
పాలెంపల్లె టోల్‌ప్లాజా వద్ద పరిశీలిస్తున్న ఎన్‌హెచ్‌ఐఎ అధికారులు
కడప సిటీ : టోల్‌ప్లాజాల్లో రద్దీ నివారించి సమయం ఆదా చేసేందుకు ఏర్పాటు చేసిన ఫాస్టాగ్ పద్ధతికీ కొందరు టోకరా కొట్టిస్తున్నారు. కక్కుర్తి తెలివితేటలు ప్రదర్శించిన ఇలాంటి వారికి తాజాగా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఫాస్టాగ్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో కడప పాలెంపల్లె వద్ద, మరొకటి మైదుకూరు మండలం బసవాపురం వద్ద ఈ టోల్ ప్లాజాలున్నాయి. ఇవి అత్యాధునిక సాంకేతిక విధానంతో పనిచేస్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద కౌంటర్లలో నగదు చెల్లించి రశీదు పొంది ఒక వాహనం ముందుకెళ్లేసరికి కొంత సమయం పడుతుంది. ఈలోగా వెనుక వాహనాల సంఖ్య కూడా పెరుగుతుంది. స్వల్ప మొత్తంలో టోల్‌ప్లాజా రుసుం చెల్లించి కదలడం పెద్ద గుదిబండగాతయారైంది. పండగ లాంటి ముఖ్యరోజుల్లో వాహనాలు ముందుకు కదలాలంటే గంటల కొలదీ కాలహరణం జరిగిపోతోంది. తాజాగా కేంద్రం విదేశాల మాదిరిగా మన దేశంలో కూడా ఫాస్టాగ్ విధానాన్ని తీసుకు వచ్చింది. ఫాస్టాగ్ స్టిక్కరున్న వాహనం టోల్‌ప్లాజ్ లైనుకి చేరగానే చిటెకెలో వాహనం స్కేనింగ్ అవుతుంది. వెనువెంటనే వాహన చోదకుడు లేదా యజమాని బ్యాంకు ఖాతా నుంచి టోల్‌ప్లాజా వారికి నిర్ణీత మొత్తం జమ అవుతుంది.
దీంతో సమయం వృధా కాదు. అక్కడ రద్దీ కూడా ఎదురుకాదు. ఈ నెల ఒకటి నుంచి ఈ విధానం అమలు చేస్తున్నా ఇంకా చాలామంది వాహన యజమానులు బ్యాంకులు లేదా టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు స్టిక్కర్లను తీసుకోలేదు. పాస్టాగ్ స్టిక్కర్లను కలిగిన వాహనాలు ప్రత్యేక వరుసల్లో అనుమతిస్తారు. ఈనెల 15నుంచి ఈ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలని కేంద్రం తొలుత స్పష్టం చేసింది. తాజాగా ఈ గడువును జనవరి 15దాటేవరకూ పొడించింది. ఇదిలా ఉండగా కొందరు స్టిక్కర్ల విషయంలో ఎన్‌హెచ్‌ఐఎ అధికారులను బోల్తా కొట్టించేందుకు ప్రయత్నించి భంగపడుతున్నారు. ఒక్కొక్క వాహనానికి ఒక్కో విధంగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొన్నిచోట్ల జీపునకు రూ.35,మినీ బస్సుకు రూ.60,లారీకి 120 వసూలు చేస్తారు. కొందరు వాహన యజమానులు కక్కుర్తి ప్రదర్శించి జీపు పేరుతో ఫాస్టాగ్ స్టిక్కరు తీసుకుని తమ లారీలకు అతికిస్తున్నారు. అయితే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడింటిఫికేషన్ ఈ స్టిక్కరును స్కాన్ చేస్తుంది. స్కానింగ్ దగ్గర ఈ తేడాను జిల్లాలోని టోల్‌ప్లాజా సిబ్బంది గుర్తించారు. తమ అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో వారు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న వాహన చోదకులకు హెచ్చరికలు జారీ చేశారు. పునరావృతమైతే వాహన నెంబరును బ్లాక్ చేస్తామని ప్రకటించారు. బ్యాంకుల వద్ద వాహనాలను తనిఖీ చేయకుండానే స్టిక్కర్లు ఇవ్వడం వల్లే ఈ మోసానికి ఆస్కారం కలుగుతోందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment