పెట్రో నిరసన
పెట్రోల్ బంక్ డీలర్లు చమురు సంస్థలపై కన్నెర్ర చేశారు. ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించారు. తమ డిమాండ్లకు తలొగ్గని పక్షంలో పెట్రోల్ బంద్‌కు పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
చెన్నై:యూపీఏ హయూంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరిగిపోయూయి. నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ స్థాయిలో చమురు ధర ఆధారంగా దేశంలో పెట్రోల్, డీజిల్‌పై ధర నిర్ణయూనికి చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల పదిహేనో తేదీ, నెలాఖరులో చమురు ధరల్ని సమీక్షించి ధర నిర్ణయించే పనిలో చమురు సంస్థలు పడ్డాయి. ఆ మేరకు గత ఏడాది ఆగస్టు నుంచి ఈనెల 14 వరకు పది సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. అయితే, ఈ తగ్గుదల కారణంగా తాము నష్ట పోవాల్సి వస్తున్నదని పెట్రోల్ బంక్, చిల్లర వర్తక యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న స్టాక్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, అధిక ధరకు తాము కొనుగోలు చేసిన పెట్రోల్, డీజిల్ నిల్వ ఉండగానే, ధరను తగ్గించడం వలన తాము నష్టాన్ని చవి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, చమురు సంస్థలు పెట్రోల్ బంక్ యజమానులు, డీలర్ల గోడును పట్టించుకోవడం లేదని చెప్పవచ్చు. దీంతో చమురు సంస్థలపై కన్నెర్ర చేస్తూ ఒక రోజు పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి యజమానుల సంఘాలు నిర్ణయించాయి.
31న కొనుగోళ్ల బంద్
పెట్రోల్ బంక్, చిల్లర వర్తక డీలర్ల సంఘం అధ్యక్షుడు కేపీ మురళి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తమ ఆవేదనను వెళ్లగక్కారు. ప్రధాని మోదీ సర్కారు అధికారంలోకి వచ్చాక పలు మార్లు ధరల్ని తగ్గించారని వివరించారు. ఐదు సార్లు పెట్రోల్, నాలుగు సార్లు డీజిల్ ధరలు తగ్గాయని పేర్కొన్నారు. ధరల తగ్గింపు గురించి ముందస్తుగా తమకు సమాచారం ఇచ్చిన పక్షంలో కొనుగోళ్లు తగ్గించి స్టాక్ నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 15న ధర తగ్గింపు వివరాల్ని వెల్లడించాల్సి ఉందని, ఆ రోజున సెలవు దినం కావడంతో 16న ప్రకటించారని వివరించారు. ఈ కారణంగా తమకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. ధర తగ్గడంతో నిల్వ ఉన్న స్టాక్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు యజమానులు రూ.150 కోట్ల మేరకు నష్టాన్ని చవి చూశారని తెలిపారు. రాష్ట్రంలో ఒక రోజుకు రెండు కోట్ల 40 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారని, ఒక రోజు కొనుగోళ్లను నిలిపి వేసిన పక్షంలో నష్టం చమురు సంస్థలకు, పన్ను రూపంలో కేంద్రానికి తప్పదని హెచ్చరించారు.
పెట్రోల్ బంకుల్లోని ట్యాంకుల్ని సకాలంలో శుభ్రం చేయకుంటే తొలి హెచ్చరికగా రూ.పది వేలు, రెండో హెచ్చరికగా రూ.20 వేలు చొప్పున జరిమానా విధించబోతున్నట్టుగా పెట్రోలియం శాఖ హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2012 క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం తమ మీద చర్యలకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాల్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రం చర్యల్ని వ్యతిరేకిస్తూ, ధరల వ్యవహారంలో తమకు ఎదురవుతున్న నష్టం భర్తీతోపాటుగా పలు రకాల డిమాండ్ల పరిష్కారం లక్ష్యంగా ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించామని ప్రకటించారు. ఒక్క రోజు తాము కొనుగోలు చేయని పక్షంలో రూ.50 కోట్ల మేరకు పన్ను నష్టం తప్పదని హెచ్చరించారు. తమ పిలుపునకు రాష్ట్రంలో 4590 పెట్రోల్ బంక్ యజమానులు కదిలారని, తమ డిమాండ్ల మీద కేంద్ర, చమురు సంస్థలు దృష్టి పెట్టని పక్షంలో తమ నిరసన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. వీరి నిరసన పుణ్యమా అని ఫిబ్రవరి ఒకటో తేదీ పెట్రోల్, డీజిల్ కొరత రాష్ర్టంలో ఏర్పడే అవకాశాలున్నాయి.
పెట్రోల్ బంక్ డీలర్లు చమురు సంస్థలపై కన్నెర్ర చేశారు. ఈ నెల 31న పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లను నిలుపుదల చేయడానికి నిర్ణయించారు. తమ డిమాండ్లకు తలొగ్గని పక్షంలో పెట్రోల్ బంద్‌కు పావులు కదుపుతున్నారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో పెట్రోల్ కొరత ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి.