‘ఫాస్ట్‌’గానే ప్రజల్లోకి.. | There is a shortage of FASTags In most parts of the country | Sakshi
Sakshi News home page

‘ఫాస్ట్‌’గానే ప్రజల్లోకి..

Published Thu, Nov 28 2019 3:04 AM | Last Updated on Thu, Nov 28 2019 3:04 AM

There is a shortage of FASTags In most parts of the country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వద్ద నగదు రహిత చెల్లింపుల్లో భాగంగా ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు వ్యవస్థపై వాహనదారుల్లో అవగాహన వేగంగా పెరుగుతోంది. డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ వ్యవస్థలో భాగంగా వాహనాల ముందు అద్దానికి అమర్చే ఫాస్టాగ్‌ల విక్రయం ఒక్కసారిగా జోరందుకుంది. సరిగ్గా వారం క్రితం తెలంగాణలో కేవలం 3,500 ట్యాగ్‌లే అమ్మకం కాగా, ప్రస్తుతం వాటి సంఖ్య పదిన్నర వేలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఈ వారంలోనే ఎక్కువ ట్యాగ్‌లు అమ్ముడుపోవటం తో చాలా ప్రాంతాల్లో వాటికి కొరత ఏర్పడింది. కొన్నిచోట్ల ట్యాగ్‌లు అందుబాటులో లేవన్న సమాధానం వస్తుండటంతో వాహనదారులు బ్యాంకులు, టోల్‌ప్లాజాల చుట్టూ తిరుగుతున్నారు.

తెలంగాణలో కూడా ఈ వారంలోనే ఏకంగా 7 వేల ట్యాగ్‌లు అమ్ముడు కావటంతో ఇక్కడా కొరత ఏర్పడే పరిస్థితి వచ్చేది. కానీ, నేషనల్‌ హైవే అథారిటీ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌ నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఒకేసారి పెద్ద మొత్తంలో ట్యాగ్‌లకు ఇండెంట్‌ పెట్టి తెప్పించారు. వాటి అమ్మకాలు పెరిగే సమయంలో అద నంగా 15వేల ట్యాగ్‌లు అందుబాటులోకి వచ్చా యి. దీంతో రాష్ట్రంలో వాటికి కొరత లేకుండా పోయింది. ప్రస్తుతం జాతీయ రహదారులపై 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో ప్రతిచోటా.. ఒక్కోవైపు 5 చొప్పున 10 కౌంటర్లు ఏర్పాటుచేసి అమ్ముతున్నారు. బ్యాంకుల్లో నేరుగా విక్రయం, ఆన్‌లైన్‌ ద్వారా తెప్పించుకోవటంతో పోలిస్తే.. టోల్‌ప్లాజాల్లోనే ఎక్కువగా అమ్మకం అవుతున్నాయి. అన్ని టోల్‌ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్‌ టోల్‌ వసూలు యంత్రపరికరాల ఏర్పాటు దాదాపు పూర్తయింది. 4టోల్‌ కేంద్రాల్లో పనులు తుదిదశలో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.  

‘సగమే వసూలు’ నిబంధనకు తూట్లు.. 
వాహనం టోల్‌ప్లాజా దాటేప్పుడు తిరుగు ప్రయాణానికీ ఒకేసారి టోల్‌ చెల్లించేవారుంటారు. వాహనం 24 గంటల్లోపు తిరిగొస్తే, రెండోసారి సగం రుసుమే చెల్లించాలి. ఈ నిబంధనపై అవగాహన లేక టోకెన్‌ పద్ధతి చెల్లింపు విధానంలో.. మొత్తం రుసుము చెల్లిస్తున్నారు. అవగాహన ఉన్నవారు ప్రశ్నించి మరీ సగమే చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఫాస్టాగ్‌ విధానం పూర్తిగా ఆటోమేటిక్‌ చెల్లింపు వ్యవస్థే అయినందున ఆ సమస్య ఉత్పన్నం కాకూడదు. అయితే కొన్ని సంస్థలు, బ్యాంకులిచ్చే ట్యాగ్‌ల్లో లోపాల వల్ల పూర్తి మొత్తం కట్‌ అవుతోందంటూ లారీ యజమానుల సంఘం ఫిర్యాదు చేసింది. అలాంటి పరిస్థితి లేకుండా చూస్తామని, ఎక్కడైనా లోపం జరిగితే ఆ మొత్తాన్ని వాహనదారుడికి తిరిగి చెల్లిస్తామని అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా ప్రయోగాత్మకంగా కొన్ని లేన్లకే ఇది పరిమితమై ఉన్నందున, పూర్తిస్థాయి వ్యవస్థ ఏర్పాటైతే ఇలాంటి లోపాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

పొగమంచుతో ఇబ్బందేనా..?
చలికాలంలో ఉదయం, సాయంత్రం వేళ పొగమంచు కురుస్తుంటుంది. దాని తీవ్రత ఎక్కువగా ఉంటే ఫాస్టాగ్‌ల నుంచి టోల్‌ మినహాయింపు ప్రక్రియ మందగించే పరిస్థితి ఉండనుంది. దీనికి సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు కొన్ని ఫిర్యాదులం దాయి. పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, సెన్సార్లకు అడ్డుగా వచ్చి ట్యాగ్‌ను వేగంగా రీడ్‌ చేయలేదని తెలుస్తోంది. దీని వల్ల రుసుమును మినహాయించుకోవటంలో జాప్యం జరిగే పరిస్థితి ఉంటుందని సమాచారం. అయితే రాష్ట్రంలో ఆ సమస్య ఉత్పన్నం కాదని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌ పేర్కొంటున్నారు. ఉత్తర భారతదేశంలో పొగమంచు దట్టంగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో సమస్య ఉత్పన్నమయ్యేందుకు అవకాశం ఉండొచ్చన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement