న్యూఢిల్లీ: 2014 అనేది కేవలం ఒక తేదీ కాదని, దేశంలో అదొక పెనుమార్పు అని ప్రధానమంతి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కాలం చెల్లిన ఫోన్‌గా అభివరి్ణంచారు. 2014లో దేశ ప్రజలు ఆ ఔట్‌డేటెడ్ ఫోన్‌ను వదిలించుకున్నారని, ఇండియా దశ దిశ మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని తెలిపారు. కాలం తీరిన ఫోన్లలో ఎన్నిసార్లు బటన్లు నొక్కినా, స్తంభించిన స్క్రీన్‌ను ఎన్నిసార్లు తట్టినా ఎలాంటి ఫలితం ఉండదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రీస్టార్ట్ చేసినా, చార్జింగ్ పెట్టినా, బ్యాటరీ మార్చినా ఆ ఫోన్ పనిచేయదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. పనికిరాని ఫోన్ తరహాలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన స్తంభించిపోయిందని అన్నారు. అలాంటి సమయంలో దేశానికి సేవ చేసే అవకాశాన్ని ప్రజలు తమకు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తోందని అన్నారు. గతంలో మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న మన దేశం ఇప్పుడు ఎగుమతిదారుగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన దేశంలోనే ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు. భారత్‌లో 5జీ మొబైల్ సేవలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని, ఇక 6జీ సరీ్వసులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు.
గతేడాది అక్టోబర్ 1న 5జీ టెక్నాలజీని ప్రారంభించామని, దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 5 లక్షల 5జీ బేస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2జీ సేవల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న టెలికాం స్పెక్ట్రం కుంభకోణాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. 4జీ సేవలను తీసుకొచ్చిన తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. 6జీ టెక్నాలజీలో ప్రపంచాన్ని మనమే ముందుకు నడిపిస్తామన్న విశ్వాసం తనకు ఉందన్నారు.
దేశవ్యాప్తంగా 100 ‘5జీ ల్యాబ్‌లు’
యూపీఏ సర్కారు పాలనలో మొబైల్ ఫోన్ల తయారీ రంగాన్ని విస్మరించారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైన్‌ఫోన్ల తయారీదారుగా మారిందని అన్నారు. అలాగే ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని తెలియజేశారు.
ఇండియాలో తయారైన ఫోన్లను ప్రపంచమంతటా ఉపయోగిస్తుండడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. బ్రాడ్‌బ్యాండ్ వేగంలో మన దేశం ఏడాది వ్యవధిలోనే 118వ స్థానం నుంచి 43వ స్థానానికి చేరిందని వివరించారు. ఇంటర్నెట్ అనుసంధానం, వేగంతో ప్రజల జీవనం సులభతరం అవుతోందన్నారు. విద్య, వైద్యం, టూరిజం, వ్యవసాయం వంటి రంగాల్లో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు.
ఆధునిక సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి సమాజంలో ఒక్కరికీ చేరాలని, ఆ దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడి, వనరులు, సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థులు, స్టార్టప్ కంపెనీల కోసం దేశవ్యాప్తంగా త్వరలో 100 ‘5జీ ల్యాబ్‌లు’ అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment