5 సెకన్లలో ‘టోల్‌’ దాటొచ్చు! | Toll fees charged with the help of sensors | Sakshi
Sakshi News home page

5 సెకన్లలో ‘టోల్‌’ దాటొచ్చు!

Published Tue, Nov 26 2019 1:23 AM | Last Updated on Tue, Nov 26 2019 10:29 AM

Toll fees charged with the help of sensors - Sakshi

విజయవాడ రహదారి.. హైదరాబాద్‌ నుంచి వాహనాలు దూసుకుపోతున్నాయి. పంతంగి టోల్‌ ప్లాజా వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా వాటికి బ్రేక్‌ పడింది. ఒక వాహనం తర్వాత ఒకటి టోల్‌ రుసుము చెల్లించి టోకెన్‌ తీసుకుని ముందుకు కదిలేసరికి భారీ జాప్యం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమయం అరగంట పడుతోంది. సాధారణ రద్దీ ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు అవుతోంది. అయితే డిసెంబర్‌ 1 నుంచి ఈ తీరు మారిపోనుంది. వాహనం రాగానే టోల్‌ గేట్‌ తెరుచుకోవటానికి కేవలం ఐదు సెకన్ల సమయమే పట్టనుంది. అదే ఫాస్టాగ్‌ మాయ. 

సాక్షి, హైదరాబాద్‌: డిసెంబర్‌ 1 నుంచి అమలులోకి రానున్న ఎలక్ట్రానిక్‌ టోల్‌ చెల్లింపు విధానంతో టోల్‌ ప్లాజాల వద్ద నిరీక్షణకు తెరపడబోతోంది. ఫాస్టాగ్‌ ఉన్న వాహనం రాగానే, టోల్‌ప్లాజా పైనుంచి సెన్సర్‌ బేస్డ్‌ రీడర్లు క్షణాల్లో దాన్ని పరిశీలిస్తాయి. అది ఏ తరహా వాహనం, దానికి ఎంత మొత్తం టోల్‌ విధించాలి అని నిర్ణయించటం మొదలు, అంత మొత్తాన్ని ఫాస్టాగ్‌లోని చిప్‌ నుంచి మినహాయించి గేటు తెరిచేయటం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. వాహనం ముందుకు కదులుతుంది. ఇందుకు ఒక్కో గేటుపై దాదాపు రూ.30 లక్షల విలువైన రీడర్లను ఏర్పాటు చేశారు. సెన్సార్ల సాయంతో అది వాహనం అద్దానికి అతికించి ఉన్న ట్యాగ్‌ నుంచి టోల్‌ రుసుమును డిడక్ట్‌ చేసుకుంటుంది. 

గేటు తెరిచి మూయాల్సిందే
వాహనాలు ఒకదానికి ఒకటి తగిలి ఉన్నట్టు ఒకేసారి పెద్ద సంఖ్యలో వస్తే, ఇక్కడా కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, అది ఇబ్బందికరంగా ఉండేంత జాప్యం కాదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ముందున్న వాహనం ఖాతా నుంచి రుసుము డిడక్ట్‌ కాగానే ఆటోమేటిక్‌గా గేటు తెరుచుకుని వాహనం ముందుకు కదులుతుంది. కానీ ఆ వెంటనే మళ్లీ గేటు మూసుకుంటుంది. మళ్లీ సెన్సర్లు తదుపరి వాహనం నుంచి రుసుము మినహాయించాక తిరిగి గేటు తెరుచుకుంటుంది. ఒకదాని వెనక ఒకటిగా వాహనాలు వచ్చినప్పుడు... ఒకసారి గేటు తెరుచుకున్నాక అన్నీ వెళ్లిపోయే ఏర్పాటు ప్రస్తుతానికి లేదు. కచ్చితంగా గేటు మూసుకున్నాకనే వెనుక ఉన్న వాహనంపై సెన్సర్ల దృష్టి పడుతుంది. గేటు నుంచి వాహనం పొడవు ఎంత ఉంటుంతో అంత పరిమాణంలో ఉండే ప్రాంతాన్ని లూప్‌గా పిలుస్తారు.

ఆ లూప్‌లోకి వాహనం వచ్చిన తర్వాతనే సెన్సర్‌లు దాని బార్‌కోడ్‌ను డిటెక్ట్‌ చేస్తాయి. ఆ వెంటనే ఆటోమేటిక్‌ వెహికిల్‌ క్లాసిఫయర్లు దాని కేటగిరీ, బరువును అంచనా వేసి రుసుమును నిర్ధారించి వాహనం ట్యాగ్‌లోని చిప్‌ నుంచి డిటెక్ట్‌ చేస్తాయి. ఆ లూప్‌నకు కాస్త దూరంగా ఉంటే సెన్సార్లు పట్టించుకోవు. ఫలితంగా ఆ లూప్‌ పరిధి నుంచి ముందున్న వాహనం కదిలి ముందుకు వెళ్తేగాని రెండో వాహనంపై సెన్సార్ల దృష్టి పడదు. దీనివల్ల కొంత జాప్యం తప్పదని అధికారులు అంటున్నారు. ఎంత ఉన్నా అది కూడా ఒక నిమిషం లోపేనని వారు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో మరింత ఆధునిక వ్యవస్థ ఏర్పాటైతే ఈ సమస్య కూడా ఉండకపోవచ్చని, ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే పద్ధతి అమలులో ఉందని పేర్కొంటున్నారు. 

పెట్రోలు బంకుల్లో ఫాస్టాగ్‌ అమ్మకాలు?
ప్రస్తుతం కొన్ని ఆన్‌లైన్‌ చెల్లింపు సంస్థల ఆధ్వర్యంలో ఫాస్టాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. గడువు దగ్గర పడుతుండటంతో టోల్‌ప్లాజాల వద్ద కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయించి ఆయా బ్యాంకుల ఆధ్వర్యంలో అమ్మకాలు జరుపుతున్నారు. వాహనదారులకు మరింత అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో త్వరలో పెట్రోలు బంకుల్లో కూడా వాటి విక్రయాలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంక్, కేవీబీ, యాక్సిస్, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, ఎయిర్‌టెల్‌ పేమెంట్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, పేటీఎం, ఇండస్‌ల్యాండ్‌ బ్యాంక్, కొటక్‌ మహీంద్రా... ఇలా మరికొన్ని బ్యాంకుల వివరాలను ప్రకటన రూపంలో ఇప్పటికే ఎన్‌హెచ్‌ఏఐ జారీ చేసింది. వీటికి అదనంగా మరిన్ని చోట్ల వాటి విక్రయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఆయిల్‌ కంపెనీలతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఒప్పందం చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. త్వరలో అన్ని పెట్రోలు బంకుల్లో ఈ ట్యాగ్‌లు అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement