Petrol Bunk dealers
-
వాహనదారులకు షాక్! లీటర్ పెట్రోల్‌లో ఏకంగా 90 శాతం నీరు?
శాయంపేట: పెట్రోల్‌లో నీరు చేరడంతో వాహనాలు మోరాయించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వాహనాలు పెట్రోల్ పోసుకున్న అరగంటకే మోరాయించడంతో వాహనదారులు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి యజమానిని ప్రశ్నించారు. దీంతో బంక్ యజమాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు బాటిల్లో పెట్రోల్ పట్టగా నీరే అధిక శాతం కనిపించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గంగిరేణిగూడెంలోని పెట్రోల్ బంక్‌లో బుధవారం ఉదయం పోతు సునీల్, దొంగరి శ్రావణ్, ముక్కెర సురేష్ తమ ద్విచక్రవాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. కాసేపటికే వాహనాలు మోరాయించడంతో మెకానిక్ వద్దకు వెళ్లారు. కల్తీ పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోయాయని చెప్పడంతో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దీంతో అతడు బుకాయిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సమస్య విని ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ పోయించగా 90శాతం నీరు, 10శాతం మాత్రం పెట్రోల్ రావడంతో కంగుతిన్నారు. దీంతో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని బంక్ యజమానిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ సీజ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ విషయమై బంక్ యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించగా మంగళవారం సాయంత్రం కొత్త లోడు వచ్చిందని, ఉదయం నుంచి పెట్రోల్ అమ్మకాలు చేపడుతున్నామని, నీరు ఎలా సింక్ అయిందో తెలియదని తెలిపారు. పెట్రోల్ పోసుకున్న వారి వాహనాలు పాడైతే మర్మమ్మతు చేయించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. -
ఛాయ్, బన్లు అందిస్తున్న లంక మాజీ క్రికెటర్
Ex Lankan Cricketer Serves Tea, Buns: శ్రీలంక తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన పలు హింసాత్మక అల్లరుల తదనంతరం శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం శ్రీలంక కొత్త ప్రభుత్వం కూడా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పలురకాలుగా ప్రయత్నిస్తోంది కూడా. అదీగాక విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోవడంతో వస్తువులను దిగుమతి చేసుకోవడం కూడా కష్టంగా మారింది. అంతేకాదు ఇంధన సంక్షోభాన్ని సైతం ఎదుర్కొంటుంది. దీంతో అక్కడ ప్రభుత్వం అనవసర ప్రయాణాలను సైతం తగ్గించుకోమని ప్రజలకు సూచించింది కూడా. ఈ మేరకు శ్రీలంకలో పెట్రోల్ బంక్‌ల వద్ద జనాలు ఇంధనం కోసం క్యూలో నిలుచుని పెద్ద సంఖ్యలో బారులు తీరి ఉన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక మాజీ క్రికెటర్ రోషన్ మహానామా పెట్రోల్ బంక్‌ల వద్ద నుంచొని ఉన్న ప్రజలకు టీలు, స్నాక్స్ సర్వ్ చేశాడు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...క్యూలో ఉన్నవాళ్లలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. పైగా అంతసేపు నుల్చుని ఉండటంతో ఆకలిగా కూడా ఉండోచ్చు. అందువల్ల మనం వారికి సాయం చేయాల్సిన సమయం ఇది. అందుకే ఇలా చేశానని చెప్పాడు. అలాగే ప్రతిఒక్కరిని తమ కోసం కాకపోయిన మన పక్కవారి కోసమైన ఏమైన ఆహార పదార్థాలు తీసుకువెళ్లడం మంచిది. ఎవరికైన బాగోకపోతే అత్యవసర నెంబర్ 1990కి కాల్ చేయండి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఒకరికొకరు సాయంగా ఉంటూ..మద్దతు ఇచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మాజీ క్రికెటర్ రోషన్ మహానామా తాను ప్రజలకు సర్వ్ చేసిన ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేస్తూ నెటిజన్లతో ఈ విషయాలను పంచుకున్నారు. We served tea and buns with the team from Community Meal Share this evening for the people at the petrol queues around Ward Place and Wijerama mawatha. The queues are getting longer by the day and there will be many health risks to people staying in queues. pic.twitter.com/i0sdr2xptI — Roshan Mahanama (@Rosh_Maha) June 18, 2022 (చదవండి: ‘మొత్తం ప్రతిపక్షాన్ని క్లీన్‌స్వీప్ చేయాలని ఇమ్రాన్ చూస్తున్నారు’) -
Petrol Bunk Fraud: కొలతల్లో ‘కోత’.. జేబులకు చిల్లు
సాక్షి, నెల్లూరు: ఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతుంటే.. మరో వైపు పెట్రోల్ బంకుల దోపిడీ మితిమీరుతోంది. కొలతల్లో కోత పెట్టి వాహనచోదకుల జేబులకు చిల్లు పెడుతున్నారు. జిల్లాలో నిత్యం పెట్రోల్ బంకుల్లో విక్రయాల లెక్కలు చూస్తే రోజుకు రూ.కోట్లల్లో దోపిడీ జరుగుతున్నట్లు అర్థమవుతోంది. జిల్లాలోని దాదాపు ఒకటీ.. రెండు చోట్ల తప్ప ప్రతి పెట్రోల్ బంకులో మోసాలు, అక్రమాలు జరుగుతున్నాయనే జగద్వితం. అయినా సంబంధిత తునికలు, కొలతల శాఖ అధికారులు మొక్కుబడి తనిఖీలతో మమ అనిపిస్తున్నారు. ఈ శాఖ తనిఖీలు, జరిమానా లెక్కలు చూస్తేనే పనితీరు అర్థమవుతోంది. పెట్రోల్ బంకుల్లో చిప్‌ల టెక్నాలజీ సాయంతో మోసాలు జరుగుతున్నాయి. చదవండి: బాబోయ్ ఎండలు.. అలా చేస్తే వాహనాలు పేలే ప్రమాదం నెల్లూరు శెట్టిగుంట రోడ్డు ప్రాంతంలోని పెట్రోల్ బంకులో ఓ వ్యక్తి పెట్రోలు పట్టించుకునేందుకు వెళ్లాడు. రూ.100కు పట్టమని చెప్పి.. పర్సులో నుంచి డబ్బులు తీసే సరికి పెట్రోలు పోసే వ్యక్తి ఇంధనం నింపేశాడు. ఇంతలోనే పట్టడం అయ్యిందా? అని ప్రశి్నస్తే.. అంత అనుమానముంటే రీడింగ్ చూసుకోవాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ రోజు ఉదయం పని చేసే కార్యాలయానికి వెళ్తుండగా మధ్యలో వాహనం ఆగిపోయింది. వెంటనే పెట్రోలు బంకుకు వెళ్లి ఆ వ్యక్తిని నిలదీయగా.. మేం సక్రమంగానే పోశాం. మీరు ఎక్కడెక్కడ తిరిగారో అంటూ ఎదురు ప్రశ్నించడంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితి. నగరంలోని అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బిడ్జి వద్ద ఉన్న ఓ పెట్రోలు బంకులో రెండు రోజుల క్రితం ఒకరు వాహనానికి పెట్రోలు పోయించుకున్నాడు. కొలతపై అతనికి అనుమానం వచ్చి మళ్లీ లీటర్ బాటిల్లో లీటర్ పెట్రోలు పోయించుకోవడంతో 200 ఎంఎల్ తక్కువ వచ్చింది. ఆ లీటర్ బాటిల్ నిండా పట్టిస్తే రూ.150 చూపించింది. లీటర్‌కు దాదాపు 200 ఎంఎల్ తక్కువ రావడంతో నిలదీస్తే సిబ్బంది కానీ, యాజమాన్యం కానీ పట్టించుకోలేదు. దీనిపై బాధితులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రతి రోజు కొత్తగా రోడ్డెక్కే వాహనాల సంఖ్య పెరుగుతున్నాయి. ఇంధన వినియోగం పెరుగుతోంది. అందుకు తగిన విధంగా జిల్లాలో పెట్రోల్ బంకులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ అత్యంత నిత్యావసర వినియోగం కావడంతో డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ బంకుల యజమానులు దోపిడీకి తెర తీస్తున్నారు. పలు చోట్ల కల్తీ జరుగుతుండగా, మరి కొందరు వినియోగదారులను బురిడీ కొట్టించి తక్కువ ఇంధనం పోస్తున్నారు. ఇంధనం నాణ్యత, కొలతలపై తరచూ తనిఖీలు చేయాల్సిన పౌర సరఫరాలశాఖ అధికారులు, తూనికలు, కొలతల శాఖ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. రేటు వాత.. కొలత కోత ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు అటూ ఇటూగా ఉన్నాయి. పెట్రోల్ లీటరు 121.70, డీజిల్ రూ.107.70 ఉంది. గడిచిన ఏడాదిన్నర కాలంలో పెట్రోల్, డీజిల్ లీటరుపై సుమారు రూ.50 వరకు పెరిగింది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రతి రోజు లీటరుకు రూ.0.80 వంతున పెరుగుతూనే ఉంది. ఓ వైపు ధరలు ఇలా పెరుగుతుంటే.. మరో వైపు బంకుల్లో దోపిడీకి అంతూపంతూ లేకుండాపోయింది. లీటరుకు 200 ఎంఎల్ వరకు కోత పడుతున్నట్లు వినియోగదారులు గుర్తిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినా, గొడవ చేసినా స్పందన లేకపోవడంతో వినియోగదారులు సైతం పట్టింది పట్టించుకుని మౌనంగా వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం అయితే లీటరుకు 5 ఎంఎల్ వరకు ఇంధనం తక్కువ రావడం సహజం. అయితే అనేక బంకుల్లో 50 ఎంఎల్ నుంచి 200 ఎంఎల్ వరకు తేడా వస్తున్నట్లుగా వాహనదారులు వాపోతున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి తూనికలు, కొలతల శాఖ అధికారులు అడపా దడపా చేసిన తనిఖీల్లో కూడా భారీగానే మోసాలు వెలుగులోకి వచ్చాయి. బంకుల్లో కేటుగాళ్లు పెట్రోల్, డీజిల్‌లో తెల్ల కిరోసిన్ కలిపి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కన్నెత్తి చూడని అధికారులు పెట్రోల్ బంకుల్లో రికార్డుల్లో చూపినట్లుగా నిల్వలున్నాయా లేదా నిర్వహణ తీరు తదితర అంశాలను పరిశీలించాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖది. పెట్రోలు, డీజిల్‌ను వాహనాల్లో నింపే క్రమంలో అక్రమాలు జరుగుతున్నాయా? లేదా అనే విషయాలను తూనికలు, కొలతల శాఖాధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అసలు తమ పరిధిలో ఉన్న బంకుల్లో ఎంత మేర నిల్వలున్నాయో కూడా చెప్పలేకపోతున్నారు. తూనికలు, కొలతలు శాఖ అధికారులు మాత్రం అడపాదడపా తనిఖీలు చేస్తున్నారు. ఏడాది మొత్తంలో 35 కేసులు నమోదు చేసి, రూ.9.70 లక్షల జరిమానా విధించారంటే ఈ శాఖ పనితీరును అర్థం చేసుకోవచ్చు. రోజుకు రూ.3.36 కోట్ల దోపిడీ జిల్లాలో దాదాపు 210 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ 14 లక్షల లీటర్ల విక్రయాలు జరుగుతున్నాయి. లీటర్‌కు 200 ఎంఎల్ తక్కువ వస్తుంది. ప్రస్తుతం పెట్రోల్ రేటు ప్రకారం 200 ఎంఎల్ విలువ రూ.24 అవుతుంది. ఈ లెక్కన రోజుకు రూ.3.36 కోట్ల వాహనచోదకుల జేబులకు చిల్లుపడుతున్నట్లు అంచనా. తనిఖీలు నిర్వహిస్తున్నాం జిల్లాలోని పెట్రోలు బంక్‌ల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు వచ్చినప్పుడుతో పాటు ఏడాదిలో సాధారణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. కొలతల్లో తేడాలు వచ్చినా, టైంకు సీలింగ్ వేయించకున్నా కేసులు నమోదు చేసి జరిమానా విధించి వసూళ్లు చేస్తున్నాం. గతేడాదిలో 35 కేసులు నమోదు చేసి అపరాధ రుసుం రాబట్టాం. రెండు రోజుల క్రితం అయ్యప్పగుడి ఫ్లైఓవర్బ్రిడ్జి వద్ద ఉన్న పెట్రోలు బంకులో మోసం చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో వెళ్లి విచారణ చేపట్టాం. వారిపై చర్యలు తీసుకుంటాం. – రవిథామస్, తూనికలు, కొలతలశాఖ ఉన్నతాధికారి నెల్లూరు -
హైదరాబాద్‌లో డీజిల్ కొట్టించగానే ఆగిపోతున్న కార్లు.. ప్రశ్నిస్తే..
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఇంధనం లేక ఆగిపోయిన వాహనాలకు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ పట్టిస్తే యధావిధిగా స్టార్ట్ అవుతాయి. కానీ ఈ పెట్రోల్ బంక్‌లో డీజిల్, పెట్రోల్ పట్టిస్తే మాత్రం ఈ డబ్బులు వృథాగా పోగొట్టుకోవడమే కాక.. వాహన మరమ్మత్తులకు కూడా జేబు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో భారీ మోసం వెలుగుచూసింది. నీళ్లతో కలిపిన డీజిల్‌ను వాహనదారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇక్కడ డీజిల్ పోయించకున్న వెంటనే వాహనాలు ఆగిపోయినట్లు చెప్తున్నారు. ఇదేంటని డీజిల్‌ని పరీక్షిస్తే లీటర్‌కు మూడొంతుల నీళ్లు కలిపినట్లు తేలింది. ఈ విషయంపై పెట్రోల్ బంక్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వాహనదారులను మోసం చేస్తున్న ఈ బంక్‌ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (గుడ్‌న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్) -
‘ఆర్టీసీ’ పెట్రోల్ బంకులు
కడప కోటిరెడ్డి సర్కిల్: ఆర్టీసీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి తెలిపారు. పెట్రోల్ బంకుల ఏర్పాటు ద్వారా.. ఆర్టీసీకి మేలు జరుగుతుందన్నారు. సోమవారం కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాంతీయ ఆస్పత్రి, ఆర్ఎం కార్యాలయం, ఆర్టీసీ బస్టాండు, గ్యారేజీ, ఆర్టీసీ వర్క్‌షాప్‌లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ద్వారా 20 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 11 బంకులకు ఎన్ఓసీ మంజూరైందని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో ఆర్టీసీకి విలువైన స్థలాలున్నాయని, వాటిని ఉపయోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఆర్టీసీ ప్రాంతీయ ఆస్పత్రులు సేవలందిస్తున్నాయని పేర్కొన్నారు. కడపలోని కార్మికులకు కూడా మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆస్పత్రిని సీఎం వైఎస్ జగన్ ఏర్పాటు చేశారన్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆర్టీసీ కార్గో సేవలను తక్కువ ధరకు అందిస్తున్నామని, ప్రతి జిల్లా కేంద్రంలో డోర్ డెలివరీ సౌకర్యాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవివర్మ, కడప రీజియన్ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్‌రెడ్డి, చైర్మన్ ఓఎస్డీ గోపి, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
బాబోయ్ చిప్.. పెట్రో బంకుల్లో కనికట్టు
-
పెట్రోల్ బంకుల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్
సాక్షి, అమరావతి బ్యూరో: డీజిల్, పెట్రోల్ వాహనాలతో రోజురోజుకూ కాలుష్యం అధికమవుతోంది. మరోవైపు రోజు రోజుకూ పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రో వినియోగంతోపాటు, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈ–వాహనాలు) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. వీటి కొనుగోలుపై రాయితీలను ఇస్తోంది. దీంతో క్రమంగా ఈ–వాహనాల సంఖ్య కూడా ఊపందుకుంటోంది. ఇప్పటికే పురపాలక, విద్యుత్, రెవెన్యూ తదితర ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ కార్లను ప్రవేశపెట్టారు. విజయవాడ సహా మరికొన్ని పట్టణాలు, నగరాల్లో ఈ–ఆటోలు కూడా నడుస్తున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల వాతావరణానికి నష్టం కలగకపోయినా, వాటిని చార్జింగ్ చేయడమే అసలు సమస్యగా మారింది. ఎలక్ట్రిక్ బైక్‌లు, ఆటోలకు ఇళ్లలోనే 5 యాంప్స్ సామర్థ్యం ఉన్న పిన్ ద్వారా చార్జింగ్కు వీలుంటుంది. విద్యుత్ కార్లకు అయితే 15 యాంప్స్ పిన్లు అవసరం. ఈ నేపథ్యంలో ఈ – కార్లకు ఇంటి వద్ద చార్జింగ్ పెట్టడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఈ–కార్ల చార్జింగ్ కోసం రాష్ట్రంలో ప్రాథమికంగా కొన్ని చార్జింగ్ స్టేషన్లను పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత చమురు సంస్థల యాజమాన్యాలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. విజయవాడ నగరంలో తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, సెంట్రల్ ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటుకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో వీటిని అందుబాటులో ఉంచాలని యోచించారు. తాజాగా పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వల్ల ప్రయోజనం ఉంటుందన్న నిర్ణయానికొచ్చారు. తొలుత విజయవాడ పరిధిలోనూ, అనంతరం జాతీయ రహదారికి ఆనుకుని, కొన్నాళ్ల తర్వాత మండల కేంద్రాల్లోని బంకుల్లోనూ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. పెరగనున్న మైలేజీ.. గతంలో వచ్చిన ఈ–కార్లకు ఫుల్ చార్జింగ్ కోసం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టేది. పైగా ఆ చార్జింగ్‌తో వాహనం 100 నుంచి 120 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించేది. మారిన పరిస్థితుల్లో తక్కువ సమయంలో చార్జింగయ్యి, ఎక్కువ దూరం ప్రయాణించే సాంకేతికత ఈ–కార్లలో అందుబాటులోకి వచ్చింది. ఇలా ఇప్పుడు వచ్చే ఈ–కార్లకు కేవలం 15 నిమిషాల్లోనే పూర్తి స్థాయిలో చార్జింగ్ అవుతుంది. ఒక్కసారి పూర్తిస్థాయిలో చార్జింగ్ అయిన కారు నిరాటంకంగా 300 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో ఇలాంటి ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లనే ఏర్పాటవుతాయని నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ జె.వి.ఎల్.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. అందువల్ల వీటితో ఇకపై ఈ–వాహనదార్లు చార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం రాదని తెలిపారు. ఈ–బైక్‌ల కోసం.. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, సిబ్బంది కోసం విద్యుత్ ద్విచక్ర వాహనాల (ఈ–బైక్‌ల)ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా రాష్ట్రంలో తొలి దశలో లక్ష వరకూ ఈ–బైక్‌లను సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. కృష్ణా జిల్లాలో అధికారుల అంచనాలకు మించి ఈ–బైక్‌ల కోసం 15 వేల మంది వరకు ఆసక్తి చూపారు. వారిలో గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తపాలా శాఖ ఉద్యోగులు అధికంగా ఉన్నారు. ఈ–బైక్‌ల పంపిణీకి దాదాపు పది కంపెనీలు ముందుకొచ్చాయి. చదవండి: ఘాట్ వద్ద.. చెమర్చిన కళ్లతో -
భారీ పెట్రోల్ స్కామ్: డిస్ప్లే వెనుక చిప్
-
భారీ పెట్రోల్ స్కామ్: డిస్ప్లే వెనుక చిప్
సాక్షి, హైదరాబాద్ : వాహనదారులను దోచుకుంటూ పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బంకుల్లో ఇంటిజిట్లర్టేడ్ చిప్‌లు అమర్చి పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు, ఎస్ఓట్ టీమ్స్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ శనివారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఇంటిజిట్లర్టేడ్ చిప్‌ల ద్వారా 1000 ఎమ్ఎల్ పెట్రోల్‌లో 970 ఎమ్ఎల్ మాత్రమే వస్తుందని, వాహనాల్లో పెట్రోల్ పోసేటప్పుడు డిస్ప్లే వెనుక ఒక చిప్ అమర్చుతారని వెల్లడించారు. లీగల్ మెట్రాలజీ, పోలీసులు చెక్ చేసినా దొరకకుండా ఒక మదర్ బోర్డు కూడా తయారుచేశారని తెలిపారు. ఈ విధంగా హైదరాబాద్‌లోని 11 బంకుల్లో 13 చిప్పులు అమర్చారని సజ్జనార్ పేర్కొన్నారు. దీనిపై ఏపీ పోలీసులకు కూడా ఈ సమాచారం ఇచ్చామని, మొత్తం తెలంగాణలో 11, ఏపీలో 22 బంకుల్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఏలూరుకు చెందిన శుభాని అతని గ్యాంగ్ ఈ స్కామ్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ముంబైకి చెందిన జోసఫ్, థామస్ అనే వ్యక్తుల ద్వారా చిప్పుల్ని తయారు చేయించారని నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఏపీలోని పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ, నెల్లూరు జిల్లాల్లో చిప్‌లు అమర్చినట్లు విచారణలో తేలిందన్నారు. ‘షేక్ శుభాని భాష, బాజి బాబా, మాదాసు గిరి శంకర్, ఇప్పిలి మల్లేశ్వర్ రావులు ముఠాగా ఏర్పడ్డారు. ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రోగ్రాం డిజైన్ చేశారంటే చాలా తెలివిగా ప్లాన్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక తమిళనాడులోనూ వీళ్ళు చిప్ లు పెట్టి ఉండవచ్చు, బంకు ఓనర్లకు ఇదంతా తెలిసే జరుగుతుంది, తెలంగాణలో 4 బీపీసీఎల్, 2 హెచ్ పీసీఎల్, 5 ఐఓసీఎల్ బంకుల్లో చిప్పులు అమర్చారు’ ప్రస్తుతం వాటిని సీజ్ చేశాం. ఆయిల్ కార్పొరేషన్ సర్ప్రయిజ్ విజిట్ చేయటం ద్వారా ఈ మోసాన్ని కనిపెట్టలేరు. ఇక నుంచి ఆయిల్ కార్పొరేషన్ కూడా లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని’ సజ్జనార్ వివరాలను వెల్లడించారు. -
పెట్రోల్ బంకుల్లో ఘరానా మోసాలు
-
భారీ మోసం, రీడింగ్ సరిగానే ఉంటుంది కానీ
సాక్షి, హైదరాబాద్: పెరిగిన ఇంధనం ధరలతో అల్లాడిపోతున్న వాహనదారులను కొందరు పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా దోచుకుంటున్నారు. మీటర్లలో ప్రత్యేకమైన చిప్‌లు పెట్టి జనాలను మోసం చేస్తున్నారు. ఈ చిప్‌లతో రీడింగ్ సరిగానే చూపెట్టినా పెట్రోల్ మాత్రం తక్కువగా వస్తుంది. పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు కొన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేయగా ఈ వ్యవహారం బయటపడింది. మోసాలకు పాల్పడుతున్న హైదరాబాద్ పరిధిలో 13 పెట్రోల్ బంక్‌లను ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. 26 మందిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్వోటీ పోలీసుల సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా 26 పెట్రోల్ బంకులను అధికారులు సీజ్ చేశారు. ముంబై నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుని నిందితులు ఈ చిప్‌లను వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మరికొన్ని చోట్ల కూడా ఇలాంటి దోపిడీ జరుగుతోందని, అందరిపైనా చర్యలు తీసుకుంటామని ఎస్వోటీ పోలీసులు వెల్లడించారు. చిప్‌లను ఉపయోగించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న ట్లు తెలిపారు. (చదవండి: గప్‘చిప్’గా దోపిడీ) -
గప్‘చిప్’గా దోపిడీ
చిత్తూరు అర్బన్/ఏలూరు టౌన్: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని పెట్రోల్ బంకుల్లో గుట్టుగా జరుగుతున్న దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. బంకుల్లో పెట్రోల్ పరిమాణాన్ని సూచించే డిజిటల్ మీటర్‌కు ఓ చిన్నపాటి చిప్‌ను అమర్చడం ద్వారా వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నట్లు వెల్లడైంది. దీనికి సంబంధించి శుక్రవారం చిత్తూరు, ఏలూరులో పోలీసులు, తూనికలు–కొలతలశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు జరిపి మోసాలకు పాల్పడుతున్న పలు బంకులను సీజ్ చేశారు. ఏలూరుకు చెందిన బాషా అనే వ్యక్తిని ఈ వ్యవహారాలకు సూత్రధారిగా గుర్తించారు. చిత్తూరులో డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి, తూనికలు, కొలతలశాఖ అధికారి సుధాకర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. పెట్రోలు బంకులో ఎలక్ట్రానిక్ చిప్‌ను తీస్తున్న పోలీసులు రీడింగ్ మీటర్ల వద్ద అమర్చి.. ► తెలంగాణలోని పలుచోట్ల పెట్రోలు బంకుల్లో ఆయిల్ తక్కువగా వస్తున్నట్లు వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందడంతో విచారణ జరిపిన అధికారులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన బాషా ఎలక్ట్రానిక్ చిప్‌లను తయారుచేసి బంకు నిర్వాహకులకు అమ్మినట్లు గుర్తించారు. సిమ్‌కార్డును పోలి ఉండే ఈ చిప్‌ను బంకుల్లో పెట్రోలు రీడింగ్ తెలియచేసే డిజిటల్ అనలాగ్ వద్ద అమరుస్తారు. దీంతో ప్రతి లీటరుకు 40 ఎంఎల్ పెట్రోలు తక్కువగా వినియోగదారులకు అందుతుంది. చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ వద్ద బంకులో.. ► బాష ఇచ్చిన సమాచారంతో చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ సమీపంలోని ఓ పెట్రోలు బంకును తనిఖీ చేసిన సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ మోహన్‌కుమార్, తూనికల శాఖ అధికారులు ఎలక్ట్రానిక్ చిప్ ఉండటాన్ని గుర్తించి బంకు మేనేజరు వెంకట్రావు(39)ను అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలు బంకు నిర్వాహకుడు గుంటూరు జిల్లా గురజాలకు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. ఇతను ఈ ఏడాది ఫిబ్రవరిలో బాష నుంచి రూ.లక్షకు ఎలక్ట్రానిక్ చిప్‌ను కొనుగోలుచేసి, 6,457 లీటర్ల పెట్రోలును విక్రయించాడు. ప్రతి లీటరుకు 40 ఎంఎల్ తక్కువగా పోయడం ద్వారా రూ.5.51 లక్షలు వినియోగదారుల నుంచి కాజేసినట్లు విచారణలో వెల్లడైంది. ► పరారీలో ఉన్న శ్రీనివాసులు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనుమానం వస్తే డయల్ 100కి ఫోన్ చేయాలని డీఎస్పీ సూచించారు. ‘పశ్చిమ’లో 11 బంకులు సీజ్... పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలక్ట్రానిక్ చిప్‌లు అమర్చి మోసాలకు పాల్పడుతున్న 11 పెట్రోల్ బంకులను అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఏలూరు మాదేపల్లి రోడ్డు ప్రేమాలయం సమీపంలోని ఐవోసీ బంకు, సత్రంపాడులోని బీపీసీఎల్, భీమడోలులోని ఎస్ఆర్ బంకు, ఐవోసీ పెట్రోల్ బంకు, విజయరాయిలోని బీపీసీఎల్, భీమవరంలోని ఐవోసీ, నరసాపురంలోని ఎస్ఆర్ పెట్రోల్ బంకు, పెరవలిలో ఐవోసీ, కాపవరంలోని హెచ్‌పీ, నల్లజర్లలోని ఐవోసీ, పాలకొల్లులోని పెట్రోల్ బంకులను సీజ్ చేశారు. పెట్రోల్ బంకుల నిర్వాహకులు రూ.లక్ష నుంచి రూ.1.70 లక్షల వరకు చెల్లించి ఈ చిప్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
జనతా కర్ఫ్యూ: పెట్రోల్ బంక్‌లు బంద్
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకి ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ (ఏపీఎఫ్పీటీ) మద్దతు ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఆదివారం ఉదయం 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించనున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3 వేల పెట్రోల్ బంకులను మూసి వేస్తూ సిబ్బందికి సెలవులు ప్రకటించినట్లు ఏపీఎఫ్పీటీ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వ వాహనాలు, అంబులెన్స్‌ల కోసం ప్రతి పెట్రోల్ బంక్‌లో ఒకరిద్దరు సిబ్బందిని ఉంచుతున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 5 వరకు ఎల్ఎల్ఆర్ పరీక్షలు రద్దు సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవాణా శాఖ ఏప్రిల్ 5వ తేదీ వరకు లెర్నింగ్ లైసెన్సు పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 5 తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి రద్దు నిర్ణయాన్ని పొడిగించాలా? లేదా? అన్నది పరిశీలిస్తామన్నారు. కార్యాలయాలకు వచ్చే సందర్శకుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఉద్యోగులు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతుంటే సెలవు తీసుకుని చికిత్స కోసం వెళ్లాలని స్పష్టం చేశారు. 31 వరకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ బంద్ విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కోవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఈనెల 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అన్ని విభాగాల కార్యకలాపాలు రద్దు చేశామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితిలో ఉద్యోగులు ఎప్పుడంటే అప్పుడు యూనివర్సిటీకి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలోని ఏపీ మెడికల్ కౌన్సిల్‌కు సెలవులు ప్రకటించే విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు రిజిస్ట్రేషన్, సమాచారం కోసం వస్తుండడంతో మెడికల్ కౌన్సిల్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్మీడియెట్ మూల్యాంకనం వాయిదా సాక్షి, అమరావతి: కోవిడ్–19 వైరస్ నేపథ్యంలో ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఆ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. స్పాట్ వాల్యుయేషన్ తేదీలను తరువాత వెల్లడిస్తామన్నారు. శారదాపీఠం తాత్కాలికంగా మూసివేత పెందుర్తి: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా విశాఖ జిల్లా చినముషిరివాడలోని శ్రీ శారదా పీఠాన్ని తాత్కాలికంగా మూసివేస్తు న్నట్లు ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఓ ప్రకటనలో తెలిపారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాల్లోని పీఠ పాలిత ఆలయాలు, ఆశ్రమాల్లో సర్వదర్శనాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. -
చిరునామా, ఫొటోలిస్తేనే పెట్రోల్..
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్ బంక్‌ల్లో ప్లాస్టిక్ బాటిళ్లలో ఇంధనం కొనుగోలు చేసేవారిపై సైబరాబాద్ పోలీసులు నిఘా కట్టుదిట్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనను తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసులు పెట్రోల్ బంక్‌లపై దృష్టి సారించారు. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాస్టిక్ బాటిల్స్ లేదా జెర్రీ కేసెస్‌లో ఇంధనం నింపడంపై నిషేధం ఉన్నా పలు పెట్రోల్ బంక్‌లు వాటిని పాటించకపోవడం వల్ల కొన్ని సార్లు నేరాలకు అవకాశం ఏర్పడుతోంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఇంధనం అవసరం ఉన్న కొనుగోలుదారుడి చిరునామా, గుర్తింపుకార్డు జిరాక్స్ ప్రతులతో పాటు ఫొటోలిస్తేనే విక్రయించాలని, లేని పక్షంలో పెట్రోల్ బంకు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ బాటిళ్లలో కొనుగోలు చేసిన పెట్రోల్ ఉపయోగించి కొందరు వ్యక్తులు హత్యలకు పాల్పడి మృతదేహాలను తగలబెడుతుండగా, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో నియమ నిబంధనలు పాటించని కొనుగోలుదారులు, పెట్రోల్‌బంక్ సిబ్బందిపై ఐపీసీ 188 సెక్షన్ కింద కేసు నమోదుచేస్తామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. అయితే కొనుగోలుదారుడు తప్పుడు చిరునామా ఇస్తే ఇతర సెక్షన్లలు కూడా నమోదుచేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసుల్లో నెల నుంచి ఆరు నెలల పాటు జైలు శిక్ష పడే అవకాశముందన్నారు. ‘ప్లాస్టిక్ బాటిల్స్‌లో పెట్రోల్ కొనడమనేది చట్టప్రకారం నేరం. దీనిపై పెట్రోల్ పంప్ యజమాన్యం, సిబ్బందికి అవగాహన కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామ’ని సీపీ పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా పెట్రోల్ విక్రయిస్తున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు. వాహనదారులు తమ వాహనాల్లోనే పెట్రోల్ పంప్‌కు వచ్చి ఇంధనాన్ని నింపుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వాహనం ఎక్కడైనా ఆగిపోతే పెట్రోల్ బంక్‌లకు బాటిల్స్‌లో కొనుగోలు చేసేందుకు వస్తే గుర్తింపుకార్డు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. -
బంక్‌లో దగా 100కు హాఫ్ లీటర్ పెట్రోల్..
కర్నూలు, శిరివెళ్ల: పెట్రోల్ బంక్‌లో వినియోగదారులను మోసం చేస్తున్న వైనం బుధవారం బయటపడింది. మండల కేంద్రానికి చెందిన అర్షద్‌బాషా మెట్ట వద్ద నున్న పెట్రోల్ బంక్‌లో రూ.100 పెట్రోల్‌ను బైక్‌లో పోయించుకుని, ఆ తర్వాత బాటిల్లోకి తీసి చూడగా 1.25 లీటర్లు రావాల్సిన పెట్రోల్ 1/2 లీటర్ కూడా లేకపోవడంతో పెట్రోల్ బంక్ బాయ్ చంద్రను ప్రశ్నించాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తోటి వినియోగదారులతో కలిసి అక్కడే ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడకు చేరుకుని బాయ్‌ను పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ ఈ నెల 24న కూడా తాను రూ.100 పెట్రోల్ బైక్‌లో పోయించుకు ఆళ్లగడ్డకు వెళ్లి తిరిగి వస్తుండంగా మార్గ మధ్యలోనే పెట్రోల్ అయిపోయిందన్నాడు. కాగా తనకు కూడా గతంలో ఇదే పెట్రోల్ బంక్‌లో మోసం జరిగిందని మరో వినియోగదారుడు మున్నా ఆరోపించారు. ఈ విషయమై ఎస్ఐ తిమ్మారెడ్డి మాట్లాడుతూ తూనికలు కొలతల అధికారులు తనిఖీ చేసి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. -
5 సెకన్లలో ‘టోల్’ దాటొచ్చు!
విజయవాడ రహదారి.. హైదరాబాద్ నుంచి వాహనాలు దూసుకుపోతున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా వాటికి బ్రేక్ పడింది. ఒక వాహనం తర్వాత ఒకటి టోల్ రుసుము చెల్లించి టోకెన్ తీసుకుని ముందుకు కదిలేసరికి భారీ జాప్యం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమయం అరగంట పడుతోంది. సాధారణ రద్దీ ఉన్నప్పుడు కొన్ని నిమిషాలు అవుతోంది. అయితే డిసెంబర్ 1 నుంచి ఈ తీరు మారిపోనుంది. వాహనం రాగానే టోల్ గేట్ తెరుచుకోవటానికి కేవలం ఐదు సెకన్ల సమయమే పట్టనుంది. అదే ఫాస్టాగ్ మాయ. సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపు విధానంతో టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణకు తెరపడబోతోంది. ఫాస్టాగ్ ఉన్న వాహనం రాగానే, టోల్‌ప్లాజా పైనుంచి సెన్సర్ బేస్డ్ రీడర్లు క్షణాల్లో దాన్ని పరిశీలిస్తాయి. అది ఏ తరహా వాహనం, దానికి ఎంత మొత్తం టోల్ విధించాలి అని నిర్ణయించటం మొదలు, అంత మొత్తాన్ని ఫాస్టాగ్లోని చిప్ నుంచి మినహాయించి గేటు తెరిచేయటం అంతా క్షణాల్లో జరిగిపోతుంది. వాహనం ముందుకు కదులుతుంది. ఇందుకు ఒక్కో గేటుపై దాదాపు రూ.30 లక్షల విలువైన రీడర్లను ఏర్పాటు చేశారు. సెన్సార్ల సాయంతో అది వాహనం అద్దానికి అతికించి ఉన్న ట్యాగ్ నుంచి టోల్ రుసుమును డిడక్ట్ చేసుకుంటుంది. గేటు తెరిచి మూయాల్సిందే వాహనాలు ఒకదానికి ఒకటి తగిలి ఉన్నట్టు ఒకేసారి పెద్ద సంఖ్యలో వస్తే, ఇక్కడా కొంత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, అది ఇబ్బందికరంగా ఉండేంత జాప్యం కాదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ముందున్న వాహనం ఖాతా నుంచి రుసుము డిడక్ట్ కాగానే ఆటోమేటిక్‌గా గేటు తెరుచుకుని వాహనం ముందుకు కదులుతుంది. కానీ ఆ వెంటనే మళ్లీ గేటు మూసుకుంటుంది. మళ్లీ సెన్సర్లు తదుపరి వాహనం నుంచి రుసుము మినహాయించాక తిరిగి గేటు తెరుచుకుంటుంది. ఒకదాని వెనక ఒకటిగా వాహనాలు వచ్చినప్పుడు... ఒకసారి గేటు తెరుచుకున్నాక అన్నీ వెళ్లిపోయే ఏర్పాటు ప్రస్తుతానికి లేదు. కచ్చితంగా గేటు మూసుకున్నాకనే వెనుక ఉన్న వాహనంపై సెన్సర్ల దృష్టి పడుతుంది. గేటు నుంచి వాహనం పొడవు ఎంత ఉంటుంతో అంత పరిమాణంలో ఉండే ప్రాంతాన్ని లూప్గా పిలుస్తారు. ఆ లూప్‌లోకి వాహనం వచ్చిన తర్వాతనే సెన్సర్లు దాని బార్‌కోడ్‌ను డిటెక్ట్ చేస్తాయి. ఆ వెంటనే ఆటోమేటిక్ వెహికిల్ క్లాసిఫయర్లు దాని కేటగిరీ, బరువును అంచనా వేసి రుసుమును నిర్ధారించి వాహనం ట్యాగ్‌లోని చిప్ నుంచి డిటెక్ట్ చేస్తాయి. ఆ లూప్‌నకు కాస్త దూరంగా ఉంటే సెన్సార్లు పట్టించుకోవు. ఫలితంగా ఆ లూప్ పరిధి నుంచి ముందున్న వాహనం కదిలి ముందుకు వెళ్తేగాని రెండో వాహనంపై సెన్సార్ల దృష్టి పడదు. దీనివల్ల కొంత జాప్యం తప్పదని అధికారులు అంటున్నారు. ఎంత ఉన్నా అది కూడా ఒక నిమిషం లోపేనని వారు పేర్కొంటున్నారు. భవిష్యత్తులో మరింత ఆధునిక వ్యవస్థ ఏర్పాటైతే ఈ సమస్య కూడా ఉండకపోవచ్చని, ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే పద్ధతి అమలులో ఉందని పేర్కొంటున్నారు. పెట్రోలు బంకుల్లో ఫాస్టాగ్ అమ్మకాలు? ప్రస్తుతం కొన్ని ఆన్లైన్ చెల్లింపు సంస్థల ఆధ్వర్యంలో ఫాస్టాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. గడువు దగ్గర పడుతుండటంతో టోల్‌ప్లాజాల వద్ద కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయించి ఆయా బ్యాంకుల ఆధ్వర్యంలో అమ్మకాలు జరుపుతున్నారు. వాహనదారులకు మరింత అందుబాటులోకి రావాలన్న ఉద్దేశంతో త్వరలో పెట్రోలు బంకుల్లో కూడా వాటి విక్రయాలు జరిపే అవకాశం కనిపిస్తోంది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, కేవీబీ, యాక్సిస్, ఐసీఐసీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, పేటీఎం, ఇండస్‌ల్యాండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా... ఇలా మరికొన్ని బ్యాంకుల వివరాలను ప్రకటన రూపంలో ఇప్పటికే ఎన్హెచ్ఏఐ జారీ చేసింది. వీటికి అదనంగా మరిన్ని చోట్ల వాటి విక్రయానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఆయిల్ కంపెనీలతో కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఒప్పందం చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. త్వరలో అన్ని పెట్రోలు బంకుల్లో ఈ ట్యాగ్లు అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. -
పెట్రోల్, డీజిల్‌లో జోరుగా కల్తీ
ధనార్జనే లక్ష్యంగా.. కొందరు బంకు యజమానులు పెట్రోల్, డీజిల్‌ను కల్తీ చేస్తూ జేబులు నింపుకుంటుండగా.. మరికొందరు నిబంధనలకు పాతరా వేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఈ కల్తీ పెట్రోల్, డీజిల్ వాడకంతో వాహనాలు మొరాయించడం.. వాటి లైఫ్ టైం తగ్గిపోవడంతోపాటు రిపేర్ చేయించేందుకు వెళ్తే షోరూంలలో రూ.వేలల్లో వినియోగదారుడి జేబుకు చిల్లు పడుతుంది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సంఘటనే జడ్చర్ల సమీపంలోని పెట్రోల్ బంక్‌లో ఇటీవల చోటుచేసుకుంది. సాక్షి, జడ్చర్ల: పెట్రోల్‌బంకుల్లో ఇంధన కల్తీతో వాహనదారుడు ఆందోళన చెందుతున్నాడు. కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకునే సమయంలో బండిలో పెట్రోల్ పడక ముందే గిర్రున మీటర్ తిరిగి 2 నుంచి 4పాయింట్లు చూయిస్తుండడం, వెంటనే రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని అడిగితే.. అదంతే దిక్కున్న చోట చెప్పుకోమంటు బంక్ సిబ్బంది అక్రోషం వెల్లగక్కుతున్నారు. ఇలా డీజిల్, పెట్రోల్‌బంకుల నిర్వాహకుల ఆగడాలు మితిమీరిపోతున్న సంఘటనలు జిల్లాలో నిత్యకృత్యంగా మారాయి. ఆయా సంఘటనలపై ఫిర్యాదు చేసినా పట్టింపు లేక పోవడంతో కొద్ది సేపు అరిచి వెళ్లి పోవడం షరామామూలుగా మారింది. అంతేగాక ఎవరికి ఫిర్యాదు చేయాలో చాలా మందికి తెలియని పరిస్థితి ఉంది. ఇందుకు సంబందించి ఫిర్యాదు స్వీకరించే అదికారుల ఫోన్ నంబర్లు, తదితర సమాచారాన్ని పెద్ద ఆక్షరాలతో ప్రతి బంకువద్ద రాయిస్తే బాగుంటుందని వినియోగదారులు పేర్కొంటున్నారు. మచ్చుకు కొన్ని.. బాదేపల్లికి చెందిన దస్తగీర్ తన ఫార్చునర్ వాహనంలో పట్టణంలోని ఓ పెట్రోల్‌బంక్‌లో డీజిల్ పోయించి కొద్ది దూరం వెళ్లేలోగా వాహనం నిలిచిపోయింది. మెకానిక్‌తో విచారిస్తే ట్యాంకులో డీజిల్‌కు బదులు నిండా నీరే ఉందని చెప్పాడు. డీజిల్ కొట్టించిన సమయంలో ట్యాంకులో చేరిన నీరే వాహనంలోకి పంపింగ్ అయ్యిందని తరువాత సదరు ఇంధన కంపెనీ సేల్స్ ఆఫీసర్ ధ్రువీకరించారు. మరో బంకులో ఓ వ్యక్తి తన వోక్స్‌వ్యాగెన్ పోలో కారులో డీజిల్ పోయించాడు. ట్యాంకు ఫుల్ చేయించిన తరువాత హైద్రాబాద్ వెళ్లి జడ్చర్లకు తిరిగి వస్తుండగా కొత్తూరు దాటిన తరువాత అకస్మికంగా కారు ఆగిపోయింది. దీంతో అతను కారు కంపెనీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడి నుండి వచ్చిన మెకానిక్ తనిఖీ చేసి డీజిల్‌లో కిరోసిన్ కల్తీ జరగడం వలన నాజిల్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నాడు. నాజిల్స్ కొత్తవి అమర్చడానికి రూ:లక్ష దాకా ఖర్చవుతుందని బాదితుడు వాపోయాడు. గంగాపూర్ రహదారిలో గల పెట్రోల్ బంకులో ఉదయాన్నే ఓ యువకుడు తన మోటార్ బైక్‌లో లీటర్ పెట్రోల్ పోయించాడు. అనంతరం బంకు దాటిండో లేడో బండి ఆగిపోయింది. బైక్ ట్యాంకు ఓపెన్‌చేసి చూస్తే చుక్క పెట్రోల్ లేదు. అదేంటి ఇప్పుడే లీటర్ పోయించా గదా పెట్రోల్ రాలేదు ఏంటీ అని ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని బుకాయింపు పైగా బెదిరింపు ధోరణి. పారదర్శకతకు పాతర ఇంధన విక్రయాలు పారదర్శకంగా కొనసాగే విధంగా పర్యవేక్షించాల్సిన అధికారులు, కంపెనీ ప్రతినిధులు నిబంధనలకు నీళ్లొదిలి నిర్వాహకులతో కుమ్మక్కు కావడంతోనే కల్తీ పెట్రోల్, డీజిల్ విక్రయాలు యథేచ్చగా కొనసాగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గత మూడేళ్ల క్రితం జడ్చర్ల జాతీయరహదారిని అనుసరించి నిర్వహిస్తున్న ఓ పెట్రోల్ బంక్‌లో ఏకంగా భూగర్భం ద్వార పైపులైన్ వేసి కిరోసిన్‌ను నింపుతుండగా విజిలెన్స్ అధికారులు దాడి చేసి కిరోసిన్ కల్తీని వెలుగులోకి తీసుకువచ్చిన సంఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. నిబంధనలు బేఖాతరు పెట్రోల్ బంకుల్లో కనీస నిబంధనలు పాటించ డం లేదు. నిబంధనల మేరకు వినియోగదారులకు తాగు నీరు, మరుగుదొడ్లు, ఉచితంగా వా హనాల టైర్లకు గాలి సౌకర్యం, బిల్లులు ఇవ్వ డం, తదితర సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పా టు చేయాలి. అదేవిధంగా అగ్ని ప్రమాదాల నివారణకు గాను నీటి వసతి కోసం ఖచ్చితంగా బోరు ఉండాలి. కొలతల్లో అనుమానాలను నివృత్తి చేసేందుకు వినియోగదారుల డిమాండ్ మేరకు 5లీటర్ల కొలత పాత్రలో ఇంధనం నింపి మాక్ టెస్టింగ్ చేసి చూపించాలి. అదేవిధంగా ప్రతి వాహనదారుడికి బిల్లులు ఇవ్వాలి. డీజిల్ ట్యాంకులో నీళ్లు బంకుల్లో భూగర్భంలో ఇంధన నిల్వ కోసం ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో వివిధ కారణాలుగా నీళ్లు చేరే అవకాశం ఉంటుందని ఇంధన కంపెనీ అధికారులు ఈసందర్భంగా పేర్కొంటున్నారు. వాహనాల్లో ఇంధనం నింపే సమయంలో బంకులోని ట్యాంకర్ల అడుగు భాగంలో సబ్మెర్సిబుల్ మోటారు పంపు ఉండడంతో మొదటగా నీటినే లాగేస్తుంది. దీంతో వాహనాల్లోకి నీళ్లు చేరే అవకాశం ఉంటుందని ఇందన కంపెనీ సేల్స్ ఆఫీసర్ ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇదిలాఉండగా, ఇప్పటికైనా వినియోగదారులకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం పెట్రోల్, డీజిల్ బంకుల్లో అక్రమాలకు తావిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే బంకుల్లో తనిఖీలు చేపడుతాం. వినియోగదారుల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించి విచారిస్తున్నాం. జడ్చర్లలో ఓ బంకుపై వచ్చిన ఫిర్యాదుపై విచారించి వెంటనే ట్యాంకును శుభ్రం చేయించే విదంగా ఆదేశించాం. – వనజాత, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
‘పాయింట్’ దోపిడీ..!
సాక్షి, దేవరకొండ: హడావుడిగా ఆఫీస్‌కు బయల్దేరుతూ దారిలో ఏ బంక్ వద్ద అయినా ఓ రూ.100 పెట్రోల్ పోయించుకుంటే తెలియకుండానే ఓ పాయింట్ ఎగిరిపోతోంది. దీనికి తోడు ఓ రూ.10పైసల నుంచి రూ.20 పైసలు తక్కువ పోసినా తొందరలో ఉన్న కస్టమర్లు గట్టిగా అడగలేరు. ఇది పెట్రోల్ బంకుల్లో నిత్యం జరుగుతున్న తంతు. ఇలా రోజు వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. హైదరాబాద్–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. హైవే వెంట ఉన్న పెట్రోల్ బంకుల్లో ప్రతి నిత్యం పైస పైస పక్కపెడుతూ రూ. లక్షలు దోచుకుంటున్నారు. బంకుల్లో పెట్రోల్ పోయించే సమయంలో పాయింట్లలో గోల్మాల్ జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కస్టమర్లకు కొందరు రూ.10పైసలు, రూ.20పైసల వరకు తక్కువగా పెట్రోల్ పోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. పాయింట్లకు కోత పాయింట్లలో కోతతో వినియోగదారులు తెలియకుండానే నష్టపోతున్నారు. పెట్రోల్ బంక్‌లో ధరల పట్టికలు ఉంచడం లేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.75 ఉంది. కంపెనీని బట్టి ధరల్లో తేడా ఉంటుంది. రోజు ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. ఇప్పుడున్న ధరకు లీటర్‌పై రూ.10పైసలు, రూ.20పైసలు పెరిగినప్పుడు యూనిట్ లెక్కించరు. లీటర్‌కు 10 పాయింట్లుగా లెక్కిస్తారు. కనీసం రూ.35పైసలకు పైగా పెరిగితేనే యూనిట్ వస్తుంది. చాలా మంది వాహనదారులు లీటర్ చొప్పున కాకుండా రూ.50, రూ.100 ఇలా పెట్రోల్ పోయించుకుంటుంటారు. ఇక్కడే అసలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లీటర్ ధర రూ.75 ఉంటే ఒక పాయింట్ విలువ 7.5యూనిట్ లెక్కన చూయిస్తుంది. అయితే వినియోగదారులు ఎవరూ ఎన్ని పాయింట్లు పోస్తున్నారనేది సరిగా గమనించలేకపోతున్నారు. చాలా మందికి దీనిపై సరైన అవగాహన ఉండదు. దీన్ని అవకాశంగా భావించి కొందరు బంకుల్లో అరపాయింట్ తగ్గించి పెట్రోల్పోస్తున్నట్లు తెలుస్తోంది. అంటే అరపాయింట్కు రూ.3.50 వినియోగదారుడు నష్టపోతున్నట్లే. ఈ రూ.3 నష్టపోవడంతో పాటు పెట్రోల్ బంక్ యజమానులకు పెట్రోల్ ఆదా అవుతుంది. ఈ లెక్కన రోజుకు వేల లీటర్లు అరపాయింట్ చొప్పున తగ్గించినా వేలలో ఆదాయం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకటి నుంచి రెండు పాయింట్లు తగ్గిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారులు వదిలేస్తున్న సదరు యజమానులకు లక్షలు మిగుల్చుతున్నాయి. ఈ మోసాన్ని వినియోగదారులు కూడా గుర్తించలేకపోతున్నారు. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణ లు ఉన్నాయి. అప్పుడప్పుడు తని ఖీలు చేస్తున్నా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. రూ.10పైసలు, రూ.20పైసలు తక్కువగానే చాలా మంది బంకుల్లో పని చేసే సిబ్బంది రూ.10 పైసల నుంచి రూ.20పైసల వరకు తక్కువగా పెట్రోల్ పోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మనం ఇచ్చే డబ్బులకు పూర్తి స్థాయిలో పెట్రోల్ పోయకుండానే చేతిలో ఉన్న క్లచ్‌ను ఆపివేస్తున్నారు. చిన్న మొత్తమైనా పరిశీలిస్తే లక్షల్లో జరుగుతున్న మోసం బయటపడుతుంది. ఇది ప్రతి బంకులో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అటు పాయింట్ల కోతతో పాటు ఇలా కూడా వినియోగదారుడు మోసపోతున్నాడు. బంకులో అన్ని మోసాలే మండలంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయి. పెట్రోల్ బంకులో రూ.వంద పెట్రోల్ పోసుకుంటే రూ.99 మాత్రమే పెట్రోల్ పోస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారితో గొడవకు దిగుతున్నారు. ప్రతి వాహనదారుడికి ఇదే సమస్య ఉంది. వాహనదారులు పాయింట్ దోపిడీకి గురికాక తప్పడం లేదు. అధికారులు ఈ దిశగా తనిఖీలు చేపట్టి పెట్రోల్ బంకులపై చర్యలు తీసుకోవాలి. –బొడ్డు మహేశ్, చింతపల్లి అన్నీ అవకతవకలే.. పెట్రోల్ బంకుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జ రుగుతున్నాయి. సంబంధిత తూనికల కొలతల శాఖ అధికారులు కా కుండా పెట్రోల్ కంపెనీలకు సంబంధించిన అధికారులు సక్రమంగా లేకపోవడంతో ఈ అవకతవకలకు ఆస్కారం ఉంటుంది. అధికారుల నిర్లక్ష్యం పెట్రోల్ బంక్ యజమానులకు వరంగా మారుతోంది. లీటర్ పెట్రోల్‌కు అరపాయింట్ వరకు తక్కువగా పోస్తున్నారు. ఇలాగే లీటర్ ధరలోనూ తేడాలు జరుగుతున్నాయి. పెట్రోల్ బంక్ మోసాలపై చర్యలు తీసుకోవాలి. –వింజమూరి రవి, సర్పంచ్, వర్కాల -
పెట్రో నిరసన
పెట్రోల్ బంక్ డీలర్లు చమురు సంస్థలపై కన్నెర్ర చేశారు. ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించారు. తమ డిమాండ్లకు తలొగ్గని పక్షంలో పెట్రోల్ బంద్‌కు పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చెన్నై:యూపీఏ హయూంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయూయి. నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ స్థాయిలో చమురు ధర ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ధర నిర్ణయూనికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల పదిహేనో తేదీ, నెలాఖరులో చమురు ధరల్ని సమీక్షించి ధర నిర్ణయించే పనిలో చమురు సంస్థలు పడ్డాయి. ఆ మేరకు గత ఏడాది ఆగస్టు నుంచి ఈనెల 14 వరకు పది సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే, ఈ తగ్గుదల కారణంగా తాము నష్ట పోవాల్సి వస్తున్నదని పెట్రోల్ బంక్, చిల్లర వర్తక యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న స్టాక్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అధిక ధరకు తాము కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్ నిల్వ ఉండగానే, ధరను తగ్గించడం వలన తాము నష్టాన్ని చవి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చమురు సంస్థలు పెట్రోల్ బంక్ యజమానులు, డీలర్ల గోడును పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. దీంతో చమురు సంస్థలపై కన్నెర్ర చేస్తూ ఒక రోజు పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి యజమానుల సంఘాలు నిర్ణయించాయి. 31న కొనుగోళ్ల బంద్ పెట్రోల్ బంక్, చిల్లర వర్తక డీలర్ల సంఘం అధ్యక్షుడు కేపీ మురళి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తమ ఆవేదనను వెళ్లగక్కారు. ప్రధాని మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక పలు మార్లు ధరల్ని తగ్గించారని వివరించారు. ఐదు సార్లు పెట్రోల్, నాలుగు సార్లు డీజిల్ ధరలు తగ్గాయని పేర్కొన్నారు. ధరల తగ్గింపు గురించి ముందస్తుగా తమకు సమాచారం ఇచ్చిన పక్షంలో కొనుగోళ్లు తగ్గించి స్టాక్ నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 15న ధర తగ్గింపు వివరాల్ని వెల్లడించాల్సి ఉందని, ఆ రోజున సెలవు దినం కావడంతో 16న ప్రకటించారని వివరించారు. ఈ కారణంగా తమకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. ధర తగ్గడంతో నిల్వ ఉన్న స్టాక్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు యజమానులు రూ.150 కోట్ల మేరకు నష్టాన్ని చవి చూశారని తెలిపారు. రాష్ట్రంలో ఒక రోజుకు రెండు కోట్ల 40 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారని, ఒక రోజు కొనుగోళ్లను నిలిపి వేసిన పక్షంలో నష్టం చమురు సంస్థలకు, పన్ను రూపంలో కేంద్రానికి తప్పదని హెచ్చరించారు. పెట్రోల్ బంకుల్లోని ట్యాంకుల్ని సకాలంలో శుభ్రం చేయకుంటే తొలి హెచ్చరికగా రూ.పది వేలు, రెండో హెచ్చరికగా రూ.20 వేలు చొప్పున జరిమానా విధించబోతున్నట్టుగా పెట్రోలియం శాఖ హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2012 క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం తమ మీద చర్యలకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం చర్యల్ని వ్యతిరేకిస్తూ, ధరల వ్యవహారంలో తమకు ఎదురవుతున్న నష్టం భర్తీతోపాటుగా పలు రకాల డిమాండ్ల పరిష్కారం లక్ష్యంగా ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించామని ప్రకటించారు. ఒక్క రోజు తాము కొనుగోలు చేయని పక్షంలో రూ.50 కోట్ల మేరకు పన్ను నష్టం తప్పదని హెచ్చరించారు. తమ పిలుపునకు రాష్ట్రంలో 4590 పెట్రోల్ బంక్ యజమానులు కదిలారని, తమ డిమాండ్ల మీద కేంద్ర, చమురు సంస్థలు దృష్టి పెట్టని పక్షంలో తమ నిరసన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. వీరి నిరసన పుణ్యమా అని ఫిబ్రవరి ఒకటో తేదీ పెట్రోల్, డీజిల్ కొరత రాష్ర్టంలో ఏర్పడే అవకాశాలున్నాయి. పెట్రోల్ బంక్ డీలర్లు చమురు సంస్థలపై కన్నెర్ర చేశారు. ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించారు. తమ డిమాండ్లకు తలొగ్గని పక్షంలో పెట్రోల్ బంద్‌కు పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.