తిప్పలుపడితేగాని పని కాలేదు. ఇందుకు ఐదారు నిమిషాల సమయం తీసుకుంది. ఈలోపు వెనక వాహనాలు నిలిచిపోయాయి. ఇది ఈ ఒక్క బస్సుకు ఎదురైన సమస్య కాదు. దాదాపు అన్ని బస్సులది ఇదే సమస్య.. – సాక్షి, హైదరాబాద్ కొత్తగా ఓ పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే దాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలియాలి. అందుకు కొంత నేర్పు, అవగాహన, శిక్షణ అవసరం. ఇవేవీ లేకుండా ఆ పరిజ్ఞానాన్ని వినియోగిస్తే కొత్త ఇబ్బందులు రావటమే కాకుండా అభాసుపాలు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫాస్టాగ్ విషయంలో ఇదే జరుగుతోంది. పాత పద్ధతిలో నగదు చెల్లించి టోకెన్ తీసుకునేందుకు పట్టే సమయం కంటే, ఫాస్టాగ్ వచ్చాక ట్యాగ్ స్కానింగ్‌కు ఎక్కువ సమయం పట్టాల్సి రావటం విశేషం. ఆర్టీసీ బస్సులు, కొన్ని ఇతర ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతోంది. టోల్గేట్ల పైభాగంలో ఉండే స్కానర్లు వీటి ట్యాగ్‌లను స్కాన్ చేయలేకపోతున్నాయి. ఎక్కడ అతికించాలో తెలియదు.. కేంద్ర ఉపరితల రవాణాశాఖ గడువు విధించి మరీ ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంతకు కొన్ని నెలల ముందు నుంచే ప్రయోగాత్మకంగా దాన్ని అమలు చేయటం కూడా ప్రారంభించింది. నగదు చెల్లించే వాహనాలకు సంబంధించి కేవలం ఒక్క లేన్ మాత్రమే అందుబాటులో ఉంచుతామని, మిగతావన్నీ ఫాస్టాగ్ అతికించిన వాహనాలకే కేటాయిస్తామని, ట్యాగ్ లేని వాహనాలు టోల్ చెల్లించేందుకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటుందంటూ ప్రకటనల రూపంలో ప్రచారం కూడా చేసింది. దీంతో వాహనదారులు హడావుడిగా ట్యాగ్ కొంటూ వచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొన్న ట్యాగ్‌ను వాహనానికి ఎక్కడ అతికించాలనే విషయంలో చాలామందికి అవగాహన లేకుండా పోయింది. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. కార్లతో పోలిస్తే పెద్ద వాహనాల్లో ఈ సమస్య ఏర్పడింది. ట్యాగ్‌ను తోచిన చోట అతికించటంతో స్కానర్లు దాన్ని గుర్తించటం లేదు. పెద్ద వాహనాలకు ఆ చోటనే.. లారీలు, బస్సులు లాంటి పెద్ద వాహనాలకు ఫాస్టాగ్‌ను ముందు వైపుండే ఎడమ అద్దానికి దిగువ భాగంలో డ్రైవర్ వైపు అతికించాలి. సెన్సార్లు గుర్తించే స్థలం ఇదే. ఆటోమేటిక్‌గా స్కాన్ చేసి గ్రీన్‌సిగ్నల్ చూపి గేట్‌ను ఓపెన్ చేస్తుంది. కానీ చాలామంది డ్రైవర్ ముందుండే అద్దం పైభాగంలో అతికిస్తున్నారు. ఫలితంగా సెన్సార్లు మొండికేస్తున్నాయి. ఇక కార్లకు అయితే అద్దంపై భాగంలో అతికించాలి. అక్కడ ఉంటేనే సెన్సార్లు గుర్తిస్తాయి. ఆర్టీసీ స్టిక్కర్లు పాతబడి.. ఇటు స్టిక్కర్లు తప్పుడు ప్రాంతాల్లో అతికించటం వల్ల ఏర్పడ్డ సమస్యకు తోడు ఆర్టీసీ బస్సుల్లో మరో ఇబ్బంది వచ్చిపడింది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 2017లోనే ఆర్టీసీ కొన్ని దూర ప్రాంత బస్సులకు ఫాస్టాగ్‌లు తీసుకుంది. ఇప్పుడు అవి పాతబడిపోయాయి. బస్సు అద్దాలను కడిగే సమయంలో చాలా ట్యాగ్లు స్వల్పంగా దెబ్బతింటూ వచ్చాయి. దీంతో సెన్సార్లు వాటిని గుర్తించటం లేదు. కొన్ని బస్సులకు ట్యాగ్ ఉండి కూడా డ్రైవర్లు నగదు చెల్లించి పాత పద్ధతిలో టోకెన్ తీసుకోవాల్సి వస్తోంది. సమస్యను గుర్తించాం.. ‘ఆర్టీసీ బస్సుల్లో ఎదురవుతున్న సమస్యను గుర్తించాం. తప్పుడు చోట్ల అతికించిన వాటిని తొలగించి సరైన స్థానంలో అతికించుకోవాలని ఆర్టీసీకి సూచించాం. దీంతోపాటు పాతబడ్డ ట్యాగ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసుకోవాలని కూడా పేర్కొన్నాం. గతంలో ట్యాగ్ అతికించిన కొన్ని బస్సులు ఇతర డిపోలకు మారటంతో వాటికి అక్కడ కొత్త ట్యాగ్లు తీసుకున్నారు. ఇలా రెండు ఉండటం వల్ల కూడా సమస్య ఎదురవుతోంది. మిగతా బస్సులకు కూడా ట్యాగ్లు ఏర్పాటు చేసే విషయంలో సోమవారం బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ లోపాలపై చర్చించి ఆర్టీసీ అధికారులకు సూచనలు జారీ చేశాం..’ – ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ -
ఈ నెలాఖరు వరకు ఉచిత ఫాస్టాగ్
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ టోల్ సేకరణను మరింత మెరుగుపరచడం కోసం ఈ నెలాఖరు వరకు ఫాస్టాగ్‌లను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే వాహనానికి ఫాస్టాగ్ తప్పనిసరి కాగా, ఈ ఏర్పాటు నిమిత్తం వసూలు చేస్తున్న రూ. 100 చార్జీని ఈ నెల 15 నుంచి 29 వరకు ఎత్తివేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులు తమ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ)ని జాతీయ రహదారి ఫీజు ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, పెట్రోల్ పంపులు వంటి ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాయింట్ ఆఫ్ సేల్ వద్ద చూపించి ఫాస్టాగ్‌ను పొందవచ్చని వివరించింది. మైఫాస్టాగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని దగ్గర్లోని సెంటర్‌ను తెలుసుకోవచ్చు. ఇక ఫాస్టాగ్ వాలెట్లో సెక్యూరిటీ డిపాజిట్, కనీస బ్యాలెన్స్ వంటి మిగిలిన అంశాల్లో మార్పులు లేవని స్పష్టంచేసింది. -
ఫాస్టాగ్ లేకుంటే సబ్సిడీ రద్దు ..
కడప సిటీ : ఫాస్టాగ్ నిబంధనలను కేంద్ర ఉపరితల రవాణాశాఖ కఠినతరం చేసింది. ఫాస్టాగ్ తీసుకోకుంటే తిరుగు ప్రయాణంలో ఇచ్చే 50 శాతం సబ్సిడీని రద్దు చేసింది. ఈ మేరకు ఆయా టోల్‌ప్లాజాలకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఎల్రక్టానిక్ టోల్ చెల్లింపు విధానం వైపు వాహనదారులు మొగ్గుచూపకపోవడంతో ఎలాగైనా నిబంధనలు కఠినతరం చేసి స్టిక్కర్లు కొనిపించాలని నిర్ణయానికి రావడం వల్లే ఈ ఆంక్షలను అమల్లోకి తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.పండుగకు ముందు రెండు, మూడు క్యాష్ కౌంటర్లు ఉండగా, తర్వాత అధికభాగం ఫాస్టాగ్ కౌంటర్లుగా మార్చి కేవలం ఒకే ఒక్క క్యాష్‌లైన్ ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని కూడా తీసి వేస్తామని పాలెంపల్లె టోల్‌ఫ్లాజా మేనేజర్ హర్షవర్ధన్ తెలిపారు. గడువు ఇచ్చినా... టోల్‌ప్లాజాల వద్ద క్యాష్ విధానం వల్ల గంటల తరబడి వాహనాలు నిలపాల్సి వచ్చేది.దీనివల్ల సమయం, వృథా, ఇంధనం ఖర్చు కూడా అవుతోంది. దీంతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ 2016లో ఫాస్టాగ్ స్టిక్కర్లను వాహనాలకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.స్టిక్కర్లో ఉన్న చిప్‌ను అక్కడున్న స్కానర్ స్కాన్ చేసి వారి అకౌంటులో ఉన్న మొత్తాన్ని జమ చేసుకుంటుంది. 2019 డిసెంబరు 1వ తేదీ నుంచి 15 వరకు ఫాస్టాగ్ స్టిక్కర్లను కొనుగోలు చేయాలని ఎన్హెచ్ఏఐ అధికారులు నిర్ణయించారు. మళ్లీ ఈ గడువును జనవరి 15, 2020 వరకు పొడిగించారు. కానీ వాహనదారులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేదు. ఇప్పటివరకు జిల్లాలో కేవలం 52 శాతం మాత్రమే ఫాస్టాగ్ స్టిక్కర్లు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో నిబంధనలను కఠినతరం చేస్తూ వస్తున్నారు. జనవరి 15వ తేదీ నుంచి ఒకే క్యాష్‌లైన్ ఏర్పాటు చేయడం, తిరుగు ప్రయాణంలో సబ్సిడీని ఎత్తివేయడం వంటి అంశాలను తీసుకొచ్చారు. నగదు చెల్లించే వారు 24 గంటల్లో తిరిగి వచ్చినా మొత్తం టోల్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. అదే ఫాస్టాగ్ స్టిక్కర్లు కలిగి ఉంటే 50 శాతం సబ్సిడీ వారికి ఉంటుంది. జాతీయ రహదారులపై రెగ్యులర్‌గా తిరిగే వాహనదారులకు నెలవారీ పాసులను కూడా జారీ చేస్తారు. దీనిని తీసుకుంటే టోల్ ఛార్జీల్లో తగ్గింపు ఉంటుంది. ఫాస్టాగ్ ఉంటేనే రాయితీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనిని సంక్రాంతి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. రాయితీ ఉండదు టోల్‌ప్లాజా వద్దకు 24 గంటల్లో తిరిగి వాహనం వస్తే 50 శాతం సబ్సిడీ మాత్రమే ఉంటుంది. ఫాస్టాగ్ స్టిక్కర్ లేకపోతే ఈ అవకాశం ఉండదు. ఇప్పటివరకు 51 శాతం ఫాస్టాగ్ స్టిక్కర్లను వాహనదారులు కొనుగోలు చేశారు. నిబంధనలు కఠినతరం చేయడం వల్ల వారం రోజుల్లో పూర్తి స్థాయిలో తీసుకుంటారని భావిస్తున్నాం. – హర్షవర్ధన్, మేనేజర్, పాలెంపల్లె టోల్‌ప్లాజా -
ఫాస్టాగ్ లేకుంటే రాయితీ కట్
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ తీసుకోకుంటే టోల్‌ప్లాజాల వద్ద క్యూలో ఎదురుచూడాల్సి రావటం ఇప్పటివరకు ఉన్న సమస్య.. కానీ ఇప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ క్రమంగా కొత్త ఆంక్షలను తెరపైకి తెస్తోంది. ఎంత ప్రయత్నించినా, ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం వైపు వాహనదారులు వేగంగా మళ్లకపోతుండటంతో, ఒత్తిడి తెచ్చి మరీ ఫాస్టాగ్స్ కొనిపించాలని నిర్ణయించింది. సంక్రాంతి వేళ కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఫాస్టాగ్ ఉంటేనే ఆ రాయితీ.. టోల్‌ప్లాజాల వద్ద రాయితీ చాలాకాలంగా అమల్లో ఉంది. టోల్గేట్ దాటి వెళ్లిన వాహనాలు 24 గంటల్లో తిరుగుప్రయా ణమై సంబంధిత టోల్ ప్లాజాకు చేరుకుంటే, రిటర్న్ టోల్‌ఫీజులో సగం రాయితీ ఉంటుంది. ఇప్పుడు ఈ రాయితీని ఫాస్టాగ్ వాహనాలకే వర్తింపచేస్తున్నారు. సంక్రాంతి నుంచి కొత్త విధానం అమల్లోకి వచ్చింది. నగదు రూపంలో టోల్ చెల్లించే వాహనాలకు ఇది వర్తించదు. నగదు చెల్లించే వారు 24 గంటల్లో తిరిగి వచ్చినా మొత్తం టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీ పాస్ రాయితీ కూడా.. జాతీయ రహదారులపై రెగ్యులర్ గా తిరిగే వాహనదారులకు నెలవారీ పాస్‌లనూ జారీ చేసే విధానం అమల్లో ఉంది. ఈ పాస్ తీసుకుంటే టోల్ చార్జీల్లో తగ్గింపు లభిస్తుంది. ఇప్పుడు ఈ పాస్‌లను కూడా ఫాస్టాగ్‌తో ముడిపెట్టారు. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానంలోనే ఇక రాయితీ వర్తిస్తుంది. ఫాస్టాగ్ లేకుంటే నెలవారీ పాస్ రాయితీ ఉండదు. అలాగే టోల్గేట్లకు 10 కి.మీ. పరిధిలో ఉండే వాహనదారులకు కూడా ప్రత్యేక రాయితీ పాస్ అమల్లో ఉంది. ఇప్పుడు ఈ పాస్‌ను కూడా ఫాస్టాగ్ ఉంటేనే రాయితీ వర్తించేలా మార్చారు. సంక్రాంతి నుంచి ఇదీ అమల్లోకి వచ్చింది. ఆ 2 టోల్ గేట్లు మినహా... సంక్రాంతి వరకు అమల్లో ఉన్న 25 శాతం హైబ్రిడ్ విధానం గడువు పొడిగింపునకు కేంద్రం సుముఖంగా లేదు. జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు నగదు చెల్లింపునకు వీలుగా ఉండేవి. వీటిల్లోంచి ఫాస్టాగ్ వాహనాలతోపాటు నగదు చెల్లించే వాహనాలు వెళ్లేవి. 14వ తేదీ అర్ధరాత్రితో ఈ గడువు తీరింది. దీంతో 15 నుంచి టోల్ ప్లాజాల వద్ద ఒక్కో వైపు ఒక్కో లేన్ మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయించారు. రాష్ట్రంలో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో 15 చోట్ల ఇదే విధానం అమల్లోకి వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉండే విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా, బెంగుళూరు హైవే మీదున్న రాయికల్ టోల్‌ప్లాజాలను దీని నుంచి మినహాయించారు. ఈ రెండు ప్లాజాల్లో మరో నెల రోజులు 25 శాతం హైబ్రీడ్ లేన్లు నగదు చెల్లించేందుకు అందుబాటులో ఉంటాయి. 1.12 లక్షలకు పెరిగిన ఫాస్టాగ్ వాహనాలు ప్రస్తుతం రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య 1.12 లక్షలకు పెరిగింది. సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లే సందర్భంలో ఎక్కువమంది ఫాస్టాగ్స్ కొనుగోలు చేయటంతో వాటి సంఖ్య కాస్త వేగంగా పెరిగింది. దీంతో టోల్‌ప్లాజాల నుంచి దూసుకెళ్తున్న మొత్తం వాహనాల్లో 54 శాతం వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నట్టైంది. టోల్ వసూళ్లలో వీటి వాటా 65 శాతానికి పెరిగింది. -
ఫాస్ట్ ట్యాగ్స్: టాప్‌లో పేటీఎం
సాక్షి, న్యూఢిల్లీ: చెల్లింపుల సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పీపీబి) ఫాస్ట్ ట్యాగ్ల జారీలో రికార్డు క్రియేట్ చేసింది. మూడు మిలియన్ ఫాస్ట్ ట్యాగ్‌లను జారీ చేశామని సంస్థ సోమవారం ప్రకటించింది. తద్వారా దేశంలో పెద్ద సంఖ్యలో ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన సంస్థగా నిలిచామని ప్రకటించింది. 'డిజిటల్ ఇండియా' లో భాగంగా తాము ఈ మైలురాయిని అధిగమించామని పేటీఎం సీఈవో సతీష్ గుప్తా వెల్లడించారు. దేశంలో డిజిటల్ టోల్ చెల్లింపులకు తమ వంతుగా చేస్తున్న కృషి కొనసాగుతోందని తెలిపారు. మార్చి నాటికి 5 మిలియన్ల వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ జారీని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైవేలపై టోల్ ప్లాజాల వద్ద చార్జీలు కట్టేందుకు గంటల తరబడి క్యూలు, చిల్లర చికాకులకు చెక్ పెట్టేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహణలో ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫాస్ట్ ట్యాగ్ అంటే జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల దగ్గర ఎలక్ట్రానిక్ పద్ధతిలో టోల్ ఫీజు వసూలు చేయడం. ప్రీపెయిడ్ లేదా పొదుపు ఖాతా నుండి నేరుగా లింక్ చేయబడిన పేటీఎం వాలెట్‌నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా టోల్ చెల్లింపులకు పేటీఎం బ్యాంకు మద్దతునిస్తుంది. దేశవ్యాప్తంగా 110 టోల్ ప్లాజాలలో ఆటోమేటిక్ నగదు రహిత చెల్లింపులను అనుమతిస్తుంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో 10వేల వ్యాపార కరస్పాండెంట్ల ద్వారా ఫాస్ట్ ట్యాగ్‌లను విక్రయిస్తోంది. అలాగే నగదు రహిత చెల్లింపు సౌలభ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి, వాణిజ్య వాహన యజమానులకు ట్యాగ్‌లను కొనుగోలులో సహాయపడటానికి, పేటీఎం బ్యాంక్ భారతదేశం అంతటా టోల్ ప్లాజాలలో 300 కి పైగా శిబిరాలను ఏర్పాటు చేసింది. టోల్ గేట్ నుంచి వెళ్లే ప్రతీ వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ ఉండాల్సిందే. లేకపోతే రెండింతలు టోల్ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. వేర్వేరు బ్యాంకులు, నేషనల్ హైవే టోల్ ప్లాజాలు, ఆర్టీఓలు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్పోర్ట్ హబ్స్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల దగ్గర్నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయొచ్చు. అలాగే ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, పేటీఎం పేమెంట్ బ్యాంక్, అమెజాన్‌లో కూడా ఫాస్ట్‌ట్యాగ్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్లో ఈ ట్యాగ్ల కొరత కారణంగా దీనిని జనవరి 15, 2020 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. -
‘ఫాస్ట్’గా వెళ్లొచ్చు!
సాక్షి, విశాఖపట్నం: వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద కష్టాలు తప్పనున్నాయి. దీనికి కారణం ఫాస్టాగ్ విధానం అమల్లోకి రానుండడమే. సాధారణంగా టోల్ ఫీజు చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనీసం ఐదు నిమిషాలు పడుతోంది. ఈ పరిస్థితిల్లో టోల్‌ప్లాజా వద్ద ఆగకుండానే వాహనాలు వెళ్లిపోవడానికి జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఎలక్ట్రానిక్ టోల్ వసూలు చేసేందుకు ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. విశాఖ శివారులోని అగనంపూడి సహా జిల్లాలోని నాలుగు టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక “ఫాస్టాగ్’లైన్లు ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ నగదు రూపేణా టోల్ చెల్లించి వెళ్లడానికి ఉన్న క్యాష్ లైన్లు తగ్గించేశారు. ఉదాహరణకు అగనంపూడి టోల్‌ప్లాజా వద్ద రాక, పోక మార్గాల్లో నాలుగేసి చొప్పున మొత్తం ఎనిమిది మార్గాలు ఉన్నాయి. వాటిలో రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి మాత్రమే క్యాష్ లైన్ ఉంటుంది. మూడేసి చొప్పున ఆరు లైన్లు ఫాస్టాగ్ ఉన్న వాహనాల కోసం కేటాయించారు. ఇప్పటివరకూ ఈ లైన్లలో ఫాస్టాగ్ ఉన్న వాహనాలే గాక నగదు రూపేణా టోల్ చెల్లించే వాహనాలనూ అనుమతిస్తున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి అలా కుదరదు. ఫాస్టాగ్ ఉన్న వాహనాలనే సంబంధిత లైన్లలోకి అనుమతిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనాలు ఆ మార్గాల్లో వెళ్తే రెట్టింపు టోల్ (రుసుం) వసూలు చేస్తారు. సంక్రాంతికి వాహనాల తాకిడి.. నక్కపల్లి, విశాఖ నగరంలో అగనంపూడి, పోర్టు అనుసంధాన మార్గంలోని పంచవటి, డాక్‌యార్డు టోల్‌ప్లాజాలు ఉన్నాయి. నక్కపల్లి టోల్‌ప్లాజా రాజమండ్రి రీజియన్‌లో ఉండగా.. మిగతా మూడు విశాఖ పరిధిలో ఉన్నాయి. జిల్లాలోని టోల్‌ప్లాజాల్లో అగనంపూడి, నక్కపల్లి జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 16)పై ఉండటంతో ఇవెంతో కీలకమైనవి. అక్కడ సగటున రోజుకు 35 వేల నుంచి 40 వేల వాహనాలకు సంబంధించిన టోల్ చెల్లింపులు జరుగుతున్నాయి. రాక, పోక మార్గాల్లోని ఎనిమిది లైన్లలో ప్రయాణించే వాహనాలకు సంబంధించి టోల్ చెల్లించడానికి ఒక్కో వాహనానికి కనిష్టంగా ఐదు నిమిషాల సమయం పడుతోంది. దీంతో సాధారణ రోజుల్లో టోల్‌ప్లాజా దాటడానికి పది నిమిషాల సమయం పడుతోంది. సంక్రాంతి, దసరా వంటి పండుగల సమయాల్లో వాహనాల తాకిడి మూడు రెట్లు పెరుగుతుండాయి. ఇప్పటికే సంక్రాంతి సెలవులు ఇచ్చేయడంతో ఆదివారం నుంచి రోజూ లక్ష వాహనాల వరకూ రాకపోకలు సాగిస్తాయని ఎన్హెచ్ఏఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఫాస్టాగ్ లేకుంటే ఇబ్బందే... జిల్లాలోని నాలుగు టోల్‌ప్లాజాల వద్ద గత డిసెంబరు ఒకటో తేదీ నుంచే ఫాస్టాగ్ లైన్లను పక్కాగా అమలు చేయడానికి ఎన్హెచ్ఏఐ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అందుకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. కానీ ప్రజాప్రతినిధులు, వాహనదారుల సంఘాల వినతి మేరకు ఆ గడువు పెంచుకుంటూ వచ్చారు. ఈనెల 15 నుంచి టోల్‌ప్లాజాల వద్ద రాక, పోక మార్గాల్లో ఒక్కొక్కటి చొప్పున మాత్రమే టోల్ రుసుం చెల్లింపు కౌంటర్లు ఉంటాయి. మిగతావన్నీ ఫాస్టాగ్ లైన్లే. ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాల్లో ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. లేని వాహనాలకు రాక, పోక మార్గాల్లో క్యాష్ లైను ఒక్కొక్కటి మాత్రమే ఉండటంతో టోల్‌ప్లాజా దాటడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. ఎంత రద్దీ ఉన్నా ఫాస్టాగ్ లైనులోకి మాత్రం వెళ్లకూడదు. 70 శాతానికి చేరిన ‘ఫాస్టాగ్’ ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనదారులకు ప్రత్యేక స్టిక్కర్ ఇస్తున్నారు. దీన్ని ఏ వాహనం నంబరుతో కొనుగోలు చేశారో ఆ వాహనం కోసమే వినియోగించాలి. ఈ స్టిక్కర్‌ను వాహనం అద్దంపై కుడివైపు పైభాగంలో అతికించాలి. ఈ స్టిక్కర్పైనున్న చిప్‌ను, బార్ కోడ్‌ను స్కాన్ చేయడానికి శక్తివంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (ఆర్ఎఫ్ఐడీ)లను టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేశారు. వాహనం టోల్‌ప్లాజా సమీపంలోకి వస్తున్నప్పుడే ఇవి స్కాన్ చేస్తాయి. దీంతో ఆ వాహనానికి చెల్లించాలి్సన టోల్ ఫాస్టాగ్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు క్షణాల్లో జరిగిపోతుంది. ఆ సమాచారం వాహనదారుని సెల్‌ఫోన్‌కు వస్తుంది. ప్రస్తుతం టోల్‌ప్లాజా వద్దకు వస్తున్న వాహనాల్లో ఫాస్టాగ్ ఉన్నవి 70 శాతం వరకూ ఉంటున్నాయి. వీటిని వంద శాతం చేసేలా అధికారులు కృషి చేయాలని ఇటీవల విశాఖలో జరిగిన పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. రిజిస్ట్రేషన్‌కు పలు మార్గాలు... ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్‌కు వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటు వాహనదారుడి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ సమర్పించాలి. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇందుకోసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. దీనిలో రూ.100 స్టిక్కర్ (ట్యాగ్) ఖరీదు కాగా మిగిలిన మొత్తంలో రూ.200 బ్యాంకులో సెక్యూరిటీ డిపాజిట్‌కు, రూ.200 టాప్అప్కు కేటాయిస్తారు. ఈ స్టిక్కర్ జాతీయ రహదారులపైనున్న అన్ని టోల్‌ప్లాజాల్లోనూ పనిచేస్తుంది. టోల్‌ప్లాజాలు, పలు పబ్లిక్ పాయింట్ల వద్ద ఫాస్టాగ్‌ల విక్రయానికి అధీకృత బ్యాంకులు ప్రత్యేక కౌంటర్ల (పాయింట్ ఆఫ్ సేల్ – పీవోఎస్)ను ఏర్పాటు చేశాయి. ఇది కొనుగోలు చేసిన తర్వాత వాహనదారులు ‘మై ఫాస్టాగ్ యాప్’ను సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. వాహన రిజిస్ట్రేషన్ నంబరుతో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసుకోవాలి. డీలర్లూ ఫాస్టాగ్ ఇవ్వాలి మోటారు వాహనాల చట్టానికి 2017లో చేసిన సవరణ ప్రకారం కొత్త కార్లు, భారీ వాహనాల కొనుగోలు సమయంలోనే డీలర్లు ఫాస్టాగ్ ఇవ్వాలి. ఈ దృష్ట్యా వాహల కొనుగోలుదారులకు ఫాస్టాగ్ స్టిక్కర్ ఇచ్చేందుకు డీలర్లంతా సహకరించాలి. ప్రస్తుతం టోల్‌ప్లాజాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం 70 శాతం వాహనాలు ఫాస్టాగ్ రిజిస్ట్రేషన్ ఉన్నవి వస్తున్నాయి. మిగతా వాహనదారులంతా ఈ విధానంలోకి వస్తే జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బంది ఉండదు. – పి.శివశంకర్, ప్రాజెక్టు డైరెక్టరు, ఎన్హెచ్ఏఐ విశాఖ రీజియన్ -
లక్షకు చేరుకున్న ‘ఫాస్టాగ్’
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఫాస్టాగ్ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శుక్రవారానికి రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య లక్ష మార్కును దాటింది. శుక్రవారం రాత్రి వరకు అమ్ముడైన మొత్తం ఫాస్టాగ్‌ల సంఖ్య 1.06 లక్షలకు చేరుకుంది. శుక్రవారం నుంచి సంక్రాంతి పండగ రద్దీ మొదలైన నేపథ్యంలో జాతీయ రహదారులపై టోల్‌ప్లాజాల వద్ద టోల్ చెల్లింపునకు క్యూలు ఏర్పడకుండా ఊరట కలిగించే విషయమిది. వచ్చే 4 రోజుల్లో నగరం నుంచి సొంతూళ్లకు 25 లక్షల మందికిపైగా వెళ్లనున్నారు. రాష్ట్రంలోని 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల వద్ద రుసుము చెల్లించేవారితో రద్దీ ఏర్పడనుంది. ప్రస్తుతం నగదు రూపంలో టోల్ చెల్లించేందుకు 25 శాతం లేన్లు ఉన్నాయి. 75 శాతం లేన్లలో ఫాస్టాగ్ వాహ నాలకే అనుమతి ఉంది. ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు ప్రారంభించిన కొత్తలో, నగదు చెల్లించే వాహనాల సంఖ్యే ఎక్కువగా ఉండటం, వాటికి కేటాయించిన లేన్ల సంఖ్య తక్కువగా ఉండటంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయేవి. డిసెంబర్ చివరికి వీటి సంఖ్య సగం సగంగా మారింది. ఇప్పుడు టోల్ గేట్ల నుంచి వెళ్లే వాహనాల్లో దాదాపు 51 శాతం వాహనాలు ఫాస్టాగ్వే ఉంటున్నాయి. టోల్ రూపంలో వసూలవుతున్న మొత్తంలో 63 శాతం ఫాస్టాగ్ ఉన్న వాహనాల నుంచే వస్తోంది. ఫాస్టాగ్ తీసుకున్న వాటిలో వాణిజ్య వాహనాలు ఎక్కువ ఉండటంతో వసూలయ్యే మొత్తం ఎక్కువే ఉంటోంది. రద్దీ అధికంగా ఉంటే మరో లేన్.... రాష్ట్రంలో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య లక్ష మించినందున సంక్రాంతి ప్రయాణ సమయాల్లో ఇబ్బంది ఉండకపోవచ్చని ఎన్హెచ్ఏఐ అధికారులు భావిస్తున్నారు. 14 తేదీ వరకు హైబ్రీడ్ విధానం అమలులో ఉండనుంది. అంటే 25% లేన్లు నగదు చెల్లింపులకు ఉంటాయి. ఒకవేళ ఫాస్టాగ్ లేని వాహనాలు ఎక్కువగాఉండి, నగదు చెల్లింపుకు ఎక్కువ సమయం పట్టేలా ఉంటే అదనంగా మరో లేన్‌ను కేటాయించే విషయాన్ని పరిశీలిస్తామని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయాధికారి కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. ఇక 15వ తేదీ నుంచి నగదు చెల్లింపులకు ఒక్క లేన్ మాత్రమే కేటాయించనున్నారు. తర్వాత కూడా నగదు లేన్ వద్ద రద్దీ అధికంగా ఉంటే కేంద్రం నుంచి అనుమతి తీసుకుంటామని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. పండుగ తర్వాతే.. ఇక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న రహదారులపై సంక్రాంతి తర్వాతే ఫాస్టాగ్ విధానం ప్రారంభించాలని నిర్ణయించారు. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై 3 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల వద్ద జనవరి 20–25 మధ్య ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులు ప్రారంభించాలని శుక్రవారం ఆయా రోడ్లను నిర్వహించే కాంట్రాక్టర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఈ మార్గంలో 3 ప్లాజాలకు సంబంధించి 28 లేన్లున్నాయి. ఇక నార్కెట్‌పల్లి–అద్దంకి మార్గంలో ఉన్న ప్లాజా వద్ద ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ విధానం మొదలుకానుంది. ఇక్కడ ఏడు లేన్లు ఉండగా 5 ఫాస్టాగ్‌కు, 2 నగదు చెల్లించేందుకు కేటాయించనున్నారు. పరికరాల బిగింపుకయ్యే వ్యయాన్ని కాంట్రాక్టు సంస్థలే భరించనున్నాయి. ఆ ఖర్చును ప్రభుత్వమే భరించాలని కాంట్రాక్టు సంస్థలు డిమాండ్ చేయగా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ అంగీకరించలేదు. -
త్వరలో అలిపిరిలో ఫాస్టాగ్
సాక్షి, తిరుమల: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ రహదారులపై టోల్గేట్ల వద్ద ‘ఫాస్టాగ్’ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అలిపిరి టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. తిరుమలకు వచ్చే ప్రతి వాహనానికీ ఫాస్టాగ్ ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ఎస్బీఐ బ్యాంక్‌తో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇక వీలైనంత తర్వలో ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని టీటీడీ విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. దీంతో దేశంలో ఫాస్టాగ్ విధానాన్ని అనుసరించే తొలి దేవాలయ పాలకమండలిగా టీటీడీ ఖ్యాతి గడించనుంది. కాగా ఇప్పటికే కేంద్రం టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పండుగపూట ఫాస్టాగ్ పరేషాన్ హైవే పక్కన హోటళ్లలో ఫాస్టాగ్ విక్రయం -
పండుగపూట ఫాస్టాగ్ పరేషాన్
‘సంక్రాంతి పండుగకు సొంత కారులో ఊరు వెళ్తున్నారా..? అయితే ఫాస్టాగ్ తీసుకోవడం మాత్రం మరవకండి. అది లేకుంటే పండుగ వేళ టోల్ ప్లాజాల వద్ద పడిగాపులు కాయాల్సి రావచ్చు. టోల్ గేట్ల వద్ద రుసుము చెల్లించేందుకు గంటల తరబడి క్యూలో ఎదురు చూడాల్సిన దుస్థితి ఎదురుకావచ్చు. పండుగ వేళ ప్రశాంతంగా ఊరెళ్దామని బయలుదేరితే, ఆ రద్దీలో చిక్కుకుని మీ సహనానికి పరీక్ష పెట్టుకుని పరేషాన్ అయ్యే పరిస్థితి రావొచ్చు’ సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ టెన్షన్ ఎన్హెచ్ఏఐ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి లక్షల మంది సొంతూళ్లకు వెళ్లనుండటంతో వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కను న్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాల కోసం తక్కువ గేట్లు ఉండటం.. టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు ఏర్పడే పరిస్థితి రానుండటంతో అధికారులు ఆగమేఘాల మీద పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న 10 రోజుల్లో వాహనదారులు ఎక్కువ మంది ఫాస్టాగ్‌లు తీసుకుంటేనే పరిస్థితి సాఫీగా ఉండనుంది. లేని పక్షంలో రోడ్లపై ప్రత్యక్ష నరకం కనిపించటం ఖాయం. ఫాస్టాగ్ విధానం వచ్చిన తొలి వారంలో వాహనాలు బారులుగా ఏర్పడి, టోల్ రుసుము చెల్లించేందుకు గంటల సమయం ఎదురు చూడాల్సి వచ్చింది. అలాంటిది ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కే సంక్రాంతి వేళ పరిస్థితి పూర్తిగా అదుపు తప్పనుంది. పండుగకు క్యాష్ లేన్ ఒకటే.. ప్రస్తుత విధానాన్ని పొడిగించని పక్షంలో 14వ తేదీ తర్వాత ఒక్క(ఇరువైపులా ఒక్కొక్కటి) లేన్ మాత్రమే క్యాష్ చెల్లింపు విధానానికి వదలనున్నారు. మిగతావన్నీ ఫాస్టాగ్ లేన్లుగా మారనున్నాయి. దీంతో ఎన్హెచ్ఏఐ అధికారులు వీలైనన్ని ఫాస్టాగ్‌లు విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. 50 శాతానికి ట్యాగ్లు.. ఫాస్టాగ్ విధానం వచ్చి నెల గడిచినప్పటికీ టోల్ ప్లాజాల గుండా వెళ్తున్న వాహనాల్లో 45 నుంచి 47 శాతం వాహనాలు మాత్రమే ఫాస్టాగ్ గేట్ల నుంచి వెళ్లటం విశేషం. అయితే తొలిసారి వాటి సంఖ్య 50 శాతానికి చేరుకుంది. గురువారం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై 17 చోట్ల ఉన్న టోల్ ప్లాజాలను పరిశీలిస్తే 50.50 శాతం వాహనాలు ఫాస్టాగ్ లేన్ల నుంచి దూసుకెళ్లినట్టు నమోదైంది. టోల్ కలెక్షన్లలో 61 శాతం వీటి నుంచే వసూలైంది. సంక్రాంతి నాటికి ఇది ట్యాగ్ వాహనాల సంఖ్య 75 శాతానికి చేర్చాలని అధికారులకు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు అధికారులు, బ్యాంకర్లతో గురువారం ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గురువారం నాటికి కేవలం 84 వేల ట్యాగ్లు మాత్రమే అమ్ముడయ్యాయి. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లే వాహనదారులు వెంటనే మేల్కొనకపోతే పండగ సమయంలో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బంది పడాల్సి వస్తుందంటూ ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. అధికమైన ఆదాయం.. ఫాస్టాగ్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా టోల్ ఆదాయం భారీగా పెరిగింది. అక్టోబర్‌లో జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్‌ప్లాజాల ద్వారా టోల్ రుసుము రూపంలో రూ.85.96 కోట్లు వసూలు కాగా, డిసెంబర్లో ఆ మొత్తం రూ.90.51 కోట్లుగా నమోదైంది. అంటే దాదాపు రూ.4.50 కోట్ల మేర ఆదాయం పెరిగింది. అన్ని వాహనాలు ట్యాగ్లు ఏర్పాటు చేసుకుంటే రూ.10 కోట్లకుపైగా అదనపు ఆదాయం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. భారీగా టెండర్లు.. టోల్ గేట్ల ఆదాయం ఎంత పెరిగితే.. తదుపరి టెండర్లలో మూల విలువను అంతమేర పెంచనున్నారు. రాష్ట్రంలోని 17 టోల్‌ప్లాజాల్లో 9 చోట్ల ఆన్యుటీ విధానం అమలులో ఉంది. అంటే అక్కడ వసూలయ్యే టోల్ మొత్తాన్ని అంచనాగా వేసుకుని దాన్ని బేస్ వ్యాల్యూగా నిర్ధారించి టెండర్లు పిలుస్తారు. టెండర్ దక్కించుకున్న సంస్థ దాన్ని మించి కోట్ చేస్తుంది. ఆ మొత్తాన్ని ఎన్హెచ్ఏఐకి చెల్లించి టోల్ వసూలు చేసుకుంటుంది. ఇప్పుడు ఫాస్టాగ్ వల్ల టోల్ కలెక్షన్లు భారీగా పెరుగుతుండటంతో తదుపరి టెండర్ల్లో భారీ మొత్తాలు నమోదు కానున్నాయి. -
హైవే పక్కన హోటళ్లలో ఫాస్టాగ్ విక్రయం
సాక్షి, హైదరాబాద్: టోల్‌ప్లాజాల వద్ద సంక్రాంతి సమయంలో అయోమయం నెలకొనే పరిస్థితి ఉండటంతో ఎన్హెచ్ఏఐ అధికారులు అప్రమత్తమయ్యారు. సంక్రాంతి రద్దీ మొదలయ్యే నాటికి వీలైనన్ని ఫాస్టాగ్‌లు విక్రయించాలని నిర్ణయిం చారు. ఇప్పటికే టోల్‌ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో కౌంటర్లు తెరిచి ఫాస్టాగ్‌లను విక్రయిస్తున్నారు. జాతీయ రహదారిపై ముఖ్యమైన హోటళ్లలో ఫాస్టాగ్ విక్రయ కౌంటర్లు తెరిచారు. విజయవాడ రహదారిలో రద్దీ ఎక్కువగా ఉంటున్నందున ఆ రోడ్డులోని 6 హోటళ్లలో విక్రయాలు ప్రారంభించారు. బుధవారం నుంచి వాటి అమ్మకాలు మొదలయ్యాయి. ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ ఈ హోటళ్లలోని కౌంటర్లను పరిశీలించి, హోటళ్లకు వచ్చే వాహనదారులతో మాట్లాడి ఫాస్టాగ్స్ కొనుగోలు చేసేలా చైతన్యపరచాలన్నారు. ఇక్కడ ఫాస్టాగ్ విక్రయాలు ఆశాజనకంగా ఉంటే మరిన్ని హోటళ్లలో వాటిని ప్రారం భించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్ లేకుంటే సం క్రాంతి ప్రయాణం ఇబ్బందిగా ఉంటుందని, దా న్ని నివారించేందుకు వెంటనే ట్యాగ్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. జాతీయ రహదారుల వెంట ఆ మేరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లేన్లు ఇలా.. ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు హైబ్రీడ్ వేలుగా ఉన్నాయి. వాటిల్లో ఫాస్టాగ్ ఉన్న వాహనాలతోపాటు లేని వాటిని కూడా అనుమతిస్తున్నారు. 75 శాతం లేన్లు పూర్తిగా ఫాస్టాగ్ ఉన్నవాటికే కేటాయిం చారు. జనవరి 14 తర్వాత క్యాష్ లేన్‌ను ఒకటి మాత్రమే(ఒక్కోవైపు ఒకటి) ఉండనుంది. మరో పక్షం రోజులపాటు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని ఎన్హెచ్ఏఐపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గడువు పెంచకుంటే సంక్రాంతి రద్దీ సమయంలో ఒక్క కౌంటర్ మాత్రమే క్యాష్ చెల్లించే వాహనాలకు అందుబాటులో ఉండనుంది. గడువు పెంచితే మరికొన్ని రోజులు ఇబ్బందులు దూరమైనట్టే. రాష్ట్రంలో ఫాస్టాగ్స్ ఉన్న వాహనాల సంఖ్య 81 వేలకు చేరుకుంది. గత నాలుగైదు రోజులుగా వాటి విక్రయాలు పెరిగాయి. -
వసూళ్లు ఎక్కువ..వాహనాలు తక్కువ
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్ టోల్ వసూళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఫాస్టాగ్ లేన్ల ద్వారా వస్తున్న ఆదా యం భారీగానే పెరుగుతోంది. ఫాస్టాగ్, క్యాష్ లేన్ల ద్వారా వస్తున్న ఆదాయం, వాహనాల రాకపోకల విషయంలో వింత పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం తెలంగాణలో 58 శాతం టోల్ ఆదాయం ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం (ఫాస్టాగ్ లేన్స్) ద్వారా వసూలవుతోంది. ఇది నాలుగైదు రోజుల్లో 60 శాతా నికి చేరుకుంటుందని అధికారుల అంచనా. ఫాస్టాగ్ గేట్లతో పోలిస్తే క్యాష్ లేన్ల నుంచే ఎక్కువ వాహనాలు దూసుకుపోతున్నాయి. రాష్ట్రంలో టోల్ ప్లాజాల మీదుగా వెళ్తున్న వాహనాల్లో 48% ఫాస్టాగ్ లేన్ల నుంచి, 52% క్యాష్ లేన్ల నుంచి వెళ్తున్నాయి. ఫాస్టాగ్ లేన్ల ద్వారా టోల్ వసూలు ఎక్కువగా, వాహనాల గమనం తక్కువగా ఉంది. క్యాష్ లేన్ల నుంచి వాహనాల సంఖ్య ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉంది. ఈ విరుద్ధ వ్యవహారం రాష్ట్రంలో నెలకొంది. ఆదాయం అదుర్స్.. ఫాస్టాగ్ విధానం రావటానికి కొన్ని నెలల ముందే ప్రయోగాత్మకంగా అధికారులు పరిశీలిస్తూ వస్తున్నారు. కొన్ని లేన్లను ప్రత్యేకంగా వాటికోసం కేటాయించారు. నవంబర్ 15న రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ లేన్ల నుంచి రూ.96 ఆదాయం మాత్రమే వచ్చింది. అదే క్యాష్ లేన్ల ద్వారా రూ.1.95 కోట్ల ఆదాయం వచ్చింది. అదే నెల 26న ఫాస్టాగ్ లేన్ల ద్వారా రూ.1.01 కోట్లు వస్తే, క్యాష్ లేన్ల ద్వారా రూ.1.59 కోట్లు వసూలయ్యాయి. డిసెంబర్ 13న రూ.1.52 కోట్లు ఫాస్టాగ్ లేన్ల ద్వారా, రూ.1.44 కోట్లు క్యాష్ లేన్ల ద్వారా వచ్చింది. గత 2 రోజులుగా సగటున ఫాస్టాగ్ లేన్ల ద్వారా రూ.1.78 కోట్లు, క్యాష్ లేన్ల ద్వారా రూ.1.20 కోట్లు వసూలవుతోంది. ఈ వారాంతానికి ఫాస్టాగ్ ద్వారా రూ.2 కోట్లు, క్యాష్ లేన్ల ద్వారా రూ.1 కోటి వసూలయ్యే అవకాశం ఉందని అధికారుల అంచనా. ఫాస్టాగ్ వల్ల సగటు ఆదాయం రూ.50 లక్షలు చొప్పు న పెరిగినట్టు అంచనా. మరో 2 రోజుల తర్వాత నెల రోజుల లెక్కలు విడుదల చేయనున్నారు. పెరగని వాహనాల సంఖ్య.. ఫాస్టాగ్ వల్ల టోల్ చెల్లించే సమయంలో క్యూలో ఉండాల్సిన సమస్య ఉండదని తేలిపోయినా.. ఇంకా వాహనదారులతో కదలిక ఆశించిన వేగంగా ఉండట్లేదు. ఇప్పటికీ 72 వేల వాహనాలకు మాత్రమే రాష్ట్రంలో ఫాస్టాగ్ ట్యాగ్లు కొన్నారు. ట్యాగ్ లేని వాహనాలే ఎక్కువగా టోల్ గేట్ల నుంచి వెళ్తున్నాయి. గత 4 రోజులుగా టోల్గేట్ల నుంచి వెళ్తున్న వాహనాల్లో 52 శాతం ట్యాగ్ లేనివే ఉండటం విశేషం. వాణిజ్యపరమైన వాహనదారులు ఎక్కువగా, సొంత వాహనాలున్నవారు తక్కువగా ట్యాగ్లు కొంటున్నారు. కమర్షియల్ వాహనాలు టోల్ ఎక్కువగా చెల్లిం చాల్సి ఉండటంతో ఫాస్టాగ్ వాహనాల సంఖ్య తక్కువగా ఉన్నా.. వాటి ద్వారా వసూలవుతున్న టోల్ ఎక్కువగా ఉంటోంది. ఫాస్టాగ్ రావటానికి 5 రోజుల ముందు నుంచి ట్యాగ్లు కొనుగోళ్ల వేగం పెరిగింది. సగటున రోజుకు 3 వేల వరకు ట్యాగ్స్ కొన్నారు. కొన్ని రోజులుగా సగటున రోజుకు 1,300 ట్యాగ్లు మాత్రమే అమ్ముడవుతున్నాయి. 14 తర్వాత గందరగోళమే! ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద 25 శాతం దారులను హైబ్రీడ్ వేలుగా మార్చారు. వీటిల్లో ట్యాగ్ ఉన్నవాటిని లేని వాటిని అనుమతిస్తున్నారు. జనవరి 14 వరకు ఈ వెసులుబాటుంది. ఆ తర్వాత కేవలం ఒకటి చొప్పున (ఒకవైపు) గేట్లను మాత్రమే క్యాష్ చెల్లించేందుకు పరిమితం చేయనున్నారు. అంటే ఫాస్టాగ్ లేని వాహనాలన్నీ ఈ ఒక్క గేటు నుంచే ముందుకు కదలాల్సి ఉం టుంది. ఫాస్టాగ్ లేన్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తారు. అదే సమయంలో సంక్రాంతి రద్దీ ఉండనుండటంతో టోల్గేట్ల వద్ద అయోమయ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కేంద్రం గడువు పొడిగించకుంటే గందరగోళం తప్పదని అధికారులు కలవరపడుతున్నారు. మరో పక్షం రోజుల్లో వీలైనన్ని వాహనాలు ట్యాగ్లు కొంటేనే పరిస్థితి అదుపులో ఉం టుంది. కొనుగోళ్లు ఇదే మందగమనంలో ఉంటే క్యాష్ లేన్ వద్ద మళ్లీ కిలోమీటరు మేర క్యూలు తప్పేలా కనిపించటం లేదు. పండగ కోసం సొం తూళ్లకు వెళ్లేవారు ఇబ్బంది పడకతప్పేలా లేదు. కనీసం మరో పక్షం రోజులు హైబ్రీడ్ లేన్ల కొనసాగింపునకు కేంద్రం అనుమతిని పొడిగించాలన్న అభ్యర్థనలు వినిపిస్తున్నాయి. -
భీమ్ యూపీఐతో ఫాస్టాగ్ రీచార్జ్
న్యూఢిల్లీ: నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్ రీచార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని సంస్థ సీవోవో ప్రవీణ రాయ్ తెలిపారు. టోల్ చెల్లింపునకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాకుండా చూసేలా ‘ఫాస్టాగ్’ అమల్లోకి రావడం తెలిసిందే. ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ అకౌంటుకు అనుసంధానించే ఫాస్టాగ్ ట్యాగ్‌లను వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికిస్తారు. టోల్‌ప్లాజాల్లో ఏర్పాటు చేసిన రీడర్లు వీటిని స్కాన్ చేశాక.. వాహనదారు ఖాతా నుంచి నిర్దేశిత టోల్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీనివల్ల టోల్ ప్లాజాల్లో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుంది. -
సంక్రాంతికి ‘టోల్’ గుబులు!
సాక్షి, హైదరాబాద్: టోల్ రుసుము చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించటంతోపాటు నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం ఇప్పుడు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ఫాస్టాగ్ ఉన్న వాహనాలు టోల్ గేట్ల వద్ద ఇబ్బంది లేకుండా దూసుకుపోతుండగా, ట్యాగ్ లేని వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలాఉంటే సంక్రాంతి సమయంలో పరిస్థితి ఏమిటని అధికారులు బెంబేలెత్తుతున్నారు. ఈ మేరకు ఎన్హెచ్ఏఐ అధికారులు మంగళవారం సమావేశమై దీనిపైనే చర్చించారు. సంక్రాంతిలోపు వీలైనన్ని ఫాస్టాగ్‌లు అమ్మేలా ప్రచారం చేయాలని నిర్ణయించారు. రద్దీ నుంచి తప్పించుకోవాలంటే ఫాస్టాగ్ కొనాల్సిందేనంటూ వివరించే కరపత్రాలు పెద్ద సంఖ్యలో ముద్రించి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నగదు చెల్లింపు వాహనాలు క్యూలలో చిక్కుకుపోవటం, ఫాస్టాగ్ వాహనాలు ఇబ్బంది లేకుండా వెళ్లిపోతున్న తీరుకు సంబంధించిన వీడియో లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇక రద్దీ ఎక్కువుంటే ఫాస్టాగ్ వాహనాల గేట్ల నుంచి సాధారణ వాహనాలు కూడా వెళ్లేందుకు అనుమతించాలని నిర్ణయించారు. కాగా, మంగళవారం జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల మీదుగా వెళ్లిన వాహనాల్లో 53.59 శాతం ఫాస్టాగ్‌తో వెళ్లినట్టు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ చెప్పారు. -
టోల్‌ప్లాజా వద్ద ఫాస్ట్‌గా టోకరా
కడప సిటీ : టోల్‌ప్లాజాల్లో రద్దీ నివారించి సమయం ఆదా చేసేందుకు ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ పద్ధతికీ కొందరు టోకరా కొట్టిస్తున్నారు. కక్కుర్తి తెలివితేటలు ప్రదర్శించిన ఇలాంటి వారికి తాజాగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఫాస్టాగ్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో కడప పాలెంపల్లె వద్ద, మరొకటి మైదుకూరు మండలం బసవాపురం వద్ద ఈ టోల్ ప్లాజాలున్నాయి. ఇవి అత్యాధునిక సాంకేతిక విధానంతో పనిచేస్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద కౌంటర్లలో నగదు చెల్లించి రశీదు పొంది ఒక వాహనం ముందుకెళ్లేసరికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వెనుక వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. స్వల్ప మొత్తంలో టోల్‌ప్లాజా రుసుం చెల్లించి కదలడం పెద్ద గుదిబండగాతయారైంది. పండగ లాంటి ముఖ్యరోజుల్లో వాహనాలు ముందుకు కదలాలంటే గంటల కొలదీ కాలహరణం జరిగిపోతోంది. తాజాగా కేంద్రం విదేశాల మాదిరిగా మన దేశంలో కూడా ఫాస్టాగ్ విధానాన్ని తీసుకు వచ్చింది. ఫాస్టాగ్ స్టిక్కరున్న వాహనం టోల్‌ప్లాజ్ లైనుకి చేరగానే చిటెకెలో వాహనం స్కేనింగ్ అవుతుంది. వెనువెంటనే వాహన చోదకుడు లేదా యజమాని బ్యాంకు ఖాతా నుంచి టోల్‌ప్లాజా వారికి నిర్ణీత మొత్తం జమ అవుతుంది. దీంతో సమయం వృధా కాదు. అక్కడ రద్దీ కూడా ఎదురుకాదు. ఈ నెల ఒకటి నుంచి ఈ విధానం అమలు చేస్తున్నా ఇంకా చాలామంది వాహన యజమానులు బ్యాంకులు లేదా టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు స్టిక్కర్లను తీసుకోలేదు. పాస్టాగ్ స్టిక్కర్లను కలిగిన వాహనాలు ప్రత్యేక వరుసల్లో అనుమతిస్తారు. ఈనెల 15నుంచి ఈ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం తొలుత స్పష్టం చేసింది. తాజాగా ఈ గడువును జనవరి 15దాటేవరకూ పొడించింది. ఇదిలా ఉండగా కొందరు స్టిక్కర్ల విషయంలో ఎన్హెచ్ఐఎ అధికారులను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించి భంగపడుతున్నారు. ఒక్కొక్క వాహనానికి ఒక్కో విధంగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొన్నిచోట్ల జీపునకు రూ.35,మినీ బస్సుకు రూ.60,లారీకి 120 వసూలు చేస్తారు. కొందరు వాహన యజమానులు కక్కుర్తి ప్రదర్శించి జీపు పేరుతో ఫాస్టాగ్ స్టిక్కరు తీసుకుని తమ లారీలకు అతికిస్తున్నారు. అయితే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ ఈ స్టిక్కరును స్కాన్ చేస్తుంది. స్కానింగ్ దగ్గర ఈ తేడాను జిల్లాలోని టోల్‌ప్లాజా సిబ్బంది గుర్తించారు. తమ అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో వారు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వాహన చోదకులకు హెచ్చరికలు జారీ చేశారు. పునరావృతమైతే వాహన నెంబరును బ్లాక్ చేస్తామని ప్రకటించారు. బ్యాంకుల వద్ద వాహనాలను తనిఖీ చేయకుండానే స్టిక్కర్లు ఇవ్వడం వల్లే ఈ మోసానికి ఆస్కారం కలుగుతోందని తెలిసింది. -
నేటి నుంచి అమల్లోకి ఫాస్టాగ్ విధానం
-
ఫాస్టాగ్‌తో సాఫీగా..
సాక్షి, నెట్వర్క్: టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ తెరదించేందుకు ఉద్దేశించిన ‘ఫాస్టాగ్’ విధానం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టోల్గేట్ల వద్ద ఈ ఫాస్టాగ్ అతికించిన వాహనాలు వేగంగా ముందుకు వెళ్లాయి. అయితే ప్రతీ వాహనానికి గేటు ఎత్తి పంపాల్సి రావడంతో కాస్త జాప్యం జరిగింది. అయినా అది పెద్ద సమస్యగా మారలేదు. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఎక్కువ సమయం నిరీక్షించాల్సి రావటం తో వాహనాలు భారీ క్యూకట్టాయి. దీంతో వాహనాల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గత రెండు నెలలుగా ఎన్హెచ్ఏఐ ఈ ట్యాగ్ల విషయమై ముమ్మరంగా ప్రచారం చేసినా, ఎక్కువ మంది పట్టించుకోలేదు. అలా ట్యాగ్ లేకుండా జాతీయ రహదారులెక్కిన వాహనదారులకు టోల్‌ప్లాజాలు చుక్కలు చూపించాయి. పండుగ సమయాల్లోలా రద్దీ.. పండుగల సమయంలో టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు ఆదివారం కూడా భారీ రద్దీ ఏర్పడింది. తొలుత ఫాస్టాగ్ లేని వాహనాల కోసం ఒకే లైన్ కేటాయించాలని భావించినా.. ఆ తర్వాత 25 శాతం గేట్లు కేటాయించారు. మూడొంతుల గేట్లు ఫాస్టాగ్ వాహనాలకే వది లారు. ఇదే సమస్యకు కారణమైంది. ఎక్కువ వాహనాలకు ట్యాగ్ లేకపోవటం, వాటికి తక్కువ లైన్లు కేటాయించడంతో క్యూ కట్టాల్సి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదీ పరిస్థితి.. హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజాలతో పాటు హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిలో గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచే వాహనాల రద్దీ నెలకొంది. టోల్ దాటేందుకు ఒక్కో వాహనదారుడు గంటకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. మహబూబ్‌నగర్ జాతీయ రహదారిపై శాఖాపూర్ టోల్‌ప్లాజా వద్ద వందల సంఖ్యలో వాహనాలు బార్లు తీరాయి. భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద బారులుదీరిన వాహనాలు రెట్టింపు రుసుము.. టోల్‌ప్లాజాకు కిలోమీటరు దూరంలో ప్రత్యేక సిబ్బందిని నియమించి ఫాస్టాగ్ ఉన్న వాహనాలను సంబంధిత లైన్లలోకి వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ కొన్ని సాధారణ వాహనాలూ అయోమయంలో ఫాస్టాగ్ లైన్లలోకి ప్రవేశిం చాయి. ట్యాగ్ లేకుండా ఆ వరుసలోకి వస్తే రెట్టిం పు రుసుము చెల్లించాలనే నిబంధనతో పలువురు వాహనదారులు పెనాల్టీ చెల్లించాల్సి వచ్చింది. మాల్స్‌లో విక్రయం..! ప్రస్తుతం బ్యాంకులు, టోల్‌ప్లాజాలు, ఆర్టీసీ కార్యాలయాలు, ఆన్లైన్లో ఫాస్టాగ్ పొందే వెసులుబాటు ఉంది. ఆదివారం రద్దీ నేపథ్యంలో వాహనదారులు వాటిని కొనేందుకు పోటీపడే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు.. షాపింగ్ మాల్స్ లోనూ విక్రయ కేంద్రాలు తెరవాలని భావిస్తున్నా రు. కాగా, రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానాన్ని జనవరి ఒకటి నుంచి అమల్లోకి తేనున్నారు. హైదరాబాద్–రామగుండం రాజీవ్ రహదారిపై మూడు చోట్ల, అద్దంకి–నార్కట్‌పల్లి రహదారి ఒక చోట టోల్ ప్లాజాలున్నాయి. అప్పటికప్పుడే కొనుగోలు.. ఫాస్టాగ్ లేని వాహనాలు టోల్ వద్ద క్యూలలో నిరీక్షించాల్సిన పరిస్థితి వస్తుందంటూ ఎన్హెచ్ఏఐ కొద్ది రోజులుగా చేస్తున్న ప్రచారాన్ని చాలామంది పట్టించుకోలేదు. దీని ప్రభావం ఆదివారం స్పష్టం గా కనిపించింది. ఇన్ని రోజులు ఫాస్టాగ్ తీసుకోని వారు వాహనాల లైన్లు చూసి అప్పటికప్పుడు ట్యాగ్లు కొన్నారు. అన్ని టోల్ ప్లాజాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి అధికారులు వాటిని విక్రయిం చారు. సాధారణ రోజుల్లో సగటున రోజుకు రాష్ట్రవ్యాప్తంగా 2 వేల ట్యాగ్లు అమ్ముడవుతుండగా ఆ సంఖ్య ఆదివారం రెట్టింపైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 60 వేల ట్యాగ్లు విక్రయమైనట్లు ఎన్హెచ్ఏఐ ప్రాంతీయాధికారి కృష్ణప్రసాద్ వెల్లడించారు. ఫాస్టాగ్ అంటే.. ఫాస్టాగ్ విధానంలో వాహనం టోల్‌గేటు వద్ద బారులు తీరే అవసరం ఉండదు. కీలకమైన ‘ఫాస్టాగ్’పేరుతో ఉండే ట్యాగ్ల ను వాహనాల ముందు అద్దానికి అతికించుకోవాలి. టోల్‌గేట్‌పై ఉండే సెన్సార్లు.. గేటు ముందుకు రాగానే ట్యాగ్‌లోని చిప్ నుంచి కావాల్సిన టోల్ రుసుమును మినహాయించుకుంటాయి. ఆ వెంటనే గేట్ తెరుచుకుం టుంది. ఒక్కో వాహనం నుంచి టోల్ రుసు ము మినహాయించుకునేందుకు 6 సెకన్ల సమయమే పడుతుంది. దీంతో వాహనదారుల సమయం ఆదా అవుతుంది. -
అమల్లోకి ఫాస్టాగ్: టోల్గేట్ల వద్ద భారీ ట్రాఫిక్‌జామ్
-
అమల్లోకి ఫాస్టాగ్: నిలిచిపోయిన వాహనాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రప్రభుత్వం జాతీయ రహదారుల్లో ఫాస్టాగ్ విధానాన్ని నేటి నుంచి అమల్లోకి తెచ్చింది. కానీ ఫాస్టాగ్ విధానంపై వినియోగదారులు పెద్దగా మొగ్గు చూపలేదు. ఫలితంగా పలు టోల్గేట్ల వద్ద భారీ ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఫాస్టాగ్‌కు అధిక లైన్లు, నగదు చెల్లింపు లైన్లను తక్కువకు కుదించి, ఫాస్టాగ్‌కు ఎక్కువ లైన్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. యాదాద్రి భువనగిరి: జిల్లాలోని పంతంగి టోల్గేట్ వద్ద పెద్దసంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. టోల్‌ప్లాజాలోని ఐదుగేట్ల ద్వారా ఫాస్టాగ్‌కు అనుమతి ఉంది. మరో మూడు గేట్ల ద్వారా నగదు చెల్లించి వాహనాల రాకపోకలు కొనసాగించవచ్చు. ఈ క్రమంలో ఆదివారం ఫాస్టాగ్ లేని గేట్ల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్గేట్ ఇరువైపులా కిలోమీటర్ మేర వాహన రాకపోకలు స్థంభించిపోయాయి.. ఫాస్టాగ్ విధానం అమలుతో నగదు చెల్లింపు కౌంటర్లు కుదించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని అధికారులు పేర్కొంటున్నారు. కృష్ణా: జిల్లాలోని టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం మొరాయించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంచికర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్‌లు పనిచేయలేదు. రెండు లైన్లలో ఫాస్టాగ్ పనిచేయకపోవడంతో టోల్గేట్ సిబ్బంది క్యాష్ కౌంటర్లు ఏర్పాటు చేసి వాహనాలను పంపిస్తున్నారు. -
నేటి నుంచే ఫాస్టాగ్
-
రాష్ట్ర రహదారులపై ఫాస్టాగ్‌కు జాప్యం
సాక్షి, హైదరాబాద్: టోల్‌ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా వాహనాలు ముందుకు వెళ్లేలా ఉద్దేశించిన ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానం రాష్ట్ర రహదారులపై అందుబాటులోకి రావడానికి జాప్యమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న 17 టోల్గేట్ల వద్ద ఈ విధానం ప్రారంభించేందుకు ఎన్హెచ్ఏఐ అన్ని ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 1వ తేదీనే ప్రారంభించాల్సి ఉన్నా దేశవ్యాప్తంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాత్రం అప్పటికే అన్నీ సిద్ధం చేసి పెట్టారు. ఈ నెల 15న రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సాఫీగానే ప్రారంభం కానుంది. కానీ రాష్ట్ర రహదారుల విషయానికి వచ్చే సరికి సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర రహదారులపై 4 టోల్‌ప్లాజాలా వద్ద కూడా దీన్ని ప్రారం భించాల్సి ఉంది. ఫాస్టాగ్‌కు సంబంధించి యంత్ర పరికరాల ఏర్పాటు ఖర్చును ఎవరు భరించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కాంట్రాక్టర్లకు మధ్య స్పష్టత కుదరలేదు. ఒక గేటుకు మాత్రం ఖర్చులో 50 శాతం కేంద్రం భరించనుంది. మిగతా గేట్లకు సంబంధించిన ఖర్చులను మాత్రం స్థానికంగా సర్ధుబాటు చేసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం సహకరించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. దీనిపై వారం, పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 58 వేల ఫాస్టాగ్‌లు అమ్ముడైనట్లు తెలిసింది. -
ఫాస్టాగ్ గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఫాస్టాగ్ గడువును డిసెంబర్ 15 వరకు పొడిగించింది. డిసెంబరు 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాల్సిందేనని ప్రకటించిన కేంద్రం.. తాజాగా గడువు పొడిగించింది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా ఈ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీని వల్ల వాహనాలు చెల్లింపుల నిమిత్తం నిలిచి ఉండాల్సిన పనిలేకుండా హైబ్రిడ్ లైన్లో వెళ్లిపోవచ్చు. నవంబర్ 21 నుంచి ట్యాగ్ వ్యయంలో వెసులుబాటు ఇచ్చిన దగ్గర నుంచి వీటి వినియోగం గణనీయంగా పెరిగినట్లు ప్రకటించింది. -
ఇకపై టోల్‌ఫ్లాజాల వద్ద ‘ఫాస్ట్’ విధానం
టోల్‌ప్లాజా వచ్చిందంటే చాలు గంటల తరబడి నిరీక్షించాల్సిందే. అప్పటివరకు రయ్‌మంటూ సాగే వాహనాలకు టోల్‌ప్లాజాలు అడ్డుకట్టగా మారేవి. బారులు తీరిన వాహనాలకు రుసం వసూలు చేస్తూ..బోలెడు సమయం వృథా అయ్యేది. దీనికి పరిష్కారంగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఈ-రుసుం చెల్లింపుతో కొత్త ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. టోల్గేట్ల వద్ద ఛార్జీల చెల్లిపులను ఎలక్ర్టానిక్ పద్దతిలో జరిపేందుకు ఉద్దేశించిన ఈ విధానం డిసెంబర్ 1 నుంచి తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ విధివిధానాలు, అసునరించాల్సిన పద్దతులేంటో తెలుసుకుందాం. -ఫాస్టాగ్ కలిగిన వాహనం టోల్‌ఫ్లాజా దగ్గరకు రాగానే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా ప్రీపెయిడ్ అకౌంట్‌కి చెల్లింపులు జరుగుతాయి. -ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను వాహనం ముందు భాగంలో విండ్సస్ర్కీన్పై అతికించాల్సి ఉంటుంది. -ఎన్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి బ్యాంకుల ద్వారా కూడా వీటిని పొందవచ్చు. -ఫాస్టాగ్‌ను ఒక వాహనానికి మాత్రమే వినియోగించేలా రూపొందించారు. * టోల్‌ప్లాజా వచ్చినప్పుడు ఫాస్టాగ్ ఉన్న లేన్‌ను చూపుతూ కొన్ని బోర్డులు ఉంటాయి. ఆ మార్గంలోనే ఫాస్టాగ్ వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. * నిర్దేశించిన లేన్‌లో వెళ్లినప్పుడు వాహన వేగం 25-30కి మించి ఉండకూడదు. * అలాగే మీరు వెళ్తున్న లేన్‌లో మీ ముందున్న వాహనానికి కనీసం 10 మీటర్ల దూరం పాటించాలి. * ఒకసారి మీ ఫాస్టాగ్ రీడ్ అయిన తర్వాత మీ వాహనం ముందుకు సాగొచ్చనే సంకేతంగా అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది. అప్పుడే ముందుకు వెళ్లాలి. * గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత కూడా వాహనాన్ని ఎక్కువ సమయం అక్కడే ఉంచితే... బారియర్ గేట్ మళ్లీ పడిపోయే అవకాశం ఉంది. * ఒకవేళ ఏదైనా కారణంతో మీ ఫాస్టాగ్ పనిచేయకపోతే అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఎరుపు రంగులోకి మారుతుంది. * అప్పుడు టోల్‌ప్లాజా సిబ్బంది తమ చేతిలో ఉన్న పరికరంతో మీ ఫాస్టాగ్‌ను స్కాన్ చేస్తారు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందీ లేకుంటే ఆకుపచ్చ లైట్ వెలుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ఛార్జీని రుసుము ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. -
వాహనదారులకు యాక్సిస్ ఉచిత ఫాస్టాగ్స్
ముంబై: జాతీయ రహదారులపై ప్రయాణించాలంటే డిసెంబర్ ఒకటి నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కొన్ని నెలలపాటు ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తామని యాక్సిస్ బ్యాంక్ బుధవారం ప్రకటించింది. ట్రాఫిక్ సమస్యలను అధిగమించడంలో భాగంగా టోల్‌ప్లాజాలు, పార్కింగ్ ప్రాంతాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా, ఫాస్టాగ్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుండగా.. ఈ టెక్నాలజీకి సేవలందించడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. దీంతో పాటు ఇందుకోసం ప్రతి ఒక్క ట్యాగ్‌కు రూ. 100 వరకు ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ ట్యాగ్స్‌ను ఉచితంగా అందిస్తుండగా, ప్రాసెసింగ్ ఛార్జీలను ఎత్తివేసినట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈనెల చివరివరకే ఈ సేవలు అందిస్తామని ఇరు బ్యాంకులు ప్రకటించాయి. 70 లక్షల ఫాస్టాగ్‌ల జారీ దేశవ్యాప్తంగా 70 లక్షల ఫాస్టాగ్‌లను (బుధవారం నాటికి) జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ 26 (మంగళవారం) నాడు అత్యధికంగా 1,35,583 ట్యాగ్లు అమ్ముడుకాగా, అంతకుముందు రోజు 1.03 లక్షల విక్రయాలు నమోదైనట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ వెల్లడించింది. -
‘ఫాస్ట్’గానే ప్రజల్లోకి..
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారులపై టోల్గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల్లో భాగంగా ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు వ్యవస్థపై వాహనదారుల్లో అవగాహన వేగంగా పెరుగుతోంది. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ వ్యవస్థలో భాగంగా వాహనాల ముందు అద్దానికి అమర్చే ఫాస్టాగ్‌ల విక్రయం ఒక్కసారిగా జోరందుకుంది. సరిగ్గా వారం క్రితం తెలంగాణలో కేవలం 3,500 ట్యాగ్లే అమ్మకం కాగా, ప్రస్తుతం వాటి సంఖ్య పదిన్నర వేలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ వారంలోనే ఎక్కువ ట్యాగ్లు అమ్ముడుపోవటం తో చాలా ప్రాంతాల్లో వాటికి కొరత ఏర్పడింది. కొన్నిచోట్ల ట్యాగ్లు అందుబాటులో లేవన్న సమాధానం వస్తుండటంతో వాహనదారులు బ్యాంకులు, టోల్‌ప్లాజాల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో కూడా ఈ వారంలోనే ఏకంగా 7 వేల ట్యాగ్లు అమ్ముడు కావటంతో ఇక్కడా కొరత ఏర్పడే పరిస్థితి వచ్చేది. కానీ, నేషనల్ హైవే అథారిటీ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో ట్యాగ్‌లకు ఇండెంట్ పెట్టి తెప్పించారు. వాటి అమ్మకాలు పెరిగే సమయంలో అద నంగా 15వేల ట్యాగ్లు అందుబాటులోకి వచ్చా యి. దీంతో రాష్ట్రంలో వాటికి కొరత లేకుండా పోయింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో ప్రతిచోటా.. ఒక్కోవైపు 5 చొప్పున 10 కౌంటర్లు ఏర్పాటుచేసి అమ్ముతున్నారు. బ్యాంకుల్లో నేరుగా విక్రయం, ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవటంతో పోలిస్తే.. టోల్‌ప్లాజాల్లోనే ఎక్కువగా అమ్మకం అవుతున్నాయి. అన్ని టోల్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ టోల్ వసూలు యంత్రపరికరాల ఏర్పాటు దాదాపు పూర్తయింది. 4టోల్ కేంద్రాల్లో పనులు తుదిదశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ‘సగమే వసూలు’ నిబంధనకు తూట్లు.. వాహనం టోల్‌ప్లాజా దాటేప్పుడు తిరుగు ప్రయాణానికీ ఒకేసారి టోల్ చెల్లించేవారుంటారు. వాహనం 24 గంటల్లోపు తిరిగొస్తే, రెండోసారి సగం రుసుమే చెల్లించాలి. ఈ నిబంధనపై అవగాహన లేక టోకెన్ పద్ధతి చెల్లింపు విధానంలో.. మొత్తం రుసుము చెల్లిస్తున్నారు. అవగాహన ఉన్నవారు ప్రశ్నించి మరీ సగమే చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఫాస్టాగ్ విధానం పూర్తిగా ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థే అయినందున ఆ సమస్య ఉత్పన్నం కాకూడదు. అయితే కొన్ని సంస్థలు, బ్యాంకులిచ్చే ట్యాగ్‌ల్లో లోపాల వల్ల పూర్తి మొత్తం కట్ అవుతోందంటూ లారీ యజమానుల సంఘం ఫిర్యాదు చేసింది. అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామని, ఎక్కడైనా లోపం జరిగితే ఆ మొత్తాన్ని వాహనదారుడికి తిరిగి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా ప్రయోగాత్మకంగా కొన్ని లేన్లకే ఇది పరిమితమై ఉన్నందున, పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటైతే ఇలాంటి లోపాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. పొగమంచుతో ఇబ్బందేనా..? చలికాలంలో ఉదయం, సాయంత్రం వేళ పొగమంచు కురుస్తుంటుంది. దాని తీవ్రత ఎక్కువగా ఉంటే ఫాస్టాగ్‌ల నుంచి టోల్ మినహాయింపు ప్రక్రియ మందగించే పరిస్థితి ఉండనుంది. దీనికి సంబంధించి ఎన్హెచ్ఏఐ అధికారులకు కొన్ని ఫిర్యాదులం దాయి. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, సెన్సార్లకు అడ్డుగా వచ్చి ట్యాగ్‌ను వేగంగా రీడ్ చేయలేదని తెలుస్తోంది. దీని వల్ల రుసుమును మినహాయించుకోవటంలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటుందని సమాచారం. అయితే రాష్ట్రంలో ఆ సమస్య ఉత్పన్నం కాదని ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ పేర్కొంటున్నారు. ఉత్తర భారతదేశంలో పొగమంచు దట్టంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో సమస్య ఉత్పన్నమయ్యేందుకు అవకాశం ఉండొచ్చన్నారు. -
టోల్గేట్ల దగ్గర బారులు తీరే పనిలేదు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అన్ని టోల్గేట్ల వద్ద డిసెంబర్ 1 నుంచి ‘ఫాస్టాగ్’ అమలు చేయనున్నామని జాతీయ రహదారుల సంస్థ రీజినల్ అధికారి కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తెలంగాణలోని 17 టోల్‌ప్లాజాల్లోనూ ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘వాహనదారుని వాహనానికి ఫాస్టాగ్‌ను అమర్చుతాం. ఈ టాగ్‌ను బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానం చేస్తాం. మొబైల్ వాలెట్ లేదా ప్రత్యేక కౌంటర్లలో ఫాస్టాగ్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. దీనిద్వారా టోల్‌ప్లాజా దగ్గర బారులు తీరకుండా సులువుగా వెళ్లిపోవచ్చు. ట్రక్కులకు కూడా అనుసంధానం చేయడం వల్ల అది ఏ టోల్‌ప్లాజా దాటింది అనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. టోల్ ప్లాజాల దగ్గర నియమించిన ప్రత్యేక సిబ్బంది ద్వారా వాహనదారులకు ఈ విధానం గురించి అవగాహన కల్పిస్తున్నాం. వాహనదారుడు ఫాస్టాగ్ యాప్ ద్వారా దీన్ని అప్లై చేసుకోవచ్చు’ అని ఆయన తెలిపారు. (చదవండి: ఐదు సెకన్లలో టోల్ దాటొచ్చు) -
5 సెకన్లలో ‘టోల్’ దాటొచ్చు!
విజయవాడ రహదారి.. హైదరాబాద్ నుంచి వాహనాలు దూసుకుపోతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా వాటికి బ్రేక్ పడింది. ఒక వాహనం తర్వాత ఒకటి టోల్ రుసుము చెల్లించి టోకెన్ తీసుకుని ముందుకు కదిలేసరికి భారీ జాప్యం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమయం అరగంట పడుతోంది. సాధారణ రద్దీ ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు అవుతోంది. అయితే డిసెంబర్ 1 నుంచి ఈ తీరు మారిపోనుంది. వాహనం రాగానే టోల్ గేట్ తెరుచుకోవటానికి కేవలం ఐదు సెకన్ల సమయమే పట్టనుంది. అదే ఫాస్టాగ్ మాయ. సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానంతో టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణకు తెరపడబోతోంది. ఫాస్టాగ్ ఉన్న వాహనం రాగానే, టోల్‌ప్లాజా పైనుంచి సెన్సర్ బేస్డ్ రీడర్లు క్షణాల్లో దాన్ని పరిశీలిస్తాయి. అది ఏ తరహా వాహనం, దానికి ఎంత మొత్తం టోల్ విధించాలి అని నిర్ణయించటం మొదలు, అంత మొత్తాన్ని ఫాస్టాగ్లోని చిప్ నుంచి మినహాయించి గేటు తెరిచేయటం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. వాహనం ముందుకు కదులుతుంది. ఇందుకు ఒక్కో గేటుపై దాదాపు రూ.30 లక్షల విలువైన రీడర్లను ఏర్పాటు చేశారు. సెన్సార్ల సాయంతో అది వాహనం అద్దానికి అతికించి ఉన్న ట్యాగ్ నుంచి టోల్ రుసుమును డిడక్ట్ చేసుకుంటుంది. గేటు తెరిచి మూయాల్సిందే వాహనాలు ఒకదానికి ఒకటి తగిలి ఉన్నట్టు ఒకేసారి పెద్ద సంఖ్యలో వస్తే, ఇక్కడా కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, అది ఇబ్బందికరంగా ఉండేంత జాప్యం కాదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ముందున్న వాహనం ఖాతా నుంచి రుసుము డిడక్ట్ కాగానే ఆటోమేటిక్‌గా గేటు తెరుచుకుని వాహనం ముందుకు కదులుతుంది. కానీ ఆ వెంటనే మళ్లీ గేటు మూసుకుంటుంది. మళ్లీ సెన్సర్లు తదుపరి వాహనం నుంచి రుసుము మినహాయించాక తిరిగి గేటు తెరుచుకుంటుంది. ఒకదాని వెనక ఒకటిగా వాహనాలు వచ్చినప్పుడు... ఒకసారి గేటు తెరుచుకున్నాక అన్నీ వెళ్లిపోయే ఏర్పాటు ప్రస్తుతానికి లేదు. కచ్చితంగా గేటు మూసుకున్నాకనే వెనుక ఉన్న వాహనంపై సెన్సర్ల దృష్టి పడుతుంది. గేటు నుంచి వాహనం పొడవు ఎంత ఉంటుంతో అంత పరిమాణంలో ఉండే ప్రాంతాన్ని లూప్గా పిలుస్తారు. ఆ లూప్‌లోకి వాహనం వచ్చిన తర్వాతనే సెన్సర్లు దాని బార్‌కోడ్‌ను డిటెక్ట్ చేస్తాయి. ఆ వెంటనే ఆటోమేటిక్ వెహికిల్ క్లాసిఫయర్లు దాని కేటగిరీ, బరువును అంచనా వేసి రుసుమును నిర్ధారించి వాహనం ట్యాగ్‌లోని చిప్ నుంచి డిటెక్ట్ చేస్తాయి. ఆ లూప్‌నకు కాస్త దూరంగా ఉంటే సెన్సార్లు పట్టించుకోవు. ఫలితంగా ఆ లూప్ పరిధి నుంచి ముందున్న వాహనం కదిలి ముందుకు వెళ్తేగాని రెండో వాహనంపై సెన్సార్ల దృష్టి పడదు. దీనివల్ల కొంత జాప్యం తప్పదని అధికారులు అంటున్నారు. ఎంత ఉన్నా అది కూడా ఒక నిమిషం లోపేనని వారు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో మరింత ఆధునిక వ్యవస్థ ఏర్పాటైతే ఈ సమస్య కూడా ఉండకపోవచ్చని, ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే పద్ధతి అమలులో ఉందని పేర్కొంటున్నారు. పెట్రోలు బంకుల్లో ఫాస్టాగ్ అమ్మకాలు? ప్రస్తుతం కొన్ని ఆన్లైన్ చెల్లింపు సంస్థల ఆధ్వర్యంలో ఫాస్టాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. గడువు దగ్గర పడుతుండటంతో టోల్‌ప్లాజాల వద్ద కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయించి ఆయా బ్యాంకుల ఆధ్వర్యంలో అమ్మకాలు జరుపుతున్నారు. వాహనదారులకు మరింత అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో త్వరలో పెట్రోలు బంకుల్లో కూడా వాటి విక్రయాలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, కేవీబీ, యాక్సిస్, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, పేటీఎం, ఇండస్‌ల్యాండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా... ఇలా మరికొన్ని బ్యాంకుల వివరాలను ప్రకటన రూపంలో ఇప్పటికే ఎన్హెచ్ఏఐ జారీ చేసింది. వీటికి అదనంగా మరిన్ని చోట్ల వాటి విక్రయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఒప్పందం చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. త్వరలో అన్ని పెట్రోలు బంకుల్లో ఈ ట్యాగ్లు అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. -
టోకెన్ గేటులో పాత టోలే!
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. టోల్‌ప్లాజాల వద్ద అప్పటికప్పుడు రుసుము చెల్లించే పద్ధతి స్థానంలో ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు (ఈటీసీ) విధానం అమల్లోకి రానుంది. ఆ పద్ధతిలో వాహనాలకు ముందు అద్దానికి అతికించే ట్యాగ్ పేరే ఫాస్టాగ్. డిసెంబర్ 1 నుంచి మన రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో ఇది అమలు కానుంది. కొత్త విధానం ప్రారంభమైనా.. అన్ని టోల్ ప్లాజాల్లో ఇరువైపులా ఒక్కో సాధారణ గేట్ కూడా కొనసాగించనున్నారు. అయితే, ఆ గేట్ నుంచి వెళ్లే వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఖండించింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ లైన్లో కూడా సాధారణ టోల్నే వసూలు చేస్తామని ఎన్హెచ్ఏఐ ప్రత్యేకాధికారి కృష్ణప్రసాద్ చెప్పారు. అదే సమయంలో ఫాస్టాగ్ కోసం కేటాయించిన గేట్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తామన్నారు. కేంద్రం చెప్పే వరకు సాధారణ లైన్ కొనసాగిస్తామని, తర్వాత దానిని కూడా ఫాస్టాగ్ వేగా మారుస్తామని తెలిపారు. డిసెంబర్ 1 తర్వాత వీలైనంత తక్కువ సమయంలోనే వాటిని తొలగించి పూర్తిగా ఫాస్టాగ్ లేన్లుగా మార్చే అవకాశం ఉంది. ప్లాజాల వద్ద కూడా కౌంటర్లు.... ఫాస్టాగ్ విధానం మొదలుకావడానికి ఇంకా ఎన్నో రోజుల సమయం లేకపోయినా.. వాహనదారులు మాత్రం వాటిని తీసుకునే విషయంలో అంత ఉత్సాహం ప్రదర్శించడంలేదు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కార్లు, 3 లక్షల లారీలు, 5 వేల బస్సులు ఉండగా.. ఇప్పటివరకు 3,500 వాహనాలు మాత్రమే ఫాస్టాగ్‌లు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ విక్రయాలపై అధికారులు దృష్టి సారించారు. అన్ని జాతీయ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీతోపాటు పేటీఎం, అమెజాన్ వంటి మరికొన్ని చెల్లింపు సంస్థలకు వీటిని విక్రయించే అనుమతి ఇచ్చారు. ఇవి ఆన్లైన్ ద్వారా కూడా వాటిని విక్రయిస్తుండగా, ఇప్పుడు అన్ని టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు తెరిచాయి. ఒక్కో టోల్‌ప్లాజా వద్ద ఒక్కో ధర ఫాస్టాగ్‌ల ధరలు రాష్ట్ర మంతటా ఒకే రకంగా ఉండవు. వాహనాల కేటగిరీ ఆధారంగా వాటి ధరల్లో వ్యత్యాసం ఉన్నట్టే ఒక్కో టోల్‌ప్లాజాల పరిధిలో వాటి ధర తేడా ఉంటుంది. వాహనం ఆ దారిలో ప్రయాణించే దూరం ఆధారంగా వాటి రుసుముల్లో తేడాలుంటాయి. రెండు టోల్‌ప్లాజాల మధ్య దూరం తక్కువగా ఉంటే, తక్కువ రుసుము, ఎక్కువ దూరం ఉంటే ఎక్కువ రుసుము ఉంటుంది. రూ.100 కనిష్ట ధరగా ఈ ట్యాగ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫాస్టాగ్‌కు కాలదోషమంటూ ఉండదు. అందులో బ్యాలెన్సు అలాగే ఉంటుంది. టోల్‌ప్లాజా దాటినప్పుడు ఆ మొత్తంలోంచి నిర్ధారిత రుసుము డిడక్ట్ అవుతుంది. టోల్‌ప్లాజాల మీదుగా ప్రయాణం చేసే అవసరం ఉండదన్న ఉద్దేశంతో కొందరు వాటిని కొనేందుకు ఆసక్తి చూపడంలేదు. కాలపరిమితి లేనందున కొని పెట్టుకుని ఉంచుకోవచ్చని, టోల్‌ప్లాజాను దాటినప్పుడు రుసుము డిడక్ట్ అయ్యే వరకు ఆ మొత్తం అలాగే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. -
టోల్గేట్లలో ఇక ఫాస్ట్‌గా!
గుంటూరు – విజయవాడ మధ్య జాతీయ రహదారిపై రద్దీగా ఉండే కాజ టోల్‌గేట్‌ను దాటాలంటే వాహనాలు బారులు తీరిన సమయంలో 10 – 15 నిమిషాలు పడుతోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో గంటల తరబడి నిరీక్షణ తప్పదు. వాహనాలు చీమల్లా కదులుతుండటంతో ఇంధనం వృథా అవుతోంది. జాతీయ రహదారులపై 10 టోల్గేట్లు దాటాలంటే సగటున అర లీటరు నుంచి లీటరు దాకా ఇంధనం వృథా అవుతోందని అంచనా. అదే ‘ఫాస్టాగ్’ వరుసలో వెళ్తే రెండు నిమిషాల్లో టోల్గేట్ దాటవచ్చు. ప్రస్తుతం టోల్గేట్లలో ఒక వరుస మాత్రమే ఫాస్టాగ్ కోసం అందుబాటులో ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి టోల్గేట్లలో అన్ని వరుసలను ఫాస్టాగ్‌గా మారుస్తారు. వాహనదారులు కేవలం ఒక్క వరుసలో మాత్రమే డబ్బులు చెల్లించి రశీదు తీసుకునే వీలుంటుంది. సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా డిసెంబరు 1వ తేదీ నుంచి ‘వన్ నేషన్.. వన్ ట్యాగ్’ నినాదంతో అన్ని టోల్గేట్లలో ఫాస్టాగ్ విధానాన్ని విధిగా అమలు చేయనున్నారు. కేవలం ఒక్క వరుసలో మాత్రమే నగదు చెల్లించే అవకాశం ఉంటుంది. ఏపీలోని 43 ఎన్హెచ్ఏఐ టోల్గేట్లలో ఫాస్టాగ్ అమలవుతుంది. టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే స్థానికులు, స్థానిక రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ప్రీ పెయిడ్ పాసులు ఇచ్చి.. ఫాస్టాగ్ విధానంలో రాయితీలు వర్తించేలా ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులిచ్చింది. పలు రకాలుగా రీ చార్జి సదుపాయం: టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ వరుసలో వాహనాలు 25–40 కి.మీ. వేగంతో మాత్రమే వెళ్లాలి. క్యాష్ లెస్ విధానంలో ఫాస్టాగ్ అమలవుతుంది. ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ల కోసం కేంద్రం 23 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. కనీసం రూ.వందతో ఫాస్టాగ్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ పొందవచ్చు. అమెజాన్, ఫాస్టాగ్ యాప్, పేటీఎం ద్వారా రీ ఛార్జి చేసుకునే సదుపాయం ఉంది. ఇవీ ఉపయోగాలు.. - ఇంధనం, సమయం ఆదా. - కాలుష్యం తగ్గుతుంది. - ట్రాఫిక్ సమస్యలుండవు. - చోరీకి గురైన ఫాస్టాగ్ ఉన్న వాహనం టోల్‌ప్లాజా దాటగానే యజమాని ఫోన్‌కు మెస్సేజ్ వస్తుంది. స్టేట్ హైవే టోల్‌ప్లాజాల్లోనూ... జాతీయ రహదారులతోపాటు రాష్ట్ర రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లోనూ ఫాస్టాగ్ అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ ఆదేశాలిచ్చింది. నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిలో తుమ్మలచెరువు వద్ద, సంతమాగులూరు సమీపం లోని ఏల్చూరు, రాజమండ్రి బ్రిడ్జి, పులిగడ్డ వారధి వద్ద ఇలాంటి టోల్గేట్లు ఉన్నాయి. వీటిలో రెండువైపులా ఫాస్టాగ్ డెడికేటెడ్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. టోల్గేట్లలో ఆర్ఎఫ్ఐడీ యంత్రాల వ్యయంలో 50 శాతాన్ని ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ భరించనుంది. ఫాస్టాగ్ అంటే..? బ్యాంకు ఖాతాతో అనుసంధానం కలిగి ఉండే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో కూడిన స్టిక్కర్‌ను ఫాస్టాగ్ అంటారు. ఫాస్టాగ్ స్టిక్కర్ మీదున్న బార్‌కోడ్‌ను టోల్‌ప్లాజాలోని ఆర్ఎఫ్ఐడీ యంత్రం గుర్తించి రీడ్ చేస్తుంది. వాహనం టోల్‌ప్లాజాను దాటుతుండగా టోల్ రుసుమును రీఛార్జి మొత్తం నుంచి మినహాయించుకుంటుంది. ఈ వివరాలు వెంటనే వాహనదారుడి ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. ఏపీలో ఫాస్టాగ్ ద్వారా ప్రస్తుతం 20 నుంచి 25 శాతం వాహనాలు ప్రయాణిస్తున్నట్లు అంచనా. సిబ్బంది కుదింపు?: టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుతో భవిష్యత్తులో సిబ్బంది కుదింపు చర్యలు చేపట్టనున్నట్లు కొంతమంది టోల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అన్ని టోల్‌ప్లాజాల్లో సగటున 105 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేలా ఎన్హెచ్ఏఐ చర్యలు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు. సరుకు రవాణా సమయం ఆదా టోల్‌ప్లాజాల్లో ట్రాఫిక్ సమస్యతో సమయం, ఇంధనం వృథా అవుతోంది. పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో ఇప్పటికే రవాణా రంగం కుదేలైంది. ఫాస్టాగ్ అమలుతో కొన్ని సమస్యలు తీరినట్లే. – ఈశ్వరరావు, లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఫాస్టాగ్‌కు కేంద్రం సాయం స్టేట్ హైవేస్‌లోని టోల్‌ప్లాజాల్లో ఫాస్టాగ్ అమలుకు రూ.20 లక్షల చొప్పున ఖర్చవుతుంది. ఈ భారం భరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. – మనోహర్‌రెడ్డి, రోడ్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ ఎండీ -
ప్రధాని కారుకూ ఫాస్టాగ్ తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ప్రధాని, సీఎం లాంటి వీవీఐపీ ల వాహనాలకూ ఫాస్టాగ్ తప్పనిసరి కానుంది. టో ల్గేట్లు దాటేటప్పుడు కచ్చితంగా వీవీఐపీల కాన్వాయ్ల్లోని వాహనాలకూ ఫాస్టాగ్ ఉండాలని అధికారులు అంటున్నారు. టోల్‌ప్లాజాల వద్ద రుసుము చెల్లించేందుకు వాహనాలు బారులు తీరాల్సిన పని లేకుండా వేగంగా ముందుకు సాగిపోయేందుకు ఉద్దేశించిన విధానమే ఫాస్టాగ్. ఎంతోకాలంగా కేం ద్రం ప్రకటిస్తున్న ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టం ఎట్టకేలకు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిలో భాగంగా వాహనాలు కచ్చితంగా ట్యాగ్ ఏ ర్పాటు చేసుకోవాల్సిందే. ట్యాగ్ లేని వాహనాలు వస్తే టోల్గేట్లు తెరుచుకోవు. ఈ పద్ధతి అలవాట య్యే వరకు అప్పటికప్పుడు రుసుము చెల్లించి టో కెన్ తీసుకునే విధానమూ కొనసాగుతుంది. కానీ అందుకు ఒక్క లేన్‌ను మాత్రమే కేటాయించి మిగ తావన్నీ ట్యాగ్ ఉన్న వాహనాలు వెళ్లేందుకు కేటాయిస్తారు. ఎంపిక చేసిన జాతీయ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకులు, అమెజాన్, పేటీఎం లాంటి ఆన్లైన్ సంస్థల్లో చెల్లించి ఫాస్టాగ్ పేరుతో ఉండే స్టిక్కర్లను పొందాలి. దాన్ని వాహనం ముం దు అద్దానికి అతికించాలి. గేట్ల వద్ద ఉండే సెన్సర్లు దీన్ని స్కాన్ చేసి నిర్ధారిత రుసుమును మినహాయించుకుంటాయి. ఆపై ఆటోమేటిక్‌గా గేటు తెరు చుకుంటుంది. కాగా, ఫాస్టాగ్ విధానంలో కూడా నిర్ధారిత వాహనాలకు టోల్‌ఫీజు మినహాయింపు ఉండనుంది కానీ, ట్యాగ్ నుంచి మాత్రం ఉండదు. జీరో బ్యాలెన్స్ ట్యాగ్.. కేంద్రం టోల్ నుంచి మినహాయింపునిచ్చిన వ్యక్తులకు సంబంధించిన వాహనాల సంఖ్య, రిజిస్ట్రేషన్ నంబరు, ఇతర వివరాలను ముందుగా ఎన్హెచ్ఏఐకి తెలపాలి. ఇందుకు ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించారు. ఎన్ని వాహనాలకు అనుమతి ఉందో గుర్తించి వాటికి ప్రత్యేకంగా జీరో బ్యాలెన్స్ అర్హత ఉండే ఫాస్టాగ్‌లను రూపొందిస్తారు. వాటిని ఎన్హెచ్ఏఐ ప్రధాన కార్యాలయాల నుంచి సంబం ధి త వ్యక్తులకు జారీ చేస్తారు. ఆ ట్యాగ్‌లను వాహనాల అద్దాలకు అతికిస్తారు. అయితే గతంలోలాగా వీఐపీల పేర్లతో తోచినన్ని వాహనాలు టోల్గేట్ల నుంచి వెళ్లటానికి వీలుండదు. కచ్చితంగా ట్యాగ్ ఉన్న వాహనం వస్తేనే అనుమతి ఉంటుంది. -
ప్రారంభమైన ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఫాస్టాగ్’ కార్ పార్కింగ్ విధానం ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో నగదు రహిత లావాదేవీలతోపాటు కాలయాపన లేకుండా పర్యావరణ హితంగా మొత్తం ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ‘ప్యాసింజర్ ప్రైమ్’లో ప్రయాణికుల సౌకర్యార్థం దేశంలోనే తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో దీనిని ప్రారంభించారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) సహకారంతో దీనిని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఐసీఐసీఐ ఫాస్టాగ్‌లతో ప్రారంభమవుతున్న ఈ ప్రక్రియ క్రమంగా ఇతర బ్యాంకులకు విస్తరించనున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు సీఈవో ఎస్జీకే కిశోర్ మాట్లాడుతూ.. ఈ ప్రక్రియ ద్వారా కార్ల పార్కింగ్ సులభతరం కానుందన్నారు. డిజిటలైజేషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రక్రియ కాలుష్యాన్ని నివారించడంతోపాటు పర్యావరణ సుస్థిరతకు దోహదం చేస్తుందని తెలిపారు. తమకు భాగస్వాములుగా చేరిన ఎన్‌పీసీఐకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలా ఉపయోగించుకోవాలి.. ‘ఫాస్టాగ్ కార్ పార్కింగ్’ను ఉపయోగించుకోవడానికి రీలోడబుల్ ఎలక్ట్రానిక్ ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ ఉంటుంది. ఈ ట్యాగ్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ ఉంటుంది. వినియోగదారులు ముందుగా ఈ ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఈ ఫాస్టాగ్‌ను సదరు వినియోగదారుడి ప్రీపెయిడ్ బ్యాంకు ఖాతాకు లింక్ చేస్తారు. ట్యాగ్ ఖాతా యాక్టివేట్ అయిన తర్వాత దానిని కారుకు సంబంధించిన విండ్ స్క్రీన్‌పై అమర్చుకోవాలి. ప్రయాణికులు, వినియోగదారులు పార్కింగ్‌కు వచ్చినపుడు లావాదేవీల కోసం ఆగకుండా ఈ ట్యాగ్ నుంచి ఆటోమేటిక్‌గా చెల్లింపులు పూర్తవుతాయి. ఈ విధానాన్ని సబ్‌స్క్రైబ్ చేసిన వాహనదారులు ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించకుండా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వీటి కోసం పార్కింగ్ వెళ్లే చోట, నిష్క్రమణల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఫాస్ట్‌ట్యాగ్ అమలుతో ఇక నేరుగా వెళ్లొచ్చు!
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ రహదారి దాదాపు 185 కిలోమీటర్ల మేర ఉంది. జిల్లాలో టోల్‌ప్లాజా నుంచి ప్రతి రోజు 7వేల కార్లు, 4వేల లారీలు, 2వేల బస్సులు, 5వేల భారీ వాహనాలు, 3వేల ఇతర వరకు వెళ్తుంటాయి. హైదరాబాద్ నుంచి కర్నూల్, కడప, అనంతపూర్, బెంగుళూర్ ప్రాంతాలకు వెళ్లే వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ కారణంగా జాతీయ రహదారిపై తరచూ ట్రాఫిక్ జాం ఏర్పడుతోంది. ఏదైన పండగలు, పలు సందర్భాల్లో రోడ్లపై ఉన్న టోల్ ప్లాజ్ల దగ్గర గంటల తరబడి వాహనాలు నిలిచిపోతుంటాయి. అత్యవసరంగా ఆస్పత్రులకు వెళ్లే వారు చాలా ఇబ్బంది పడుతుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని టోల్ గేట్ల దగ్గర కొత్త విధానానికి శ్రీకారం చూట్టారు. నేరుగా వాహనం వెళ్లిపోయేలా వెసులుబాటు కల్పించారు. డిసెంబర్ 1నుంచి అమలు ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని వచ్చేనెల 1వ తేదీనుంచి అమల్లోకి తెస్తున్నారు. దీనివల్ల టోల్‌ప్లాజా వద్ద వాహనదారులు ఇక ఆగాల్సిన అవసరం లేదు. పెరిగిన వాహనాల రద్దీ, ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్ ట్యాగ్ సేవలు అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణం చేసే వాహనదారులు ముందే సిమ్ట్యాగ్ తీసుకొని వాటిలో ముందే నగదు వేసుకొని వాహనం ముందు భాగంలో స్టిక్కర్లు అతికించుకోవాలి. ఆ స్టికర్లను టోల్‌ప్లాజా దగ్గర ఉన్న స్కానర్లు వాటిని స్కాన్ చేసిన క్షణంలో ఖాతా నుంచి నగదు సంబంధిత టోల్‌ప్లాజా ఖాతాలోకి వెళ్తుంది. డిసెంబర్ 1 నుంచి ఒక బ్లాక్‌లో దీనిని ప్రయోగత్మకంగా పరిశీలన చేయనున్నారు. సమయం ఆదా.. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో అడ్డాకుల, బాలానగర్ దగ్గర రెండు టోల్‌ప్లాజాలు ఉన్నా యి. దీంట్లో ఒక వాహనం టోల్‌ప్లాజాను దాటడానికి కనీసం పది నిమిషాలు పడుతోంది. ఇక పండుగ, రద్దీ సమయాల్లో అయితే ఆర గంట నుంచి గంటకుపైగా అక్కడే రోడ్డుపై నిరీక్షించాల్సి వస్తోంది. అదేవిధంగా టోల్ రుసుము నగదు రూపంలో చెల్లిస్తుండటంతో సింగిల్‌కు ఒక విధానం డబుల్‌కు మరో విధానం ఉండటం వల్ల సరిపడ చిల్లర లేక మరింత అలస్యం అవుతుంది. ఈ సమస్యను నివారించేందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 1నుంచి ఆన్లైన్ చెల్లింపులకు శ్రీకారం చూడుతున్నారు. అప్పటి నుంచి పూ ర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టోల్‌ప్లాజా యాజమాన్యాలకు కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆరు బ్యాంకుల్లో అవకాశం ఫాస్ట్‌ట్యాగ్ సిమ్‌కార్డును తీసుకోవడానికి ఆరు ప్రధాన బ్యాంకుల్లో అవకాశం కల్పించారు. జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా నిర్వహకులు ఒక్కొక్కరు ఒక్కోక్క విధానాలు అమలు చేస్తున్నారు. దీంతో వారికి అనుబంధంగా ఉన్న ఆరు బ్యాంకుల్లో ఏదో ఒక దాంట్లో నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కార్డు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో ముందుగానే కొంత నగదు వేయాల్సి ఉంటుంది. ఇలా వేసిన తర్వాత జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో ఆ ఖాతా నుంచి కొంత నగదు కట్ అవుతున్న క్రమంలో మళ్లి వేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మొదట కొంత ఇబ్బంది ఉన్న తర్వాత సులువు కానుంది. టోల్‌ప్లాజా దగ్గర చిల్లర కోసం ఇతర కారణాల వల్ల గంటల కొద్ది ట్రాఫిక్‌లో ఇరుకుపోయే కంటే ఇది చాలా సువులుగా ఉంటుంది. ఈ పద్ధతి వల్ల వచ్చిన ప్రతి వాహనం సెకెండ్లలో టోల్‌గేట్‌ను దాటివెళ్తోంది. దీంతో సమస్యలు ఉత్పన్నం కావు. ఆన్లైన్ చెల్లింపులు ఇలా.. ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్‌ను వాహనం ముందు భా గంలో అద్దంపై అతికించాలి. గేటు వద్దకు వా హనం రాగానే ఈటీసీ కెమెరాలు స్కాన్ చేస్తా యి. దీంతో గేటు ఆటోమెటిక్‌గా ఓపెన్ అవుతా యి. అడ్డాకుల, రాయికల్ టోల్‌ప్లాజా దగ్గర డి సెంబర్ 1నుంచి అమల్లోకి తెస్తారు. ఫాస్ట్‌ట్యాగ్ అమల్లో భాగంగా జాతీయ రహదారుల సంస్థ మై ఫాస్ట్ ట్యాగ్, ఫాస్ట్‌ట్యాగ్ పా ర్టనర్ యాప్‌లను అందుబాటులోకి తీ సుకొచ్చింది. వాహనదారులు తమ బ్యాంకు ఖాతాలో ఈ యాప్‌ను అనుసంధానం చేసుకొని నిర్ణీత సొమ్మును చెల్లించాలి. ఆ వివరాలు ఎంపిక చేసిన బ్యాంకుల్లో లేదా టోల్‌ప్లాజా ఇస్తే ఫాస్ట్‌ట్యాగ్‌తో కూడిన ఒక ఫ్రీపెయిడ్ స్టిక్కర్ ఇస్తారు. ఇకపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తవు ఫాస్ట్‌ట్యాగ్ విధానంతో టోల్‌ప్లాజా దగ్గర ట్రాఫిక్ జాం కాదు. దీంతో పాటు నగదు రహిత సేవలు కూడా అమల్లోకి వస్తాయి. ఇంధనం, సమయం, పొల్యూషన్ చాలా వరకు ఆదా చేయవచ్చు. ఈ విధానం తీసుకురావడం వల్ల వాహనదారులకు ఎంతో మేలు జరుగుతుంది. – శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ, మహబూబ్‌నగర్ -
ఫాస్ట్ ట్యాగ్ !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని అందింపుచ్చుకోవడంలో ఆర్టీసీ అధికారులు ఓ అడుగు ముందుకేశారు. టోల్గేట్ల వద్ద ఫీజు చెల్లించడం, నెలవారీ పాస్ చూపించడం వాటితో సమయం వృథా కాకుండా ఫాస్ట్‌ట్యాగ్ స్టికర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. తద్వారా టోల్గేట్ల వద్ద నిరీక్షించకుండా ఫాస్ట్‌ట్యాగ్ స్టికర్లపై ఉండే బార్‌కోడింగ్ సాయంతో నేరుగా బస్సులు వెళ్లిపోనున్నాయి. ఈ మేరకు టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేక కౌంటర్లు, మిషన్లు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ రీజియన్‌లో టోల్‌ప్లాజ్‌ల మీదుగా హైదరాబాద్, కర్నూలు తిరిగే బస్సులకు ‘ఫాస్ట్ ట్యాగ్’ పద్ధతిని ఆర్టీసీ అమలు చేస్తోంది. మూడు టోల్ ప్లాజాలు మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలో ఇటు హైదరాబాద్, కర్నూలు రూట్లలో తిరిగే బస్సులకు ‘ఫాస్ట్ ట్యాగ్’ అమలు చేస్తున్నా రు. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు 200 కి.మీ మేర విస్తరించి ఉన్న జాతీయ రహదారి (ఎన్‌హెచ్–44)పై మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటి వద్ద ఆర్టీసీ బస్సులు టోల్ రుసుం చెల్లించడానికి లేదా నెలవారీ పాస్ చూపించేందుకు వేచిచూడాల్సి వచ్చేది. దీనివల్ల రద్దీ సమయాల్లో సమయం వృథా అయ్యేది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతిని తీసుకొచ్చింది. బస్సుకు సంబంధించిన ఒక అద్దానికి ఫాస్ట్‌ట్యాగ్ స్టికర్ అంటిస్తారు. ఈ స్టిక్కర్‌పై బార్ కోడ్ ఉంటుంది. రీజియన్ పరిధిలోని రాయికల్, అడ్డాకుల, ఎర్రవల్లి టోల్‌ప్లాజ్‌ల వద్దకు ఫాస్ట్‌ట్యాగ్ బస్సులు చేరుకోగానే ఎక్కువ సమయం వేచి ఉండకుండా పది అడుగుల దూరంలోనే బార్‌కోడింగ్‌ను టోల్‌ప్లాజ్‌కు చెందిన స్కానర్లు స్కానింగ్ చేసుకుంటాయి. దీంతో వెంటనే అక్కడి నుంచి బస్సులు ముందుకు కదిలేలా గేట్ తెరుచుకుంటుంది. టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న బస్సులు వెళ్లడానికి ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. రీజియన్‌లోనే ప్రథమంగా... ఫాస్ట్‌ట్యాగ్ విధానాన్ని మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియన్‌లో ఆగస్టు నెలలో ప్రయోగాత్మకంగా ప్ర వేశపెట్టారు. ఈ ప్రయోగం విజయ వంతం కావడంతో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పూరిస్థాయిలో దీనిని అమలు చేస్తున్నారు. రీజియన్‌లోని తొమ్మిది డిపోలకు చెందిన హైదరాబాద్, కర్నూలు రూట్లలో తిరిగే బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్ స్టిక్కర్లు వేశారు.అమర్చారు. హైదరాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులకు సమయం ఆదా అవుతున్నప్పటికీ రాయికల్ టోల్‌ప్లాజ్‌లో ఒకే కౌంటర్ ఉండడంతో కొన్నిసార్లు బస్సుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. టోల్‌ప్లాజ్‌లోని అన్ని కౌంటర్లలో ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న బస్సులకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. ఫాస్ట్‌ట్యాగ్‌తో సమయం ఆదా టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతి అమలు చేయడం వల్ల సమయం ఆదా అవుతోంది. గతంలో టోల్‌ప్లాజాల వద్ద టికెట్ తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేది. ఫాస్ట్‌ట్యాగ్ వల్ల ఆ ఆలస్యాన్ని నివారించగలుగుతున్నాం. – మహేశ్, ఆర్టీసీ డీవీఎం -
ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: టోల్గేట్ల వద్ద ఫీజు చెల్లించడం, నెలవారీ పాస్ చూపించడం వాటితో సమయం వృథా కాకుండా ఫాస్ట్ ట్యాగ్ సిక్కర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ విధానాన్ని మహబూబ్‌నగర్ ఆర్టీసీ రీజియ న్లో ఆగస్టులో ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. ఈ ప్రయోగం విజయవంతం కావ డంతో సెప్టెంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో దీనిని అమలు చేస్తున్నారు. ఎన్‌హెచ్–44పై మూడు టోల్ప్లాజాలున్నాయి. ఆర్టీసీ బస్సులు వాటి వద్ద టోల్ రుసుం చెల్లించడానికి లేదా నెలవారీ పాస్ చూపించేందుకు వేచి చూడాల్సి వచ్చేది. దీనివల్ల రద్దీ సమయాల్లో సమయం వృథా అయ్యేది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతిని తీసుకొచ్చింది. బస్సుకు సంబంధించిన ఒక అద్దానికి ఫాస్ట్ ట్యాగ్ స్టిక్కర్ అంటిస్తారు. ఈ స్టిక్కర్‌పై బార్ కోడ్ ఉంటుంది. టోల్‌ప్లాజ్‌ల వద్దకు ఫాస్ట్ ట్యాగ్ బస్సులు చేరుకోగానే పది అడుగుల దూరంలోనే బార్‌కోడింగ్‌ను టోల్‌ప్లాజ్‌కు చెందిన స్కానర్లు స్కానింగ్ చేసుకుంటాయి. దీంతో వెంటనే అక్కడి నుంచి బస్సులు ముందుకు కదిలేలా గేట్ తెరుచుకుంటుంది. ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న బస్సులు వెళ్లడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఫాస్ట్‌ట్యాగ్‌తో సమయం ఆదా.. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్‌ట్యాగ్ పద్ధతి అమలు చేయడం వల్ల సమయం ఆదా అవుతోందని ఆర్టీసీ డీవీఎం మహేశ్ తెలిపారు. గతంలో టోల్‌ప్లాజాల వద్ద టికెట్ తీసుకోవాలంటే ఎక్కువ సమయం పట్టేదని చెప్పారు.