ఫాస్టాగ్‌లను విక్రయిస్తున్న దృశ్యం
సాక్షి, హైదరాబాద్: ఫాస్టాగ్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. టోల్‌ప్లాజాల వద్ద అప్పటికప్పుడు రుసుము చెల్లించే పద్ధతి స్థానంలో ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు (ఈటీసీ) విధానం అమల్లోకి రానుంది. ఆ పద్ధతిలో వాహనాలకు ముందు అద్దానికి అతికించే ట్యాగ్ పేరే ఫాస్టాగ్. డిసెంబర్ 1 నుంచి మన రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 17 ప్రాంతాల్లో ఉన్న టోల్‌ప్లాజాల్లో ఇది అమలు కానుంది. కొత్త విధానం ప్రారంభమైనా.. అన్ని టోల్ ప్లాజాల్లో ఇరువైపులా ఒక్కో సాధారణ గేట్ కూడా కొనసాగించనున్నారు. అయితే, ఆ గేట్ నుంచి వెళ్లే వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఖండించింది. కేంద్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ లైన్‌లో కూడా సాధారణ టోల్‌నే వసూలు చేస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రత్యేకాధికారి కృష్ణప్రసాద్ చెప్పారు. అదే సమయంలో ఫాస్టాగ్ కోసం కేటాయించిన గేట్ల నుంచి వెళ్లే సాధారణ వాహనాలకు రెట్టింపు టోల్ వసూలు చేస్తామన్నారు. కేంద్రం చెప్పే వరకు సాధారణ లైన్ కొనసాగిస్తామని, తర్వాత దానిని కూడా ఫాస్టాగ్ వేగా మారుస్తామని తెలిపారు. డిసెంబర్ 1 తర్వాత వీలైనంత తక్కువ సమయంలోనే వాటిని తొలగించి పూర్తిగా ఫాస్టాగ్ లేన్లుగా మార్చే అవకాశం ఉంది.
ప్లాజాల వద్ద కూడా కౌంటర్లు....
ఫాస్టాగ్ విధానం మొదలుకావడానికి ఇంకా ఎన్నో రోజుల సమయం లేకపోయినా.. వాహనదారులు మాత్రం వాటిని తీసుకునే విషయంలో అంత ఉత్సాహం ప్రదర్శించడంలేదు. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల కార్లు, 3 లక్షల లారీలు, 5 వేల బస్సులు ఉండగా.. ఇప్పటివరకు 3,500 వాహనాలు మాత్రమే ఫాస్టాగ్‌లు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ విక్రయాలపై అధికారులు దృష్టి సారించారు. అన్ని జాతీయ బ్యాంకులు, ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీతోపాటు పేటీఎం, అమెజాన్ వంటి మరికొన్ని చెల్లింపు సంస్థలకు వీటిని విక్రయించే అనుమతి ఇచ్చారు. ఇవి ఆన్‌లైన్ ద్వారా కూడా వాటిని విక్రయిస్తుండగా, ఇప్పుడు అన్ని టోల్‌ప్లాజాల వద్ద ప్రత్యేకంగా కౌంటర్లు తెరిచాయి.
ఒక్కో టోల్‌ప్లాజా వద్ద ఒక్కో ధర
ఫాస్టాగ్‌ల ధరలు రాష్ట్ర మంతటా ఒకే రకంగా ఉండవు. వాహనాల కేటగిరీ ఆధారంగా వాటి ధరల్లో వ్యత్యాసం ఉన్నట్టే ఒక్కో టోల్‌ప్లాజాల పరిధిలో వాటి ధర తేడా ఉంటుంది. వాహనం ఆ దారిలో ప్రయాణించే దూరం ఆధారంగా వాటి రుసుముల్లో తేడాలుంటాయి. రెండు టోల్‌ప్లాజాల మధ్య దూరం తక్కువగా ఉంటే, తక్కువ రుసుము, ఎక్కువ దూరం ఉంటే ఎక్కువ రుసుము ఉంటుంది. రూ.100 కనిష్ట ధరగా ఈ ట్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఫాస్టాగ్‌కు కాలదోషమంటూ ఉండదు. అందులో బ్యాలెన్సు అలాగే ఉంటుంది. టోల్‌ప్లాజా దాటినప్పుడు ఆ మొత్తంలోంచి నిర్ధారిత రుసుము డిడక్ట్ అవుతుంది. టోల్‌ప్లాజాల మీదుగా ప్రయాణం చేసే అవసరం ఉండదన్న ఉద్దేశంతో కొందరు వాటిని కొనేందుకు ఆసక్తి చూపడంలేదు. కాలపరిమితి లేనందున కొని పెట్టుకుని ఉంచుకోవచ్చని, టోల్‌ప్లాజాను దాటినప్పుడు రుసుము డిడక్ట్ అయ్యే వరకు ఆ మొత్తం అలాగే ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment