PM Narendra Modi: వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే | Lok sabha elections 2024: Those Indulged In Corruption Will Face Action In Next 5 Years | Sakshi
Sakshi News home page

PM Narendra Modi: వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే

Published Sun, May 5 2024 4:53 AM | Last Updated on Sun, May 5 2024 4:53 AM

Lok sabha elections 2024: Those Indulged In Corruption Will Face Action In Next 5 Years

అవినీతిపరులపై చట్టపరంగా కఠినచర్యలు తప్పవు  

25 ఏళ్లుగా పదవుల్లో ఉన్న నాపై అవినీతి ఆరోపణల్లేవు  

నాకు సొంత ఇల్లు, సొంత సైకిలు కూడా లేదు  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ  

జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఎన్నికల ప్రచారం  

సిసాయ్‌/దర్భంగా:  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవినీతిపరుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని, అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఇక తప్పించుకోలేరని తేలి్చచెప్పారు. 

శనివారం జార్ఖండ్‌లోని సిసాయ్, పాలాము, బిహార్‌లోని దర్భంగాలో లోక్‌సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రోడ్‌ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా రాంచీలో, ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు.

 జనం సొమ్ము దోచుకున్నవారికి మద్దతుగా మాట్లాడారని, వారి ఆసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినందుకే జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి(హేమంత్‌ సోరెన్‌) ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడని చెప్పారు. అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే..  

యూపీఏ పాలనలో ఆకలి చావులు  
‘‘అభివృద్ధిలో గిరిజన ప్రాంతాలు వెనుకంజలోనే ఉండిపోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణం. 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆహార ధాన్యాలు గోదాముల్లో పందికొక్కుల పాలయ్యాయి. అప్పట్లో ఎంతోమంది గిరిజనుల బిడ్డలు తగిన ఆహారం లేక ఆకలితో మాడిపోయారు. సోనియా గాంధీ–మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ రాచరిక పాలనలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు.

 మేము అధికారంలోక వచ్చాక పరిస్థితి మారిపోయింది. పేదలకు ఉచితంగా రేషన్‌ సరుకులు ఇవ్వకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్‌ హయాంలో పేదలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కలి్పంచడాన్ని అప్పటి పాలకులు వ్యతిరేకించారు. కేవలం సంపన్నులకే ఆ సదుపాయం ఉండేది. మేమొచ్చాక మారుమూల ప్రాంతాల్లోనూ అందరికీ ఇంటర్నెట్‌ అందుతోంది. డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చాం. నేడు సోషల్‌ మీడియాలో యువత హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు.  

గోద్రా ఘటనపై బోగస్‌ నివేదిక  
20 ఏళ్ల క్రితం గుజరాత్‌లో గోద్రా రైలు దహనం ఘటనకు బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు(లాలూ ప్రసాద్‌ యాదవ్‌) ప్రయతి్నంచారు. కరసేవలకుపైనే నింద మోపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఆయన సహవాసం చేశారు. సోనియా మేడమ్‌ హయాంలోనే గోద్రా రైలు దహనం జరిగింది. 60 మందికిపైగా కరసేవకులు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి నియమించిన బెనర్జీ కమిషన్‌పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. బోగస్‌ నివేదిక సమరి్పంచేలా జాగ్రత్తపడ్డారు. అసలు దోషులను కాపాడుతూ కరసేవకులనే బాధ్యులుగా చిత్రీకరించారు. ఆ నివేదికను న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది. అసలు దోషులను గుర్తించి శిక్ష విధించింది. కొందరికి మరణశిక్ష పడింది’’ అని ప్రధాని మోదీ వివరించారు.  

సాధారణ జీవితం గడుపుతున్నా..  
‘‘కాంగ్రెస్‌ రాజకుమారుడు నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. పేదల ఇళ్లను సందర్శిస్తూ కెమెరాలకు పోజులిస్తున్నాడు. నేను సాధారణ జీవితమే గడుపుతున్నా. పేదల కష్టాలు నాకు తెలుసు కాబట్టి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రారంభించా. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. నేను గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాకు సొంత ఇల్లు, సొంత సైకిలు కూడా లేదు. జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం నాయకులు అవినీతికి పాల్పడుతూ తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు’’  

గిరిజనులపై అకృత్యాలు సహించం  
‘‘మావోయిస్టులపై కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓటు బ్యాంక్‌ను కాపాడుకోవడానికి మావోయిస్టుల జోలికి వెళ్లలేదు. నిషేధిత తీవ్రవాద సంస్థలు గిరిజన మహిళలపై అత్యాచారాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నాయి. ఇలాంటి అకృత్యాలు సహించే ప్రసక్తే లేదు’’    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement