న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం తప్పుదోవలో తమలో కొందరిపై ప్రయోగిస్తోందంటూ విపక్షాలు, కేంద్రంలోని బీజేపీపై గుప్పిస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. సీబీఐ తనపైనా ఓ కేసు దర్యాప్తు విషయమై ఒత్తిళ్లు చేసిందని, నరేంద్ర మోదీని అందులో ఇరికించే యత్నమూ చేసిందని ఆరోపించారాయన.
బుధవారం ఓ మీడియా ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కూడా సీబీఐ నా మీద కూడా ఒత్తిళ్లకు పాల్పడింది. గుజరాత్ ఫేక్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాని మోదీని ఇరికించేందుకు యత్నించింది. ఆ సమయంలో ఆయన(మోదీ) గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో నన్ను ప్రశ్నించిన సీబీఐ.. మోదీ పేరును ప్రస్తావించాలని సీబీఐ నాపై(షా తనను తాను ఉద్దేశించుకుని) ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది అని పేర్కొన్నారాయన.
కానీ, ఆ సమయంలో దర్యాప్తు సంస్థ ఒత్తిళ్లకు నేను తలొగ్గలేదు. అలాగని సీబీఐ తీరును బీజేపీ బహిరంగంగా ఎండగట్టలేదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతికి మద్దతుగా రాద్ధాంతం చేస్తోందని, దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పిస్తోందని పేర్కొన్నారాయన.
ఇక రాహుల్ గాంధీ అనర్హత పరిణామంపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఆయన కోర్టుకు వెళ్లొచ్చు. కానీ, తన తలరాతకు ప్రధాని మోదీనే కారణమంటూ రాజకీయ రచ్చ చేస్తున్నాడు.. కన్నీళ్లు కారుస్తున్నాడు అంటూ షా తప్పుబట్టారు. ఇంకా పలు అంశాలపైనా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఇదీ చదవండి: ఆ పథకానికి పీఎం మోదీ కన్వీనర్.. కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా
Comments
Please login to add a commentAdd a comment